కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నా.. | psr nellore rdo haritha special interview | Sakshi
Sakshi News home page

ఆశయం దిశగా పయనం

Published Sun, Feb 11 2018 8:16 AM | Last Updated on Mon, Feb 12 2018 4:04 PM

psr nellore rdo haritha special interview - Sakshi

ఆర్డీఓ హరిత, భర్త అనిల్‌కుమార్‌రెడ్డి

‘‘అమ్మాయిని ఒక విధంగా, అబ్బాయిని ఒక విధంగా చూడడం మంచి పద్ధతి కాదు. కొడుకైనా, కూతురైనా ఒక్కటే. కుటుంబంలో మహిళలను ప్రోత్సహించిన నాడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. వారి అభిరుచిని గుర్తించి సహకరిస్తే విజయాలు సాధించడంతో పాటు ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. మహిళా సాధికారతపై కుటుంబాల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది’ – నెల్లూరు ఆర్డీఓ హరిత మనోగతం

నెల్లూరు(వేదాయపాళెం): మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, చిన్నతనం నుంచే ఐఏఎస్‌ లక్ష్యంగా ముందుకు సాగుతూ కష్టపడి చదివి గ్రూప్‌ – 1 అధికారిగా డిప్యూటీ కలెక్టర్‌గా విజయం సాధించారు చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని దామలచెరువుకు చెందిన డీ హరిత. కడపలో ఆర్డీఓగా తొలిసారి ఉద్యోగంలో చేరిన ఆమె అనంతరం జిల్లాకు బదిలీ పై వచ్చారు. డ్వామా పీడీగా, నెల్లూరు ఆర్డీఓగా ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ పలువురి మ న్ననలు పొందుతున్నారు. ఆర్డీఓ హరిత మహిళా సాధికారత సాధన కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఎప్పటికైనా ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో పట్టుదలతో విధి నిర్వహణలోనూ అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఈ మేరకు సాక్షితో శనివారం తన మనోగతాన్ని పంచుకున్నారు.

ప్ర: జీవితాశయంలో మీకు ఆదర్శప్రాయులు ఎవరు..?
జ:మా నాన్నే నాకు ఆదర్శం. చిన్నతనం నుంచి ఐఏఎస్‌గా చూడాలనేది ఆయన ఆశయం. అయన ఆశయ సాధన కోసం శ్రమిస్తున్నా. మా నాన్న విశ్రాంత తహసీల్దార్‌ దామలచెరువు చిన్నయ్య, తల్లి నిర్మల న్యాయవాది.

ప్ర: మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది..?
జ: తిరుపతిలోని లిటిల్‌ ఏంజెల్స్‌ హైస్కూల్లో పదో తరగతి వరకు, తిరుపతిలోని క్యాన్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాను. విద్యానికేతన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్, చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో ఎంటెక్‌ చదివా.

ప్ర: మీ కుటుంబ నేపథ్యం..?
జ:అన్నయ్య హరికిశోర్‌ టాటా ప్రాజెక్ట్‌లో పనిచేస్తుండగా, తమ్ముడు హరికృష్ణ వ్యాపారంలో స్థిరపడ్డారు. 2012లో పెద్దల సమక్షంలో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నా. భర్త అనిల్‌కుమార్‌రెడ్డి వ్యాపారంలో రాణిస్తున్నారు. కుమారుడి పేరు ప్రణయ్‌ కార్తికేయ.

ప్ర: అందుకున్న అవార్డులు, సత్కారాలు..?
జ: తొలుత కడప ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన 2013– 14లో ఉత్తమ అధికారి గా అవార్డును అందుకున్నా. నెల్లూరులో డ్వామా పీడీగా చేస్తున్న సమయంలో పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా విజయవాడలో ప్రశంసపత్రాన్ని పొందా. నెల్లూరు ఆర్డీఓ గా ఇటీవల జన్మభూమి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు మంత్రి నారాయణ చేతుల మీదుగా అవార్డును అందుకున్నా.

ప్ర: మహిళా సాధికారతపై మీ అభిప్రాయం..?
జ: కుటుంబంలో మహిళలను ప్రోత్సహించిన నాడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. మహిళలకు ఆయా రంగాల అభిరుచికి తగ్గట్లుగా కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తే మంచి విజయాలను సాధించడంతో పాటు ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అమ్మాయిని ఒక విధంగా, అబ్బాయిని ఒక విధంగా చూడటం మంచి పద్ధతి కాదు. కొడుకైనా.. కూతురైనా ఒక్కటే. మహిళలు ఉద్యోగాలు చేయకూడదనే భావన కొన్ని కుటుంబాల్లో నేటికీ ఉంది. ఇది పోవాలి. మహిళా సాధికారతపై కుటుంబాల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది.

ప్ర: నెల్లూరు ఆర్డీఓగా మహిళల అభ్యున్నతికి చేపడుతున్న చర్యలు..?
జ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను అన్ని వర్గాల మహిళలకు సక్రమంగా అందేలా చూస్తున్నా. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు నా వంతు కృషిని ఎల్లవేళలా అందిస్తా.

ప్ర: కుటుంబంలో ప్రోత్సాహం ఎలా ఉంది..?
జ: భర్త అనిల్‌కుమార్‌రెడ్డి ప్రోత్సాహం ఎంతో బాగుంది. దీనికి తోడు మా అత్తగారింట్లో ప్రతి ఒక్కరూ నన్ను గౌరవించడంతో పాటు ఉద్యోగ బాధ్యతలను నిర్వహించేందుకు ఎంతగానో ప్రో త్సాహం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement