కీచకుడి కాలం నుంచో ఇంకా ముందు నుంచో పనికి వెళ్లిన ప్రతి స్త్రీపైనా కామపు కళ్లు, వెకిలి మాటలు, తేళ్లై కుట్టే చేతులు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరింపులు, ఆ పైన తాయిలాలు ఆశ పెట్టి లొంగదీయడం. ఆమె బహుముఖ సామర్థ్యంతో పోటీ æపడలేక నీచమైన వ్యాఖ్యలు చేయడం, పదోన్నతి పొందకపోవడానికి తమ సోమరితనం కారణమనేది కప్పిపుచ్చి ‘ఆమె పడకలేసింది’ అనే పైశాచిక పుకార్లు.. నైపుణ్యంతో అధిగమించలేని దుగ్ధ లైంగిక వేధింపులుగా రూపాంతరం.. ఓ ‘మగతనపు ఆటవికత’. ఇంటి గడపే స్త్రీకి లక్ష్మణరేఖ.. వంటి కాలం చెల్లిన భావాలు పుణికిపుచ్చుకున్న ఆధునిక మనువులే ప్రతిచోటా.
పొలాల్లో, నిర్మాణంలో, గృహ పరిశ్రమల్లో ఒకటేమిటి.. అసంఘటిత రంగం నిండా స్త్రీలే. కడుపు నింపుకోవడం కోసం, కన్నబిడ్డల కోసం... అహరహం ఒళ్లు విరిగే చాకిరీ. అతి తక్కువ వేతనం. ఆపైన లైంగిక దోపిడీ. ప్రతి నిమిషం పనిపోతుందని భయం. ఎవరేం చేసినా భరించాలి. ఆకలి, అవసరం.. అభిమానాన్ని చంపుతాయి. రెక్కల కష్టం చేసే వీరి గౌరవం కాపాడటం.. ఉపాధికి – శరీరానికి భద్రత కల్పించటం ఎవరి బాధ్యత? ‘మనిషి’గా మర్యాదగా బతికే హక్కుకు హామీ ఏదీ?
భద్రమైన ఉద్యోగాలు చేసే చోట కూడా కుత్సితపు చూపుల వేటలే. ఎవరితో చెప్పుకోవాలి? ఎలా నిరూపించుకోవాలి? చెబితే నమ్ముతారా? అంతర్గత ఫిర్యాదుల కమిటీ గోప్యత పాటిస్తుందా? అందరికీ తెలిసి మరింత మందికి చులకనై మరికొందరు చెయ్యేస్తే? అతివల సంపాదనను పూర్తిగా ఆమోదించని కుటుంబం పరువు కోసం ఉద్యోగం వదిలేయమంటే? ఇపుడిపుడే విచ్చుకుంటున్న ‘స్వేచ్ఛ’ లేత రెక్కల్ని కత్తిరిస్తే? తననే అనుమానిస్తే? అసలు తానేమైనా తన దుస్తులతో హావభావాలతో ప్రవర్తనతో వాడికి అలుసిచ్చిందా? స్త్రీ కావడం వల్లే వెంటాడే ఎన్నో అపరాధ భావనలు... ఎన్నెన్నో ప్రతిబంధకాలు.. లక్షల సుడిగుండాలు. ఎలా బయటపడాలి? ఇంటా బయటా శాంతిగా బతికే దారేదీ?
చట్టం కూడా అసమానతకు చుట్టమే. ‘ఫిర్యాదు చేసిన లైంగిక వేధింపు నిరూపణ కాకపోతే దండనే’. ఏ చట్టం లోపలా లేని ఈ షరతు ఈ చట్టానికే ఎందుకు? అసలు బాధితులెవరిక్కడ? ఫిర్యాదు చేయకుండా హెచ్చరించడం నిరుత్సాహపరచడం కాదా? సుప్రీంకోర్టు ‘విశాఖ తీర్పు’ స్ఫూర్తికి తూట్లు పొడవడం కాదా? సుప్రీం తీర్పు తర్వాత సాగలాగిలాగి పదిహేనేళ్లకు ఏడ్చుకుంటూ తెచ్చిన ‘పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల (నివారణ – నిషేధం – పరిష్కార మార్గాలు, 2013) చట్టం’ ఎంతమేరకు అమలవుతోంది? అనుభవాల పాఠాలతో చట్టాన్ని తాజాపర్చుదాం. పదండి.. వేధింపులు లేని జీవితం కోసం.
సవాలక్ష సుడిగుండాలు
Published Sun, Feb 25 2018 12:01 AM | Last Updated on Sun, Feb 25 2018 12:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment