ద్వారకాతిరుమల గుడిసెంటర్‌లో గాజులు విక్రయిస్తున్న వెంకటరమణ
‘కష్టాలు రానీ.. కన్నీళ్లు రానీ.. ఏమైనా కానీ.. ఎదురేది రానీ.. ఓడిపోవద్దు.. రాజీపడొద్దు’ అన్నట్టుగా బతుకు పోరు సాగిస్తోంది. భర్త తోడు లేకపోయినా బిడ్డకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసినా ఏమాత్రం వెరవలేదు. కష్టాలను పంటి బిగువన దాచి గాజుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించడంతో పాటు తన కంటి పాప (కూతురు)కు వైద్యం అందిస్తూ ముందుకు సాగుతోంది అన్నం వెంకటరమణ. పాప ఆరోగ్యమే తన శ్వాస.. ధ్యాసగా జీవిస్తూ.. ద్వారకాతిరుమల గుడి సెంటర్‌లో బండిపై గాజుల వ్యాపారం చేస్తున్న వెంకటరమణ జీవిత గాథ ఆమె మాటల్లోనే..
నేను పుట్టి పెరిగింది ద్వారకాతిరుమలలో నే. చిన్ననాటి నుంచి కష్టాలతో పోరాడుతున్నా. సుమారు 15 ఏళ్ల క్రితం నా భర్త అన్నం సత్యనా రాయణ గుండెపోటుతో మృతిచెందారు. చంటిబిడ్డగా ఉన్న నా కూతురు జ్యోతికి తల్లి, తండ్రి నేనే అయ్యా. జ్యోతికి నాలుగేళ్ల వయసులో అకస్మాత్తుగా జ్వరం సోకింది. వైద్యులకు చూపిస్తే బ్లడ్ క్యాన్సర్ అన్నారు. నా గుండెల్లో రాయి పడినంత పనయ్యింది. అంతే అప్పటివరకు సజావుగా సాగుతోందని అనుకున్న నా జీవితంలో క ల్లోలం రేగింది. నా పరిస్థితి తెలిసిన బంధువులు క్యాన్సర్ సోకిన బిడ్డను ఎక్కడన్నా వదిలేయమన్నారు. అలా చేస్తే నీ పోషణ మేం చూస్తామ ని చెప్పారు. ఇందుకు నా మనసు ఒప్పలేదు నా లుగేళ్ల పాటు కంటికి రెప్పలా సాకిన పాపను వ దల్లేక పోయాను. ధైర్యంగా ముందుకు వెళ్లడమే మంచిదనిపించింది. బిడ్డ ప్రాణాలను కాపాడుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నా
ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా
బిడ్డకు పట్టెడన్నం పెట్టాలేకపోతున్నానన్న బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. చాలా సార్లు తిండి దొరక్క పస్తులు కూడా ఉన్నాను. ఎవరైనా చేయూత నిస్తారేమోనని ఆశగా ఎదు రు చూసేదాన్ని. నన్ను, నా బిడ్డను ఎవరూ ఆదరించలేదు సరికద.. నోరారా పలకరించేవారే క రువయ్యారు. దీనికి తోడు బిడ్డ జ్యోతి అనా రోగ్యం నన్ను మరింతగా కుంగదీసింది. జీవి తంపై విరక్తి చెందిన నేను ఒకానొక సందర్భం లో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా అయినా నా బిడ్డను ఒంటరి దానిని చేసి చావడానికి మనసొప్పలేదు. ఎలాగైనా సరే.. చావుకు దగ్గరవుతున్న బిడ్డను బతికించుకోవాలని బ లంగా నిర్ణయించుకున్నా. ధైర్యాన్ని కూడదీసుకుని నా తల్లిదండ్రులు చేసిన గాజుల వ్యాపారంతోనే ముం దుకు సాగాను. ఇప్పటికీ ద్వారకాతిరుమల గు డిసెంటర్‌లో గాజుల బండితో వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. జ్యోతికి ఏ లోటూ లేకుండా చూసుకోవాలన్నదే నా ఆశ. నా బిడ్డకు హైదరాబాద్‌లోని ఎంఎన్‌జీ ఆస్పత్రిలో క్యాన్సర్ చికిత్స చేయిస్తున్నా. ఇందుకు నెలకు దాదాపు రూ.8 వేల వరకు ఖర్చు అవుతోంది. అష్టకష్టాలు పడి ఆ డబ్బును సమకూర్చుకుంటున్నా. గాజులు అమ్మితేనే మా బతుకు బండి నడుస్తుంది. అన్‌సీజన్‌లో అప్పుల బాధ తప్పడం లేదు. ఇన్ని కష్టాలు భరిస్తూనే నా బి డ్డకు వైద్యం చేయిస్తూ, ప్రస్తు తం గ్రామంలోని సంస్కృతోన్న త పాఠశాలలో పదో తరగతి చదివిస్తున్నా. స్వయం కృషితో ముందుకు సాగుతున్నాను.
పాపే నా ప్రాణం
నేను ఇప్పటికీ బతుకుతుంది నా పాప జ్యోతి కోసమే. ఆ బిడ్డే లేకుంటే నేను లేను. ఆమెకు మంచి భవిష్యత్ కల్పించాలనో.. ఏమో.. ఆ భగవంతుడు నాకు ఇంకా కష్టపడే శక్తినిచ్చాడు. ఉదయం జ్యోతిని పాఠశాలకు పంపిన తర్వాత వంట చేసుకుని గాజుల వ్యాపారానికి వెళతాను. సాయంత్రం వరకు వ్యాపారం చూసుకుని ఇంటికి చేరతాను. బడి నుంచి వచ్చిన జ్యోతికి కష్టాలు చెప్పుకుని సేదతీరుతుంటాను.
ఒకరి కోసం ఒకరం
జ్యోతి నేను ఒకరి కోసం ఒకరం అన్నట్టుగా జీవిస్తున్నాం. నా బిడ్డ భవిష్యత్‌కు బంగారు బాట వేయాలన్నదే నా సంకల్పం. అందుకు ఇంకెన్ని కష్టాలైనా భరిస్తాను. ప్రస్తుతం జ్యోతి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆమెకు మంచి చదువు చెప్పించి, ఓ అయ్య చేతిలో పెట్టాలన్నదే నా ఆకాంక్ష. మగతోడు లేకుండా ఇక్కడివరకు బతుకు బండిని నెట్టుకొచ్చా. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడన్న ధైర్యంతో ముందుకు సాగుతున్నా.
ఓ పక్క భర్త చనిపోయి పుట్టెడు కష్టంలో ఉన్న నా జీవితంలో బిడ్డకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసి మరింత కల్లోలం రేగింది. నా పరిస్థితి చూసి బిడ్డను ఎక్కడన్నా వదిలేయి.. నీ పోషణ మేం చూస్తాం అంటూ బంధువులు ఉచిత సలహా ఇచ్చారు. నాలుగేళ్ల పాటు కంటికి రెప్పలా సాకిన పాపను వదల్లేకపోయాను. ధైర్యంగా ముందుకు వెళ్లడమే మంచిదనిపించింది. కుటుంబాన్ని పోషించడంతో పాటు బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడం సవాల్‌గా స్వీకరించా.
Comments
Please login to add a commentAdd a comment