DCP sumathi
-
జగ్గారెడ్డి 15 లక్షలు తీసుకున్నారు: డీసీపీ సుమతి
సాక్షి, హైదరాబాద్: మనుషుల అక్రమ రవాణా కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పక్కా ఆధారాలతోనే అరెస్ట్ చేసినట్లు డీసీపీ సుమతి తెలిపారు. ఆయన ముగ్గుర్ని కుటుంబ సభ్యుల పేరుతో అక్రమంగా అమెరికాకు పంపారని, దీనికి వారి నుంచి రూ. 15 లక్షలు తీసుకున్నారని తెలిపారు. మంగళవారం ఆమె మీడియాకు ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారన్న ఆరోపణలను ఖండించారు. (చదవండి: అక్రమంగా అరెస్ట్ చేశారు: జగ్గారెడ్డి) సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్‌కు వచ్చిన ఫిర్యాదుతో నిశితంగా దర్యాప్తు చేశామన్నారు. 2004లో ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమంగా పాస్‌పోర్ట్‌లు పొందారని, ఎమ్మెల్యే లెటర్ హెడ్‌తో పాస్‌పోర్టులు ఇవ్వాలని కోరారన్నారు. ఈ నకిలీ పాస్‌పోర్ట్‌లతో వీసాలు పొందారని, భార్య ఫొటో, కుమార్తె, కుమారుడు పుట్టిన తేదీల మార్పిడి జరిగిందన్నారు. ఆధార్ డేటా ఆధారంగా ఈ అక్రమాలను గుర్తించినట్లు స్పష్టం చేశారు. జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అమెరికాకు పంపించిన వ్యక్తులను బ్రోకర్ మధు తన దగ్గరకు తీసుకొచ్చాడని ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్లు తమ విచారణలో జగ్గారెడ్డి చెప్పారన్నారు. ఐపీసీ 419,490,467,468,471,370 సెక్షన్లతో పాస్‌పోర్ట్ యాక్ట్ సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 24 కింద కేసులు నమోదు చేశామన్నారు, ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. చదవండి: జగ్గారెడ్డి అరెస్ట్ -
బస్సులో ‘చిల్లర’ గొడవ.. కిడ్నాపర్లను పట్టించింది!
హైదరాబాద్: బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. బాలుడిని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం బాలుడి కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. కేసు వివరాలను నార్త్‌జోన్ డీసీపీ సుమతి, రైల్వే ఎస్పీ జి.అశోక్‌కుమార్‌తో కలసి మీడియాకు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లా మన్నాపూర్ ప్రాంతానికి చెందిన సంజూ చామర్(32) కుమారుడు ఆయూష్(4), కుమార్తె అంజలి(7)తో కలసి నగరంలోని బండ్లగూడలో నివసిస్తోంది. జీవనోపాధి లేకపోవడంతో సొంతూరుకు వెళ్లేందుకు సోమవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు తన పిల్లలతో కలసి వచ్చింది. తర్వాత టిఫిన్ కోసమని తల్లి బయటకు వెళ్లగా బాలుడిని ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేశారు. గోపాలపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే రంగంలోకి దిగిన నార్త్‌జోన్ పోలీసులు 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. కిడ్నాపర్లు ఉదయం 7.36 నిమిషాలకు రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఫుటేజీల ఆధారంగా వెనక్కివెళ్లి వారి ఆచూకీ కోసం గాలించసాగారు. ‘చిల్లర’గొడవే పట్టించింది... సుచిత్ర జంక్షన్ వద్ద హకీంపేట డిపోకు చెం దిన 25ఎస్ బస్సులో సోమవారం ఉదయం ఇద్దరు మహిళలు ఎక్కారు. రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకుగాను టికెట్‌కు అవసరమైన చిల్లర డబ్బులు లేకపోవడంతో గొడవ పడ్డారు. డ్రైవర్ నర్సింహులు కల్పించుకుని టికెట్ రేటు రూ.30 చెల్లించి మిగతా చిల్లర తర్వాత తీసుకోవాలని సూచించారు. ‘మా అంబేడ్కర్ నగర్ నుంచి స్టేషన్‌కు 10 రూపాయలే కదా!’అని డ్రైవర్‌తోనూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమం లో పోలీసులు సదరు మహిళల ఫొటోలను చూపడంతో డ్రైవర్ గుర్తుపట్టి గొడవ వివరాలు వెల్లడించారు. ఆ మహిళలు అల్వాల్ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన వారై ఉంటారని పోలీసులు భావించి మంగళవారం వేకువజాము వరకు ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. స్థానికుల సమాచారం మేరకు సమీపంలోని జొన్నలగడ్డలో కిడ్నాపర్ల ఇంటిని గుర్తించి బాలుడిని కాపాడారు. సురక్షితంగా తల్లికి అప్పగించారు. కిడ్నాపర్ల చెరలో మరో ఇద్దరు బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితురాళ్లు యాదమ్మ (21), ఎం.జయ(18)ల అదుపులో మరో ఇద్దరు చిన్నారులున్నట్లు పోలీసులు కనుగొన్నారు. తమ పిల్లలే అని తొలుత బుకాయించగా గట్టిగా నిలదీయడంతో వారిని సైతం కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్లు నిందితులు అంగీకరించారు. వీరిలో శేఖర్ అనే ఏడేళ్ల బాలుడిని 2015లో ఉందానగర్, రేణుక (7) అనే బాలికను మేడ్చల్ రైల్వే స్టేషన్ నుంచి అపహరించినట్లు చెప్పారు. శేఖర్ మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పుగూడకు చెందిన అంజయ్య కుమారుడని, రేణుక నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రాంతానికి చెందిందని పోలీసులు గుర్తించారు. ప్రజల సహకారమే కీలకం: డీసీపీ సుమతి పలు కేసుల ఛేదనలో పోలీసులకు స్థానికులు ఇచ్చే సమాచారమే కీలకంగా మారుతుందని డీసీపీ సుమతి అన్నారు. ఆయూష్ కిడ్నాప్ కేసు దర్యాప్తులో బస్సు డ్రైవర్, అంబేడ్కర్నగర్వాసులు ఇచ్చిన సమాచారం ఉపయోగపడిందన్నారు. పౌరులు తమకు అనుమానం వచ్చిన విషయాలను వెంటనే పోలీసులకు చెప్పాలని కోరారు. -
ఆ 30 లక్షలు దొరికాయ్!
సాక్షి, హైదరాబాద్ : 30 లక్షల రూపాయల మిస్సింగ్ కేసును సికింద్రాబాద్, గోపాలపురం పోలీసులు సోమవారం చేధించారు. ఈ నెల1న (బుధవారం) నల్లకుంటకు చెందిన భగవతుల మోహిని(50), ఆమె తల్లి సుశీల(85)లు విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆటోలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బయల్దేరారు. మధ్యలో రూ.30 లక్షల రూపాయలున్న బ్యాగును పోగొట్టుకున్నారు. రైల్వే స్టేషన్‌కు వచ్చాక నగదు ఉన్న బ్యాగు కనిపించకపోవడంతో తిరిగి అదే రూటులో ఎంత వెతికినా దొరకలేదు. దీంతో గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా అన్ని కోణాల్లో పరిశీలించిన వారు సీసీ కెమెరాల సాయంతో కేసును చేధించారు. వారు ప్రయాణించిన మార్గంలోని మొత్తం 42 సీసీ కెమెరా వీడియోలను పరిశీలించిన పోలీసులు.. బ్యాగ్‌ను మహేశ్వరానికి చెందిన మున్సిపల్ కాంట్రాక్ట్ స్వీపర్ రాములు(48) తీసుకున్నట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని రూ.28 లక్షలు రికవరీ చేశారు. కేసును త్వరగా చేధించిన పోలీసులకు డీసీపీ సుమతి రివార్డులు అందజేశారు. ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా అందరూ తప్పనిసరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. -
సీసీటీవీ కెమెరాలు చేధించిన మరో కేసు
-
హైదరాబాద్‌లో కిలాడీ లేడీ అరెస్ట్
-
ఘరానా మహిళ అరెస్టు.. 3 నెలల్లో 17 దొంగతనాలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఓ మహిళ 2009 నుంచి దొంగతనాలు చేస్తోంది. అందరి కళ్ళు కప్పి తప్పించుకుని తిరిగసాగింది. చివరికి పోలీసులకు చిక్కింది. వివరాలివి.. నగరంలో బ్యూటీ ప్లారర్లో దొంగతనాలకు పాల్పడుతున్న డైసి అనే ఘరానా మహిళను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఆమె స్వస్థలం కడప. బ్యూటీ పార్లర్లే టార్గెట్‌గా మహిళ దొంగతనాలు చేసేది. డైసీ బీఏ లిటరేచర్ చదివింది.. దొంగతనాలకు అలవాటు పడింది. ఆమె నుంచి రూ. 17 లక్షల విలువ చేసే 63 తులాల బంగారాన్ని మారేడుపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి మాట్లాడుతూ.. ఆమె 2009 నుంచి నగరంలో దొంగతనాలు చేస్తోంది. మూడు నెలల్లోనే 17 దొంగతనాలు పాల్పడిందని తెలిపారు. ఆమె హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 9, సైబారాబాద్‌లో 5, రాచకోండలో 3 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు డీసీపీ చెప్పారు. నగరంలో ఆమె దొంగలించిన సోత్తును మొత్తం రికవరీ చేశామన్నారు. అంతేకాక ఆ మహిళపై పీడీ యాక్ట్ పెడుతామని డీసీపీ సుమతి తెలిపారు. -
మా సుమతమ్మ.. పోలీసాఫీసర్..!
జిల్లాలోనే పేరుగాంచిన వంశం.. సుమారుగా 125 ఏళ్ల నుంచి వందలాది శివభక్తులకు ప్రతిఏటా అన్నదానం.. ఇది వంశపారంపర్యంగా చేస్తున్న కార్యక్రమం. అంతపెద్ద కుటుంబంలో జన్మించిన ఆమెకు చిన్నప్పటి నుంచి కుటుంబం, గ్రామ పరిస్థితులపై అవగాహన ఉంది. ‘మా సుమతమ్మ పెద్దాయ్యాక పోలీసాఫీర్ అవుతుంది.. మన జిల్లాకే ఎస్పీగా వస్తుంది..అంటూ తెలియని వయస్సులోనే నాయనమ్మ నూరిపోసిన మాటలు ఆమెలో ఓ పట్టుదలను తెచ్చిపెట్టాయి... చివరకు అనుకున్నది సాధించి నేడు వేలాది మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు ‘నార్త్‌జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్’ బడుగుల సుమతి. తను ఈ వృత్తిలోకి ఎలా వచ్చిందీ.. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందీ.. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకుంది. హిమాయత్‌నగర్: కుగ్రామం నుంచి సిటీ వరకు మాది అప్పట్లో మహబూబ్‌నగర్ జిల్లా, ప్రస్తుతం జోగులాంబ జిల్లాలోని కలుగోట్ల అనే కుగ్రామం. మా నాన్న తిరుపతిరెడ్డికి 17 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేశారు. మేం నలుగురు ఆడపిల్లలం, ఒక అబ్బాయి మొత్తం ఐదుగురం. నేను మూడో సంతానం. నేను కష్టపడి చదువుకుని వైద్యురాలి కావాలని చిన్నప్పుడే ఆశించా. ఆ తరువాత నా జీవితంలో నాకూ నాయనమ్మ మధ్య జరిగిన సంభాషణే.. నేను పోలీసాఫీర్ అయ్యేలా చేసింది. మన జిల్లాకు ఎస్పీగా వస్తుంది మా ఊరిలో సర్పంచుల వ్యవస్థ మా కుటుంబం నుంచే ప్రారంభం అయింది. మా నాన్ననే మొట్టమొదటి సర్పంచ్. వరుసగా పదిసార్లు సర్పంచ్‌గా గెలుపొంది ఎంతోమంది పేదలకు సేవ చేయడం చూశాను. ‘‘చూడు ఓ గ్రామానికి పెద్ద అయితేనే ఇంత సేవ చేస్తున్నాడు. జనం కూడా న్యాయం కోసం మీ నాన్నని ఆశ్రయిస్తున్నారు. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్నారు, ఎస్పీని ఆశ్రయిస్తున్నారు. ఒక కలెక్టర్, ఎస్పీకి ఎంత పలుకుబడి ఉంటుందో చూడు ’’అంటూ నాయనమ్మ నన్ను పదే పదే అంటుండేది. ఇలా నాతో మాట్లాడుతూనే మా ఊరిలో ఉన్న వారందరితో ‘రేప్పొద్దున మా సుమతమ్మ ఖచ్చితంగా పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతుంది.. మన ఊరికే..మా జిల్లాకే ఎస్పీగా వస్తుంది ’అంటూ చెబుతుండేది. ఆ మాటలు నా చెవుల్లో ఎప్పుడూ మార్మోగుతూ ఉండేవి.. అమ్మ ప్రోత్సాహంతో విజయం.. నాకు సమాజం నుంచి పెద్దగా అవమానాలు రాకపోయినప్పటికీ బంధువుల నుంచి మాత్రం ఎదురయ్యాయి. ఒకానొక సమయంలో ‘ఈ అమ్మాయి ఇంటలిజెంట్ అయితే అయ్యి ఉండొచ్చు. అయినా మెడిసనే కొట్టలేకపోయింది సివిల్స్ కొట్టిద్దా.? ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి, ఉన్న ఆస్తుల్ని అమ్ముకుంటూ ఆ అమ్మాయిని చదివించడం’ అంటూ మా అమ్మతో, నా మొహంపై అనేశారు. అయితే.. అమ్మ నా భుజం తట్టి ‘నువ్వేంటో..మాకు తెలుసు, నీకు తెలుసు. ఎవరెవరో ఏవేవో అన్నారని వాళ్లందరికీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం కావాలనుకున్నావో..అయ్యి చూపించు నువ్వు అవుతావ్ అని ఆ నమ్మకం మాకు ఉంది’ అంటూ నాలో ధైర్యం తట్టింది. మెడిసిన్ రాలేదు సివిల్స్ కొట్టాల్సిందే నాయనమ్మ నేను పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కన్నప్పటికీ నాకు మెడిసిన్ చదవాలనిపించేది. మెడిసిన్ కోసం చాలా కష్టపడ్డాను. మెడిసిన్ సీటు రాకపోయే.. కలెక్టర్, ఎస్పీ కావాలని దీనికోసం సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా విజయం సాధించాలని నిశ్చయించుకున్నాను. దీనికోసం మా అమ్మ సుజాతమ్మ, నాన్న తిరుపతిరెడ్డిలను ఒప్పించి రూ.50వేలు తీసుకుని హైదరాబాద్‌కు వచ్చా. 2000లో ఒకటేసారి సివిల్స్, గ్రూప్–1కు ప్రయత్నించా. సివిల్స్ కొట్టలేకపోయా గ్రూప్స్ కొట్టాను. డీఎస్పీగా పోస్టింగ్‌వచ్చింది. 2007లో ఐపీఎస్‌గా పదోన్నతి సాధించాను, ఆరేళ్ల సర్వీసుకే ఒక గ్రూప్–1 అధికారి ఐపీఎస్ కావడం తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి, ఇదినాకు చాలా గర్వకారణమనే చెప్పాలి. మా ఆయన ప్రోత్సాహమే నడిపిస్తోంది నేను తిరుపతిలో అగ్రికల్చర్ కోర్స్ చదివే సమయంలో శ్రీనాథ్‌తో పరిచయం ఏర్పడింది. నా మనసుని దగ్గరగా చూస్తారు. నేను చెప్పకపోయినా నా మనసుని అర్థం చేసుకుని భుజం తడతారు. అయితే చాలాసార్లు ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్లాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో మేం మాట్లాడుకునే అవకాశమూ వచ్చేది కాదు. నా కోసం ఆయన కెరీర్‌ను వదులుకున్నారు. చిక్కడపల్లి ఏసీపీగా పనిచేస్తున్న సమయంలో జరిగిన సంఘటన జీవితంలో మర్చిపోలేనిది. కొన్నేళ్ల క్రితం వారం రోజులపాటు పని ఒత్తిడిలో ఉండిపోయా. నేను ఇంటికి రాగానే ఆయన వెళ్లిపోతూ.. ఎక్కడికి అని అడగొద్దు అన్నారు. మనసు అల్లకల్లోలం అయింది. కన్నీళ్ల వరద ఆగలేదు. చివరకు ఓ గట్టి నిర్ణయం తీసుకున్నాను. నేనూ మీ వెంటే అంటూ బ్యాగ్ సర్దుకుని ఆయన బ్యాగ్ పక్కన పెట్టాను. అదే రాత్రి రాజీనామా లేఖను డ్రైవర్‌తో డీజీపీ కార్యాలయానికి పంపాను. అయితే తరువాత భర్త సర్దిచెప్పడంతో నిర్ణయం మార్చుకున్నాను. -
'మహంకాళి జాతరను ప్రశాంతంగా నిర్వహిస్తాం'
రాంగోపాల్‌పేట్: జూలై 24, 25 వ తేదీల్లో జరుగనున్న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు చేపట్టాల్సిన భద్రత చర్యలపై ఉత్తర మండలం డీసీపీ సుమతి మంగళవారం పరిశీలించారు. మొదటి సారిగా దేవాలయానికి వచ్చిన ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ట్రాఫిక్, పోలీసులు అధికారులతో కలిసి దేవాలయంతో పాటు పరిసరాలను పరిశీలించారు. ఆలయ విశిష్టత, ఎంత మంది భక్తులు హాజరవుతారు, క్యూలైన్లు తదితర వివరాలను ఈవో అన్నపూర్ణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.