Gurdeep Chawla Is The Voice Of Many Global Leaders - Sakshi
Sakshi News home page

Gurdeep Kaur Chawla: ప్రధాని విదేశానికి వెళ్తే.. ఈమె ఉండాల్సిందే

Published Thu, Jul 13 2023 12:27 AM | Last Updated on Thu, Jul 13 2023 1:29 PM

Gurdeep Chawla is the voice of many global leaders - Sakshi

దేశ నేతలు ఇతర దేశాల నేతలతో సరిగా మాట్లాడాలి. వారు చెప్పేది సరిగా వినాలి. దౌత్య సంబంధాలు సఫలం కావాలంటే సంభాషణే కీలకం. కాని అన్ని భాషలు అందరు నేతలకూ రావాలని లేదు. అందుకే దుబాసీలను ఎంచుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల్లో తరచు కనిపిస్తున్న దుబాసి గుర్‌దీప్‌ కౌర్‌ చావ్లా. ఇటీవల మోదీ అమెరికా పర్యటనలో ఆమె కీలక పాత్ర పోషించింది.

అది వేదిక మీద ఎవరో ఒక నాయకుడు చేస్తున్న రాజకీయ ప్రసంగాన్ని అనువాదం చేయడం కాదు. లేదా ఒక కథనో వ్యాసాన్నో అనువాదం చేయడం కాదు. అగ్రనేతలు చర్చలు చేసుకుంటున్నప్పుడు ఆ సంభాషణను అనువాదం చేయడం. దుబాసీగా ఉండటం. ‘ఆ పని చాలా కష్టం’ అంటారు గుర్‌దీప్‌ కౌర్‌ చావ్లా. అమెరికాలో స్థిరపడిన ఈ పంజాబీ భారతీయురాలు గత 26 ఏళ్లుగా దౌత్యరంగంలో దుబాసీగా  సేవను అందిస్తున్నారు. ‘డిప్లమాటిక్‌ ఇంటర్‌ప్రెటర్‌’గా అంతర్జాతీయ గుర్తింపు పొందారు గుర్‌దీప్‌ కౌర్‌.

ఢిల్లీలో చదువుకుని
గుర్‌దీప్‌ కౌర్‌ ఢిల్లీలో ఎం.ఏ. ఇంగ్లిష్‌ చదవి, ఆ తర్వాత పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేసి, పీహెచ్‌డీ చేశాక పార్లమెంట్‌లో అనువాదకురాలిగా కెరీర్‌ను ప్రారంభించారు. ఇంగ్లిష్, హిందీ, పంజాబీ, ఉర్దూ భాషల్లో గొప్ప ప్రవేశం ఉండటంతో దుబాసీగా ఆమె సేవలను పార్లమెంట్‌ భవన్‌ ఉపయోగించుకునేది. అయితే భర్త ఉద్యోగరీత్యా 1996లో అమెరికా వెళ్లిన గుర్‌దీప్‌ అక్కడ కూడా దౌత్యపరమైన దుబాసీగా కావాల్సిన అనుభవం కోసం ‘జ్యుడిషియల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా’లో పని చేశారు. ‘దౌత్యరంగానికి అవసరమైన మేలిమి ఇంటర్‌ప్రెటర్‌ల కొరతను ఆ రోజుల్లోనే నేను గమనించాను. అలాంటివారిని తయారు చేయడానికి ‘ఇండియన్‌ లాంగ్వేజస్‌ సర్వీసెస్‌’ అనే సంస్థను స్థాపించి దుబాసీలను తయారు చేస్తున్నాను. భారతీయ నేతల కోసమే కాదు ప్రపంచ నేతల కోసం కూడా అరబిక్, స్పానిష్, చైనీస్‌ తదితర భాషలలో నిపుణులైన దుబాసీలను మేము ఏర్పాటు చేస్తాం’ అంటారు గుర్‌దీప్‌ కౌర్‌.

ప్రధానులకు దుబాసీ
అమెరికా పర్యటనకు వచ్చే భారతీయ ప్రధానులకు గుర్‌దీప్‌ దుబాసీగా పని చేసి ప్రశంసలు అందుకున్నారు. వి.పి.సింగ్, చంద్రశేఖర్, పి.వి.నరసింహారావు, వాజ్‌పేయి, గుజ్రాల్, మన్‌మోహన్‌ సింగ్‌ వీరందరూ అమెరికా వచ్చినప్పుడు వారి అధికారిక దుబాసీగా గుర్‌దీప్‌ పని చేశారు. ఇప్పుడు నరేంద్ర మోదీ కోసం పని చేస్తున్నారు. అయితే ట్రంప్‌ హయాంలో మోదీ అమెరికా వచ్చినప్పుడు ట్రంప్‌కు కూడా దుబాసీగా గుర్‌దీప్‌ పని చేశారు. అంటే ట్రంప్‌ మాట్లాడేది హిందీలో అనువాదం చేసి మోదీకి తెలిపారు. ఒబామాకు కూడా గుర్‌దీప్‌ పని చేశారు.

సవాళ్లతో నిండిన పని
‘అగ్రనేతలు పాల్గొనే దౌత్య సంబంధ సమావేశాలలో దుబాసీగా పని చేయడం చాలా సవాలు. నేతలు మాట్లాడేది ఒక మాట తక్కువ కాకూడదు ఒక మాట ఎక్కువ కాకూడదు. ముఖ్యంగా మన భావాలు, పెడర్థాలు కలపకూడదు. నేను ఒక నేతకు దుబాసీగా పని చేయాలని అనుకున్న వెంటనే ఆ నేత వాడే పదసముదాయం, ఉచ్చారణ, యాస, వ్యక్తీకరణ మొత్తం స్టడీ చేస్తాను. రెండు దేశాల మధ్య ఉండే దౌత్య పరమైన సంబంధాల అవగాహన ఉండాలి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, సాంస్కృతిక అంతరం, అధికారిక సంబంధాల మధ్య ఉండే సవాళ్లు... వీటన్నింటిని తెలుసుకుని ఆ అగ్రనేత ఏం మాట్లాడబోతాడో ఊహించి సిద్ధంగా ఉండాలి. ఇంత హోమ్‌వర్క్‌ లేకపోతే తక్షణ అనువాదం సాధ్యం కాదు’ అంటుంది గుర్‌దీప్‌ కౌర్‌.

ఐక్యరాజ్యసమితి, ఐ.ఎం.ఎఫ్, వరల్డ్‌ బ్యాంక్, యూ.ఎస్‌. ఇండియా బిజినెస్‌ కౌన్సిల్, డబ్లు్య.హెచ్‌.ఓ తదితర సంస్థలకు గుర్‌దీప్‌ కౌర్‌ వ్యక్తిగతంగా తన సంస్థ తరఫున సేవలు అందిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరు దేశాలు ఏవైనా మాట్లాడుకోవాలంటే గుర్‌దీప్‌ కౌర్‌ సేవలు తప్పనిసరి అనే స్థితిలో ఆమె తన సేవలను విస్తరించారు. భాష తెలియడం వల్ల వచ్చిన విజయం ఇది. భాషల మీద పట్టు సాధించి ఇటువైపు కెరీర్‌ మలుచుకోవాలనుకునేవారికి గుర్‌దీప్‌ గొప్ప స్ఫూర్తి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement