మౌన వీణ గానమిదీ... | Inspirational Women Translator Lakshmi | Sakshi
Sakshi News home page

మౌన వీణ గానమిదీ...

Published Sun, Mar 4 2018 12:04 PM | Last Updated on Sun, Mar 4 2018 12:04 PM

Inspirational Women Translator Lakshmi - Sakshi

ఆమె జీవితం అందరిలా వడ్డించిన విస్తరికాదు... చిన్నవయసులోనే ఇల్లాలిగా మారినా చింతించలేదు. కన్నవారి నిర్ణయంతో మాటరాని భర్తకు తానే ఆలంబనగా  నిలవడానికి వెనుకాడలేదు. ఇలాంటి సమస్య తనకే ఎందుకు ఎదురైందని ఆమె మనోవ్యధ చెందలేదు. ఏమిటిది భగవంతుడా అని కుంగిపోలేదు. జీవితాన్ని సవాల్‌గా తీసుకున్నారు. తనకెదురైన కష్టాన్ని ఓ లక్ష్యంగా మలచుకున్నారు. తన భర్త లాంటి ఎంతో మందికి ఇప్పుడు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. అలాంటి కష్టం ఎవరికి వచ్చినా... అండగా ఉండేందుకు ఓ ఆయుధమయ్యారు. వారి సమస్యలనుఅధికారులకు వివరించగలిగే అనువాదికురాలయ్యారు.

సాక్షిప్రతినిధి, విజయనగరం: మాటరాని నోటికి ఆమె పలుకయ్యారు. వినలేని చెవులకు శబ్దమయ్యారు. బధిరుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఆమే లక్ష్మి కొండమ్మ. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో పుట్టిన ఆమె కోటేశ్వరావు, పూర్ణలక్ష్మిల ఎనిమిదిమంది సంతానంలో చివరి అమ్మాయి. వినలేని, మాట్లాడలేని భర్తకు మాట సాయం చేయడంతో మొదలు పెట్టిన ఆమె జీవితం బధిరుల పాలిట కల్పవల్లిగా మారేలా చేసింది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోనేగాదు... రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి మాట సాయం కావాలన్నా ఆమె ఉండాల్సిందే. వారి మనసుల్లోని భావాలను మాటలుగా మలచి పాలకులకు, అధికారులకు అర్థమయ్యేలా వ్యక్తీకరిస్తూ బధిరుల కుటుంబంలో ఒక సభ్యురాలిగా మారిపోయారు. వారి మధ్య మనస్పర్ధలను మంచి మాటలతో దూరం చేసే పెద్దదిక్కులా నిలుస్తున్నారు. మౌనాన్ని జయించిన ఆమె తన జీవితం గురించి ‘సాక్షిప్రతినిధి’తో పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే..

నాన్న ఆర్టీసీ పాలకొండ డిపోలో డ్రైవర్‌. పదోతరగతి చదువుతున్నప్పుడే పెళ్లయింది. భర్త చీపురుపల్లి మండలం పెదనడిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ మా మామయ్య కొడుకు. దగ్గరి సంబంధం అని చేసేశారు. నిజానికి చిన్నప్పుడే పెద్దలు ఈ పెళ్లి నిర్ణయించారు. అప్పట్లో అసలు పెళ్లి, జీవితం అంటే ఏమీ తెలీదు. అత ను పుట్టు మూగ, చెవిటి. ఆ విషయం పెళ్లికి ముందే తెలి సినా దాని గురించి ఆలోచించే వయసు లేదు. పెద్దబ్బా యి పుట్టేంత వరకూ ప్రపంచం తెలియలేదు. మా వారు హైదరాబాద్‌లోని హెచ్‌పీసీఎల్‌లో అప్రంటిస్‌గా కేవలం రూ.1000ల జీతానికి చేసేవారు. ఆయన కోసం హైదరాబాద్‌కు మకాం మార్చాం.

అనుభవం నేర్పిన భాష
సాధారణంగా బధిరులు మామూలు వాళ్లను తమ పార్టనర్‌గా అంగీకరించలేరు. వారు ఏదీ మనసులో పెట్టుకోరు. లోపలేదుంటే దానిని నిర్మొహమాటంగా బయటపెట్టేస్తారు. మనం వారి మనుషులమంటూ ఎంతో నమ్మకం కలిగించాలి. వారి మనసు తెలుసుకుని మసలుకోవాలి. మా వారితో పాటు నేనూ సాయంగా వెళ్లేదాన్ని. ఆయన విధుల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అలవాటైంది. ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నది తక్కువే కానీ మా వారితో ఉంటూ ఆయన ద్వారానే అ న్ని సైగలకు అర్థాలు తెలుసుకున్నాను. ఆ భాషను పూరి ్తగా నేర్చుకున్నాను. ఇంట్లో నా భర్తవంటి వ్యక్తి ఉంటే ఎ లాంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలిసిన తర్వాత ఆయనలాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉంటారని, వారికి కూడా నా అవసరం ఉందని తెలుసుకున్నాను.

మా వారి ప్రోత్సాహంతో అందరికీ సాయం
డెఫ్‌ అండ్‌ డమ్‌ యూనియన్‌ను మా వారే 1991లో జిల్లాలో ఏర్పాటు చేశారు. బధిరుల్లో చాలా ఐక్యత ఉంటుంది. వారంతా ఒకరోజు అనుకుని ఆ రోజు నిర్దేశిత ప్రాంతానికి కచ్చితంగా చేరుకుంటారు. యూనియ న్‌కు నేనూ సేవలందించడం మొదలుపెట్టాను. అలా వారితో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. ఇప్పుడీ యూనియన్‌లో 480 మంది ఉన్నారు. వారిలో దాదాపు 200 మంది మహిళలే. వారి హక్కుల కోసం, అవసరం కోసం ప్రభుత్వాన్ని అడగాలంటే ఐక్యంగా యూనియన్‌ తరఫున అడుగుతుంటాం. మొదట్లో అధికారుల దగ్గరకు వెళ్లినపుడు వీరి భావాలను వారికి నా మాటగా వ్యక్తీకరించే ట్రాన్స్‌లేటర్‌గా ఉండేదాన్ని. అలా అలా తర్వాత బధిరుల కుటుంబ వ్యక్తిగా మారా ను. వారి కుటుంబాల్లో ఏ సమస్య వచ్చినా కూర్చోబెట్టి కౌన్సెలింగ్‌ చేయడం మొదలైంది. సాధారణ వ్యక్తులతో పోల్చితే వీరికి సర్దిచెప్పడం చాలా కష్టం. దేనినీ త్వరగా మర్చిపోరు. కొత్త సమస్య వస్తే పాతవన్నీ తవ్వుతారు. వారికి కోపం ఎక్కువ. అలాంటి సందర్భాల్లో మనమే తగ్గాలి. వారికి ఏదైనా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తక్కువ. అయితే ప్రైవేటు సెక్టార్‌లో వారికి ఉపాధి కల్పించడానికి మేమే ఓరియంటేషన్‌ కార్యక్రమం చేపట్టి వారికి పని చూపిస్తున్నాం.

సమస్యలూ ఎదురైనా...
బధిరుల కోసం చాలా ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంటుం ది. అలా వెళ్లినపుడు కొంతమంది నుంచి వేధింపులు, ఛీదరింపులు తప్పవు. ఒక్కోసారి ఇంటికే పరిమితం అయిపోవాలనేంత బాధ కలుగుతుంది. కానీ తెల్లారేసరికి బధిరులు ఇంటిదగ్గరకొచ్చి కూర్చుంటే వారితో వెళ్లకుండా ఉండలేను. ఒక పని జరగడానికి చాలా రోజుల పాటు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వీళ్లకోసం అదేమంత కష్టం అనిపించదు. ఎదుటివారు కూడా వీరిని అర్ధం చేసుకుని కొంచెం మానవత్వం చూపితే చాలు లోపాన్ని మర్చిపోయి మనలా సంతోషంగా బతికేస్తారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలోనే కాదు రాష్ట్రంలో లైవ్‌ ట్రాన్స్‌లేటర్లు పెద్దగా లేరు. మన రాష్ట్రంలో నాతో పాటు మరో మహిళ మాత్రమే ఉన్నారు. మూగసైగలకు మాట అవసరమొచ్చినప్పుడల్లా వారితో నేనుంటాను.

చిన్నవయసులోనే పెద్ద బాధ్యత...
అమ్మవాళ్లింట్లో ఉన్నంతకాలం నాకు ఏ పనీ చేప్పేవారు కాదు. కాలు బయట పెట్టిం ది లేదు. అత్తవారింటికి వచ్చాక వారి సాయంతోనే భర్తతో మాట్లాడాల్సి వచ్చేది. హైదరాబాద్‌ వెళ్లాక నాకు బయటకు రావాల్సిన అవసరం ఏర్పడింది. నా భర్త వెంట నేనే వెళ్లాలి. ఆయన సైగలకు నేనే మాటనవ్వాలి. కానీ అది ఇబ్బందిగా ఉం డేది. నా మాట వేరు,. ఆయన సైగ వేరుగా ఉండేది. దాంతో ఎలాగైనా ఆయన భావాలను అర్థం చేసుకోవాలనుకున్నాను. భర్త కోసం మూగ భాషను నేర్చుకోవాలనుకున్నాను. హైదరాబాద్‌లో నేర్చుకుందామని ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. అయితే అప్పటికే రెండోవాడు కడుపున పడ్డాడు. రన్నింగ్‌ బస్సులు ఎక్కి శిక్షణకు వెళ్లడం శ్రేయస్కరం కాదని మా నాన్న వారించారు. పురిటికోసం పుట్టింటికి తీసుకువచ్చారు. బాబు పుట్టిన పదమూడు రోజులకు మా వారికి ఆరోగ్యశాఖలో ఉద్యోగం వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement