WE-Interview
-
ఇక్కడి మహిళలు అదృష్టవంతులు
తార్నాక: నేటి సమాజంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు విజయాలు సాధిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని దేశాల్లో వారికి ఎంతో గౌరవం లభిస్తుండగా.. మరికొన్ని దేశాలు వారిపై అంక్షలు విధిస్తూ స్వేచ్ఛను ఆంక్షల చట్రంలో బిగిస్తున్నాయి. ఈ విషయంలో భారత మహిళలకు మాత్రం కావాల్సినంత స్వేచ్ఛ ఉందని, ఈ దేశంలో పుట్టిన ఆడపిల్లలు అదృష్టవంతులంటున్నారు విదేశీ విద్యార్థులు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న పలువురు విదేశీ విద్యార్థినులతో ‘సాక్షి’ ముచ్చటించింది. ఆ వివరాలు విద్యార్థుల మాటల్లోనే.. చాలా అదృష్టవంతులు మా దేశంతో పోలిస్తే భారతదేశంలో మహిళలు స్వేచ్ఛగా ఉంటారు. మా దేశంలో మహిళా దినోత్సవం నిర్వహించరు. అయితే రక్షణ, గౌరవం బాగానే లభిస్తుంది. అయితే ఎంత రక్షణ ఉన్నా స్వేచ్ఛగా ఉండే అవకాశం లేదు. అందుకే భారతీయ స్త్రీలు అన్ని విషయాల్లోనూ అదృష్టవంతులు.– రెవీనా సెమాల్, ఇథియోఫియా ప్రభుత్వమే గౌరవిస్తుంది.. మా దేశంలో మార్చి 8న ‘మదర్స్‌డే’గాను, జూలై 27న ‘డాటర్స్‌డే’ గాను ఉత్సవాలు చేస్తారు. ఈ సందర్భాల్లో మహిళలందరికీ బహుమతులు ఇవ్వడంతో పాటు, సన్మానాలు చేస్తారు. ఈ కార్యక్రమాలు ప్రభుత్వ నిధులతోనేచేపడతారు. ప్రభుత్వమే మహిళలను గౌరవిస్తుంది. – ఆజాదే ఫర్హాదీ, ఇరాన్ సమానత్వం ఉండదు.. మా దేశంలో మహిళా దినోత్సవాలు ఉన్నతమైన హోదాలో ఉన్న వారికే పరిమితం. స్వేచ్ఛ విషయంలో భారత్‌లో పోలిస్తే మా దేశంలో కొంత నిర్బంధమే. పురుషులతో సమానం గా చూసే పరిస్థితి లేదు. ఒక సంస్థలో పనిచేసే స్త్రీలకు పురుషులతో సమానంగా వేతనాలు ఉండవు. అయితే స్త్రీలు హక్కులు సాధించుకునే విశగాస్వశక్తిగా ఎదగాలి. – బొరాయ్ రోహిన్, ఇరాక్ ఇప్పటికీ స్వేచ్ఛ లేదు.. ఆఫ్రికాలోని టీ–చాంద్ దేశంలో పుట్టిన మేం బతుకు దెరువు కోసం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లాం. ఇక్కడా, ఇక్కడా నేను గమనించిందేంటంటే.. స్త్రీలపై నిర్బంధం కొనసాగడం. ఇప్పటికీ మా దేశంలో మహిళలకు స్వేచ్ఛ లేదు. మా దేశంలో మహిళా దినోత్సవాలు నిషిద్ధం. బయటకు వెళ్లాలంటే మాకంటే చిన్న వారైనా సరే ఒక మగతోడు ఉండాల్సిందే. చదువు కోసం వచ్చిన మాకు ఇక్కడున్న కొద్ది కాలమైన ఆనందంగా ఉంటాం. అందుకు భారతదేశానికి సల్యూట్.– నియిమా అక్బర్, దక్షిణాఫ్రికా స్త్రీ స్వేచ్ఛలో భారత్ మిన్న.. స్త్రీ స్వేచ్ఛలో భారత్ తరువాతే ప్రపంచంలోని మిగతా దేశాలు. మా దేశంలో అయితే స్త్రీలకు స్వేచ్ఛ లేకపోగా, అభద్రతా భావం కూడా ఎక్కువే. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీంతో మేం చాలా నిర్బంధంలో ఉంటాం. స్వేచ్ఛగా బయట తిరుగలేం. భారత్‌లో అలా కాదు.. స్త్రీలను ఎంతో గౌరవిస్తారు. అందుకే ఇక్కడి సంస్కృతి అంటే నాకు చాలా ఇష్టం. – నసీబా, అఫ్ఘనిస్థాన్ -
స్వాతంత్య్రమే.. సాధికారత
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘రోజులు మారాయి. ఈ రోజుల్లో అమ్మాయిలు సాధించలేనిదంటూ ఏమీ లేదు. కాస్త ప్రోత్సహిస్తే చాలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. అసాధ్యమనుకున్న వాటిని సాధ్యం చేసి చూపిస్తున్నారు. అయితే పురుషాధిక్య సమాజంలో ఇప్పటికీ మహిళల పట్ల ఎక్కడో ఒక చోట.. ఏదో ఒక రకంగా వివక్ష ఉంటోంది. అందుకే మహిళలు తమ కాళ్లపై తాము నిలబడగలగాలి. ఎవరిపై ఆధారపడకుండా ఆర్థికంగా ఎదిగినప్పుడే సాధికారత దిశగా అడుగులు పడతాయి’ అని అంటున్నారు జిల్లా పోలీస్‌బాస్ డాక్టర్ బి.అనురాధ. ఉద్యోగ, వ్యక్తిగత జీవితంలో తన అనుభవాలు, సమాజంలో అమ్మాయిల పట్ల చోటు చేసుకుంటున్న వివక్షతో పాటు మహిళా సాధికారతపై ఎస్పీ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలు చెప్పుకొచ్చారు. ఆ వివరాలు ఎస్పీ మాటల్లోనే... అందుకే వారికి సెల్యూట్ చేస్తా.. నేను ఒక ఆడపిల్లగా పుట్టినా కొన్ని విషయాల్లో చాలా లక్కీ అనే చెప్పాలి. కొన్ని కుటుంబాల్లో అమ్మాయిలకు సరైన చదువులు చెప్పించకుండా ఇంటి వద్దే ఉంచడం... తొందరగా పెళ్లిళ్లు చేసి తల్లిదండ్రులు చేతులు దులుపుకోవడం చిన్నప్పుడే చేశాను. కానీ నా విషయంలో అలా జరగలేదు. అందుకే పదే పదే చెబుతుంటా.. మా అమ్మనాన్న కమల, జగన్‌మోహన్‌రెడ్డిలే నాకు స్పూర్తి ప్రదాతలని. ఎందుకంటే అమ్మాయిలుగా ఇసుమంత వివక్ష చూపకుండా సమానంగా చూశారు. మేం మొత్తం నలుగురు సంతానం. నాకు అన్న, తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. అందరినీ కూడా క్రమశిక్షణతో పెంచారు. మా అమ్మనాన్నలు విద్యావంతులు కావడంతో అందరికీ ఉన్నత విద్య చెప్పించడంతో పాటు సమాన అవకాశాలు కల్పించారు. ఇప్పుడు అన్నయ్య యూకేలో డాక్టర్, తమ్ముడు ఇంజనీర్‌గా, చెల్లెలు ఢిల్లీలోని జేఎన్‌యూ నుంచి ఎల్ఎల్ఎంలో బంగారు పతకం సాధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో లీగల్ అడ్వైజర్‌గా పని చేస్తోంది. ఇక నేను ఈ రోజు జిల్లా పోలీసు బాస్‌గా నిలబడగలిగానంటే అందుకు కారణం మా తల్లిదండ్రులే. అందుకే వారికి సెల్యూట్ చేస్తా. పెళ్లి తర్వాత భర్త శ్రావణ్‌కుమార్‌రెడ్డి కూడా ఫుల్ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. నిత్యం తీవ్ర ఒత్తిడితో కూడుకున్న పోలీసు జాబ్‌ను కుటుంబ సభ్యుల సహకారంతో సులువుగా నెగ్గుకొస్తున్నా. సర్వీస్‌లో చాలా చూస్తున్నా.. సర్వీస్‌లో భాగంగా ఆడవారిపై జరిగే వివక్షను చూస్తున్నా. ప్రస్తుతమంటే కాలం మారింది కానీ... గతంలో అమ్మాయిలపై ఒక రకమైన వివక్ష ఉండేది. అబ్బాయిలను ఒక రకంగా... అమ్మాయిలను ఒక విధంగా చూడటంతో పాటు అవకాశాల విషయంలో కూడా వివక్ష చూపేవారు. ఇప్పటికీ కొందరు అబ్బాయిలను గుర్తింపు పొందిన మంచి స్కూళ్లలో, అమ్మాయిలను మామూలు స్కూళ్లలలో చదివిస్తున్నారు. చిన్నప్పటి నుంచి చోటు చేసుకుంటున్న ఇలాంటి వాటి వల్ల సమాజంలో ఒక రకమైన భావన ఏర్పడుతోంది. అందుకే ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే కుటుంబ వ్యవస్థలో మార్పురావాలి. అప్పుడే కాస్తయినా అమ్మాయిల విషయంలో వివక్ష తగ్గుతుంది. అప్పుడే పెళ్లంటే ఏం తెలుస్తుంది? ఇప్పటికీ మన గ్రామీణ వ్యవస్థలో అమ్మాయిలను భారంగా భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసి పంపించాలనే ఆలోచనలోనే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. ఎందుకంటే 18 ఏళ్లకే పెళ్లి చేస్తే వారికి ఏం తెలుస్తుంది? అప్పుడప్పుడే సమాజం, మనుషులను అర్థం చేసుకునే వయస్సు. అలాంటప్పుడు పెళ్లి చేస్తే జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? సమాజం పట్ల కనీస అవగాహన అవసరం. అమ్మాయిలు కూడా ధైర్యంతో అడుగు ముందుకు వేయాలి. పోరాట పటిమ అలవరుచుకోవాలి. ముఖ్యంగా ఆర్థికంగా నిలబడగలిగే శక్తి రావాలి. అలాగైతేనే జీవితంలో నిలదొక్కుకోగలుగుతారు. చట్టం గురించి తెలియకే అలా.. చాలా మంది అమ్మాయిలకు చట్టం గురించి తెలియడం లేదు. టీనేజ్‌లో ఆకర్షణకు లోనై ప్రేమ పేరుతో చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కనీస వయస్సు రాకుండానే జరుగుతున్న పెళ్లిళ్లు చాలా ఉన్నాయి. తెలిసీ తెలియని వయస్సులో పెళ్లి చేసుకోవడం.. తర్వాతి క్రమంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. మా వద్దకు వచ్చే చాలా కేసులు ఇలానే ఉంటాయి. ఇలాంటి కేసులను సున్నితంగా డీల్ చేస్తాం. సాధ్యమైనంత వరకు కౌన్సిలింగ్ ఇచ్చి దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఇటీవలి కాలంలో మా పోలీసు శాఖ తరఫున ఏయే చట్టాలు ఏవిధంగా ఉపయోగపడుతాయనే అంశంపై స్కూళ్లు, కాలేజీల్లో సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. కళాజాత బృందాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నాం. తాట తీస్తా... అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా.. మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా వ్యవహరించిన సహించేది లేదు. చట్టప్రకారం వారి తాట తీస్తాం. ప్రస్తుతం మా షీ టీమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి. కాలేజీలతో పాటు పబ్లిక్ ప్లేస్‌ల వద్ద మా సభ్యులు మఫ్టీలో ఉండి పర్యవేక్షిస్తుంటారు. ఎవరైన తిక్కతిక్క నక్రాలు చేస్తే ఆధారాలు సేకరించి స్టేషన్‌కు పట్టుకొస్తున్నారు. తర్వాత తల్లిదండ్రులను పిలిచి వారి సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. అయినా రెండో సారి పట్టుబడితే మా ట్రీట్మెంట్ చూపిస్తాం. అంతేకాదు మహిళా ఉద్యోగుల పట్ల కూడా సహచర ఉద్యోగులు అనుచితంగా ప్రవర్తిస్తున్న సందర్భా లు కూడా చోటు చేసుకుంటున్నాయి. వారిపై నేరుగా ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నాం. ఆ ఫీలింగ్ ఇప్పటికీ ఉంది.. ఉద్యోగ బాధ్యతల నేపథ్యంలో కుటుంబానికి సమయం కేటాయించలేక పోతున్నాననే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది. నేను చేస్తున్నది పోలీస్ జాబ్. ఈ వృత్తిలో రాత్రి, పగలు తేడా ఉండదు. ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. పిల్లలు చిన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించేది. కానీ నేను ఎంతో ఇష్టంగా సాధించుకున్న పోలీసు జాబ్‌కు న్యాయం చేయాల నే భావనలో మనస్సు లోకి వచ్చేది. నా పరిస్థితిని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం పిల్లలు సుజీత్‌రెడ్డి, ధరణిరెడ్డి ఇద్దరూ మెడిసిన్ చదువుతున్నారు. అయితే కొన్ని సందర్భా ల్లో ఇబ్బందికరంగా ఫీలయ్యే దాన్ని. చాలా దగ్గరి బంధువుల ఫంక్షన్లకు కూ డా హాజరయ్యే పరిస్థితి ఉండేది కాదు. అందుకే బంధువులు.. ఏ ఫంక్షన్‌కు హాజరు కావు.. అని పదేపదే అంటుంటా రు. కానీ నా వృత్తి ద్వారా పది మందికి న్యాయం జరుగుతుండటంతో అవన్నీ మర్చిపోతుంటా. -
చదువే ఆయుధం
‘ప్రస్తుత సమాజంలో మహిళా సాధికారత సాధించాలంటే మహిళలు ఉన్నత చదువులు చదవాలి. విద్యను ఒక ఆయుధంగా మల్చుకొని చదువులో రాణించా లి. ఆర్థికంగా బలపడడమే కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలి. దీంతో ఒకరిపై ఒకరు ఆధారపడే స్థితి నుంచి బయటపడినప్పుడు మహిళలు జీవితంలో ధైర్యంగా నిలదొక్కుకోగలుగుతారు’.. అని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక పేర్కొన్నారు. ‘సాక్షి’ మహిళా క్యాంపెయిన్‌లో భాగంగా ‘మహిళా సాధికారత’పై ఇంటర్వ్యూ వివరాలు ఆమె మాటల్లోనే.. సూర్యాపేట : మహిళలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో రాణిస్తున్నా.. నేటికీ అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక అసమానతలు, వేధింపులు, గృహ హింస వంటివి కొనసాగుతున్నాయి. తల్లిదండ్రులు ఆడపిల్లలను అబ్బాయిలతో సమానంగా చూడాలి. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వంటి ఘటనలు వెలుగు చూçస్తు న్నాయి. ఆడపిల్ల పుట్టగానే కష్టమనుకొని పాఠశాలకు పంపించకపోవడం, తొందరగా పెళ్లిళ్లు చేయడం వంటి ఆలోచనలు తల్లిదండ్రులు మానుకోవాలి. ఆడ, మగ ఎవరైతే ఏంటి మార్పు ఇప్పటికీ 40 శాతం వచ్చింది. ఆడ, మగ ఎవరైతేనే అని తల్లిలో మార్పు రావాలి. మగబిడ్డ పుడితే బాగుం టుందనే ఆలోచనను పారదోలాలి. దీంతో ఇక ఆడపిల్లలతో సమానంగా అబ్బాయిలను సమానంగా తల్లిదండ్రుల నుంచే మొదలవుతుంది.. అలాంటప్పుడు సమాజంలో లింగ వివక్ష ఉండదు. తక్కువ అనే భావన దూరం చేయాలి మహిళల్లో ముఖ్యంగా తమకు తాము తక్కువ అనే భావనను మనసు నుంచి దూరం చేయాలి. విద్య ద్వారానే విజ్ఞానం, ధైర్యం, లోకజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతోంది. కుటుంబ బాధ్యతల్లో మగ్గిపోకుండా వాటిలో కుటుంబ సభ్యులను బాధ్యులుగా చేస్తూ అన్ని రంగాల్లో ముందుకు సాగాలి. మహిళల రక్షణకు ఎన్నో చట్టాలు.. ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు తీసుకొచ్చింది. చట్టాలతోనే మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టవచ్చు. పనిచేసే చోట్లతో పాటు ఇంట, బయట కూడా మహిళలు వేధింపులకు గురవుతున్నారు. వేధింపులు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి. ప్రయాణాలు, కార్యాలయాల్లో వేధింపులు జరిగినప్పుడు వెంటనే బయటకు చెప్పాలి. ఇలాంటి సమయాల్లో రక్షణ కల్పించడానికి కోర్టు తీర్పులు, చట్టాలు ఉన్నాయి. దినపత్రికలు, ప్రసార మాద్యమాల ద్వారా వేధింపులు తెలియజేయాలి. -
ఎంత ఎదిగినా శ్రీదేవి మారలేదు
శ్రీదేవిగారు చనిపోయారనే వార్త విన్నప్పుడు ఏమనిపించింది? మోహన్‌బాబు: షాకింగ్ న్యూస్. నమ్మలేకపోయాను. ఇంత త్వరగానా అనిపించింది. మంచి మనిషి. మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టింది కాబట్టి.. ఇంకా ఎక్కువ సినిమాలు చేస్తుందనుకునేవాణ్ణి. ఇలా జరుగుతుందని ఊహించలేదు. పైగా ఆరోగ్యంగానే కనిపిస్తోంది కాబట్టి ఎవరూ ఊహించలేం. శ్రీదేవిగారి కుటుంబంతో మీ పరిచయం తిరుపతి నుంచే జరిగింది కదా? అవును. శ్రీదేవి తల్లి రాజేశ్వరీగారిది తిరుపతి. ఆ కుటుంబంతో నాకు తిరుపతి నుండి మంచి అనుబంధం ఉంది. రాజేశ్వరిగారు చాలా మంచి మనిషి. కూతుర్ని మంచి హీరోయిన్ని చేయాలనే పట్టుదల ఆమెలో ఉండేది. అనుకున్నట్లే చేయగలిగారు. కూతురి వైభవాన్ని చూశారు. ఆమె చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. ఏదో ఆపరేషన్ చేయించుకోబోయి, ఊహించని విధంగా చనిపోయారావిడ. ఇప్పుడు శ్రీదేవి అకాల మరణం పెద్ద షాక్. భారతీయ చిత్రసీమ మంచి నటిని మాత్రమే కాదు, ఉన్నతమైన వ్యక్తిని కూడా కోల్పోయింది. ‘పదహారేళ్ల వయసు’, ‘దేవత’.. ఇలా మీరు, శ్రీదేవిగారు చాలా సినిమాల్లో నటించారు. ఆ సమయంలో ఆమె మీకు దీటుగా నటించడానికి ఇబ్బందిపడిన సంఘటనలేమైనా? ఒకటీ రెండు ఉన్నాయి. అయితే అవి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. ‘దేవత’ సినిమాలో నా భార్య క్యారెక్టర్ చేసింది శ్రీదేవి. అప్పుడు వాళ్ల అమ్మగారు సినిమాల్లోనే మోహన్‌బాబుగారు యాంటీ రోల్స్ చేస్తారు. నిజజీవితంలో చాలా మంచి వ్యక్తి అని శ్రీదేవితో అనేవారు. నా కాంబినేషన్లో నటించడానికి తనెప్పుడూ ఇబ్బంది పడలేదు.స్వతహాగా ఏ పాత్రను అయినా అవలీలగా చేయగల గొప్ప నటి శ్రీదేవి. భారతదేశం గర్వించదగ్గ నటి అనిపించుకున్నప్పటికీ సెట్లో పోజు కొట్టడం నేనెప్పుడూ చూడలేదు. బాంబేకి వెళ్లి అక్కడ టాప్ హీరోయిన్ అయ్యాక కూడా తనలో మార్పు రాలేదు. ఆ వ్యక్తిత్వమే ఆమెను పెద్ద స్థాయికి తీసుకెళ్లింది. కరెక్టే.. ముంబయ్‌లో సెటిలైనా ఇక్కడ ఏ ఫంక్షన్ జరిగినా హాజరయ్యేవారు. పుట్టినింటికి వచ్చానంటూ ఆనందంగా మాట్లాడేవారు.. అవును నిజమే. నా 42వ సినీ జీవిత ఉత్సవాలు వైజాగ్‌లో జరిగినప్పుడు ఫంక్షన్‌కి రావాలనగానే, ఒక్కసారి భర్త బోనీతో మాట్లాడమంది. ‘వాట్ మోహన్‌బాబుగారు వాట్ డూ యు వాంట్?’ అన్నారు. విషయం చెప్పాను. ఓకే అన్నారు. మీ సెక్రటరీని మా సెక్రటరీతో మాట్లాడమనండి అన్నారు. ఫ్లైట్ టిక్కెట్స్ గురించి నేను మాట్లాడబోతుంటే, ‘వద్దు. మేమే టికెట్స్ కొనుక్కుంటాం. హోటల్ కూడా మేమే చూసుకుంటాం’ అన్నారు. హోటల్ ఓకే చేశాం కానీ టిక్కెట్స్ మాత్రం ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ‘మోహన్బాబుగారూ.. మీరు నన్ను గుర్తుపెట్టుకుని ఇంత ప్రేమగా పిలిచారు. అది చాలు’ అంది శ్రీదేవి. వేరేవాళ్లయితే ‘డైరీ చెక్ చేసుకుని చెబుతానండి’ అనేవారేమో. కానీ శ్రీదేవి అలా కాదు. అక్కడికి వచ్చి చాలా బాగా మాట్లాడింది. అంతకన్నా సంస్కారం ఏం ఉంటుంది. మన ఇండస్ట్రీలో కొంతమందిని ఫంక్షన్‌కి పిలిస్తే ‘అబ్బో బిజీ బిజీ’ అంటుంటారు. అంతెందుకు? మనతో సినిమాలు చేసేవాళ్లు ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి రమన్నా రారు. ఈ జనరేషన్లో అలాంటివాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లందరికీ శ్రీదేవి ఆదర్శప్రాయురాలు. పిల్లల బాగోగులు అడగడం వంటివి చేసేవారా? మా ఫ్యామిలీకి చాలా క్లోజ్. ఎక్కడ కనిపించినా ‘ఏం శ్రీదేవి ఎలా ఉన్నావ్?’ అంటే, ‘నేను బోనీకపూర్ బాగున్నాం. పిల్లలు బాగున్నారు’ అని చెప్పి, మా పిల్లల బాగోగుల గురించి అడిగి తెలుసుకుంటుంది. గొప్ప సంస్కారవంతురాలు. ఈ జనరేషన్లో చాలామంది ఆమెను చేరుకోవడం కష్టం. శ్రీదేవి అంటే నాకు చాలా అభిమానం. అందుకే నేను హీరోగా యాక్ట్ చేసిన ‘అల్లుడుగారు’ సినిమా ఫస్ట్ షాట్‌కు తనతో క్లాప్ కొట్టిద్దామని రాఘవేంద్రరావుగారు అడగ్గానే ‘ఓ యస్’ అన్నాను. శ్రీదేవి కూడా చాలా ఆనందంగా వచ్చి, క్లాప్ కొట్టింది. శ్రీదేవిగారు తక్కువ మాట్లాడేవారట. చిన్న వయసులోనే ప్రొఫెషనల్‌గా బిజీ బిజీగా ఉండటం వల్ల ఆమెలో కష్టం ఏదైనా ఉండేదా? పర్సనల్ విషయాలు మనకేం తెలుస్తాయి. కానీ నాకు తెలిసినంతవరకూ తను హ్యాపీగా ఉండేది. స్వతహాగా మితభాషి. మాట్లాడిన నాలుగు మాటలు బాగానే మాట్లాడేది. ఎక్కడ పుట్టింది? ఎక్కడికి వెళ్లింది? భారతదేశంలోనే నంబర్ వన్ అనిపించుకుంది. తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయం ఇది. శ్రీదేవి లేని లోటు భర్తీ చేయలేనిది. నటిగా ఆమె ఓ అద్భుతం. -
బట్టలు కాదు... బుద్ధులు మారాలి
సమాజంలో ఆడవాళ్ల పై జరుగుతున్న లైంగిక దాడుల గురించి నటి ఖుష్బూతో ‘సాక్షి’ స్పెషల్ ఇంటర్వ్యూ. స్త్రీ వస్త్రధారణ సరిగ్గా లేకపోవడంవల్ల కూడా దాడులు జరుగుతున్నాయన్నది కొందరి ఒపీనియన్.. మీరేమంటారు? ఎనిమిదేళ్ల పాపపై అత్యాచారం జరిగింది. 67 ఏళ్ల వృద్ధురాలిపైనా లైంగిక దాడి జరిగింది. వారు ఎలాంటి బట్టలు వేసుకున్నారని అలా జరిగింది. 88ఏళ్ల తల్లిని 45ఏళ్ల కొడుకు రేప్ చేశాడు. ఆ వయసులో ఆ తల్లి ఎలాంటి బట్టలు వేసుకుని ఉంటుంది? వయసు మీద పడి, వాడిపోయిన ఆమె శరీరం కనిపిస్తే వేరే ఆలోచనలు వస్తాయా? చూసే కళ్లల్లో తేడా ఉంటే ఎదుటి వ్యక్తి నిండుగా కప్పుకున్నా చెడ్డ ఆలోచనలే వస్తాయి. పైన చెప్పిన ఉదాహరణలన్నీ మనుషులు చేయదగ్గవేనా? మనిషి రూపంలో ఉన్న మృగాలు వాళ్లు. అయినా మన దగ్గరే బట్టల గురించి మాట్లాడుతున్నాం. విదేశాల్లో మొత్తం కురచ దుస్తులే వేసుకుంటారు. రోడ్డు మీద వాళ్లు వెళుతుంటే ఎవరూ పట్టించుకోరు. మనకు మాత్రం చాలా వింతగా ఉంటుంది. చూసే దృష్టి మారాలి. బుద్ధి మారాలి. ఆ మధ్య వైజాగ్‌లో ఓ అమ్మాయిని రోడ్డు మీద రేప్ చేస్తుంటే జనాలు చూస్తూ ఉండిపోయారు. ఈ సంఘటన వినే ఉంటారు. కామన్ పీపుల్‌కి మీరిచ్చే సందేశం ఏంటి? చూస్తూ నిలబడ్డానికి అక్కడేమైనా వినోదం జరిగిందా? అరాచకం జరిగినప్పుడు ఆపాల్సిన బాధ్యత లేదా? ఇవాళ అక్కడ ఉన్నది మన ఇంటికి సంబంధించిన అమ్మాయి కాకపోవచ్చు.. రేపు మన అమ్మాయి అవ్వొచ్చు. ‘ప్రతి స్త్రీ మన ఇంటి సభ్యురాలే’ అనుకుంటే చాలు. ఆ ్రïస్తీకి అన్యాయం చేయాలనుకునేవాళ్లు చేయలేరు. ఒకవేళ ఎవరైనా చేసినా మిగతావాళ్లు చూస్తూ ఉండలేరు. ఇంటి నుంచి రోడ్డు మీదకు వచ్చాక మన కళ్లెదుటే జరగరానిది జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలబడాలి. లేకపోతే ‘మేం ఈ దేశ పౌరులం’ అని చెప్పుకునే అర్హత మనకు లేదు. ఒకవేళ పట్టించుకుంటే మనకేదైనా జరుగుతుందేమోనని భయం. ఆ మైండ్‌సెట్ మారాలి. లో క్లాస్ ఆఫీసుల నుంచి హై క్లాస్ ఆఫీసుల వరకూ లైంగిక వేధింపులకు గురయ్యే ఆడవాళ్ల సంఖ్య చాలానే ఉంటుంది. ‘ఉద్యోగంలోంచి తీసేస్తా’ వంటి బెదిరింపులు ఎదుర్కొంటుంటారు. వాళ్ల గురించి? మన వ్యక్తిగత మర్యాదను కాపాడుకోవడంకన్నా ఏ ఉద్యోగమూ గొప్పది కాదని నా అభిప్రాయం. ఉద్యోగం తప్పనిసరి అయిన పరిస్థితుల్లో కూడా రాజీపడకూడదు. ఎందుకంటే, ఒక్కసారి ‘యస్’ చెబితే అక్కడున్నంతకాలం అన్నింటికీ ఆమోదించాల్సిందే. అందుకే ‘నో’ చెప్పడం నేర్చుకోవాలి. ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు కుదరదని నిర్మొహమాటంగా చెప్పేయొచ్చు. వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు. కానీ ‘నో’ చెప్పలేని పరిస్థితుల్లో వేరేవాళ్లు ఉంటారు. వాళ్లే ‘సెక్స్ వర్కర్స్’. వాళ్లంటే నాకు గౌరవం ఉంటుంది. ఎందుకంటే వేరే ఏ దారీ దొరక్క తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆ పని చేస్తున్నామని వాళ్లు బాహాటంగానే చెబుతుంటారు. ఏ స్త్రీ కూడా తన శరీరాన్ని ఇష్టపూర్వకంగా అమ్ముకోదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అలా చేస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వేధిస్తారని నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌పై హాలీవుడ్ నటి ఆష్లే జడ్ ఆరోపణలు చేశాక చాలామంది ‘మీటూ’ అంటూ తమకెదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. మీకలాంటి సంఘటనలు ఏమైనా? టీనేజ్‌లో నేను సినిమాల్లోకొచ్చాను. ముంబై నుంచి ఇక్కడికొచ్చినప్పుడు ఇక్కడి పద్ధతులు తెలియవు. ఇక్కడి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో కూడా తెలియదు. లక్కీగా నాకు ఎలాంటి వేధింపులు ఎదురు కాలేదు. కెరీర్ మొత్తం స్మూత్‌గా సాగింది. అయితే ‘అన్‌లక్కీ’ పీపుల్ ఉంటారు. వాళ్లు వేధింపులు ఎదుర్కొన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ‘నో’ చెప్పగలగడం. స్టార్టింగ్‌లోనే ‘నో’ చెప్పేశామనుకోండి.. ఇక్కడ ఉండనిస్తే ఉండనిస్తారు. లేకపోతే లేదు. వేరే ప్రొఫెషన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు.. గుడిలాంటి పాఠశాలల్లో మంచి మార్కులు వేసి, పాస్ చేస్తానంటూ స్టూడెంట్స్‌ని ట్రాప్ చేయడానికి ట్రై చేసే టీచర్స్ గురించి తెలిసినప్పుడు మీకేమనిపిస్తుంది? నా రక్తం ఉడికిపోతుంది. అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసేయాలనిపించేంత కసి. ఏమీ చేయలేం. మన పిల్లలు ఎక్కువ టైమ్ గడిపేది స్కూల్స్‌లోనే. అమ్మ లేని చోట పిల్లలను గైడ్ చేయడానికి టీచర్ ఉంటారంటారు. అలాంటి టీచర్సే ద్రోహం చేస్తుంటే ఇక పిల్లల్ని నమ్మి ఎక్కడికి పంపించాలి? స్కూల్‌కి పంపించాలంటే భయం. హాస్టల్లో ఉంచాలంటే భయం. ఎవర్ని నమ్మాలి? అందుకే పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో ఎక్కువగా మాట్లాడాలి. స్కూల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఒకవేళ మూడీగా ఉంటే ఎందుకలా ఉన్నారో అడిగి తెలుసుకోవాలి. స్కూల్‌కి వెళ్లనని మొండికేస్తే బలవంతంగా పంపించేయకూడదు. అలా ఎందుకు చేస్తున్నారో ఆలోచించాలి. ఇంట్లో చెబితే నిన్ను ఫెయిల్ చేస్తామని టీచర్ బెదిరించి ఉండొచ్చు. అందుకే పదే పదే అడిగి, విషయం రాబట్టాలి. ముఖ్యంగా పిల్లల ప్రవర్తనలో మార్పొస్తే ఏదో జరగకూడనిది జరిగిందని గ్రహించాలి. అందుకే పిల్లల కోసం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. ఆడవాళ్లకు మీరిచ్చే సందేశం? సందేశాలు ఇచ్చేంత కాదు కానీ.. నా మనసుకి తోచిన విషయాలు చెబుతాను. ఆత్మాభిమానం వదులుకోవాల్సి వచ్చే పరిస్థితులను సవాల్ చేయండి. తలొంచకూడదు.. తలెత్తుకునేలా మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోండి. ఎదుటి వ్యక్తి దాడి చేస్తున్నాడనగానే భయపడి సహాయం కోసం అరవకండి. తిరగబడండి. మీ కళ్లెదుట ఉన్నది మీలాంటి మనిషే అనే విషయాన్ని మరచిపోవద్దు. ఓవైపు నిర్మాతగా అప్పుడప్పుడు నటిగా చేస్తున్నారు. మీ ఇద్దరు కూతుళ్లకు తగినంత టైమ్ స్పెండ్ చేస్తుంటారా? ఇప్పుడు ఒక పాప టెన్త్, మరో పాప ట్వెల్త్ చదువుతున్నారు. చిన్నప్పుడు స్కూల్‌కి డ్రాప్, పికప్ నేనే. ఇప్పుడు వాళ్లే వెళతారు. మొదటి నుంచీ నా పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఆ రోజంతా ఏం జరిగిందో చెప్పే అలవాటు చేశాను. నేను పికప్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు కారులో వచ్చేటప్పుడే అన్ని విషయాలూ అడిగి తెలుసుకునేదాన్ని. ఇప్పుడు నా పని మీద బిజీగా ఉండి, ఇంట్లో లేకపోతే స్కూల్ నుంచి రాగానే ఫోన్ చేస్తారు. ‘ఈరోజు చాలా మూడీగా గడిచిందమ్మా’ అంటే.. ఎందుకు? అని అడుగుతాను. ‘హ్యాపీగా గడిచింది’ అంటే కూడా కారణం అడుగుతాను. నా పిల్లల మూడ్స్ మీద నేను ఓ దృష్టి పెడతాను. అలాగని వాళ్లకు ఆంక్షలు పెట్టను. స్వేచ్ఛ లేకుండా చేయను. తల్లిగా ఓ కంట కనిపెడతా. అంతే. ఇంతకుముందు స్కూల్ గురించి మాట్లాడుకున్నాం. స్కూల్‌లాంటి పవిత్రమైన మరో ప్లేస్ ‘హాస్పిటల్’. అక్కడ పేషెంట్స్‌ని కూడా కొందరు డాక్టర్స్ వదలని సంఘటనలు బయటికొచ్చాయి. అంత చదివినవాళ్లు కూడా అలా అంటే కారణం ఏమంటారు? పెరిగిన వాతావరణం ముఖ్య కారణం. ప్రాణం పోయాల్సిన డాక్టర్ దయనీయ స్థితిలో ఉన్న పేషెంట్‌పై లైంగిక దాడికి పాల్పడుతున్నాడంటే అతను డాక్టర్ ఎలా అయ్యాడు? అనిపిస్తుంది. చదువు.. సంస్కారం నేర్పిస్తుందంటారు. మరి.. ఆ చదువు ఎక్కడికి పోయినట్లు? ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. ఇంట్లో ఆడవాళ్లను మగవాళ్లు ఎలా ట్రీట్ చేస్తారన్నది చాలా ముఖ్యం. వాళ్లు చులకనగా చూస్తే.. ఆడవాళ్లను అవమానించడం, వాళ్ల పట్ల అమానుషంగా ప్రవర్తించడం తమ ‘బర్త్ రైట్’ అని అబ్బాయిలు అనుకుంటారు. పరాయి స్త్రీపై దాడి చేయాలనుకోవడానికి ఇదో కారణం అయ్యిండొచ్చు. అందుకే ఆడపిల్లల పెంపకం విషయంలో జాగ్రత్త తీసుకున్నట్లే మగపిల్లలను కూడా కేర్‌ఫుల్‌గా పెంచాలి. ఆడవాళ్ల విలువ చెప్పాలి. దాడులు జరగడం సరే.. కొందరు ఆడవాళ్లు తమంతట తాము మాయలో పడిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ భక్తి పేరుతో ఏ స్వామీజీని పడితే ఆ స్వామీజీని నమ్మడంలాంటివి.. ఇదైతే చర్చించాల్సిన విషయం. దేవుడు ఉన్నాడని నమ్ముతాం. దేవుడి సహాయం కోరతాం. దేవుడి మీద నమ్మకం పోతే అది మూఢ నమ్మకం అవుతుందని నా ఒపీనియన్. ఆ మూఢ నమ్మకమే వాళ్లను నమ్మకూడని వాళ్లను నమ్మేలా చేస్తుంది. పిల్లలు పుట్టాలంటే స్వామీజీ ఎలా చెబితే అలా చేయాలట? అవన్నీ కూడా చేయదగ్గ పనులు కాదు. అప్పుడైనా అతనెలాంటివాడో గ్రహించాలి కదా. గుర్మీత్ రామ్ రహీమ్ చేసిన అకృత్యాలు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అందుకే ఎవర్ని నమ్ముతున్నామన్నది ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి. సమాజంలో జరిగేవే సినిమాల్లో కనిపిస్తున్నాయా? సినిమాలు చూసి చేస్తున్నారా? కొన్ని సినిమాలు చెడు దారి పట్టిస్తున్నాయనే విమర్శకు మీ సమాధానం? సమాజంలో జరిగేవే సినిమాల్లో చూపిస్తున్నాం. మీరు ఏ సినిమా తీసుకున్నా.. లవ్, ఫ్యామిలీ, యాక్షన్.. ఇలా ఏ జానర్ తీసుకున్నా.. ఫైనల్‌గా ‘చెడుని మంచి గెలవడం’ అనే పాయింట్‌తోనే సినిమా ఎండ్ అవుతుంది కదా. అన్ని సినిమాల్లో చెప్పే ఇంత సింపుల్ మెసేజ్‌ని గుర్తించలేకపోతున్నారా? విలనే కదా ఓడిపోతున్నాడు. సినిమాలో ఉన్న మంచిని తీసుకుని చెడుని వదిలేయొచ్చు కదా. చెడు మార్గంలో వెళ్లాలనుకునేవాళ్లు చెడుని తీసుకుంటారు. అలాంటివాళ్లు సినిమాలు చూసి మాత్రమే చెడిపోరు. స్వతహాగా వాళ్లల్లో చెడు ఉంటుంది. సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఇద్దరు ఆడపిల్లల తల్లిగా కూతుళ్లు పుట్టినందుకు ఎప్పుడైనా బాధపడ్డారా? నెవర్. చాలా ఆనందంగా ఉన్నాను. నేను, మా ఆయన (దర్శకుడు–నటుడు సుందర్. సి) ఆడపిల్లలు పుట్టాలనే కోరుకున్నాం. మేం లక్కీ. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక మగపిల్లాడు కావాలని కూడా అనుకోలేదు. ఏం ఆడపిల్లలు మన రక్తం కాదా? మరి.. మగపిల్లలనే ఎందుకు వారసులుగా ప్రకటిస్తున్నాం. మన కడుపున పుట్టిన మగబిడ్డ ఒంట్లో ఉండేదీ మన రక్తమే.. ఆడబిడ్డ ఒంట్లోదీ ఉండేది మన రక్తమే. అలాంటప్పుడు ఎందుకీ తేడా? ఫైనల్లీ.. పూటకో లైంగిక వేధింపుల గురించి వింటున్నాం. ఇవి ఆగాలంటే ఏం చేయాలి? చట్టరీత్యా పెద్ద దండన దొరుకుతుందనే భయం లేదు. అందుకే ఫ్రీగా ఉంటున్నారు. అరెస్ట్ చేసినా బెయిల్ మీద బయటికి వచ్చేయొచ్చనే ధీమా. నాన్–బెయిలబుల్ వారెంట్‌తో అరెస్ట్ చేయాలి. నేరం రుజువైతే శిక్ష వెంటనే పడాలి. పదీ పన్నెండేళ్లు లాగకూడదు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో తీర్పు చెప్పాలి. ‘క్యాపిటల్ పన్మిష్మెంట్’ ఇవ్వాలి. ఇలా చేస్తేనే నేరాలు కొంతైనా తగ్గుతాయి. లా స్ట్రిక్ట్‌గా ఉండాలి. తమిళనాడులో ఓ చిన్నారి రేప్ విషయంలో ఇలానే జరిగింది కదా? తను ఏడేళ్ల పాప. చట్ట ప్రకారం బాధితుల పేరు మనం చెప్పకూడదు. నేరగాడి పేరు చెబుతాను. అతని పేరు ధశ్వంత్. ఏడేళ్ల పాపను రేప్ చేసి, చంపేశాడు. అతనికి న్యాయస్థానం మరణ శిక్ష విధించాలని తీర్పు ఇచ్చింది. ఈ కేస్ ఏళ్ల తరబడి సాగలేదు. ఏ కేస్ అయినా ఇంత త్వరగా మూవ్ అయితే బాగుంటుంది. – డి.జి. భవాని -
సవాలక్ష సుడిగుండాలు
కీచకుడి కాలం నుంచో ఇంకా ముందు నుంచో పనికి వెళ్లిన ప్రతి స్త్రీపైనా కామపు కళ్లు, వెకిలి మాటలు, తేళ్లై కుట్టే చేతులు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరింపులు, ఆ పైన తాయిలాలు ఆశ పెట్టి లొంగదీయడం. ఆమె బహుముఖ సామర్థ్యంతో పోటీ æపడలేక నీచమైన వ్యాఖ్యలు చేయడం, పదోన్నతి పొందకపోవడానికి తమ సోమరితనం కారణమనేది కప్పిపుచ్చి ‘ఆమె పడకలేసింది’ అనే పైశాచిక పుకార్లు.. నైపుణ్యంతో అధిగమించలేని దుగ్ధ లైంగిక వేధింపులుగా రూపాంతరం.. ఓ ‘మగతనపు ఆటవికత’. ఇంటి గడపే స్త్రీకి లక్ష్మణరేఖ.. వంటి కాలం చెల్లిన భావాలు పుణికిపుచ్చుకున్న ఆధునిక మనువులే ప్రతిచోటా. పొలాల్లో, నిర్మాణంలో, గృహ పరిశ్రమల్లో ఒకటేమిటి.. అసంఘటిత రంగం నిండా స్త్రీలే. కడుపు నింపుకోవడం కోసం, కన్నబిడ్డల కోసం... అహరహం ఒళ్లు విరిగే చాకిరీ. అతి తక్కువ వేతనం. ఆపైన లైంగిక దోపిడీ. ప్రతి నిమిషం పనిపోతుందని భయం. ఎవరేం చేసినా భరించాలి. ఆకలి, అవసరం.. అభిమానాన్ని చంపుతాయి. రెక్కల కష్టం చేసే వీరి గౌరవం కాపాడటం.. ఉపాధికి – శరీరానికి భద్రత కల్పించటం ఎవరి బాధ్యత? ‘మనిషి’గా మర్యాదగా బతికే హక్కుకు హామీ ఏదీ? భద్రమైన ఉద్యోగాలు చేసే చోట కూడా కుత్సితపు చూపుల వేటలే. ఎవరితో చెప్పుకోవాలి? ఎలా నిరూపించుకోవాలి? చెబితే నమ్ముతారా? అంతర్గత ఫిర్యాదుల కమిటీ గోప్యత పాటిస్తుందా? అందరికీ తెలిసి మరింత మందికి చులకనై మరికొందరు చెయ్యేస్తే? అతివల సంపాదనను పూర్తిగా ఆమోదించని కుటుంబం పరువు కోసం ఉద్యోగం వదిలేయమంటే? ఇపుడిపుడే విచ్చుకుంటున్న ‘స్వేచ్ఛ’ లేత రెక్కల్ని కత్తిరిస్తే? తననే అనుమానిస్తే? అసలు తానేమైనా తన దుస్తులతో హావభావాలతో ప్రవర్తనతో వాడికి అలుసిచ్చిందా? స్త్రీ కావడం వల్లే వెంటాడే ఎన్నో అపరాధ భావనలు... ఎన్నెన్నో ప్రతిబంధకాలు.. లక్షల సుడిగుండాలు. ఎలా బయటపడాలి? ఇంటా బయటా శాంతిగా బతికే దారేదీ? చట్టం కూడా అసమానతకు చుట్టమే. ‘ఫిర్యాదు చేసిన లైంగిక వేధింపు నిరూపణ కాకపోతే దండనే’. ఏ చట్టం లోపలా లేని ఈ షరతు ఈ చట్టానికే ఎందుకు? అసలు బాధితులెవరిక్కడ? ఫిర్యాదు చేయకుండా హెచ్చరించడం నిరుత్సాహపరచడం కాదా? సుప్రీంకోర్టు ‘విశాఖ తీర్పు’ స్ఫూర్తికి తూట్లు పొడవడం కాదా? సుప్రీం తీర్పు తర్వాత సాగలాగిలాగి పదిహేనేళ్లకు ఏడ్చుకుంటూ తెచ్చిన ‘పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల (నివారణ – నిషేధం – పరిష్కార మార్గాలు, 2013) చట్టం’ ఎంతమేరకు అమలవుతోంది? అనుభవాల పాఠాలతో చట్టాన్ని తాజాపర్చుదాం. పదండి.. వేధింపులు లేని జీవితం కోసం. -
బయటకు చెప్పకుంటే పరిష్కారం కష్టం..
‘ఇటీవల ఇద్దరు అమ్మాయిలు నా దగ్గరికి వచ్చారు. అందులో ఒకరు నేను బాక్సర్నవుతాను.. సహకారం అందివ్వాలని కోరింది. మరొక అమ్మాయి మౌంటనీర్ (పర్వతారోహకురాలు) అవ్వాలని ఉంది.. శిక్షణ ఇప్పించాలని వేడుకుంది. ఈ బాలికల వెంట వారి తల్లిదండ్రులు ఉన్నారు. సమాజంలో మంచి మార్పు వస్తుందనేందుకు ఇవి ఉదాహరణలు. గతంతో పోల్చితే అమ్మాయిలకు సంబంధించి కెరీర్ ఎంపిక విషయంలో చాలా మార్పులు వచ్చాయనేది స్పష్టమవుతోంది. అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉందని మాత్రం చెప్పలేం.’ అని అంటున్నారు వరంగల్ రూరల్, అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట. స్త్రీ జీవితం చుట్టూ పెనవేసుకున్న నిబంధనలు, ఆచార వ్యవహారాలపై ఆమె తన అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.- వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి ‘పుట్టడం, పెరగడం, చదువు, పెళ్లి, ఉద్యోగం ఇలా అన్ని విషయాల్లో మహిళలు అనేక ఆంక్షల మధ్య జీవిస్తున్నారు. ఈ ఆంక్షల కారణంగా ఎంతో ప్రతిభావంతులు సైతం ఇంటికే పరిమితం అవుతున్నారు. భరించలేని బాధలను పంటి బిగువున అదిమి పెడుతున్నారు. అందరితో మంచి అనిపించుకోవాలనే ఆత్రుతతో తమని తాము కోల్పోతున్నారు..’ స్త్రీ జీవితం చుట్టూ పెనవేసుకున్న నిబంధనలు, ఆచార వ్యవహరాలపై వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి కాటా స్పందించారు. ఒక్క రోజులో ఈ ప్రపంచాన్ని మార్చలేమని, వ్యక్తిగత స్థాయిలో మార్పును ఆహ్వానిస్తే అతి త్వరలో సామాజిక మార్పు, తద్వారా మహిళల జీవితాల్లో మరింత వెలుగు తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు. మహిళలకు సంబంధించిన వివిధ అంశాలపై ఆమె అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... పెళ్లి కంటే... కెరీర్ ఎంతో ముఖ్యం ఓ కలెక్టర్‌గా నా దగ్గరకు వివిధ సమస్యలతో వచ్చే మహిళలో చాలా మంది పెళ్లైన తర్వాత భర్త సరిగా చూసుకోవడం లేదు. ఇబ్బంది పెడుతున్నాడు, భర్త, అతని కుటుంబం నుంచి కష్టాలు వస్తాయని చెప్పిన వారే ఉన్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం బయటి నుంచి చూపించడం కష్టం. తన కాళ్ల మీద తాను నిలబడగలను అనే ధైర్యం ఉన్నప్పుడు పరిష్కారం త్వరగా వస్తుంది. పెళ్లి చేసుకుంటే నా జీవితం సెట్ అయిపోతుంది, నా భర్తే అంతా చూసుకుంటారు అనే ఆలోచణ ధోరణి కంటే నా కాళ్ల మీద నేను నిలబడతాను అనే వైఖరి అమ్మాయిల్లో రావాలి. జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైనది. తల్లిదండ్రులు, బంధువులు.. అంతా కలిసి పెళ్లి విషయం చూసుకుంటారు. పెళ్లి విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టే బదులు ఆర్థిక స్వాతంత్ర సాధించే దిశగా పదో తరగతి నుంచి అమ్మాయిలు ఆలోచించడం మేలు. తెలివితేటలు అభిరుచికి తగ్గ చదువు, నైపుణ్యం పెంచుకోవాలి. ఉద్యోగం లేదంటే కుట్లు,అల్లికలు.. ఇలా క్రియేటివ్ వర్క్ ఏదైనాచేస్తూ తమ కాళ్ల మీద తాము నిలబడాలి. సాధారణంగా 15 నుంచి 20 ఏళ్లు వచ్చే వరకు ఎలాంటి కేరీర్ ఎంచుకోవాలనే అంశంపై చాలా మందికి స్పష్టత ఉండదు. మన వ్యక్తిత్వం, బలాలు, బలహీనతలు, ఇష్టాఇష్టాలను బేరీజు వేసుకుని ఏ తరహా కెరీర్ ఎంచుకోవాలనేది తెలుస్తుంది. అందులో బెస్ట్‌గా ఉండేదాన్ని సాధించాలనే గోల్ పెట్టుకోవాలి. నా విషయానికి వస్తే కేరీర్ విషయంలో నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడు సపోర్ట్‌గా ఉన్నారు. నువ్వు అమ్మాయివి ఇలాంటి చదువే నీకు కరెక్ట్ అనలేదు. పని ప్రదేశాల్లో... ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థల్లో మహిళలు పని చేస్తున్నారు. ఇక్కడ స్త్రీ, పురుషులకు ఒకే రకమైన సదుపాయాలు ఉంటున్నాయి. పని ప్రదేశాల్లో మహిళల సంఖ్య పెరుగుతున్నందున అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలి. ఉదాహరణకు కార్యాలయంలో పని చేసే ఓ మహిళ తన పసిబిడ్డకు పాలు పట్టించేందుకు ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది. క్లీన్ అండ్ సేఫ్ టాయిలెట్స్ పెద్ద సమస్య. వీటిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. అందరికీ నచ్చేట్టు ఎలా ? సామాజిక కట్టుబాట్లు, ఆచారాలకు అమ్మాయిలు లొంగి ఉండాలి అనేట్టుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజం నేర్పుతుంది. దీంతో అమ్మాయిలు లొంగి ఉండటం, సర్థుకుపోవడం వంటివి వంటబట్టించుకుంటారు. ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి, అందరితో మంచి అనిపించుకోవాలి. అణుకువగా ఉండాలి అంటే. బీ కూల్, బీ నైస్ అని చెబుతారు. అబ్బాయిల విషయంలో అగ్రెసివ్‌గా ఉండు, నువ్వు ఏం చేసినా ఏం కాదు.. భయపడకు అని చెబుతారు. ఇలా మొదటి నుంచి పిల్లల పెంపకం (కండీషనింగ్)లోనే తేడాలు ఉంటాయి. ప్రపంచంలో అందరికీ నచ్చేట్టు ఎవ్వరూ బతకలేరు. అలా ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం మంచిగా బతకడం ముఖ్యం, ఆ తర్వాత పక్కన వాళ్లు. లీగల్, సోషల్ కౌన్సిలర్లు ఈ అంశంపై మహిళలతో మాట్లాడి వారిలో మార్పును తీసుకువస్తున్నారు. తరతరాలు ఉన్న పద్ధతిని ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా మార్చలేము. నెమ్మదిగా అయినా మార్పు వస్తుంది. ఇక్కడ బెటరే అమ్మాయిల రక్షణ విషయంలో దేశంలో మన హైదరాబాద్ నగరం ఎంతో ముందంజలోఉంది. పాలన వ్యవహారాలు, వ్యక్తిగత పనుల మీద ఢిల్లీ, బెంగళూరులకు వెళ్లినప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనేది పరిశీలిస్తాను. ప్రభుత్వ పనులు పక్కన పెడితే నేను ఓ సాధారణ మహిళనే. ఈ రెండు పరిస్థితుల మధ్య తేడా ను పోల్చి చూసినప్పుడు ఢిల్లీ, బెంగళూరుల కంటే హైదరాబాద్ మహిళల రక్షణ విషయంలో మెరుగైన స్థితిలో ఉంది. బెంగళూరు, ఢిల్లీలో ఉన్న నా ఫ్రెండ్ మాటలను బట్టి.. ఏదైనా ఆపద వచ్చినా ఇబ్బందుల్లో ఉన్నా.. వారికి న్యాయం జరగాలంటే ఎన్ని ఫోన్ కాల్స్ చేయాలి.. ఎంత మందిని కలవాలి అనేది బేరీజు వేస్తాను. మన రాష్ట్రంలో కలెక్టర్‌గా కాకుండా ఓ సాధారణ మహిళగా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు షీ టీమ్స్ వస్తాయి. ఇలాంటి రక్షణ దేశంలో ఇతర ప్రాంతాల్లో లేదు. ఎన్ని చర్యలు తీసుకున్నా.. అమ్మాయిలను వేధించే, టీజ్ చేసే వాళ్లు అన్ని చోట్ల ఉంటున్నారు. వ్యక్తిగత స్థాయిలో మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే అమ్మాయి ప్రభుత్వ పాఠశాలల అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్‌పై శిక్షణ ఇస్తున్నాం. ఇందుకోసం పీఈటీలకు స్వశక్తి టీమ్‌లతో ఇప్పటికే శిక్షణ ఇప్పించాం. ధైర్యం చేయాలి మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. అనేక స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఈ క్రమంలో బయట పని చేయడం అంటే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలి అని కాకుండా ప్రైవేట్ రంగంలో అయినా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ పాఠశాల/ కాలేజీల్లో ఉన్న పిల్లలు హై స్పీడ్ ట్రాక్‌లో ఉన్నారు. కస్తూర్బా పాఠశాలల్లో మార్పు వస్తోంది. గతంలో టెన్త్‌తో చదువు ఆపేసే వారు. ఇప్పుడు ఇంటర్మీడియట్‌కు వెళ్లేలా వారిలో మార్పు తీసుకువచ్చాం. నైన్త్, టెన్త్‌లో చదువు ఆపేసిన వారు, అన్ స్కిల్ల్డ్ గల్స్ కోసం వోకేషనల్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. బాధలుచెప్పుకోవాలి ర్యాగింగ్ చేసినా, టీజింగ్ చేసినా బయటకు చెప్పడానికి అమ్మాయిలు భయపడుతారు. ఇంట్లో సమస్యలు ఉంటే బయటకు చెబితే చుట్టు పక్కల అంతా చెడుగా అనుకుంటారెమో అని పెళ్ళైన వాళ్లు సందేహపడతారు. ఇలా సమస్యను బయటకు చెప్పకుండా ఉంటే పరిష్కారం లభించడం కష్టం. నువ్వు అక్కడెందుకు ఉన్నావ్, అలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, అలా ఎందుకు మాట్లాడవు... తప్పంతా నీదే అంటూ విక్టిమ్ బ్లేమింగ్ చేస్తారని ముందుకు రారు. కానీ అమ్మాయిలు బయటకు చెప్పాలి. ఏదైనా సమస్య ఉంటే పోలీసులు, రెవిన్యూ వాళ్లకి చెప్పండి.. మేము చూసుకుంటాం. గుర్తింపు లేని శ్రమ గృహిణిగా ఉండడం అనేది ఓ గొప్ప విషయం. అయితే గృహిణి ఇంట్లో చేసి పనిని ఎవ్వరూ సరిగా గుర్తించరు. అండర్ వాల్యూ చేస్తారు. గృహిణిగా ఉంటూనే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నించాలి. గంటా, రెండు గంటలా అనేది కాదు. పార్ట్‌టైం జాబ్, క్రియేటివ్ వర్క్ ఏదైనా పర్లేదు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలగాలి. మనం అవునన్నా.. కాదన్నా వరల్డ్ రన్స్ ఆన్ ఎకనామికల్. హౌజ్ వైఫ్‌గా ఉండటం తప్పు కాదు. కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కంపల్సరీ. ఎంతో తెలివైన వాళ్లు, సృజనాత్మకత ఉన్న వారు వారి ప్రతిభను అంతా ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఉమన్ గో అవుట్ అండ్ వర్క్... దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. బాడీ పాజిటివ్ బాడీ పాజిటివ్ అనేది పెద్ద సమస్య. అమ్మాయి ఎర్రగా ఉండాలి, లావుగా లేదా సన్నగా ఉండకూడదు.. ఇలా శరీర ఆకృతి నుంచి హెయిర్ స్టైల్, బట్టల విషయంలో పైకి కనిపించకుండా అనేక ఆంక్షలు పెడతారు. ఇవన్నీ అందం గురించి ఎప్పటి నుంచో నాటుకుపోయిన భావన ఆధారంగా ఏర్పడినవి (స్టాండర్డ్స్ ఆఫ్ బ్యూటీ). దీంతో ఇలానే ఉండాలనే ఒత్తిడి అమ్మాయిలపై ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం చేధించాలి. స్ట్రెయిట్ హెయిర్, ఫెయిర్, సన్నగా ఉండటమే అందం కాదని తెలుసుకోవాలి. ఇప్పుడు నలుపు, సన్నగా.. ఇలా అన్ని విషయాల్లో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న ఐకాన్స్ ఉన్నారు. ఈ ఆలోచణ ధోరణి సరికాదనే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నా విషయంలో తల్లిదండ్రుల నుంచి ఇటువంటి ఒత్తిడులు లేవు. అంతేకాదు ఏం చదవాలనే విషయంలో అమ్మాయిలకు ఛాయిస్ ఉండడం లేదు. అమ్మాయిలు డాక్టర్, టీచర్, అబ్బాయిలు ఇంజనీరు అంటారు. అమ్మాయిలు ఇంజనీరింగ్ చదివినా అందులో కంప్యూటర్స్ సెలక్ట్ చేసుకోమంటారు. మెకానికల్, సివిల్స్ వద్దంటారు. అమ్మాయిల తెలివి తేటలు, సామర్థ్యంతో పని లేకుండా శారీరక కష్టం లేని విధంగా చదువు సాగాలని అభిలాషిస్తారు. అన్ని రంగాల్లో ఆడవాళ్లు విజయం సాధిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. టెర్రిబుల్ ట్రాజిక్ మగ పిల్లలను కనాలి అనుకునే ప్రబుద్ధులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు. ఇది మనమందరం బాధపడే విషయం, టెర్రిబుల్ ట్రాజిక్. రోజురోజుకూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలే నమ్మకంగా ఉంటారు. తల్లిదండ్రులకు అండగా ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసినా మళ్లీ మగపిల్లలే కావాలంటారు. ఈ పద్దతిలో మార్పు రావాలి. -
ప్రపంచం పిలుస్తోంది
మహిళలు అంటే వంటింటికే పరిమితం కావద్దని..తమలోని శక్తిపై నమ్మకంతో ముందడుగు వేస్తే సాధించలేనిదేమీ లేదని.. ఆడపిల్లలపై తల్లిదండ్రులు వివక్ష వీడి, అబ్బాయిలతో సమానంగా పెంచాలంటున్నారు మిస్ క్వీన్ ఇండియా, పోచంపల్లి ఇఖత్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్ రశ్మీఠాకూర్. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, ఆడపిల్లల చదువుపై వివక్ష చూపొద్దని కోరుతున్నారు. ఎన్టీసీపీ రామగుండం వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ ఆమెను పలకరించింది. స్త్రీశక్తిపై ఆమె మాటలు.. పెద్దపల్లి, జ్యోతినగర్: దక్షిణ భారతదేశంలో మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు. సమానత్వం కోసం ఇంకా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. మగవారితో సమానంగా అవకాశాలు ఇవ్వాలి. అయితే ఇంటి నుంచే వివక్ష మొదలవుతుంది. తల్లిదండ్రులే ఆడపిల్లలపై ఆంక్షలు పెడుతున్నారు. దీంతో వారు స్వశక్తితో ముందుకు సాగలేకపోతున్నారు. అబ్బాయిలతో సమానంగా చూసినప్పుడే వారిలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ప్రధానంగా విద్యతోనే అభివృద్ధి సాధ్యం. ఉన్నత విద్యనభ్యసించి, ఆర్థికంగా ఎదిగినప్పుడే గుర్తింపు దక్కుతుంది. అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలి. ♦ బ్రాండ్ అంబాసిడర్‌గా.. పోచంపల్లి ఇఖత్కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం నా అదృష్టం. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నికైన మూడో రోజే అక్కడకు వెళ్లినప్పుడు వారి కష్టాలను చూశాను. పలువురు తమ మగ్గాలను వదిలి పెట్రోల్‌బంక్‌లు, షాపింగ్మాల్స్ల్లో వాచ్మెన్లుగా పనిచేయడం కలచివేసింది. వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. వారు తయారు చేసిన వస్త్రాలను విక్రయించేందుకు ‘రశ్మీఠాకూర్ టెక్స్టైల్స్’ ఏర్పాటు చేయబోతున్నాను. అంతేకాకుండా వివిధ దేశాల్లో పర్యటించినప్పుడు వారు నేసిన వస్త్రాల గురించి ప్రచారం చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నాము. ♦ అందాల పోటీలపై.. పారిశ్రామికప్రాంతం రామగుండం నుంచి అందాల పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. అయితే ఇండియాలో అందాల పోటీల నిర్వహణలో వెనుకబడి ఉన్నాం. అయితే తెలంగాణ టూరిజం వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ♦ శ్రీమతి తెలంగాణతో.. స్త్రీ అంటే శక్తి అని నిరూపించేందుకే ‘శ్రీమతి తెలంగాణ’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను వివరిస్తూ ఈ పోటీలు చేపడుతున్నాం. ఈ పోటీల ద్వారా మహిళల ప్రాధాన్యతను వివరిస్తూ, వారిలోని టాలెంట్‌ను బయటకు తీస్తుంది. పోటీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం గర్వకారణంగా ఉంది. ఈ పోటీల ద్వారా మహిళల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మహిళల్లోని ప్రతిభను వెలుగుతీసేందుకే ఈ కార్యక్రమం. ♦ యువతకు సందేశం విద్యతోనే బంగారు భవిష్యత్ సాధ్యం. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తేనే ఏదైనా సాధించగలం. సోషల్‌మీడియాను మంచికే ఉపయోగించుకోవాలి. అలాగని గంటలకొద్దీ గడపడం కచ్చితంగా తప్పు. ఆరోగ్యం పాడుకావడంతోపాటు విలువైన సమయాన్ని నష్టపోతాం. మనకు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలి. విశ్రమించకుండా పరిశ్రమించాల్సిందే. అప్పుడే బంగారు భవిష్యత్ మన కళ్ల ముందు ఉంటుంది. మనకంటూ గుర్తింపు వస్తుంది. తల్లిదండ్రులు సైతం ఆడపిల్లలపై వివక్ష చూపొద్దు. మగవారితో సమానంగా పెంచాలి. -
నాలుగు 'గోడు'లు
నాలుగు గోడల మధ్య ఉండాల్సినవి నాలుగు గోడల మధ్యే ఉండాలని ఆడపిల్లకు చెప్పి మరీ మెట్టినింటికి పంపిస్తారు. అందుకేనేమో ఆడపిల్ల నాలుగు గోడలకే అన్ని గోడులు చెప్పుకుంటుంది. ఇది మారాలి అంటున్నారు నదియా. గృహ హింస కొందరి ఆడవాళ్లకు ‘జీవన్మరణ సమస్య’. మీరు ఇలాంటి సంఘటనలను స్వయంగా చూశారా? చూడలేదు కానీ విన్నాను. నిజానికి ఇంట్లో ఇలాంటి హింస జరుగుతోందంటే చాలామంది నమ్మరు. ఎందుకంటే ఇంట్లో ఏం జరుగుతోందో ఎవరూ ఊహించలేం. కొన్నిసార్లు అమ్మాయి చెప్పినదానికన్నా ఎక్కువ హింస∙జరిగి ఉండొచ్చు. కొన్నిసార్లు తక్కువ జరిగి ఉండొచ్చు. తక్కువ.. ఎక్కువ అని కాదు కానీ ‘డొమెస్టిక్ వయొలెన్స్’ అంటేనే క్షమించరాని నేరం. నాలుగు గోడల మధ్య అమ్మాయిని బంధించి, నిస్సహాయురాలిని చేసి, ఆమె జీవితంతో ఆడుకోవడం సరి కాదు. ఇలాంటివాటిని ఎదుర్కోవాలంటే ఆడవాళ్లు ఏం చేయాలి? అమ్మాయిలు ఏం చేయాలనే విషయం చెప్పేముందు తల్లిదండ్రుల గురించి మాట్లాడాలి. ‘ఏదైనా జరిగితే ఎవరో వస్తారు.. హెల్ప్ చేస్తారని ఎదురు చూస్తూ కూర్చోకుండా నీ అంతట నువ్వు సమస్యను ఎదుర్కోవాలి’ అని చిన్నప్పటి నుంచి చెబుతూ పెంచాలి. అప్పుడే వాళ్లల్లో ధైర్యం పెరుగుతుంది. పోనీ పేరెంట్స్ నేర్పించలేదనుకోండి.. సమాజాన్ని చూసి పిల్లలు నేర్చుకోవాలి. ఓ సమస్యను ఇతరులు ఎలా పరిష్కరించుకుంటున్నారో తెలుసుకోవాలి. భరిస్తూ ఉంటే బాధ పెరుగుతుంది తప్ప తగ్గదు. అంటే.. ఆ బంధాన్ని వదిలించేసుకోవాలంటారా? అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి తప్పుదోవ పట్టించను. ‘కాంప్రమైజ్’ అవ్వాలి. అయితే అది ఎంతవరకు? అన్నది ముఖ్యం. ఎందుకంటే ఒక బంధం ఏర్పడటం చాలా కష్టం. అంత ఈజీగా ఆ బంధాన్ని తెంచేసుకోకూడదు. అందుకే రాజీపడాలన్నాను. అయితే రాజీపడినా లాభం లేదనుకున్నప్పుడు ఆ బంధం నుంచి బయటపడిపోవాలి. బాధపడుతూ అక్కడే ఉండటంలో అర్థం లేదు. భార్యను భర్త వేధించడం మాత్రమే కాదు.. తండ్రికి ఇచ్చిన గౌరవం పిల్లలు తల్లికి ఇవ్వకపోవడం కూడా గృహ హింసకు దారి తీస్తుందా? ఎగ్జాట్లీ. తండ్రికి ఇచ్చే విలువ తల్లికి ఇవ్వని పిల్లలను నేనూ చూశాను. పిల్లలు అలా ప్రవర్తించడానికి తండ్రే కారణం. ‘ఆ.. మీ అమ్మకేం తెలుసు? వంట తప్ప’ అని తండ్రి అనే మాటలు పిల్లలకు తల్లిపట్ల చిన్న చూపు కలిగేలా చేస్తాయి. అలాగే పిల్లల కళ్ల ముందే భార్యను భర్త కొడితే ఆ పిల్లలకు తల్లంటే ఏం గౌరవం ఉంటుంది? భార్య మాటలకు భర్త గౌరవం ఇస్తే అప్పుడు పిల్లలు కూడా తల్లిని గౌరవిస్తారు. అప్పుడే కుటుంబం కూడా బాగుంటుంది. అక్కడ పిల్లలను తిట్టినా కేసు అవుతుంది గృహ హింసకు గురవుతున్న స్త్రీల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉంది. అయితే మన దేశంలోనే ఎక్కువగా జరుగుతున్నట్లు రావడానికి కారణం మన పాపులేషన్ ఎక్కువ. శిక్షలు పడటం తక్కువ. అదే విదేశాల్లో అయితే కారణం లేకుండా పిల్లలను తిట్టినా కేసు అవుతుంది. ఇక్కడైతే ‘హింస భరించలేకపోతున్నాను’ అంటూ స్త్రీ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకునేవాళ్లు తక్కువ. మీ కుటుంబం సంగతేంటి? మా ఆయన, నేను పిల్లల ముందు వాదించుకోం. అలాగే పిల్లలు ఏదైనా అడిగినప్పుడు తను ‘సరి’ అని, నేను ‘కాదు’ అని చెప్పం. ఇద్దరం ఒకే మాట మీద ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నా కూతుళ్లు ఈవినింగ్ ఏదైనా పార్టీకి వెళతానని పర్మిషన్ అడిగితే.. ‘ఈ టైమ్ లోపల వచ్చేయాలి’ అని నేను ఓ కండిషన్ పెడతాను. ఆయన కూడా అదే అంటారు. అలా కాకుండా ‘మీ అమ్మ మాటలకేం.. మీ ఇష్టం’ అని ఆయన అన్నారనుకోండి.. అప్పుడు పిల్లలు నా పర్మిషన్ కోసం చూడరు. తల్లి అనుమతి లేకుండా పిల్లలు బయటికెళ్లడం అంత మంచిది కాదు. ఎందుకంటే.. పిల్లలెక్కువగా తల్లి కనుసన్నల్లోనే పెరుగుతారు. కొంతమంది ఆడవాళ్లు భర్త మీద పూర్తిగా ఆధారపడతారు.. అలాంటివాళ్లకు మీరిచ్చే సలహా? ఆడవాళ్లందరూ చదువుకోవాలి. తమ కాళ్ల మీద తాము నిలబడాలి. నాలుగు గోడల మధ్య మగ్గిపోకూడదు. భర్త తెచ్చే సంపాదనతో ఇల్లు గడుపుతూ, అతను అనే సూటిపోటీ మాటలు పడకూడదు. పూర్తిగా అతని మీద ఆధారపడినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అందరూ ఇలా ఉంటారని అనడంలేదు. నా మాటలు కటువుగా అనిపించొచ్చు కానీ భర్త ఉన్నంతవరకూ చూసుకుంటాడు. ఒకవేళ అతను చనిపోతే ఆ తర్వాత ఆ కుటుంబానికి దిక్కెవరు? పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? భార్యదే కదా. అందుకే రూపాయి సంపాదించుకోవడం తెలుసుకోవాలి. ఒకవేళ చదువుకోలేదనుకోండి ఏదో ఒక పని నేర్చుకోవాలి. అది కూడా నేర్చుకోలేని స్థితిలో ఉన్నవాళ్లను చూసి జాలిపడటం మినహా మనం ఏమీ చేయలేం. వాళ్లది నిజంగా దయనీయ స్థితి. భయపెట్టి, ఒత్తిడి చేసి కొందరు ఆడపిల్లలకు బాల్యవివాహం చేస్తున్నారు. దాని గురించి? నా ఫ్రెండ్స్ కొంతమంది టీనేజ్లోనే పెళ్లి చేసుకున్నారు. 16, 17, 18ఏళ్ల వయసులో వాళ్ల పెళ్లి జరిగింది. అయితే ఎవరూ ఒత్తిడి చేయలేదు. కానీ ఆ వయసులో పెళ్లి చేసుకోవడం సరి కాదు. అసలు ప్రపంచం గురించి ఏం తెలుస్తుంది? పెళ్లి చేసుకుని భర్త, పిల్లలను చూసుకుంటూ గడిపేస్తారు. బాగున్నంతవరకూ అంతా బాగానే ఉంటుంది. లేకపోతేనే కష్టం. అందుకే ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాక పెళ్లి చేయాలి. రేపు ఏదైనా జరిగితే తట్టుకునేంత ఆత్మస్థయిర్యం అమ్మాయికి ఉండాలి కదా. ఇళ్లల్లో జరిగే బాల్య వివాహలను మనం సామాన్యులం ఆపలేం. ప్రభుత్వం చేయాల్సిన పని అది. ఇలాంటి పెళ్లిళ్ల విషయంలో ఇంట్లో ఉండే ఆడవాళ్ల చెయ్యి కూడా ఉంటుంది కాబట్టి.. భార్య–భర్తలిద్దర్నీ విమర్శించాలి. నాలుగు గోడల మధ్య జరిగే హింసను నలుగురి దృష్టికి తేవడానికి కొందరు ముందుకు రావడంలేదు. ఎందుకంటారు? భయం. నలుగురూ ఆడిపోసుకుంటారని. ‘ఏమో.. ఆ అమ్మాయి ఏం చేసిందో?’ అని మాట్లాడుకుంటారని. నిజానికి పరాయి ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోకుండా కామెంట్ చేయకూడదు. చాలామంది అమ్మాయిలు భయపడేది ఇలాంటి కామెంట్స్‌కే. ప్లస్ చట్టపరంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉండాలి. అప్పుడే ధైర్యంగా ముందుకొస్తారు. మన చట్టం ఎలా ఉందంటే... ఇవాళ అమ్మాయి ఫిర్యాదు చేస్తే స్వీకరిస్తారు. కానీ ఆ కేసు తేలడానికి ఏళ్లు పడుతుంది. ఈలోపు అబ్బాయి ఏదో ఒక రకంగా బయటికొచ్చేస్తున్నాడు. లండన్, న్యూయార్క్‌లో అలా కాదు. పేదరికం ఓ శాపం భర్త ఇంటిని పట్టించుకోకపోతే పిల్లలను పోషించుకోవడానికి ఇళ్ల పనులు చేస్తుంటారు కొందరు ఆడవాళ్లు. అన్ని ఇళ్లూ ‘సేఫ్’ అని చెప్పలేం. అలాగే ఇక్కడి ఏజెంట్స్ ద్వారా విదేశాలు వెళ్లి ఇళ్ల పనులు ఒప్పుకుంటారు. ఏ కుటుంబంలో ఇరుక్కుంటారో తెలియదు. వీళ్ల ఫేట్ బాగుంటే మంచి ఇంట్లో పడతారు. బాగాలేకపోతే అరాచక శక్తుల చేతిలో పడతారు. అది వాళ్ల బ్యాడ్ లక్. పేదరికం ఓ శాపం. స్త్రీకి స్త్రీయే శత్రువు కాకూడదు ఎక్కడైతే సురక్షితంగా ఉండొచ్చనుకుంటామో అక్కడే (ఇంట్లో) వేధింపులు అంటే బాధపడాల్సిన విషయం. మేనమామ వేధించాడనో, బాబాయ్ వెకిలిగా ప్రవర్తించాడనో, తండ్రే దాడి చేశాడనో విన్నప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. ‘అసలు వీళ్లు మనుషులేనా?’ అనుకుంటా. పట్టరాని ఆవేశం వస్తుంది. అయితే నాది ఎందుకూ పనికి రాని ఆవేశం. ఎందుకంటే నేను స్వయంగా వెళ్లి ఏమీ చేయలేను. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు ఆ మగవాళ్లను వదిలిపెట్టకూడదు. కొన్నిచోట్ల ఆడవాళ్లు ఇలాంటి విషయాలను తేలికగా తీసుకుంటారు. సాటి స్త్రీని అర్థం చేసుకోలేకపోతే ఎలా? మగవాళ్లకు మనం లోకువ అయ్యేది అక్కడే. ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు కాకూడదు. ఇప్పుడు చాలా టీవీ సీరియల్స్‌లో చూపిస్తున్నది అదే కదా. అత్త మీద కోడలు కుట్రలు చేయడం, తోడికోడలి మీద అసూయ, ఆడబిడ్డ కాపురాన్ని నాశనం చేయాలనుకోవడం వంటివి చూపించడం ద్వారా సమాజానికి ఏం చెబుతున్నట్లు? అవి చూసి రియల్ లైఫ్‌లోనూ ఫాలో అవుతున్నారు. పర్టిక్యులర్‌గా లండన్, నూయార్క్ గురించి చెప్పారేంటి? నా పెళ్లయిన తర్వాత కొన్నేళ్లు అక్కడ ఉన్నాను. అక్కడ ‘లా’ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ వీక్‌గా ఉంటుంది. తప్పు చేస్తే అక్కడ తప్పించుకోవడం కష్టం. ఇంట్లో భర్త హింసపెడుతుంటే ఒక్క ఫోన్ చేస్తే చాలు నిముషాల్లో పోలీసులు ఇంటికొస్తారు. అలా ఉండాలి. అదే ఇక్కడ అయితే అంత ఫాస్ట్‌గా రియాక్షన్ ఉండదు. లీగల్ సిస్టమ్ నమ్మకం కలిగిస్తే.. నాలుగు గోడల మధ్య మౌనంగా రోదిస్తున్నవాళ్లు తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టగలుగుతారు. ఆడవాళ్లు చాలావరకు సున్నితహృదయులు. ‘కైండ్’గా ఉంటారు. మన ఇంట్లోవాళ్లను బయటపెట్టడమేంటి? అనుకుంటారు. ఆ ‘కైండ్‌నెస్’ని ‘వీక్నెస్’గా అర్థం చేసుకుంటున్నారు. అది బలహీనత కాదు.. మంచితనం అని అర్థం చేసుకుంటే గృహహింసలు తగ్గుతాయి. – డి.జి. భవాని -
పురుషులూ భాగస్వాములు కావాలి
మనసుకి బాధ కలిగించేది హింస. శారీరక, మానసిక, లైంగిక... ఏ హింస అయినా హింసే. అన్నిరకాల హింసా ఒకటే. దీనికి ఎక్కువ, తక్కువ స్థాయిలు ఉండవు. ముఖ్యంగా స్త్రీకి సంబంధించి ఇలా ఆమెను బాధపెట్టి ఆమె నోరుమూయించే ప్రయత్నం జరుగుతోంది. ఇది పితృస్వామ్యంలో భాగం. ఇది సరైంది కాదు. ఎక్కడ హింస జరుగుతుందో అక్కడ మానవహక్కుల ఉల్లంఘన జరిగినట్టే. హ్యూమన్ డిగ్నిటీ దెబ్బతిన్నట్టే. అసలు నిత్యజీవితంలో స్త్రీ, పురుషులు యుద్ధరంగంలో ఉన్నట్టే ఉంటాము. ఎవరూ గమనించని సత్యం ఇది. దెప్పడం, హేళన చేయడం, తిట్టడం, అనుమానపడటం వంటివి జరుగుతూనే ఉంటాయి. చుట్టుపక్కల అందరికీ తెలుస్తుంటుంది ఇది. కాని ఎవ్వరూ జోక్యం చేసుకోరు. అది ప్రైవేట్ వ్యవహారం అని ఊరుకుంటారు. ఇలా ఊరుకోవడం వల్ల ఆ హింస శారీరక హింసకు దారితీస్తుంది. మనదగ్గర చట్టాల గురించి ఎవరికీ తెలియదు. పోలీసులు అంటే భయం. కంప్లయింట్ చేయడం అంటే భయం. ఎవిడెన్స్ అడిగితే ఎక్కడినుంచి తేవాలి? రోజూవారి కార్యక్రమాలను పక్కన పెట్టి పోలీసుల చుట్టూ తిరగడం అంటే భయం. వీటన్నిటికీ భయపడి సమస్యను భరించడమంటే మానవహక్కుల ఉల్లంఘనను సమర్థిస్తున్నట్టే. తన పొరుగు ఇంట్లో హింస జరుగుతున్నా పట్టించుకోవట్లేదంటే ఆ హింసను సమర్థిస్తున్నట్టే. ఈ హింసకు ధనిక,పేద తేడా లేదు. పేదవర్గంలో జరిగేది బయటకు వస్తుంది. ధనికవర్గంలో జరిగే హింస బయటకు రాదు. దీని మీద మన దేశంలో కొన్నేళ్లుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీలు తమ హక్కుల కోసం పోరాడుతూ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, ది ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్‌మ్యారేజ్ యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్‌ప్లేస్ యాక్ట్, ఇండీసెంట్ రిప్రంజెంటేషన్ ఆఫ్ విమెన్ యాక్ట్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్, డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ వంటి చట్టాలను తెచ్చుకున్నారు. ఇంకా ముందుకు వెళ్లాలి. మహిళలు, మగవాళ్లు అనేది ఓ డివిజన్. డైవర్సిటీ ఆఫ్ నేచర్. కాని హక్కులు అందరికీ సమానమే. స్త్రీలు తక్కువ కాదు. మహిళల విషయంలో కాస్ట్ అప్రెషన్, జెండర్ అప్రెషన్ రెండూ ఉన్నాయి. స్త్రీలంటే తక్కువ. అందులో దళిత స్త్రీలంటే ఇంకా తక్కువచూపు ఉంది. ఇది పోవాలి అంటే ఈ పోరాటంలో పురుషులూ పాలుపంచుకోవాలి. సమానత్వం, కొత్త సంస్కృతి, భద్రత కోసం ఈ పోరాటంలో వాళ్లూ భాగస్వాములు కావాలి. అయితే ఇదివరకన్నా ఇప్పుడు పరిస్థితి కొంత మారింది. ఇంతకుముందు చేసిన ఉద్యమాలు, చర్చల వల్ల కొంత చైతన్యం అయ్యారు. ముఖ్యంగా మన దేశంలో స్త్రీలకు సంబంధించి పురుషుల ఆలోచనా ధోరణి కొంత మారింది. మహిళల హక్కులను గుర్తిస్తున్నారు. వాళ్ల స్పేస్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారు. గౌరవిస్తున్నారు. ఇంకా మార్పు రావాలి. ఈ ఉద్యమం మరింత లోతుకు వెళ్లాలి. స్త్రీ, పురుషులు, ఎల్జీబీటీ అందరూ సమానమే అని ఆలోచిస్తూ అంతా ఒక్క తాటిమీదకు రావాలి. ఆ బీజం ఉంది. ఆ ఆశయసాధన కోసం స్త్రీపురుషులు కలిసి పోరాటం చేయాలి!! -
ఆ రోజు నేను చనిపోయేదాన్ని...!
కాపాడవలసిన చేతులు... ప్రేమించాల్సిన చేతులు ఊతం కావలసిన చేతులు...భరోసా ఇవ్వాల్సిన చేతులు మాటిమాటికీ లేస్తుంటే... బుసలు కొడుతుంటే.. కాటేస్తుంటే... అలాంటి చేతులకు సంకెళ్లు వేయాల్సిందే ఇనుప గాజులు తొడగాల్సిందే. సాక్షి తలపెట్టిన మహోద్యమం, మహిళోద్యమం అయిన ‘నేను శక్తి’ లో భాగంగా గతవారం అంతా ‘లైంగిక వివక్ష’పై కేస్ స్టడీలు ఇచ్చిన ‘ఫ్యామిలీ’.. ఈరోజు నుంచి ‘గృహహింస’పై ప్రత్యేక కథనాలను అందిస్తోంది. పెళ్లంటే అందరి అమ్మాయిల్లాగే నేనూ ఎన్నో కలలు కన్నాను. ఒక కొత్త జీవితాన్ని ఊహించి ఆ ఇంట్లో అడుగుపెట్టాను. అన్ని విధాలా నన్ను చూసుకునే, ప్రేమించే వ్యక్తి ఉన్నాడనే భరోసాతో వెళ్లాను. కానీ పెళ్లయిన పదహారో రోజే అత్తారింట్లో అందరిముందు కొట్టాడు. పెళ్లిలో మా అమ్మ మర్యాదలు సరిగా చేయలేదని. నేను టెన్త్‌క్లాస్‌లో ఉన్నప్పుడే నాన్న చనిపోయారు హఠాత్తుగా. ఏజీ ఆఫీస్‌లో పనిచేసేవారు. మేం ముగ్గురం పిల్లలం. నాకు ఒక చెల్లి, తమ్ముడు. అమ్మే కష్టపడి పెంచింది మమ్మల్ని. ‘‘మా అమ్మను ఒక్క మాట కూడా అనొద్దు’’ అని నేను అన్నందుకు నన్ను కొట్టాడు. దవడ ఇప్పటికీ నొప్పిగానే ఉంటుంది. ఆరోజే అనుకున్నాను ఇంక ఇది వద్దు అని. అయితే విడాకులు తీసుకొని ఇంటికెళితే అమ్మకు ఎంత కష్టం? పెళ్లి కావల్సిన చెల్లి ఉంది. సొసైటీ ఏమనుకుంటుంది? అనే ఆలోచన వెనక్కిలాగింది. అయినా ‘‘నాకు వద్దు. నేను వెళ్లిపోతా’’అని చెప్పా. అప్పుడు మా మామగారు.. ‘‘అమ్మాయి చెప్పింది కరెక్టే. సరిగ్గా చూసుకోగలిగితే చూసుకో. లేదంటే నేనే దగ్గరుండి డివోర్స్ ఇప్పిస్తాను’’ అని అన్నారు. ఆ మాటకు ‘‘లేదు, ఇంకోసారి ఈ మిస్టేక్ జరగదు. ఇది నాకు కావాలి’’ అని తను అన్నాడు. క్షమించాను. కాని అది క్లోజ్ కాలేదు. అతను చెయ్యి ఎత్తుతూనే వచ్చాడు. ఒకసారి మా అత్తగారితో కూడా షేర్ చేసుకున్నా. ‘‘మన ఇళ్లల్లో కొత్తేం కాదు ఇది.. నువ్వే కొంచెం చూసీ చూడనట్టు పో’’ అని చెప్పారు ఆమె. చూసీచూడనట్టూ వెళ్లా. తర్వాత నాకు తెలిసిందేంటంటే.. అతను ఇంకో అమ్మాయితో ఉన్నాడు.. వాళ్లకు సంతానం కూడా ఉందని. టామ్‌బాయ్‌లా.. మా నాన్నే కొట్టలేదెప్పుడూ నన్ను. సింగింగ్‌తో చదువులో బీగ్రేడ్ వచ్చిన రోజూ పల్లెత్తు మాటనలేదు. ‘‘బాధపడకురా.. నీకు చాలా స్ట్రెన్త్ ఉంది’’ అంటూ ఎంకరేజ్ చేయడం తప్ప. పైగా నన్ను ఓ టామ్‌బాయ్‌లా పెంచారు. సైకిల్ తొక్కేదాన్ని. స్పోర్ట్స్ బాగా ఆడేదాన్ని. సింపుల్‌గా, స్ట్రాంగ్‌గా ఉండడం ఆయనకు ఇష్టం. అలాగే పెంచాడు. నిజానికి మా మామగారు, మా నాన్న ఇద్దరూ కొలీగ్స్. చిన్నప్పటి నుంచీ చూసినవాళ్లే. పాడడం నచ్చే నన్ను చేసుకున్నాడు అతను (భర్త). ఫస్ట్‌లో చాలా ఎంకరేజ్ చేశాడు కూడా. అలాంటిది ఒక్కసారిగా ‘‘నీ ఫొటోలు చూడు ఎట్లా ఉన్నాయో? నీ బిహేవియర్ చూడు ఎట్లా ఉందో? నీకు ఎవడో ఉన్నడంట కదా..’’ అంటూ మొదలుపెట్టాడు. సామరస్యంగా మాట్లాడదామని ట్రై చేసినా సాగనిచ్చేవాడు కాదు. కొట్టడమే. ఆయన ఇంటికొస్తున్నాడంటనే దడ వచ్చేది. ‘‘ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావ్?’’ అని అడిగితే నా మీద రాంగ్ ఎలిగేషన్స్ వేయడం స్టార్ట్ చేశాడు. ఎక్కడికి వెళ్లినా ఆయనను తీసుకునే వెళ్లేదాన్ని. అయినా అలా మాట్లాడేవాడు. ఉన్నట్టుండి అప్రోచ్ అయి కొట్టేవాడు. పోలీసుల దగ్గరకు వెళ్లా.. ‘‘ఏం జరిగిందో నాతో చెప్పట్లేదు. ఆయనను ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మా ఇద్దరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి’’ అని. చంపేస్తామని బెదిరించారు సూపర్ సింగర్ 7 నాకు పెద్ద చాలెంజ్. అప్పుడే అమ్మకు క్యాన్సర్, ఆయన గొడవలు స్టార్ట్ చేయడం అన్నీ ఒకేసారి. చాలా కుంగిపోయా. ఎందుకంటే ఆమే నాకు సపోర్ట్. బాధ తొలిచేసేది. ఒకసారి మా బావగారు అంటే ఆయన పెద్దనాన్న కొడుకు వాళ్లు వచ్చారు ఇంటికి మా సమస్యను సాటవుట్ చేద్దామని. వాళ్లందరి ముందూ కొట్టాడు రక్తంకారేలా. వాళ్లు ఆయన్ని ఆపకపోతే నేను చచ్చిపోయేదాన్ని ఆ రోజు. మా బాబుకి అప్పుడు ఆరేళ్లు. ‘అమ్మను కొట్టొద్దు నాన్నా. ప్లీజ్ కొట్టొద్దు నాన్నా’ అంటూ వాళ్ల నాన్న కాళ్లు పట్టుకున్నాడు. నా దగ్గరకు వచ్చి ‘అమ్మా కొట్టుకోకండి అమ్మా... కలిసి ఉండండి అమ్మా..’ అని వాడు ఏడుస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది. నా తలంతా గాయాలే. మా బావగారు వాళ్లే ఐస్‌క్యూబ్స్ ఇచ్చి ‘‘వెళ్లి అమ్మాయికి పెట్టరా’’ అన్నారు. ఆయన తలకు ఐస్‌క్యూబ్స్ అద్దుతుంటే ‘‘ఎందుకిలా చేస్తున్నావ్? నిన్నేం ఇబ్బంది పెట్టను. చెప్పుకోవడానికి నాకెవరూ లేరు’’ అని బతిమాలాను. అయితే తెల్లవారి ఈ మాటలనే పట్టుకుని హేళన చేస్తుంటే అనుకున్నాను ఇంక చాలు అని. మాట్లాడ్డానికి కూడా ట్రై చేయక మళ్లీ పోలీసుల దగ్గరకు వెళ్లా. ‘‘కేసులేమీ లేకుండా ఒకసారి ఆయనను పిలిచి మాట్లాడండి’’ అని రిక్వెస్ట్ చేశా. కంప్లయింట్లు ఇచ్చి, పదిమందికీ తెలిసి అల్లరి కాకుండా లోపలే పరిస్థితి చక్కదిద్దుకుందామనే నా ప్రయత్నం అప్పటికీ. అందుకే ఆయన మీద డొమెస్టిక్ వయలెన్స్ కేసు వేయాలనే ఆలోచన కూడా రాలేదు. కాని ఇప్పుడనిపిస్తోంది. అప్పుడే ఆ పని చేసుండాల్సింది అని. ఆయనతో ఉన్న ఆమె పేరు బయటపెడితే చంపేస్తామని బెదిరించారు ఇద్దరూ. భయపడి అప్పుడు కేస్ ఫైల్ చేశాను. ఒక్కో రీజన్‌తో.. భరించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. భరించడం కూడా ఒక శాపం. ఒక్కసారి చెయ్యి ఎత్తిన మగవాడు మళ్లీ మళ్లీ ఎత్తుతూనే ఉంటాడు. ఇది నా అనుభవంతో చెప్తున్న సత్యం. వెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్.. దాని వెనక కారణం ఏంటో గ్రహించాలి. మరీ పాజిటివ్ ఆటిట్యూడ్ కూడా మంచిది కాదు. నెమ్మదిగా ఆయనే మారతాడని, చెల్లెలి పెళ్లికావాలని, అమ్మకు మాట రాకూడదని, సమాజం ఏమనుకుంటుందోనని.. తర్వాత బాబు ఉన్నాడని ఒక్కో రీజన్‌తో కామ్‌గా ఉన్నా. తర్వాత నా వల్ల కాలేదు. మన దేశంలో స్త్రీత్వం అంటే డిపెండెన్సీ.. అదే అందం అంటూ ఆడపిల్లలను పెంచుతారు. కాని మనకు కావల్సింది ఆత్మవిశ్వాసం, ధైర్యం! నా చేయి పట్టుకొని నా కొడుకు.. ఎదురుగా జీవితమనే సముద్రం.. ఒంటరిగా ఆ సముద్రాన్ని ఈదాలనే వాస్తవం భయపెట్టినప్పుడు, రేపేంటి? అన్న ప్రశ్న కలవరం పుట్టిస్తే నావలా కనిపించేది ఆత్మస్థైర్యమే. సెల్ఫ్ పిటీలోకి పడిపోయి ఎమోషనల్ అయిపోతే ముందుకు వెళ్లలేం. ఆర్థిక ఇబ్బందులున్నాయి. కలిసి ఉన్నప్పుడు భర్త, నేను వేరువేరు అనుకోం కదా. నా అకౌంట్స్, ఐటీ రిటర్న్స్అన్నీ ఆయనే చూసుకునేవారు. అలా ఆస్తీ ఆయనే చూసుకున్నారు. అయినా నాకు న్యాయం జరుగుతుందన్న ఆశ ఉంది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కొట్టినా, తిట్టినా పడ్డాను. సెలబ్రెటీగా నేనెప్పుడూ బతకలేదు. ఇంట్లో అన్ని పనులు చేసే రికార్డింగ్‌కి వెళ్లేదాన్ని. ఆయన స్నేహితులొస్తే వండిపెట్టేదాన్ని. అత్తింట్లో అందరికీ మర్యాద ఇచ్చాను. నా కొడుకు వ్యాక్సినేషన్ దగ్గర్నుంచి స్కూల్లో చేర్పించేదాకా అన్నీ నేనే చూసుకున్నా ఇండిపెండెంట్‌గా. ఎక్కడా ఏ లోపం చేయలేదే? ఎందుకు నన్ను ఇంత మోసం చేయడం? ఇప్పుడు నా జీవితం నేను జీవిస్తున్నా. నేను ఇంత బలంగా.. సంతోషంగా.. నవ్వుతున్నానంటే కారణం నా కొడుకే. వాడు క్రికెట్ బాగా అడతాడు. పొద్దున్నే అయిదు గంటలకు కోచింగ్‌కు తీసుకెళ్తా. నేను నా కొడుకు మీద పెడుతున్న శ్రధ్ధను చూసి వాళ్ల నాన్నే జెలసీ ఫీలయ్యి ‘‘నువ్వు నీ కొడుకును పెంచినట్టు మా అమ్మ నన్ను పెంచి ఉంటే నేనిట్లా తయారయ్యేవాడిని కాను’’ అని అంటుండేవాడు. నాకున్న గొడవల్లో నాకు వచ్చిందాన్ని మరిచిపోకుండా ఉండడానికే సంగీత అకాడమీ. అదే నా ఆత్మసంతృప్తి. పాడడంలోనే నాకు మనశ్శాంతి. మన హక్కు మనమే.. ఎవరో వస్తారు.. ఏదో సాయం చేస్తారు అనుకుంటూ ఎదురుచూసే రోజులు పోయాయి. నీకు నువ్వే అన్నీ. మన హక్కును మనమే కాపాడుకోవాలి. మన చాయిస్‌ను మనం పర్స్యూ చేసుకోవాలి. ఇబ్బందిని ధైర్యంగా చెప్పాలి. ఇలాంటి క్యాంపెయిన్స్ వల్ల సమాజం ఎడ్యుకేట్ అవుతుంది. -సరస్వతి రమా డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ మనదేశంలో గృహహింస చట్టం 2006 నుంచి అమల్లోకి వచ్చింది. ఒక్కొక్క ఉపశమనానికి ఒక్కో కోర్ట్ని ఆశ్రయించకుండా అన్ని ఉపశమనాలకు ఒకే చట్టం అనేది ఇందులోని ముఖ్యమైన విషయం. స్త్రీలపై జరిగే మానసిక, శారీరక, ఆర్థిక, లైంగిక వేధింపుల నుంచి ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. అన్ని హింసల స్వరూప స్వభావాలను చర్చించి, విశదీకరించిందీ చట్టం. సహజీవనాన్నీ గుర్తించింది. ఇదొక శుభపరిణామం.. మహిళలకు ఆశాకిరణం! ది బెస్ట్: మహిళలు పోరాడి సాధించుకున్న ఈ చట్టం చాలా గొప్పది. ప్రభుత్వం కాస్త దృష్టి పెడితే దిబెస్ట్ అవుతుంది. మధ్యంతర ఉత్తర్వులు ఆర్థికపరంగా, నివాసపరంగా, కస్టడీ పరంగా, రక్షణపరంగా వెనువెంటనే వస్తున్నాయి. కేస్ల పరిష్కారమే ఆలస్యమవుతోంది. ఉత్తర్వుల సత్వర అమలుకు చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. డీవీ (డొమెస్టిక్ వయలెన్స్) చట్టం వచ్చాక 498ఏ కేసుల సంఖ్య కొంత శాతం తగ్గింది. సపరేట్ కోర్టులు కావాలి: డీవీ కేసులను విచారించడానికి సపరేట్ కోర్ట్‌లను ఏర్పాటు చేయాలి. క్రిమినల్ కేసులలో ఎఫ్ఐఆర్ లాంటిదే డీవీ కేసులలో డీఐఆర్. చట్టప్రకారమైతే కొన్ని గుర్తింపు ఉన్న ఎన్జీఓలు గృహహింస జరిగిన చోటుకు వెళ్లి, విచారించి ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలి. దాని ఆధారంగానే అధికారులు తదుపరి చర్యలు తీసుకొని కోర్ట్‌కు పంపాలి. కాని ఇది సవ్యంగా జరగడంలేదు. యాంత్రికంగా డీఐఆర్లు వేస్తున్నారు. అసలు కొన్ని చోట్ల అయితే విచారణలే లేవు. ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు పరిచే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. డీవీ చట్టం కింద జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తే నేరం. కాని నేరాన్ని నిరూపించాలన్నా, ఆ ఉత్తర్వులను అమలుపర్చుకోవాలన్నా పోలీసుల సహాయం తప్పనిసరి. కాబట్టి ప్రతి స్టేషన్లో కొందరు పోలీసులకు ఈ బాధ్యతను అప్పగించాలి. రెండవ స్థానంలో .. ♦ డొమెస్టిక్ వయలెన్స్ కేసుల విషయంలో దేశంలోనే రెండవస్థానంలో ఉంది హైదరాబాద్. ♦మహిళలకు సంబంధించి హైదరాబాద్‌లో దాఖలయ్యే కేసుల్లో 25 డీవీ కేసులే. ♦ చట్టం వచ్చిన ఈ పదేళ్లలో మన దేశంలో పదిలక్షల కేసులు నమోదయ్యాయి. ♦ ప్రతిరోజు ఒక్కో కోర్టులో కనీసం అయిదు డీవీ కేస్లు బుక్ అవుతున్నాయి. సర్వే: తమపై జరిగే హింస గృహహింస అని చాలామంది మహిళలు ఇంకా గుర్తించనేలేదు. వారికి తెలియదు కూడా. 80 శాతం మగవారు ఏదో ఒక సందర్భంలో భార్యలను కొడుతున్నామని అంగీకరించారు. అప్పుడప్పుడు అది తప్పు కాదని కొందరు అభిప్రాయపడ్డారు కూడా. - ఇ. పార్వతి, అడ్వకేట్, ఫ్యామిలీకౌన్సిలర్ గట్టిగా ఎదురించాలి.. ఎక్కువ కుటుంబాల్లో భర్తలు తాగివచ్చి భార్యలపై దాడులకు పాల్పడుతున్నారు. శారీరకంగా వేధిస్తున్నారు. చాలా మంది మహిళలు పిల్లల కోసం ఈ హింసను భరిస్తున్నారు. తమపై జరిగే దాడులను మహిళలు ప్రతిఘటించాలి. నలుగురికీ చెప్పాలి. గట్టిగా ఎదురించాలి. అవసరమైతే బంధువుల సహాయం తీసుకోవాలి. అలా చేస్తేనే మగవారిలో భయం వస్తుంది. విదేశాల్లో కూడా గృహహింస ఉంటుంది. ఫిర్యాదు చేస్తే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయి. – పద్మ పాల్వాయి, సైకాలజిస్ట్ జీవితంలో ఎన్ని అపజయాలనైనా ఎదుర్కోవచ్చు.. కాని నీకు నువ్వు ఓటమికి లొంగిపోకు! – మాయా ఎంజెలో -
సమాన అవకాశాలు ఇవ్వాలి
జనగామ: ‘‘ఉద్యోగ, రాజకీయ రంగాల్లో పురుషులతోపాటు మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలి.. పార్లమెంట్, అసెంబ్లీలో రిజర్వేషన్లు, సమాజంలో తగిన గౌరవం కల్పించాలి.. అప్పుడే మహిళా సాధికారత ఏర్పడుతోంది..’’ అని అంటున్నారు జనగామ మునిసిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి. ‘ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం’ అనేది నినాదానికే పరిమితం కాకుండా మహిళలకు అన్ని చోట్ల తగిన ప్రాతినిథ్యం కల్పిస్తేనే దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. మహిళల సత్తా చాటాం.. ప్రభుత్వాలు మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా అవి ఆచరణకు నోచుకోవడం లేదు. గత టీడీపీ హయాంలో అసెంబ్లీలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తీర్మానం చేసినా, పార్లమెంట్‌కు వెళ్లే సరికి అది ఆమోదానికి నోచు కోలేదు. రాజకీయంగా రిజర్వేషన్లు లేకపోవడంతో మహిళలు జనరల్ స్థానాల్లో పోటీచేయాల్సి వస్తుంది. జనగామ మునిసిపల్‌లో 14 మంది మహిళలకు రిజర్వేషన్లు అనుకూలిస్తే, ఇతర స్థానాల్లో కలుపుకుని మొత్తం 16 మంది గెలిచి మహిళల సత్తా చాటు కున్నాం. రిజర్వేషన్లు ఉంటే పురుషులతో సమానంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. మాకు మేమే ముందుకు వెళ్తున్నాం తప్ప.. చట్టాలు అనుకూలంగా కనిపించడం లేదు. స్త్రీలను ప్రోత్సహించాలి.. మహిళలు వంటింటికే పరిమితం అనే పదాన్ని పక్కన బెట్టి.. వారిని ప్రోత్సహించే విధంగా ఉండాలి. ముఖ్యంగా రాజకీయంగా సమాన హక్కులు కల్పించాలి. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, రాజ్యసభ తదితర వాటిలో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు తీసుకురావడంతో మహిళలకు అక్కడ సముచిత స్థానం లభించింది. అన్నింట్లో పనిచేయగలిగే సత్తా మహి ళలకు ఉంది. 80 శాతం మంది విద్యావంతులుగా మారినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చాలామంది వెనకబడి ఉన్నారు. నేల నుంచి ఆకాశం వరకు దేశం సాధిస్తున్న ప్రగతిలో మహిళల పాత్ర ముఖ్యభూమిక పోషిస్తుంది. చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలనే తపన మహిళల్లో రావాలి. రిజర్వేషన్లు అమలైతే నారీ లోకానికి తిరుగు ఉండదు. స్వేచ్ఛ రావాలి.. ప్రస్తుత రాజకీయాల్లో మహిళలు రాణిస్తున్నా.. పూర్తిస్థాయి స్వేచ్ఛ లేకుండా పోయింది. మహిళలకు ప్రత్యేక హోదా.. గౌరవం రావాలి. ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్న క్రమంలో స్వతహాగా నిర్ణయం తీసుకునే శక్తిగా ఎదగాలి. రాజకీయ రంగంతో పాటు ఉద్యోగ అవకాశాల్లో పురుషులతో సమాన అవకాశాలు రావాలి. పురుషుల చాటు మహిళలు కాకుండా, వారే నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలి. మహిళలకు అనేక చట్టాలు ఉన్నా, దాడులు, అత్యాచారాలు జరిగిన సమయంలో దుండగులు అందులో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని తప్పించుకుంటున్నారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.. మహిళలు ఆర్థికంగా బలపడే విధంగా ఏటా బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలి. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేసినప్పుడే వంటింటి చాటున ఉన్న వారు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతమున్న మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ఉద్యోగం చేస్తున్న మహిళల్లో మరింత ఆత్మ స్థ్యైర్యాన్ని కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్య క్రమాలను నిర్వహించాలి. భ్రూణహత్యలు, వరకట్న వేధింపులు లేకుండా ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేయాలి. -
కన్నీళ్లు దిగమింగుతూ.. కష్టాలతో పోరాడుతూ..
‘కష్టాలు రానీ.. కన్నీళ్లు రానీ.. ఏమైనా కానీ.. ఎదురేది రానీ.. ఓడిపోవద్దు.. రాజీపడొద్దు’ అన్నట్టుగా బతుకు పోరు సాగిస్తోంది. భర్త తోడు లేకపోయినా బిడ్డకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసినా ఏమాత్రం వెరవలేదు. కష్టాలను పంటి బిగువన దాచి గాజుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించడంతో పాటు తన కంటి పాప (కూతురు)కు వైద్యం అందిస్తూ ముందుకు సాగుతోంది అన్నం వెంకటరమణ. పాప ఆరోగ్యమే తన శ్వాస.. ధ్యాసగా జీవిస్తూ.. ద్వారకాతిరుమల గుడి సెంటర్లో బండిపై గాజుల వ్యాపారం చేస్తున్న వెంకటరమణ జీవిత గాథ ఆమె మాటల్లోనే.. నేను పుట్టి పెరిగింది ద్వారకాతిరుమలలో నే. చిన్ననాటి నుంచి కష్టాలతో పోరాడుతున్నా. సుమారు 15 ఏళ్ల క్రితం నా భర్త అన్నం సత్యనా రాయణ గుండెపోటుతో మృతిచెందారు. చంటిబిడ్డగా ఉన్న నా కూతురు జ్యోతికి తల్లి, తండ్రి నేనే అయ్యా. జ్యోతికి నాలుగేళ్ల వయసులో అకస్మాత్తుగా జ్వరం సోకింది. వైద్యులకు చూపిస్తే బ్లడ్ క్యాన్సర్ అన్నారు. నా గుండెల్లో రాయి పడినంత పనయ్యింది. అంతే అప్పటివరకు సజావుగా సాగుతోందని అనుకున్న నా జీవితంలో క ల్లోలం రేగింది. నా పరిస్థితి తెలిసిన బంధువులు క్యాన్సర్ సోకిన బిడ్డను ఎక్కడన్నా వదిలేయమన్నారు. అలా చేస్తే నీ పోషణ మేం చూస్తామ ని చెప్పారు. ఇందుకు నా మనసు ఒప్పలేదు నా లుగేళ్ల పాటు కంటికి రెప్పలా సాకిన పాపను వ దల్లేక పోయాను. ధైర్యంగా ముందుకు వెళ్లడమే మంచిదనిపించింది. బిడ్డ ప్రాణాలను కాపాడుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా బిడ్డకు పట్టెడన్నం పెట్టాలేకపోతున్నానన్న బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. చాలా సార్లు తిండి దొరక్క పస్తులు కూడా ఉన్నాను. ఎవరైనా చేయూత నిస్తారేమోనని ఆశగా ఎదు రు చూసేదాన్ని. నన్ను, నా బిడ్డను ఎవరూ ఆదరించలేదు సరికద.. నోరారా పలకరించేవారే క రువయ్యారు. దీనికి తోడు బిడ్డ జ్యోతి అనా రోగ్యం నన్ను మరింతగా కుంగదీసింది. జీవి తంపై విరక్తి చెందిన నేను ఒకానొక సందర్భం లో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా అయినా నా బిడ్డను ఒంటరి దానిని చేసి చావడానికి మనసొప్పలేదు. ఎలాగైనా సరే.. చావుకు దగ్గరవుతున్న బిడ్డను బతికించుకోవాలని బ లంగా నిర్ణయించుకున్నా. ధైర్యాన్ని కూడదీసుకుని నా తల్లిదండ్రులు చేసిన గాజుల వ్యాపారంతోనే ముం దుకు సాగాను. ఇప్పటికీ ద్వారకాతిరుమల గు డిసెంటర్లో గాజుల బండితో వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. జ్యోతికి ఏ లోటూ లేకుండా చూసుకోవాలన్నదే నా ఆశ. నా బిడ్డకు హైదరాబాద్‌లోని ఎంఎన్జీ ఆస్పత్రిలో క్యాన్సర్ చికిత్స చేయిస్తున్నా. ఇందుకు నెలకు దాదాపు రూ.8 వేల వరకు ఖర్చు అవుతోంది. అష్టకష్టాలు పడి ఆ డబ్బును సమకూర్చుకుంటున్నా. గాజులు అమ్మితేనే మా బతుకు బండి నడుస్తుంది. అన్‌సీజన్‌లో అప్పుల బాధ తప్పడం లేదు. ఇన్ని కష్టాలు భరిస్తూనే నా బి డ్డకు వైద్యం చేయిస్తూ, ప్రస్తు తం గ్రామంలోని సంస్కృతోన్న త పాఠశాలలో పదో తరగతి చదివిస్తున్నా. స్వయం కృషితో ముందుకు సాగుతున్నాను. పాపే నా ప్రాణం నేను ఇప్పటికీ బతుకుతుంది నా పాప జ్యోతి కోసమే. ఆ బిడ్డే లేకుంటే నేను లేను. ఆమెకు మంచి భవిష్యత్ కల్పించాలనో.. ఏమో.. ఆ భగవంతుడు నాకు ఇంకా కష్టపడే శక్తినిచ్చాడు. ఉదయం జ్యోతిని పాఠశాలకు పంపిన తర్వాత వంట చేసుకుని గాజుల వ్యాపారానికి వెళతాను. సాయంత్రం వరకు వ్యాపారం చూసుకుని ఇంటికి చేరతాను. బడి నుంచి వచ్చిన జ్యోతికి కష్టాలు చెప్పుకుని సేదతీరుతుంటాను. ఒకరి కోసం ఒకరం జ్యోతి నేను ఒకరి కోసం ఒకరం అన్నట్టుగా జీవిస్తున్నాం. నా బిడ్డ భవిష్యత్‌కు బంగారు బాట వేయాలన్నదే నా సంకల్పం. అందుకు ఇంకెన్ని కష్టాలైనా భరిస్తాను. ప్రస్తుతం జ్యోతి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆమెకు మంచి చదువు చెప్పించి, ఓ అయ్య చేతిలో పెట్టాలన్నదే నా ఆకాంక్ష. మగతోడు లేకుండా ఇక్కడివరకు బతుకు బండిని నెట్టుకొచ్చా. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడన్న ధైర్యంతో ముందుకు సాగుతున్నా. ఓ పక్క భర్త చనిపోయి పుట్టెడు కష్టంలో ఉన్న నా జీవితంలో బిడ్డకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసి మరింత కల్లోలం రేగింది. నా పరిస్థితి చూసి బిడ్డను ఎక్కడన్నా వదిలేయి.. నీ పోషణ మేం చూస్తాం అంటూ బంధువులు ఉచిత సలహా ఇచ్చారు. నాలుగేళ్ల పాటు కంటికి రెప్పలా సాకిన పాపను వదల్లేకపోయాను. ధైర్యంగా ముందుకు వెళ్లడమే మంచిదనిపించింది. కుటుంబాన్ని పోషించడంతో పాటు బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడం సవాల్‌గా స్వీకరించా. -
విధిని ఎదిరించి..
చెన్నూర్ రూరల్: తోటి పిల్లలు చెంగు చెంగున ఎగురుతుంటే చిన్ని మనసు బాధపడింది. ఆడపిల్ల.. పైగా రెండు కాళ్లు లేవు.. ఎలా బతుకుతుందో ఏమోనని సమాజం జాలిపడుతుంటే మరింత పట్టుదల పెరిగింది. ఎలాగైనా తన అంగవైకల్యాన్ని జయించాలని నిశ్చయించుకుంది. కన్న వాళ్లకు భారమవకూడదని స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకుంది. అనంతరం దూరవిద్య ద్వారా పదో తరగతి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఆత్మస్థైర్యంతో అంగవైకల్యాన్ని జయించి.. వనితాలోకానికి ఆదర్శంగా నిలిచిన లక్ష్మి విజయమంత్రం ఆమె మాటల్లోనే.. మాది మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామం. అమ్మానాన్న ఎన్నం మల్లక్క, సమ్మయ్య. మేం మొత్తం ఆరుగురం సంతానం. వారిలో నలుగురు అమ్మాయిలం, ఇద్దరు అబ్బాయిలు. నేను రెండో కుమార్తెను. చిన్న వయస్సులోనే నాకు పోలియో సోకి రెండు కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. మాది నిరుపేద కుటుంబం. నా చిన్నతనంలో ఒక్కో రోజు పస్తులు కూడా ఉండాల్సి వచ్చేది. అంగవైకల్యం ఉండడంతో మనసులో చదువుకోవాలని ఉన్నా చదువుకోలేకపోయాను. అంగవైకల్యం ఉందని నన్నెప్పుడూ ఇంట్లో తిట్టలేదు. మా వాళ్లంతా నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ నేను ఎన్ని రోజులు వారికి భారంగా ఉండాలని అనిపించింది. ‘కుట్టు’ నేర్చుకుని.. సొంత కాళ్లపై నిలబడ్డా.. తల్లిదండ్రులకు ఏదో విధంగా నా వంతుగా సహాయం అందించాలనుకున్నా. ఆతర్వాత మిషన్ నేర్చుకుని అప్పు చేసి కుట్టుమిషన్ కొనుకున్నా. గ్రామంలోని బస్‌స్టాప్ సమీపంలో రూ.1000తో ఓ గదిని అద్దెకు తీసుకున్నా. చిన్నగా లేడీస్ టైలర్ ఏర్పాటు చేశా. దుస్తులు కుట్టగా వచ్చిన సొమ్ముతో అదే గదిలో చిన్నగా కంగన్‌హాల్, బట్టల షాప్‌ను ఏర్పాటు చేశా. ఆ తర్వాత కుటుంబానికి కొంత ఆసరయ్యా. ఇంకా ఏదో చేయాలనే తపన నన్ను వేధించేది. గ్రామంలోని మహిళలకు, యువతులకు కుట్టులో శిక్షణ ఇచ్చా. అంతటితో ఆగకుండా చిన్నప్పుడు చదువుకోవాలనే ఆశను నెరవేర్చుకోవాలనుకున్నా. దూరవిద్యలో చదువుకున్నా.. 2012లో దూరవిద్యలో పదో తరగతి చదివా. ప్రతీ ఆదివారం చెన్నూర్‌లోని బాలికల పాఠశాలలో ఓపెన్ తరగతులకు 40 వారాలు హాజరయ్యా. పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించా. 2013లో మా నాన్న సమ్మయ్య మృతి చెందాడు. 2016 ఏప్రిల్‌లో వికలాంగుల కోటా కింద మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించా. ఆగçస్టు 8న ఉద్యోగంలో చేరి ప్రస్తుతం రూ.15వేల వేతనంతో ఉద్యోగం చేస్తున్నా. అమ్మా, తమ్ముళ్లకు చేదోడు, వాదోడుగా ఉంటున్నా. అంగవైకల్యం మనసుకే కానీ మనిషికి కాదు. వికలాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. కుటుంబ అండ కూడా ఉండాలి. -
కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నా..
‘‘అమ్మాయిని ఒక విధంగా, అబ్బాయిని ఒక విధంగా చూడడం మంచి పద్ధతి కాదు. కొడుకైనా, కూతురైనా ఒక్కటే. కుటుంబంలో మహిళలను ప్రోత్సహించిన నాడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. వారి అభిరుచిని గుర్తించి సహకరిస్తే విజయాలు సాధించడంతో పాటు ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. మహిళా సాధికారతపై కుటుంబాల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది’’ – నెల్లూరు ఆర్డీఓ హరిత మనోగతం నెల్లూరు(వేదాయపాళెం): మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, చిన్నతనం నుంచే ఐఏఎస్ లక్ష్యంగా ముందుకు సాగుతూ కష్టపడి చదివి గ్రూప్ – 1 అధికారిగా డిప్యూటీ కలెక్టర్‌గా విజయం సాధించారు చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని దామలచెరువుకు చెందిన డీ హరిత. కడపలో ఆర్డీఓగా తొలిసారి ఉద్యోగంలో చేరిన ఆమె అనంతరం జిల్లాకు బదిలీ పై వచ్చారు. డ్వామా పీడీగా, నెల్లూరు ఆర్డీఓగా ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ పలువురి మ న్ననలు పొందుతున్నారు. ఆర్డీఓ హరిత మహిళా సాధికారత సాధన కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఎప్పటికైనా ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో పట్టుదలతో విధి నిర్వహణలోనూ అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఈ మేరకు సాక్షితో శనివారం తన మనోగతాన్ని పంచుకున్నారు. ప్ర: జీవితాశయంలో మీకు ఆదర్శప్రాయులు ఎవరు..? జ:మా నాన్నే నాకు ఆదర్శం. చిన్నతనం నుంచి ఐఏఎస్‌గా చూడాలనేది ఆయన ఆశయం. అయన ఆశయ సాధన కోసం శ్రమిస్తున్నా. మా నాన్న విశ్రాంత తహసీల్దార్ దామలచెరువు చిన్నయ్య, తల్లి నిర్మల న్యాయవాది. ప్ర: మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది..? జ: తిరుపతిలోని లిటిల్ ఏంజెల్స్ హైస్కూల్లో పదో తరగతి వరకు, తిరుపతిలోని క్యాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాను. విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్, చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో ఎంటెక్ చదివా. ప్ర: మీ కుటుంబ నేపథ్యం..? జ:అన్నయ్య హరికిశోర్ టాటా ప్రాజెక్ట్‌లో పనిచేస్తుండగా, తమ్ముడు హరికృష్ణ వ్యాపారంలో స్థిరపడ్డారు. 2012లో పెద్దల సమక్షంలో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నా. భర్త అనిల్‌కుమార్‌రెడ్డి వ్యాపారంలో రాణిస్తున్నారు. కుమారుడి పేరు ప్రణయ్ కార్తికేయ. ప్ర: అందుకున్న అవార్డులు, సత్కారాలు..? జ: తొలుత కడప ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన 2013– 14లో ఉత్తమ అధికారి గా అవార్డును అందుకున్నా. నెల్లూరులో డ్వామా పీడీగా చేస్తున్న సమయంలో పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విజయవాడలో ప్రశంసపత్రాన్ని పొందా. నెల్లూరు ఆర్డీఓ గా ఇటీవల జన్మభూమి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు మంత్రి నారాయణ చేతుల మీదుగా అవార్డును అందుకున్నా. ప్ర: మహిళా సాధికారతపై మీ అభిప్రాయం..? జ: కుటుంబంలో మహిళలను ప్రోత్సహించిన నాడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. మహిళలకు ఆయా రంగాల అభిరుచికి తగ్గట్లుగా కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తే మంచి విజయాలను సాధించడంతో పాటు ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అమ్మాయిని ఒక విధంగా, అబ్బాయిని ఒక విధంగా చూడటం మంచి పద్ధతి కాదు. కొడుకైనా.. కూతురైనా ఒక్కటే. మహిళలు ఉద్యోగాలు చేయకూడదనే భావన కొన్ని కుటుంబాల్లో నేటికీ ఉంది. ఇది పోవాలి. మహిళా సాధికారతపై కుటుంబాల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ప్ర: నెల్లూరు ఆర్డీఓగా మహిళల అభ్యున్నతికి చేపడుతున్న చర్యలు..? జ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను అన్ని వర్గాల మహిళలకు సక్రమంగా అందేలా చూస్తున్నా. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు నా వంతు కృషిని ఎల్లవేళలా అందిస్తా. ప్ర: కుటుంబంలో ప్రోత్సాహం ఎలా ఉంది..? జ: భర్త అనిల్‌కుమార్‌రెడ్డి ప్రోత్సాహం ఎంతో బాగుంది. దీనికి తోడు మా అత్తగారింట్లో ప్రతి ఒక్కరూ నన్ను గౌరవించడంతో పాటు ఉద్యోగ బాధ్యతలను నిర్వహించేందుకు ఎంతగానో ప్రో త్సాహం అందిస్తున్నారు. -
చివరికి కంచంలోనూ...
‘నేను శక్తి’ క్యాంపెయిన్ గురించి జయప్రద మాట్లాడుతూ... ‘‘సాక్షి’ చేస్తున్న ఈ కార్యక్రమం చాలా గొప్పది. ఈ ప్రయత్నం తప్పకుండా జయప్రదం కావాలి. ఎంతోమందిలో ఇది చైతన్యం తేవాలి’’ అన్నారు. ఆడ, మగ... రెండూ రక్తమాంసాలున్న శరీరాలే. ఆడ తక్కువ.. మగ ఎక్కువ ఎందుకు? కరెక్టే. దెబ్బ తగిలితే నొప్పి ఎవరికైనా ఒకటే. మగాళ్లకు తక్కువగా ఉంటుందా? లేదు కదా. మరి ఆడవాళ్లు ఎందుకు తక్కువ? మగవాళ్లు ఎందుకు ఎక్కువ? ఇది ఎవరికివాళ్లు వేసుకోవాల్సిన ప్రశ్న. ముఖ్యంగా ఆడవాళ్లు తక్కువ అని అనుకునేవాళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కడుపులో పడ్డ బిడ్డ ‘ఫీమేల్’ అనగానే నిర్దాక్షిణ్యంగా ఊపిరి ఆపేస్తున్నారు. చివరికి ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అని అభ్యర్థించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.. ‘ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే’ సెలబ్రేషన్స్‌ను ప్రతి ఏడాదీ ఘనంగా జరుపుకుంటున్నాం. ఆ వేడుకలు ఎందుకు? ఎవరి కోసం? సమాజంలో ఉన్న ఆడవాళ్లందరి పరిస్థితీ బాగుందనా? ఇప్పుడు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. వెయ్యి మంది మగపిల్లలుంటే ఆరేడు వందల మంది మాత్రమే ఆడపిల్లలు ఉంటున్నారు. ఆడపిల్లను కడుపులోనే చంపేస్తున్నారు. చూస్తూ ఉండండి... ఇప్పుడు కట్నం తీసుకుంటున్న అబ్బాయిలు భవిష్యత్తులో ఆడపిల్లల కొరత కారణంగా ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మీరు హర్యానా, రాజస్తాన్‌లను తీసుకుంటే అక్కడ భ్రూణ హత్యలు ఎక్కువ. ఆడపిల్ల ఏం పాపం చేసిందని భూమ్మీదకు రానివ్వకుండా చేస్తున్నారో? మగపిల్లాడైతే కట్నం తెస్తాడనా? కొన్ని సందర్భాల్లో ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులవుతున్నారు. కోడలి కడుపులో పడ్డది ఆడబిడ్డ అంటే అత్త కూడా వ్యతిరేకిస్తుంది. అందుకే ఆడవాళ్లలోనూ మార్పు రావాలి. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థలకు ఓ విన్నపం. లింగ నిర్ధారణ కూడదని ప్రభుత్వం ఓ నిబంధన పెట్టినప్పటికీ, కొన్ని చోట్ల దాన్ని ఉల్లంఘిస్తున్నారు. దయచేసి దాని మీద పోరాడండి. భాష కూడా మారిపోతుంది నా విషయంలో అజమ్ ఖాన్ చేసింది ఏంటి? నీచమైన ప్రచారానికి ఒడిగట్టాడు. క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. స్త్రీ అంటే ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక బొమ్మలా భావిస్తారు. ఈ గడ్డ మీద ప్రతి స్త్రీకి ప్రతి నిమిషం అగ్ని పరిక్షే. ఆమె గురించి మాట్లాడేటప్పుడు కొందరి భాష కూడా మారిపోతుంది. వాడే పదాలు ఘోరంగా ఉంటాయి. ఆ విధంగా సంతృప్తి పొందుతారు. ఖిల్జీకి దక్కకూడదనే పద్మావతి అలా చేసింది ఆడవాళ్లకు ఆత్మాభిమానం ఎక్కువ. రాణీ పద్మావతి అందుకు ఓ ఉదాహరణ. ఖిల్జీ నీడ కూడా తనను తాకకూడదని ఆత్మాహుతికి పాల్పడింది. పిరికితనంతో కాదు.. తెగువతో. తనంతట తాను ఇష్టపడి తీసుకున్న నిర్ణయం అది. ఖిల్జీకి దక్కి తాను ఓడిపోకూడదని, తనువు చాలించి, గెలిచింది. మన గడ్డ మీద ఉన్న స్త్రీ అంత పవిత్రమైనది. ఆడవాళ్లు గొప్ప పదవుల్లో ఉంటే.. ఆమెను వీలైనంతగా హింసించాలని చాలామంది ప్రయత్నిస్తారు. రాజకీయ నాయకురాలిగా మీరలాంటివి ఫేస్ చేశారు కదా? యస్.. మనం పెద్ద పదవుల్లో ఉంటే భరించలేరు. రామ్‌పూర్‌లో నేను పొలిటీషియన్‌గా అడుగుపెట్టినప్పుడు ఆడవాళ్లను లీడర్‌గా అంగీకరించే పరిస్థితులు లేవు. కానీ ప్రజల ప్రేమతో గెలిచాను. ప్రత్యర్థి పార్టీల సంగతి వదిలేయండి.. నా పార్టీలో ఉన్నవాళ్లే నన్ను సూటిపోటి మాటలనేవాళ్లు. యాసిడ్ ఎటాక్ చేస్తారని, చంపేస్తారని భయపడేదాన్ని. అలాంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. మనసులో భయం ఉన్నా ధైర్యంగా ముందుకెళ్లా. మేల్ డామినేషన్ ఉన్న ఈ సొసైటీలో ఆడవాళ్లు రాజకీయాల్లోకి రావాలి. ఇందిరా గాంధీ, జయలలితగార్లను జనాలు ఎప్పటికీ మరచిపోలేరు. ప్రజల ప్రేమ ఒక్కటి చాలు. ఎవరేం చేయాలనుకున్నా చేయలేరు. ఆడవాళ్ల ప్రతిష్టను మంటగలపాలంటే వాళ్ల క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడే ప్రబుద్ధులు చాలామంది ఉంటారు. అలాంటివారి గురించి ఏమంటారు? వాళ్లకు ‘ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్’ ఎక్కువ. అందుకే క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడతారు. నిండు సభలో జయలలితగారిని అలానే కదా చేయబోయారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. పట్టుదలతో అనుకున్నది సాధించారు. క్యారెక్టర్ తక్కువ చేసి మాట్లాడటం మొదలుపెడితే ఏ ఆడపిల్లకైనా బాధ ఉంటుంది. ఆ బాధలోంచి అభద్రతాభావం వస్తుంది. మానసికంగా కుంగిపోతుంది. అప్పుడు అనుకున్నది సాధించలేదు. అప్పుడు ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్‌తో బాధపడే మగవాడు తాను గెలిచినట్లుగా ఫీలవుతాడు. ఆ మగవాడి బుద్ధి అంత నీచమైనది. నా గురించి కూడా అవాకులు చెవాకులు పేలారు. పట్టించుకోలేదు. ఎందుకంటే పట్టించుకుని నేను వెనక్కి తగ్గితే, ఇంకొకరి గెలుపుకి కారణం అవుతాను. అలాగే మగవాళ్ల సక్సెస్‌ని వాళ్ల ప్రతిభతో, ఆడవాళ్ల సక్సెస్‌ని వాళ్ల అందానికి ఎక్కువగా ఆపాదించి, టాలెంట్‌కి తక్కువ స్పేస్ ఇస్తారు కొంతమంది... ఇది దౌర్భాగ్య పరిస్థితి. ఆడవాళ్ల ప్రతిభను అంగీకరించలేని కుంచిత మనస్తత్వాలు ఉంటాయి. ఆ మనుషులను ఏమీ చేయలేం. అయితే బయటకు ఎంత మాట్లాడినా మనసుకి తెలుస్తుంది కదా.. తాము మాట్లాడేది కరెక్ట్ కాదని. అది ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా, పాలిటిక్స్ అయినా.. ఏ ఫీల్డ్ అయినా ఆడవాళ్ల టాలెంట్‌ను అభినందించే వాళ్లు తక్కువ ఉంటారు. వాళ్ల సక్సెస్‌ని ప్రతిభకు తక్కువ, అందంతో ఎక్కువ ముడిపెట్టేస్తారు. అందుకే అంటున్నా... ‘అందంగా ఉండటం కూడా ఆడదానికి శాపమే’. అసలు ఆడవాళ్లంటేనే అందమైనవాళ్లు. అందుకే ప్రతి స్త్రీకి పోరాటం తప్పడంలేదు. నాలుగేళ్ల పాపలో ఏం అందం చూసి, రేప్ చేస్తున్నారు. ఎంత రాక్షసత్వం ఉండి ఉంటుంది. ఆ మనిషి ఎంత కఠినాత్ముడు అయ్యుంటాడు? వాళ్లను క్షమించవచ్చా? ‘నిర్భయ’ యాక్ట్ అంటున్నారు. కానీ నిర్భయంగానే ఇలాంటి పనులు చేస్తున్నారు. వాళ్లను ఎంత కఠినంగా శిక్షించాలంటే తప్పు చేయాలనుకున్నవాళ్ల వెన్నులో వణుకు పుట్టాలి. అవునూ... ఆడవాళ్లు ఎందుకు కట్నం ఇవ్వాలి? ఈ ప్రశ్న చాలాసార్లు వేసుకున్నాను. ఇలాంటి ఓ నియమం ఉంది కాబట్టే ఆడపిల్లను తల్లిదండ్రులు భారంగా అనుకుంటున్నారు. ఎక్కువ చదువులు చదివిస్తే ఆ చదువుకి తగ్గ వరుడ్ని తీసుకురావాల్సి వస్తుందని భయపడుతున్నారు. అంతేకానీ అమ్మాయి తన కాళ్లపై తను నిలబడుతుందని ఆలోచించడంలేదు. ‘డౌరీ యాక్ట్’ రావడంతో చాలామంది బతికిపోయాం. లేకపోతే ఆడవాళ్లను గుండెల మీద కుంపటిలా చూసేవాళ్లు. అయినా ఇప్పటికీ కట్నం వ్యవహారం సాగుతుందనుకోండి. ఒక పెళ్లి కుదరాలంటే కట్నం ‘డిసైడింగ్ ఫ్యాక్టర్’ అవుతోంది. పెళ్లనేది రెండు మనసులతో, ‘మాంగల్యం’తో ముడిపడుతుంది కానీ డబ్బుతోనే ఎక్కువ ముడిపడింది. బాధపడాల్సిన విషయం ఏంటంటే.. పుట్టింటి నుంచి మెట్టినింటికి కోడలిగా వచ్చే అమ్మాయి.. అత్త అయ్యే సమయానికి కట్నం ఆశిస్తోంది. కొందరు ఆడవాళ్లు ఇందుకు మినహాయింపు. ఏది ఏమైనా నిన్నటి కంటే ఇవాళ మార్పు వచ్చింది. కట్నం విషయంలో రేపు మరింత మంచి మార్పు వస్తుందనే నమ్మకం ఉంది. కొందరు మగవాళ్లు తమ ఇంటి ఆడవాళ్లను పరాయి మగాడు కన్నెత్తి చూడకూడదనుకుంటారు. వాళ్లు మాత్రం పరాయి ఆడవాళ్ల మీద కన్నేస్తారు... రావణాసురుడు ఏమయ్యాడు? సీతను అపహరించి మరీ తీసుకెళ్లాడు. అతనికి అవసాన దశ వచ్చింది కాబట్టే అలాంటి దుర్బుద్ధి పుట్టింది. పరాయి స్త్రీని ఆశించే ఏ మగాడి పరిస్థితి అయినా చివరికి అదే అవుతుంది. మీరు గమనించారో లేదో కానీ అనాధాశ్రమాల్లో దత్తత తీసుకునేటప్పుడు కూడా ఎక్కువమంది తల్లిదండ్రులు మగపిల్లలనే దత్తత తీసుకుంటుంటారు? ‘మాతృదేవోభవ’ సినిమా గుర్తొస్తోంది. ఆ సినిమాలో ముందు మగపిల్లలను దత్తత తీసుకుంటారు. బిడ్డలు లేనివాళ్లకు ఏ బిడ్డ అయినా ఒకటే. అయినా దత్తత తీసుకునేటప్పుడు మగబిడ్డను కోరుకుంటారు. మగబిడ్డ లేకపోతే అప్పుడు ఆడపిల్ల గురించి ఆలోచిస్తారు. నేను స్వయంగా ఇలాంటి సంఘటనలు చూశా. కొంతమందికి హితబోధ చేశాను కూడా. మగపిల్లాడైతే ఆదుకుంటాడనా? ఏం మగపిల్లలు తల్లిదండ్రులను నిర్దయగా వదిలేయడం మనం చూడటంలేదా? అయినా ఇంకా మారకపోతే ఎలా? దేశం కోసం పోరాడిన వీర నారీమణులు ఉన్న ఝాన్సీ లక్ష్మీబాయ్, రాణీ రుద్రమదేవి, పద్మావతి వంటి వాళ్లు తిరగాడిన ఈ గడ్డ మీద వివక్షా? అప్పుడు వాళ్లు కత్తి పట్టి దేశాన్ని రక్షించాలనుకున్నారు. ఆడవాళ్లు దేశాలనే పాలించగల సమర్థత ఉన్నవాళ్లు. వాళ్లను అణగదొక్కడమా? ఇదెక్కడి న్యాయం? కొన్ని ఇళ్లల్లో మగవాళ్లకు ముందు అన్నం పెట్టి, ఆ తర్వాత ఆడవాళ్లు తినడం జరుగుతుంది. ఆకలికి కూడా ‘జెండరా?’ ఇదెక్కడి న్యాయం? ఆడ కడుపు, మగ కడుపు అని ఉండదు కదా. ఆకలి ఒకటే. మగవాళ్లు తినేంతవరకూ ఆకలి భరించాలా? వాళ్లు తిన్న తర్వాత మిగిలితే తినాలా? సగం ఆకలే తీర్చుకోవాలా? కడుపు నిండా తినే అర్హత కూడా ఆడపిల్లకు లేదా? ఆకలిలోనూ వివక్షా? ఇదెంత దుర్మార్గం. కొన్ని ఇళ్లల్లో మగపిల్లలకు పౌష్టికాహారం పెట్టి, ఆడపిల్లకు తక్కువ పెడతారు. మగపిల్లలకు గ్లాసుడు పాలు ఇస్తారు. అమ్మాయికి కొన్ని చుక్కలు ఇస్తారు. మగాడి జన్మకు కారణం అవుతున్న ఆడపిల్లకు తక్కువ తిండా? ఆడపిల్ల చదువుకోకూడదా? ఎనిమిదో తరగతి వరకూ చదివిస్తే చాలని ఇప్పటికీ కొన్ని ఇళ్లల్లో అనుకుంటున్నారు. ఆడపిల్ల ఎడ్యుకేట్ అవ్వకూడదా? ఏం... ప్రశ్నిస్తుందని భయమా? హీరోలతో సమానంగా హీరోయిన్లకు పారితోషికం ఎందుకు ఇవ్వరు? ఈ ఒక్క విషయంలో కొంచెం న్యాయం మాట్లాడాలి. ఫెయిల్యూర్ ఎఫెక్ట్ ఎక్కువగా హీరోల మీదే పడుతుంది. అందుకని మనం ఈ పరిస్థితిని అంగీకరించాలి. అదే విధంగా హీరోయిన్ల కష్టం తక్కువ కాదని కూడా గ్రహించాలి. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో సాగడం అంటే అంత సులువు కాదు. అయినా మాకంటూ ఓ ప్రత్యేకత క్రియేట్ చేసుకోవాలి. ఆ ప్రత్యేకత కొన్ని తరాల పాటు గుర్తుండిపోయేలా ఉండాలి. అది సాధించగలిగితే మేం సక్సెస్ అయినట్లే. ప్రపంచం ప్రగతిపథంలో వెళుతున్న ఈ సమయంలో ‘సమానత్వం’ ఇంకా ప్రశ్నార్థకంగానే ఉండటం గురించి? పురాణాలకు వెళితే స్త్రీ–పురుషులు సమానమే అనేది గుర్తొస్తుంది. సీతారాములు, రాధాకృష్ణులు, పార్వతీపరమేశ్వరులు అన్నారు. పురాణాల్లో స్త్రీకి అంత విలువ ఉంది. మనం చాలా విషయాల్లో పురాణాలను ఆచరిస్తాం. కానీ స్త్రీ–పురుష సమానత్వం వచ్చేసరికి కొందరు పురాణాలను మరచిపోతారు. స్త్రీని దేవతలా భావించాల్సిన సంస్కృతి మనది. దేవతలా భావించడం పక్కన పెట్టండి.. కనీసం తమతో సమానంగా చూడ్డానికి కూడా ఇష్టపడటంలేదు. మారాలి.. మనిషి ఆలోచనా విధానం మారాలి. స్త్రీని చూసే విధానంలో మార్పు రావాలి. స్త్రీని సమానంగా చూసే ప్రపంచం రావాలి. – డి.జి. భవాని