విధిని ఎదిరించి.. | women empowerment special story | Sakshi
Sakshi News home page

విధిని ఎదిరించి..

Published Tue, Feb 13 2018 12:02 PM | Last Updated on Tue, Feb 13 2018 12:11 PM

women empowerment special story - Sakshi

లక్ష్మి

చెన్నూర్‌ రూరల్‌: తోటి పిల్లలు చెంగు చెంగున ఎగురుతుంటే చిన్ని మనసు బాధపడింది. ఆడపిల్ల.. పైగా రెండు కాళ్లు లేవు.. ఎలా బతుకుతుందో ఏమోనని సమాజం జాలిపడుతుంటే మరింత పట్టుదల పెరిగింది. ఎలాగైనా తన అంగవైకల్యాన్ని జయించాలని నిశ్చయించుకుంది. కన్న వాళ్లకు భారమవకూడదని స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకుంది. అనంతరం దూరవిద్య ద్వారా పదో తరగతి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఆత్మస్థైర్యంతో అంగవైకల్యాన్ని జయించి.. వనితాలోకానికి ఆదర్శంగా నిలిచిన లక్ష్మి విజయమంత్రం ఆమె మాటల్లోనే..

మాది మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలం కిష్టంపేట గ్రామం. అమ్మానాన్న ఎన్నం మల్లక్క, సమ్మయ్య.  మేం మొత్తం ఆరుగురం సంతానం. వారిలో నలుగురు అమ్మాయిలం, ఇద్దరు అబ్బాయిలు. నేను రెండో కుమార్తెను. చిన్న వయస్సులోనే నాకు పోలియో సోకి రెండు కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. మాది నిరుపేద కుటుంబం. నా చిన్నతనంలో ఒక్కో రోజు పస్తులు కూడా ఉండాల్సి వచ్చేది. అంగవైకల్యం ఉండడంతో మనసులో చదువుకోవాలని ఉన్నా చదువుకోలేకపోయాను. అంగవైకల్యం ఉందని నన్నెప్పుడూ ఇంట్లో తిట్టలేదు. మా వాళ్లంతా నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ నేను ఎన్ని రోజులు వారికి భారంగా ఉండాలని అనిపించింది. 

‘కుట్టు’ నేర్చుకుని.. సొంత కాళ్లపై నిలబడ్డా..
తల్లిదండ్రులకు ఏదో విధంగా నా వంతుగా సహాయం అందించాలనుకున్నా. ఆతర్వాత మిషన్‌ నేర్చుకుని అప్పు చేసి కుట్టుమిషన్‌ కొనుకున్నా. గ్రామంలోని బస్‌స్టాప్‌ సమీపంలో రూ.1000తో ఓ గదిని అద్దెకు తీసుకున్నా. చిన్నగా లేడీస్‌ టైలర్‌ ఏర్పాటు చేశా. దుస్తులు కుట్టగా వచ్చిన సొమ్ముతో అదే గదిలో చిన్నగా కంగన్‌హాల్, బట్టల షాప్‌ను ఏర్పాటు చేశా. ఆ తర్వాత కుటుంబానికి కొంత ఆసరయ్యా. ఇంకా ఏదో చేయాలనే తపన నన్ను వేధించేది. గ్రామంలోని మహిళలకు, యువతులకు కుట్టులో శిక్షణ ఇచ్చా. అంతటితో ఆగకుండా చిన్నప్పుడు చదువుకోవాలనే ఆశను నెరవేర్చుకోవాలనుకున్నా.

దూరవిద్యలో చదువుకున్నా..

2012లో దూరవిద్యలో పదో తరగతి చదివా. ప్రతీ ఆదివారం చెన్నూర్‌లోని బాలికల పాఠశాలలో ఓపెన్‌ తరగతులకు 40 వారాలు హాజరయ్యా. పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించా. 2013లో మా నాన్న సమ్మయ్య మృతి చెందాడు. 2016 ఏప్రిల్‌లో వికలాంగుల కోటా కింద మంచిర్యాల మున్సిపల్‌ కార్యాలయంలో పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించా. ఆగçస్టు 8న ఉద్యోగంలో చేరి ప్రస్తుతం రూ.15వేల వేతనంతో ఉద్యోగం చేస్తున్నా. అమ్మా, తమ్ముళ్లకు చేదోడు, వాదోడుగా ఉంటున్నా. అంగవైకల్యం మనసుకే కానీ మనిషికి కాదు. వికలాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. కుటుంబ అండ కూడా ఉండాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement