translator
-
G20 Summit: విదేశీ అతిథుల కోసం అనువాదకులు
న్యూఢిల్లీ: జీ20 సదస్సు కోసం వచ్చి ఢిల్లీ దుకాణాల్లో, ముఖ్యంగా చాందినీ చౌక్ ప్రాంతంలో షాపింగ్ చేసే విదేశీ అతిథుల సౌకర్యం కోసం అక్కడి వర్తకులు మరో అడుగు ముందుకేశారు. షాపింగ్ సమయంలో భాషా బేధంతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు అనువాదకు(ట్రాన్స్‌లేటర్)లను సిద్ధంచేస్తున్నారు. ఇంగ్లి‹Ù, ఫ్రెంచ్, స్పానిష్ ఇలా జీ20 దేశాల్లో మాట్లాడే భాషలను అనర్గళంగా మాట్లాడి అనువదించగల 100 మంది మహిళా అనువాదకులను అక్కడి వర్తకులు రంగంలోకి దింపుతున్నారు. వీరు అందుబాటులో ఉండటంతో ఇకమీదట విదేశీ అతిథులు షాపింగ్ వేళ ఎలాంటి ఇబ్బందులు పడరని వర్తకులు చెబుతున్నారు. ఈ అనువాదకులు నిజానికి నూతన వ్యాపార వ్యవస్థాపకులు(ఎంట్రప్రెన్యూవర్స్). వీరిలో ఫ్యాషన్ డిజైనర్లు, సెలూన్, బొటిక్ యజమానులు, బ్లాగర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు ఉన్నారు. ‘ వీరంతా ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్, జర్మనీ తదితర భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. 8, 9, 10 తేదీల్లో ట్రేడర్లకు, అతిథులకు అనుసంధానకర్తలుగా మెలగుతారు’ అని వీరితో భాగస్వామ్యం కుదుర్చుకున్న ది చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(సీటీఐ) చైర్మన్ బ్రిజేష్ గోయల్ చెప్పారు. ‘ ట్రేడర్లకు సాయపడే వాలంటీర్ల జాబితాను ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖకు పంపాం. వీరు విదేశీ అతిథులకు అందుబాటులో ఉండి సాయపడతారు. దేశంలోనే షాపింగ్‌కు చిరునామాగా నిలిచే చాందీనీ చౌక్‌లో విదేశీయుల సందడి మరింత పెరగనుంది’ అని గోయల్ పేర్కొన్నారు. -
Gurdeep Kaur Chawla: ప్రధాని విదేశానికి వెళ్తే.. ఈమె ఉండాల్సిందే
దేశ నేతలు ఇతర దేశాల నేతలతో సరిగా మాట్లాడాలి. వారు చెప్పేది సరిగా వినాలి. దౌత్య సంబంధాలు సఫలం కావాలంటే సంభాషణే కీలకం. కాని అన్ని భాషలు అందరు నేతలకూ రావాలని లేదు. అందుకే దుబాసీలను ఎంచుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల్లో తరచు కనిపిస్తున్న దుబాసి గుర్దీప్ కౌర్ చావ్లా. ఇటీవల మోదీ అమెరికా పర్యటనలో ఆమె కీలక పాత్ర పోషించింది. అది వేదిక మీద ఎవరో ఒక నాయకుడు చేస్తున్న రాజకీయ ప్రసంగాన్ని అనువాదం చేయడం కాదు. లేదా ఒక కథనో వ్యాసాన్నో అనువాదం చేయడం కాదు. అగ్రనేతలు చర్చలు చేసుకుంటున్నప్పుడు ఆ సంభాషణను అనువాదం చేయడం. దుబాసీగా ఉండటం. ‘ఆ పని చాలా కష్టం’ అంటారు గుర్దీప్ కౌర్ చావ్లా. అమెరికాలో స్థిరపడిన ఈ పంజాబీ భారతీయురాలు గత 26 ఏళ్లుగా దౌత్యరంగంలో దుబాసీగా సేవను అందిస్తున్నారు. ‘డిప్లమాటిక్ ఇంటర్ప్రెటర్’గా అంతర్జాతీయ గుర్తింపు పొందారు గుర్దీప్ కౌర్. So good to see Gurdeep Kaur Chawla (interpreter) at the historic meeting between President Biden and Prime Minister Modi. Gurdeep is simply brilliant!#Politics #India #Historic pic.twitter.com/DuelcjJNUB — Dr. Jagdish N. Sheth (@JagSheth) June 27, 2023 ఢిల్లీలో చదువుకుని గుర్దీప్ కౌర్ ఢిల్లీలో ఎం.ఏ. ఇంగ్లిష్ చదవి, ఆ తర్వాత పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ చేసి, పీహెచ్డీ చేశాక పార్లమెంట్లో అనువాదకురాలిగా కెరీర్‌ను ప్రారంభించారు. ఇంగ్లిష్, హిందీ, పంజాబీ, ఉర్దూ భాషల్లో గొప్ప ప్రవేశం ఉండటంతో దుబాసీగా ఆమె సేవలను పార్లమెంట్ భవన్ ఉపయోగించుకునేది. అయితే భర్త ఉద్యోగరీత్యా 1996లో అమెరికా వెళ్లిన గుర్దీప్ అక్కడ కూడా దౌత్యపరమైన దుబాసీగా కావాల్సిన అనుభవం కోసం ‘జ్యుడిషియల్ కౌన్సిల్ ఆఫ్ కాలిఫోర్నియా’లో పని చేశారు. ‘దౌత్యరంగానికి అవసరమైన మేలిమి ఇంటర్ప్రెటర్ల కొరతను ఆ రోజుల్లోనే నేను గమనించాను. అలాంటివారిని తయారు చేయడానికి ‘ఇండియన్ లాంగ్వేజస్ సర్వీసెస్’ అనే సంస్థను స్థాపించి దుబాసీలను తయారు చేస్తున్నాను. భారతీయ నేతల కోసమే కాదు ప్రపంచ నేతల కోసం కూడా అరబిక్, స్పానిష్, చైనీస్ తదితర భాషలలో నిపుణులైన దుబాసీలను మేము ఏర్పాటు చేస్తాం’ అంటారు గుర్దీప్ కౌర్. We are proud of Pacific Council member Dr. Gurdeep Kaur Chawla, who is interpreting bilateral talks during the #ASEAN summit in #Singapore. pic.twitter.com/PqyFBbRYP4 — Pacific Council (@PacCouncil) November 15, 2018 ప్రధానులకు దుబాసీ అమెరికా పర్యటనకు వచ్చే భారతీయ ప్రధానులకు గుర్దీప్ దుబాసీగా పని చేసి ప్రశంసలు అందుకున్నారు. వి.పి.సింగ్, చంద్రశేఖర్, పి.వి.నరసింహారావు, వాజ్‌పేయి, గుజ్రాల్, మన్మోహన్ సింగ్ వీరందరూ అమెరికా వచ్చినప్పుడు వారి అధికారిక దుబాసీగా గుర్దీప్ పని చేశారు. ఇప్పుడు నరేంద్ర మోదీ కోసం పని చేస్తున్నారు. అయితే ట్రంప్ హయాంలో మోదీ అమెరికా వచ్చినప్పుడు ట్రంప్‌కు కూడా దుబాసీగా గుర్దీప్ పని చేశారు. అంటే ట్రంప్ మాట్లాడేది హిందీలో అనువాదం చేసి మోదీకి తెలిపారు. ఒబామాకు కూడా గుర్దీప్ పని చేశారు. సవాళ్లతో నిండిన పని ‘అగ్రనేతలు పాల్గొనే దౌత్య సంబంధ సమావేశాలలో దుబాసీగా పని చేయడం చాలా సవాలు. నేతలు మాట్లాడేది ఒక మాట తక్కువ కాకూడదు ఒక మాట ఎక్కువ కాకూడదు. ముఖ్యంగా మన భావాలు, పెడర్థాలు కలపకూడదు. నేను ఒక నేతకు దుబాసీగా పని చేయాలని అనుకున్న వెంటనే ఆ నేత వాడే పదసముదాయం, ఉచ్చారణ, యాస, వ్యక్తీకరణ మొత్తం స్టడీ చేస్తాను. రెండు దేశాల మధ్య ఉండే దౌత్య పరమైన సంబంధాల అవగాహన ఉండాలి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, సాంస్కృతిక అంతరం, అధికారిక సంబంధాల మధ్య ఉండే సవాళ్లు... వీటన్నింటిని తెలుసుకుని ఆ అగ్రనేత ఏం మాట్లాడబోతాడో ఊహించి సిద్ధంగా ఉండాలి. ఇంత హోమ్‌వర్క్ లేకపోతే తక్షణ అనువాదం సాధ్యం కాదు’ అంటుంది గుర్దీప్ కౌర్. ఐక్యరాజ్యసమితి, ఐ.ఎం.ఎఫ్, వరల్డ్ బ్యాంక్, యూ.ఎస్. ఇండియా బిజినెస్ కౌన్సిల్, డబ్లు్య.హెచ్.ఓ తదితర సంస్థలకు గుర్దీప్ కౌర్ వ్యక్తిగతంగా తన సంస్థ తరఫున సేవలు అందిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరు దేశాలు ఏవైనా మాట్లాడుకోవాలంటే గుర్దీప్ కౌర్ సేవలు తప్పనిసరి అనే స్థితిలో ఆమె తన సేవలను విస్తరించారు. భాష తెలియడం వల్ల వచ్చిన విజయం ఇది. భాషల మీద పట్టు సాధించి ఇటువైపు కెరీర్ మలుచుకోవాలనుకునేవారికి గుర్దీప్ గొప్ప స్ఫూర్తి. Super proud of our colleague, Dr Gurdeep Kaur Chawla @ Imagindia Institute - she is sitting to the right of US Secy State Pompeo, as he meets Prime Minister Modi today morning in Delhi. pic.twitter.com/lCLz1DcLCa — Imagindia (@Imagindia) June 26, 2019 -
ఎల్లలు దాటించే కళ
నిత్యం మధుర ఫలాలు తినేవాడికి పులుపు మీద మనసు పుడుతుందట. మనిషి స్వభావాన్ని అత్యంత సన్నిహితంగా చూసినవాడు మాత్రమే చెప్పగలిగే ఈ వాక్యాన్ని కవులకే కవి అయిన కాళిదాసు పదిహేను వందల సంవత్సరాల క్రితం అన్నాడట. ఈ అట ఎందుకంటే, సంస్కృతంలో దీన్ని చదివినవాళ్లు ఎంతమందో మనకు తెలియదు. తక్కువమంది అని మాత్రమే నిశ్చయంగా చెప్పగలం. ఆ కాళిదాసుకు వెయ్యి సంవత్సరాల ముందు, మనిషికి శాంతిలోని సౌఖ్యాన్ని తెలియ జేయడానికి బుద్ధ భగవానుడు చెప్పాడని చెప్పేదంతా పాళీ భాషలో ఉంది. అయినా అదంతా మనకు చేరింది. బైబిల్, ఖురాన్ తమ మూలభాషలైన హీబ్రూ, అరబిక్‌లను దాటుకొని ప్రపంచ మూలమూలలకూ వ్యాపించాయి. ఒక్కమాటలో దీనంతటికీ కారణం: అనువాదం. గ్రీకు సోక్రటీసు మనకు సన్నిహితుడే. పారశీక రూమీ కావాల్సినవాడే. గోర్కీ రష్యాలో రాస్తే ఇక్కడి పల్లెటూళ్లలో సమోవార్ల వెచ్చదనం అనుభవించాం. మావో చైనాలో ఏదో చెబితే మన పక్కనే ఉండి మనకు చెప్పాడనుకుని కార్యరంగంలోకి దూకాం. మపాసా ఫ్రాన్సులో చెప్పినదానికి మన చలం చెప్పేవాటితో పోలికలు వెతికాం. పక్కనే కన్నడ దేశంలో ఉన్న భైరప్ప ఏం రాశాడో; పొరుగున మరాఠా ప్రాంతంలో ఉన్న శరణ్ కుమార్ లింబాలే ఏం చేశాడో అనాయాసంగా తెలుసుకోగలం. బహుశా ప్రపంచంలోని సారస్వతం అంతా అనువాద రూపంలోనే బతికి ఉంది. ఈ ప్రపంచం నిలిచింది, వివేకవంతమైంది అనువాదంతోనే. ఒక భాషలోని రచనను ఇంకో భాషవాళ్లకు తెలియజేయాలని ఒక అనువాదకుడు ఎందుకు ఉవ్విళ్లూరుతాడో దానికి తనవైన కారణాలు ఉండొచ్చు. భావజాల వ్యాప్తి మొదలు తాను అనుభవించిన సంతోషాన్ని ఇంకొకరికి పంచడం దానికి ప్రేరేపకాలు కావొచ్చు. మూల భాషలోంచి లక్ష్య భాషలోకి ఎలా తేవాలో చెప్పడానికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆ తెచ్చిన దాని పట్ల అన్నే నిరసనలూ ఉన్నాయి. పోయే గింజంతా పోగా మిగిలిన పొల్లు మాత్రమే అనువాదం అని చెప్పేంతగా. పూలనే కాదు, ఆ రాళ్లను ముఖాన కొట్టించుకోవడానికి కూడా అనువాదకుడు సిద్ధపడతాడు. పుష్కిన్ కవిత్వాన్ని అనువదించ లేమంటారు. ఆ కారణంగా ఎవరూ అనువాదానికే పూనుకోకపోతే, ఆ అమృతం తాగలేకపోయిన ఇతర భాషీయులకు సువాసన అయినా పీల్చే అవకాశం ఉండదు కదా. అయితే అనువాదకుల వల్ల కూడా లక్ష్యభాషలు వృద్ధి చెందాయి. కొత్త పదాలు పుట్టాయి. కొత్త వ్యక్తీకరణలు పరిచయం అయ్యాయి. ఒక్క మాటలో రచన ఒక కళ అయితే, అనువాదం దాదాపుగా అంతకు తగ్గని కళ. ఆ స్వీయాభిమానంతోనే, ఈ మధ్య కొందరు అనువాదకులు ‘ట్రాన్స్‌లేటర్స్ ఆన్ ద కవర్’ హ్యాష్‌ట్యాగ్‌తో ఒక ఉద్యమం చేపట్టారు. ప్రచురణ సంస్థలు రచయితల పేర్లను మాత్రమే కవర్ పేజీ మీద వేస్తున్నాయనీ, తమ పేర్లను కూడా గౌరవంగా ముఖపత్రం మీద ముద్రించాలనీ లండన్‌లోని ‘ద సొసైటీ ఆఫ్ ఆథర్స్’ ప్రచారం ప్రారంభించారు. సెప్టెంబర్ 30 నాటి అంతర్జాతీయ అనువాద దినోత్సవం దీనికి ఒక ట్రిగ్గర్‌గా పనికొచ్చింది. దానికి కొనసాగింపుగా చర్చలు జరుగుతున్నాయి. రచయితల సమూహం ప్రచురణకర్తలకు బహిరంగ లేఖ రాశారు. దానికి బలం పెరిగేలా సంతకాల సేకరణ మొదలుపెట్టారు. ఎందరో ప్రసిద్ధ అనువాదకులు సమ్మతి తెలిపారు. పదకొండు వేల మంది సభ్యులున్న అమెరికాకు చెందిన ‘ఆథర్స్ గిల్డ్’ కూడా వీరికి మద్దతుగా నిలిచింది. యాభై లక్షల రూపాయల నగదు కలిగిన ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజును రచయితతో పాటు అనువాదకులకూ 2016 నుంచి సమంగా పంచుతున్నారు. ఇది అనువాద ప్రతిభను గొప్పగా గౌరవించడమే. అయితే, 2018లో ‘ఫ్లైట్స్’ పుస్తకానికి గానూ ఈ పురస్కారం గెలుచుకున్న పోలండ్ రచయిత్రి ఓల్గా తొకార్చుక్ పేరును కవర్ మీద వేశారు గానీ, దాన్ని ఆంగ్లంలోకి అనువదించిన జెన్నిఫర్ క్రాఫ్ట్ పేరును వేయలేదు. పుస్తకం లోపల వేస్తారు; కానీ చూడగానే అనువాదం అని తెలియకుండా అదో చిన్న యుక్తి అనేది కొంత మంది ప్రచురణకర్తల వాదన. అదే సంవత్సరం సాహిత్యంలో అత్యున్నత గౌరవమైన నోబెల్ పురస్కారం కూడా పొందిన తొకార్చుక్ కూడా ముఖపత్రం మీద అనువాదకుల పేరు వేయాలన్న వాదనకు మద్దతునివ్వడం గమనార్హం. భిన్న అనువాదాల్లో వెలువడే అదృష్టం ఉన్న రచయితలు కొంతమంది ఉంటారు. అలాంట ప్పుడు అడిగినా అనువాదకుల పేరు కవర్ మీద వేయడం జరగకపోవచ్చు. కానీ వారి ప్రతిభతో నిమిత్తం లేకపోయినా అనువాదం కావడమే గొప్ప అదృష్టం అయ్యే రచయితలు మరికొందరు ఉంటారు. అలాంటప్పుడు ఆ డిమాండ్ సులువుగానే అంగీకారం పొందుతుంది. అయితే రచయిత, అనువాదకుడు సమానం అవుతారా? కచ్చితంగా కాదని ఆ సంతకాలు పెడుతున్న అనువాదకులు కూడా ఒప్పుకుంటారు. రచయితకూ అనువాదకుడికీ మధ్య ఒక గౌరవప్రదమైన దూరం ఉండాలి. అయితే, కవర్ పేజీ మీద పేరు వేయడం అనేది మరింతమందిని అనువాదంలోకి దిగేలా పురిగొల్పడానికీ, ఏదో భాషలో చీకట్లో ఉండిపోయిన అద్భుతమైన రచనను ప్రపంచానికి తెలియ జెప్పడానికి కావాల్సిన డ్రైవ్ ఇవ్వడానికీ కారణం కాగలదేమో. ‘అనువాదం గనక లేకపోతే, నేను నా దేశ సరిహద్దులకే పరిమితమయ్యేవాణ్ణి’ అన్నాడు స్పానిష్ రచయిత సెర్వాంటెజ్. కదా! అందువల్లే ఆయన ‘డాన్ కిహోటీ’ మనదాకా వచ్చాడు. ప్రపంచ ఎల్లలను చెరపడంలో రచయితల కన్నా అను వాదకుల పాత్రే ఎక్కువనే విషయంలో మాత్రం ఎవరికీ సందేహం లేదు. -
హైదరాబాద్‌లో ట్రాన్స్లేటర్ల పేరుతో నయా దంద
-
మౌన వీణ గానమిదీ...
ఆమె జీవితం అందరిలా వడ్డించిన విస్తరికాదు... చిన్నవయసులోనే ఇల్లాలిగా మారినా చింతించలేదు. కన్నవారి నిర్ణయంతో మాటరాని భర్తకు తానే ఆలంబనగా నిలవడానికి వెనుకాడలేదు. ఇలాంటి సమస్య తనకే ఎందుకు ఎదురైందని ఆమె మనోవ్యధ చెందలేదు. ఏమిటిది భగవంతుడా అని కుంగిపోలేదు. జీవితాన్ని సవాల్‌గా తీసుకున్నారు. తనకెదురైన కష్టాన్ని ఓ లక్ష్యంగా మలచుకున్నారు. తన భర్త లాంటి ఎంతో మందికి ఇప్పుడు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. అలాంటి కష్టం ఎవరికి వచ్చినా... అండగా ఉండేందుకు ఓ ఆయుధమయ్యారు. వారి సమస్యలనుఅధికారులకు వివరించగలిగే అనువాదికురాలయ్యారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: మాటరాని నోటికి ఆమె పలుకయ్యారు. వినలేని చెవులకు శబ్దమయ్యారు. బధిరుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఆమే లక్ష్మి కొండమ్మ. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో పుట్టిన ఆమె కోటేశ్వరావు, పూర్ణలక్ష్మిల ఎనిమిదిమంది సంతానంలో చివరి అమ్మాయి. వినలేని, మాట్లాడలేని భర్తకు మాట సాయం చేయడంతో మొదలు పెట్టిన ఆమె జీవితం బధిరుల పాలిట కల్పవల్లిగా మారేలా చేసింది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోనేగాదు... రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి మాట సాయం కావాలన్నా ఆమె ఉండాల్సిందే. వారి మనసుల్లోని భావాలను మాటలుగా మలచి పాలకులకు, అధికారులకు అర్థమయ్యేలా వ్యక్తీకరిస్తూ బధిరుల కుటుంబంలో ఒక సభ్యురాలిగా మారిపోయారు. వారి మధ్య మనస్పర్ధలను మంచి మాటలతో దూరం చేసే పెద్దదిక్కులా నిలుస్తున్నారు. మౌనాన్ని జయించిన ఆమె తన జీవితం గురించి ‘సాక్షిప్రతినిధి’తో పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే.. నాన్న ఆర్టీసీ పాలకొండ డిపోలో డ్రైవర్. పదోతరగతి చదువుతున్నప్పుడే పెళ్లయింది. భర్త చీపురుపల్లి మండలం పెదనడిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ మా మామయ్య కొడుకు. దగ్గరి సంబంధం అని చేసేశారు. నిజానికి చిన్నప్పుడే పెద్దలు ఈ పెళ్లి నిర్ణయించారు. అప్పట్లో అసలు పెళ్లి, జీవితం అంటే ఏమీ తెలీదు. అత ను పుట్టు మూగ, చెవిటి. ఆ విషయం పెళ్లికి ముందే తెలి సినా దాని గురించి ఆలోచించే వయసు లేదు. పెద్దబ్బా యి పుట్టేంత వరకూ ప్రపంచం తెలియలేదు. మా వారు హైదరాబాద్‌లోని హెచ్పీసీఎల్లో అప్రంటిస్‌గా కేవలం రూ.1000ల జీతానికి చేసేవారు. ఆయన కోసం హైదరాబాద్‌కు మకాం మార్చాం. అనుభవం నేర్పిన భాష సాధారణంగా బధిరులు మామూలు వాళ్లను తమ పార్టనర్‌గా అంగీకరించలేరు. వారు ఏదీ మనసులో పెట్టుకోరు. లోపలేదుంటే దానిని నిర్మొహమాటంగా బయటపెట్టేస్తారు. మనం వారి మనుషులమంటూ ఎంతో నమ్మకం కలిగించాలి. వారి మనసు తెలుసుకుని మసలుకోవాలి. మా వారితో పాటు నేనూ సాయంగా వెళ్లేదాన్ని. ఆయన విధుల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అలవాటైంది. ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నది తక్కువే కానీ మా వారితో ఉంటూ ఆయన ద్వారానే అ న్ని సైగలకు అర్థాలు తెలుసుకున్నాను. ఆ భాషను పూరి ్తగా నేర్చుకున్నాను. ఇంట్లో నా భర్తవంటి వ్యక్తి ఉంటే ఎ లాంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలిసిన తర్వాత ఆయనలాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉంటారని, వారికి కూడా నా అవసరం ఉందని తెలుసుకున్నాను. మా వారి ప్రోత్సాహంతో అందరికీ సాయం డెఫ్ అండ్ డమ్ యూనియన్ను మా వారే 1991లో జిల్లాలో ఏర్పాటు చేశారు. బధిరుల్లో చాలా ఐక్యత ఉంటుంది. వారంతా ఒకరోజు అనుకుని ఆ రోజు నిర్దేశిత ప్రాంతానికి కచ్చితంగా చేరుకుంటారు. యూనియ న్కు నేనూ సేవలందించడం మొదలుపెట్టాను. అలా వారితో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. ఇప్పుడీ యూనియన్‌లో 480 మంది ఉన్నారు. వారిలో దాదాపు 200 మంది మహిళలే. వారి హక్కుల కోసం, అవసరం కోసం ప్రభుత్వాన్ని అడగాలంటే ఐక్యంగా యూనియన్ తరఫున అడుగుతుంటాం. మొదట్లో అధికారుల దగ్గరకు వెళ్లినపుడు వీరి భావాలను వారికి నా మాటగా వ్యక్తీకరించే ట్రాన్స్‌లేటర్‌గా ఉండేదాన్ని. అలా అలా తర్వాత బధిరుల కుటుంబ వ్యక్తిగా మారా ను. వారి కుటుంబాల్లో ఏ సమస్య వచ్చినా కూర్చోబెట్టి కౌన్సెలింగ్ చేయడం మొదలైంది. సాధారణ వ్యక్తులతో పోల్చితే వీరికి సర్దిచెప్పడం చాలా కష్టం. దేనినీ త్వరగా మర్చిపోరు. కొత్త సమస్య వస్తే పాతవన్నీ తవ్వుతారు. వారికి కోపం ఎక్కువ. అలాంటి సందర్భాల్లో మనమే తగ్గాలి. వారికి ఏదైనా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తక్కువ. అయితే ప్రైవేటు సెక్టార్లో వారికి ఉపాధి కల్పించడానికి మేమే ఓరియంటేషన్ కార్యక్రమం చేపట్టి వారికి పని చూపిస్తున్నాం. సమస్యలూ ఎదురైనా... బధిరుల కోసం చాలా ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంటుం ది. అలా వెళ్లినపుడు కొంతమంది నుంచి వేధింపులు, ఛీదరింపులు తప్పవు. ఒక్కోసారి ఇంటికే పరిమితం అయిపోవాలనేంత బాధ కలుగుతుంది. కానీ తెల్లారేసరికి బధిరులు ఇంటిదగ్గరకొచ్చి కూర్చుంటే వారితో వెళ్లకుండా ఉండలేను. ఒక పని జరగడానికి చాలా రోజుల పాటు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వీళ్లకోసం అదేమంత కష్టం అనిపించదు. ఎదుటివారు కూడా వీరిని అర్ధం చేసుకుని కొంచెం మానవత్వం చూపితే చాలు లోపాన్ని మర్చిపోయి మనలా సంతోషంగా బతికేస్తారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలోనే కాదు రాష్ట్రంలో లైవ్ ట్రాన్స్‌లేటర్లు పెద్దగా లేరు. మన రాష్ట్రంలో నాతో పాటు మరో మహిళ మాత్రమే ఉన్నారు. మూగసైగలకు మాట అవసరమొచ్చినప్పుడల్లా వారితో నేనుంటాను. చిన్నవయసులోనే పెద్ద బాధ్యత... అమ్మవాళ్లింట్లో ఉన్నంతకాలం నాకు ఏ పనీ చేప్పేవారు కాదు. కాలు బయట పెట్టిం ది లేదు. అత్తవారింటికి వచ్చాక వారి సాయంతోనే భర్తతో మాట్లాడాల్సి వచ్చేది. హైదరాబాద్ వెళ్లాక నాకు బయటకు రావాల్సిన అవసరం ఏర్పడింది. నా భర్త వెంట నేనే వెళ్లాలి. ఆయన సైగలకు నేనే మాటనవ్వాలి. కానీ అది ఇబ్బందిగా ఉం డేది. నా మాట వేరు,. ఆయన సైగ వేరుగా ఉండేది. దాంతో ఎలాగైనా ఆయన భావాలను అర్థం చేసుకోవాలనుకున్నాను. భర్త కోసం మూగ భాషను నేర్చుకోవాలనుకున్నాను. హైదరాబాద్‌లో నేర్చుకుందామని ఇన్స్టిట్యూట్లో చేరాను. అయితే అప్పటికే రెండోవాడు కడుపున పడ్డాడు. రన్నింగ్ బస్సులు ఎక్కి శిక్షణకు వెళ్లడం శ్రేయస్కరం కాదని మా నాన్న వారించారు. పురిటికోసం పుట్టింటికి తీసుకువచ్చారు. బాబు పుట్టిన పదమూడు రోజులకు మా వారికి ఆరోగ్యశాఖలో ఉద్యోగం వచ్చింది. -
అనువాద వ్యాకరణం
అనువాదకుడు మూల కవిత్వ స్వభావాన్ని బట్టి భాషా స్వరూపాన్ని నిర్ణయించుకోవడం అవసరం. అనువాదకుడు అసహాయకుడు. మూల కవిత్వాన్ని యథాతథంగా అనువదించాలి, ఎలాంటి తనతనం డామినేట్ చెయ్యకుండా. అనువాద ప్రక్రియకు వ్యాకరణం అంటూ లేదు. అది ఎవరికి వారు పేనుకున్న సూత్రాల మీద ఎవరికి వారే చేసే tight-rope-walking. అది ఒక ఔత్సాహిక దుబాసి చేసే సాహసం. మూలంలోని రంగులు చెడకుండా తమదైన ముద్రతో పొరుగు వాకిళ్ల ముగ్గుల్లోకి ప్రవేశించడం. పాఠకుల్ని పొలిమేరలు దాటించడం. మూలంలోని భావార్థాలు చెక్కుచెదర నీయకుండా, వీలైన మేరకు మూల రచన శైలీ శిల్పాలను ప్రతిబింబింపజేయడం కత్తి మీది సాము. Poetry is what gets lost in translation అన్నది అనువాదకుని పాలిటి Death Blow! కవిత్వానువాదంలో మూలంలోని సంగీతం లుప్తం కావడం అనివార్యం అని వాడ్రేవు చినవీరభద్రుడు గారు అన్నట్లు గుర్తు. అది అనుభవంలోకి వచ్చిన అక్షర సత్యం. ఈ లోటును కొంతలో కొంత ప్రాసల ప్రయోగంతో పూరించవచ్చేమో! నిర్దిష్టమైన సమానార్థక పదబంధ ప్రయోగం Diction లలిత భావ వ్యక్తీకరణకు తోడ్పడినట్లే, పదాంత ప్రాసలు పాటకు అవసరమైన తాళ గతులకు, వాక్యాంత ప్రాసలు రాగ శ్రావ్యతకు ఉపకరిస్తాయని నా భావన. పాటను పోగొట్టుకున్న సమకాలీన వచన కవితలోని అంతర్లయకు నిస్సందేహంగా ఇవి దోహదకారులే. కాని, అనువాదం వచన కవిత్వమైతే, అది వెనుతిరిగి మళ్లీ పాటలోకి, పద్యంలోకి ప్రవహిస్తున్నట్టు అనిపించకూడదు! పాశ్చాత్య పాత తరపు కవులలో భాషా గాఢత, భావ నిగూఢత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. నేటి వచన కవితకు ఇవి అవసరమా అన్నది సమకాలీన శేషప్రశ్న! నా దృష్టిలో ప్రతి పదానికి ఒక ప్రత్యేక స్వభావం ఉంటుంది. ఆ నైజపు సొగసు వాక్య నిర్మాణంలో కాని బయటపడదు. నిజానికి, ఒక చక్కని కవితలోని అన్ని పదాలను, పదబంధాలను (శీర్షిక నుండి పాద సూచికల వరకు) పరిశీలిస్తే ఆ పద సమూహం ఒక సజాతికి, ఒక natural classificationM కు చెందినవిగా నాకు తోస్తుంటుంది. అంటే, ప్రయోగించిన పదం (అచ్చ తెలుగైనా, సంస్కృత పదమైనా, తుదకు ఆంగ్ల పదమైనా) ఆ స్థానంలో సంపూర్ణంగా ప్రత్యామ్నాయం లేని కచ్చితమైన అక్షరోక్తిలాగా గోచరిస్తేనే అది సాధ్యం. తత్సమ తద్భవాలు, నా అనుభవంలో, అయాచితంగా అందివచ్చే ఆప్త హస్తాలు. అవి వచనకవితకు అత్యంత ఆవశ్యకమైన క్లుప్తతకు దోహదకారులు. ఇది వైరి సమాసం కాదుకదా అన్న సందేహానిది, నేటి వచన కవితా నేపథ్యంలో, ద్వితీయ స్థానమే. వాడిన సమాసం చెవులకింపుగా ఉండటం ముఖ్యం. లలిత భావోక్తి, కదిలించే కవితాభివ్యక్తి అనుభూతి కవిత్వానికైనా సామాజిక ప్రయోజన కారకమైన ఏ కవితకైనా అవసరమే. మూలం, ముఖ్యంగా అది విదేశీయం అయినప్పుడు, దేశవాళీ తెలుగు రంగులద్దడం నాకు అంతగా రుచించదు. అనువాదం సాఫీగా సాగుతూనే విదేశీ వాతావరణాన్ని, ఆనాటి దేశకాల పరిస్థితులను గుర్తు చేయాలి. అందుకే, అవసరమనుకున్న చోట వివరణాత్మక అధో పాదసూచికలు పొందు పరుస్తాను. ఇక, భావ నిగూఢత- నా దృష్టిలో వాంఛనీయం. రొమాంటిక్ కవుల నుండి రవీంద్రుని దాకా, ‘మో’ నుండి ‘దెంచనాల’ దాకా నిగూఢత ఏదో ఒక రూపంలో వాడబడిన అలంకారమే. ఆచ్ఛాదనలో దాగిన అందం ఆకర్షణీయం కాదా? కవిత్వంలో ఇముడలేని దేశ కాల నేపథ్యాన్ని పదాలలో గుంభనంగా దాచారు పురా కవులు, ముఖ్యంగా ప్రాచీన పాశ్చాత్య కవులు, పరోక్ష ప్రస్తావనల, ప్రతీకల రూపంలో. T.S.Eliot ను చదివితే బుద్ధిపూర్వకంగా అతను కవిత్వంలో జటిలతను పొందుపరచ లేదుకదా అని అనిపిస్తుంటుంది. అంత అవసరం కాదేమో? చెప్పీ చెప్పకుండా చెప్పడం, విప్పీ విప్పకుండా విషయాన్ని విప్పడం ఒక అభిలషించదగిన కళాత్మక నైపుణ్యమని నేను భావిస్తాను. అనువాదకుడు మూల కవిత్వ స్వభావాన్ని బట్టి భాషా స్వరూపాన్ని నిర్ణయించుకోవడం అవసరం. అనువాదకుడు అసహాయకుడు. మూల కవిత్వాన్ని యథాతథంగా అనువదించాలి, ఎలాంటి తనతనం డామినేట్ చెయ్యకుండా. అందుకే, వీలైనంత వరకు, వాక్యానువాక్య (Paraphrasing/ Metaphrasing) అనువాదమే నాకు తోచిన ఉపయుక్తమైన ఉదాత్త ప్రక్రియ. దీంతో, భావం అర్థంతో పాటు వారి శైలీ శిల్పాలు కూడా కొంత ప్రతిఫలిస్తాయి. కాని, అనువాదం మక్కీకి మక్కీగా ఉందనే విమర్శకు గురి అయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడే, అనువాదకుడు తన భాషా పాటవాన్ని వినియోగించుకోవాలి. స్వీయ కవితలాగా సహజంగా సాఫీగా సాగిపోతూనే అనువాదం ఆనాటి దేశ కాల వాతావరణాన్ని గుర్తుకు తేవాలి. అందుకు, మూలంలోని కీలక పదాలను, పదబంధాలను, పదచిత్రాలను, భావచిత్రాలను, ప్రతీకలను, పరోక్ష ప్రస్తావనలను (allegory), ప్రాంతీయ వర్ణనలను యథాతథంగా (పేర్లను కూడా మార్చకుండా) మొదట పట్టుకొని వాటికి తగిన సమాన స్థాయి తెలుగు పదాలను నిర్ధారించుకుంటే అనువాదం చాలా వరకు మూలానికి చేరువలో ఉంటుందని నా అనుభవం. నా అనువాదాలు ‘‘అనుధ్వని’’, ‘‘అనుస్వరం’’, ‘జాన్ కీట్స్’ సంకలనాలలో నేను ఎదుర్కొన్న సవాళ్లు నాకీ అవగాహనను అందించాయి. ఐతే, ఇది సార్వత్రిక సత్యం కాక ఒక కేవల వ్యక్తిగత అనుభవ సత్యమే అయి ఉండవచ్చు. నా ఆచరణలో అక్షరత్వం దాల్చి ఉండకపోవచ్చు. తాడు మీది నడక తప్పటడుగుల ప్రయాణమే కదా! - నాగరాజు రామస్వామి 8374486186 -
మైక్రోసాఫ్ట్‌లోనూ ట్రాన్స్‌లేటర్..
సాక్షి, హైదరాబాద్: ఒక భాషను వివిధ రకాల భాషల్లోకి మార్చుకునేందుకు మనం ఎక్కువగా గూగుల్ ట్రాన్స్‌లేటర్‌ను వాడుతుంటాం. ఇకపై మైక్రోసాఫ్ట్‌లో కూడా ఆ సదుపాయం అందుబాటులోకి రానుంది. మైక్రోసాఫ్ట్ ట్రాన్స్‌లేటర్ పేరుతో ఆ సంస్థ సరికొత్త యాప్‌ను విడుదల చేసింది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, ట్యాబ్, స్మార్ట్‌ఫోన్, స్మార్ట్వాచీల్లోనూ ఈ లోనూ ఈ యాప్ పనిచేస్తుందని సంస్థ అధికారులు తెలిపారు. గూగుల్ ట్రాన్స్‌లేటర్ 27 రకాల భాషలు, వాయిస్ కన్వర్జేషన్‌కు మాత్రమే సహకరిస్తుండగా.. మైక్రోసాఫ్ట్ ట్రాన్స్లేటర్లో 50 రకాల భాషలను అనువదించుకోవచ్చు. అంతేకాకుండా త్వరలో స్కైప్‌కు కూడా ప్రత్యేక ట్రాన్స్‌లేటర్ యాప్‌ను రూపొందించనున్నట్లు సంస్థ వెల్లడించింది. గతంలో మైక్రోసాఫ్ట్ బింగ్ వైబ్‌సైట్ ద్వారా విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం, విండోస్ 10 డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్‌లో ట్రాన్స్‌లేటర్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచింది.