మా సుమతమ్మ.. పోలీసాఫీసర్‌..! | DCP Sumathi Special Interview With Sakshi | Sakshi
Sakshi News home page

మా సుమతమ్మ.. పోలీసాఫీసర్‌..!

Published Thu, Mar 8 2018 7:54 AM | Last Updated on Thu, Mar 8 2018 7:54 AM

DCP Sumathi Special Interview With Sakshi

జిల్లాలోనే పేరుగాంచిన వంశం.. సుమారుగా 125 ఏళ్ల నుంచి వందలాది శివభక్తులకు ప్రతిఏటా అన్నదానం.. ఇది వంశపారంపర్యంగా చేస్తున్న కార్యక్రమం. అంతపెద్ద కుటుంబంలో జన్మించిన ఆమెకు చిన్నప్పటి నుంచి కుటుంబం, గ్రామ పరిస్థితులపై అవగాహన ఉంది. ‘మా సుమతమ్మ పెద్దాయ్యాక పోలీసాఫీర్‌ అవుతుంది.. మన జిల్లాకే ఎస్పీగా వస్తుంది..అంటూ తెలియని వయస్సులోనే నాయనమ్మ నూరిపోసిన మాటలు ఆమెలో ఓ పట్టుదలను తెచ్చిపెట్టాయి... చివరకు అనుకున్నది సాధించి నేడు వేలాది మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు ‘నార్త్‌జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌’ బడుగుల సుమతి. తను ఈ వృత్తిలోకి ఎలా వచ్చిందీ.. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందీ.. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకుంది.

హిమాయత్‌నగర్‌: కుగ్రామం నుంచి సిటీ వరకు
మాది అప్పట్లో మహబూబ్‌నగర్‌ జిల్లా, ప్రస్తుతం జోగులాంబ జిల్లాలోని కలుగోట్ల అనే కుగ్రామం. మా నాన్న తిరుపతిరెడ్డికి 17 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేశారు. మేం నలుగురు ఆడపిల్లలం, ఒక అబ్బాయి మొత్తం ఐదుగురం. నేను మూడో సంతానం. నేను కష్టపడి చదువుకుని వైద్యురాలి కావాలని చిన్నప్పుడే ఆశించా. ఆ తరువాత నా జీవితంలో నాకూ నాయనమ్మ మధ్య జరిగిన సంభాషణే.. నేను పోలీసాఫీర్‌ అయ్యేలా చేసింది.  

మన జిల్లాకు ఎస్పీగా వస్తుంది
మా ఊరిలో సర్పంచుల వ్యవస్థ మా కుటుంబం నుంచే ప్రారంభం అయింది. మా నాన్ననే మొట్టమొదటి సర్పంచ్‌. వరుసగా పదిసార్లు సర్పంచ్‌గా గెలుపొంది ఎంతోమంది పేదలకు సేవ చేయడం చూశాను. ‘‘చూడు ఓ గ్రామానికి పెద్ద అయితేనే ఇంత సేవ చేస్తున్నాడు. జనం కూడా న్యాయం కోసం మీ నాన్నని ఆశ్రయిస్తున్నారు. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్నారు, ఎస్పీని ఆశ్రయిస్తున్నారు. ఒక కలెక్టర్, ఎస్పీకి ఎంత పలుకుబడి ఉంటుందో చూడు ’’అంటూ నాయనమ్మ నన్ను పదే పదే అంటుండేది. ఇలా నాతో మాట్లాడుతూనే మా ఊరిలో ఉన్న వారందరితో ‘రేప్పొద్దున మా సుమతమ్మ ఖచ్చితంగా పెద్ద పోలీస్‌ ఆఫీసర్‌ అవుతుంది.. మన ఊరికే..మా జిల్లాకే ఎస్పీగా వస్తుంది ’అంటూ చెబుతుండేది. ఆ మాటలు నా చెవుల్లో ఎప్పుడూ మార్మోగుతూ ఉండేవి..  

అమ్మ ప్రోత్సాహంతో విజయం..
నాకు సమాజం నుంచి పెద్దగా అవమానాలు రాకపోయినప్పటికీ బంధువుల నుంచి మాత్రం ఎదురయ్యాయి. ఒకానొక సమయంలో ‘ఈ అమ్మాయి ఇంటలిజెంట్‌ అయితే అయ్యి ఉండొచ్చు. అయినా మెడిసనే కొట్టలేకపోయింది సివిల్స్‌ కొట్టిద్దా.? ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి, ఉన్న ఆస్తుల్ని అమ్ముకుంటూ ఆ అమ్మాయిని చదివించడం’ అంటూ మా అమ్మతో, నా మొహంపై అనేశారు. అయితే.. అమ్మ నా భుజం తట్టి ‘నువ్వేంటో..మాకు తెలుసు, నీకు తెలుసు. ఎవరెవరో ఏవేవో అన్నారని వాళ్లందరికీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం కావాలనుకున్నావో..అయ్యి చూపించు నువ్వు అవుతావ్‌ అని ఆ నమ్మకం మాకు ఉంది’ అంటూ నాలో ధైర్యం తట్టింది.

మెడిసిన్‌ రాలేదు సివిల్స్‌ కొట్టాల్సిందే
నాయనమ్మ నేను పోలీస్‌ ఆఫీసర్‌ కావాలని కలలు కన్నప్పటికీ నాకు మెడిసిన్‌ చదవాలనిపించేది. మెడిసిన్‌ కోసం చాలా కష్టపడ్డాను. మెడిసిన్‌ సీటు రాకపోయే.. కలెక్టర్, ఎస్పీ కావాలని దీనికోసం సివిల్స్‌కి ప్రిపేర్‌ అయ్యి ఖచ్చితంగా విజయం సాధించాలని నిశ్చయించుకున్నాను. దీనికోసం మా అమ్మ సుజాతమ్మ, నాన్న తిరుపతిరెడ్డిలను ఒప్పించి రూ.50వేలు తీసుకుని హైదరాబాద్‌కు వచ్చా. 2000లో ఒకటేసారి సివిల్స్, గ్రూప్‌–1కు ప్రయత్నించా. సివిల్స్‌ కొట్టలేకపోయా గ్రూప్స్‌ కొట్టాను. డీఎస్‌పీగా పోస్టింగ్‌వచ్చింది. 2007లో ఐపీఎస్‌గా పదోన్నతి సాధించాను, ఆరేళ్ల సర్వీసుకే ఒక గ్రూప్‌–1 అధికారి ఐపీఎస్‌ కావడం తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి, ఇదినాకు చాలా గర్వకారణమనే చెప్పాలి.   

మా ఆయన ప్రోత్సాహమే నడిపిస్తోంది
నేను తిరుపతిలో అగ్రికల్చర్‌ కోర్స్‌ చదివే సమయంలో శ్రీనాథ్‌తో పరిచయం ఏర్పడింది. నా మనసుని దగ్గరగా చూస్తారు. నేను చెప్పకపోయినా నా మనసుని అర్థం చేసుకుని భుజం తడతారు. అయితే చాలాసార్లు ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్లాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో మేం మాట్లాడుకునే అవకాశమూ వచ్చేది కాదు. నా కోసం ఆయన కెరీర్‌ను వదులుకున్నారు. చిక్కడపల్లి ఏసీపీగా పనిచేస్తున్న సమయంలో జరిగిన సంఘటన జీవితంలో మర్చిపోలేనిది. కొన్నేళ్ల క్రితం వారం రోజులపాటు పని ఒత్తిడిలో ఉండిపోయా. నేను ఇంటికి రాగానే ఆయన వెళ్లిపోతూ.. ఎక్కడికి అని అడగొద్దు అన్నారు. మనసు అల్లకల్లోలం అయింది. కన్నీళ్ల వరద ఆగలేదు. చివరకు ఓ గట్టి నిర్ణయం తీసుకున్నాను. నేనూ మీ వెంటే అంటూ బ్యాగ్‌ సర్దుకుని ఆయన బ్యాగ్‌ పక్కన పెట్టాను. అదే రాత్రి రాజీనామా లేఖను డ్రైవర్‌తో డీజీపీ కార్యాలయానికి పంపాను. అయితే తరువాత భర్త సర్దిచెప్పడంతో నిర్ణయం మార్చుకున్నాను. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement