
అనువాద వ్యాకరణం
అనువాదకుడు మూల కవిత్వ స్వభావాన్ని బట్టి భాషా స్వరూపాన్ని నిర్ణయించుకోవడం అవసరం. అనువాదకుడు అసహాయకుడు. మూల కవిత్వాన్ని యథాతథంగా అనువదించాలి, ఎలాంటి తనతనం డామినేట్ చెయ్యకుండా.
అనువాద ప్రక్రియకు వ్యాకరణం అంటూ లేదు. అది ఎవరికి వారు పేనుకున్న సూత్రాల మీద ఎవరికి వారే చేసే tight-rope-walking. అది ఒక ఔత్సాహిక దుబాసి చేసే సాహసం. మూలంలోని రంగులు చెడకుండా తమదైన ముద్రతో పొరుగు వాకిళ్ల ముగ్గుల్లోకి ప్రవేశించడం. పాఠకుల్ని పొలిమేరలు దాటించడం. మూలంలోని భావార్థాలు చెక్కుచెదర నీయకుండా, వీలైన మేరకు మూల రచన శైలీ శిల్పాలను ప్రతిబింబింపజేయడం కత్తి మీది సాము. Poetry is what gets lost in translation అన్నది అనువాదకుని పాలిటి Death Blow!
కవిత్వానువాదంలో మూలంలోని సంగీతం లుప్తం కావడం అనివార్యం అని వాడ్రేవు చినవీరభద్రుడు గారు అన్నట్లు గుర్తు.
అది అనుభవంలోకి వచ్చిన అక్షర సత్యం. ఈ లోటును కొంతలో కొంత ప్రాసల ప్రయోగంతో పూరించవచ్చేమో! నిర్దిష్టమైన సమానార్థక పదబంధ ప్రయోగం Diction లలిత భావ వ్యక్తీకరణకు తోడ్పడినట్లే, పదాంత ప్రాసలు పాటకు అవసరమైన తాళ గతులకు, వాక్యాంత ప్రాసలు రాగ శ్రావ్యతకు ఉపకరిస్తాయని నా భావన. పాటను పోగొట్టుకున్న సమకాలీన వచన కవితలోని అంతర్లయకు నిస్సందేహంగా ఇవి దోహదకారులే. కాని, అనువాదం వచన కవిత్వమైతే, అది వెనుతిరిగి మళ్లీ పాటలోకి, పద్యంలోకి ప్రవహిస్తున్నట్టు అనిపించకూడదు! పాశ్చాత్య పాత తరపు కవులలో భాషా గాఢత, భావ నిగూఢత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. నేటి వచన కవితకు ఇవి అవసరమా అన్నది సమకాలీన శేషప్రశ్న! నా దృష్టిలో ప్రతి పదానికి ఒక ప్రత్యేక స్వభావం ఉంటుంది.
ఆ నైజపు సొగసు వాక్య నిర్మాణంలో కాని బయటపడదు. నిజానికి, ఒక చక్కని కవితలోని అన్ని పదాలను, పదబంధాలను (శీర్షిక నుండి పాద సూచికల వరకు) పరిశీలిస్తే ఆ పద సమూహం ఒక సజాతికి, ఒక natural classificationM కు చెందినవిగా నాకు తోస్తుంటుంది. అంటే, ప్రయోగించిన పదం (అచ్చ తెలుగైనా, సంస్కృత పదమైనా, తుదకు ఆంగ్ల పదమైనా) ఆ స్థానంలో సంపూర్ణంగా ప్రత్యామ్నాయం లేని కచ్చితమైన అక్షరోక్తిలాగా గోచరిస్తేనే అది సాధ్యం.
తత్సమ తద్భవాలు, నా అనుభవంలో, అయాచితంగా అందివచ్చే ఆప్త హస్తాలు. అవి వచనకవితకు అత్యంత ఆవశ్యకమైన క్లుప్తతకు దోహదకారులు. ఇది వైరి సమాసం కాదుకదా అన్న సందేహానిది, నేటి వచన కవితా నేపథ్యంలో, ద్వితీయ స్థానమే. వాడిన సమాసం చెవులకింపుగా ఉండటం ముఖ్యం. లలిత భావోక్తి, కదిలించే కవితాభివ్యక్తి అనుభూతి కవిత్వానికైనా సామాజిక ప్రయోజన కారకమైన ఏ కవితకైనా అవసరమే.
మూలం, ముఖ్యంగా అది విదేశీయం అయినప్పుడు, దేశవాళీ తెలుగు రంగులద్దడం నాకు అంతగా రుచించదు. అనువాదం సాఫీగా సాగుతూనే విదేశీ వాతావరణాన్ని, ఆనాటి దేశకాల పరిస్థితులను గుర్తు చేయాలి. అందుకే, అవసరమనుకున్న చోట వివరణాత్మక అధో పాదసూచికలు పొందు పరుస్తాను.
ఇక, భావ నిగూఢత- నా దృష్టిలో వాంఛనీయం. రొమాంటిక్ కవుల నుండి రవీంద్రుని దాకా, ‘మో’ నుండి ‘దెంచనాల’ దాకా నిగూఢత ఏదో ఒక రూపంలో వాడబడిన అలంకారమే. ఆచ్ఛాదనలో దాగిన అందం ఆకర్షణీయం కాదా? కవిత్వంలో ఇముడలేని దేశ కాల నేపథ్యాన్ని పదాలలో గుంభనంగా దాచారు పురా కవులు, ముఖ్యంగా ప్రాచీన పాశ్చాత్య కవులు, పరోక్ష ప్రస్తావనల, ప్రతీకల రూపంలో. T.S.Eliot ను చదివితే బుద్ధిపూర్వకంగా అతను కవిత్వంలో జటిలతను పొందుపరచ లేదుకదా అని అనిపిస్తుంటుంది. అంత అవసరం కాదేమో? చెప్పీ చెప్పకుండా చెప్పడం, విప్పీ విప్పకుండా విషయాన్ని విప్పడం ఒక అభిలషించదగిన కళాత్మక నైపుణ్యమని నేను భావిస్తాను. అనువాదకుడు మూల కవిత్వ స్వభావాన్ని బట్టి భాషా స్వరూపాన్ని నిర్ణయించుకోవడం అవసరం. అనువాదకుడు అసహాయకుడు.
మూల కవిత్వాన్ని యథాతథంగా అనువదించాలి, ఎలాంటి తనతనం డామినేట్ చెయ్యకుండా. అందుకే, వీలైనంత వరకు, వాక్యానువాక్య (Paraphrasing/ Metaphrasing) అనువాదమే నాకు తోచిన ఉపయుక్తమైన ఉదాత్త ప్రక్రియ. దీంతో, భావం అర్థంతో పాటు వారి శైలీ శిల్పాలు కూడా కొంత ప్రతిఫలిస్తాయి. కాని, అనువాదం మక్కీకి మక్కీగా ఉందనే విమర్శకు గురి అయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడే, అనువాదకుడు తన భాషా పాటవాన్ని వినియోగించుకోవాలి. స్వీయ కవితలాగా సహజంగా సాఫీగా సాగిపోతూనే అనువాదం ఆనాటి దేశ కాల వాతావరణాన్ని గుర్తుకు తేవాలి. అందుకు, మూలంలోని కీలక పదాలను, పదబంధాలను, పదచిత్రాలను, భావచిత్రాలను, ప్రతీకలను, పరోక్ష ప్రస్తావనలను (allegory), ప్రాంతీయ వర్ణనలను యథాతథంగా (పేర్లను కూడా మార్చకుండా) మొదట పట్టుకొని వాటికి తగిన సమాన స్థాయి తెలుగు పదాలను నిర్ధారించుకుంటే అనువాదం చాలా వరకు మూలానికి చేరువలో ఉంటుందని నా అనుభవం.
నా అనువాదాలు ‘‘అనుధ్వని’’, ‘‘అనుస్వరం’’, ‘జాన్ కీట్స్’ సంకలనాలలో నేను ఎదుర్కొన్న సవాళ్లు నాకీ అవగాహనను అందించాయి. ఐతే, ఇది సార్వత్రిక సత్యం కాక ఒక కేవల వ్యక్తిగత అనుభవ సత్యమే అయి ఉండవచ్చు. నా ఆచరణలో అక్షరత్వం దాల్చి ఉండకపోవచ్చు. తాడు మీది నడక తప్పటడుగుల ప్రయాణమే కదా!
- నాగరాజు రామస్వామి
8374486186