ఓ ‘హీరా’యిన్... ఫిల్మ్ ఫెస్టివల్ కథ
ఉత్తరాఖండ్‌కు చెందిన 80 ఏళ్ల హీరా దేవి గతేడాది ‘పైర్’ (చితి) అనే హిందీ చిత్రంలో ‘హీరోయిన్ ’గా నటించారు. ఆ చిత్రం ‘టాలిన్ బ్లాక్ నైట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’కు ఇండియా నుండి అధికారికంగా పోటీకి ఎంపికైంది కూడా. విషయం ఏమిటంటే – ఉత్తర ఐరో΄ాలోని ఎస్టోనియా దేశానికి రాజధాని అయిన టాలిన్ పట్టణంలో జరుగుతున్న ఆ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ రోజు (నవంబర్ 19) సాయంత్రం ‘పైర్’ను ప్రదర్శిస్తున్నారు. ఇక విశేషం ఏమిటంటే – చిత్ర దర్శకుడు వినోద్ కప్రీ తనతోపాటుగా హీరా దేవిని ఎస్టోనియా తీసుకువెళ్లేందుకు ఎట్టకేలకు ఆమెను ఒప్పించగలిగారు. చిత్ర బృందంతో కలిసి హీరాదేవి ఆదివారం ఎస్టోనియా విమానం ఎక్కేశారు. అదేం విశేషం అంటారా? తన బర్రెను వదలి తను వచ్చేదే లేదని హీరా దేవి మొరాయించారు మరి!
అసలు ‘ఫైర్’ చిత్రంలో నటించే ముందు కూడా ఆమె ఒక పట్టాన ఊరు దాటేందుకు అంగీకరించలేదు. ‘‘షూటింగ్ కోసం రోజూ నేను మీతో వచ్చేస్తుంటే ఇక్కడ నా బర్రెను ఎవరు చూసుకుంటారు?’’ అని ఆమె ప్రశ్న. ఇప్పుడు ఎస్టోనియా వెళ్లటానికి ఆమె అడుగుతూ వచ్చిన ప్రశ్న కూడా అదే.. ‘‘మీతోపాటు విమానం ఎక్కేస్తే ఇక్కడ నా బర్రెను ఎవరు చూసుకుంటారు?’’ అని! ‘‘నేను తప్ప నా బర్రెకు ఎవరూ లేరు, నేను రాలేను..’’ అని కరాకండిగా చెప్పేశారు హీరా దేవి. ఆమె నిరాకరణ సమంజసమైనదే.
హీరా దేవి ఉంటున్నది ‘గడ్టిర్’ అనే మారుమూల గ్రామంలో. ఆమె, ఆమె బర్రె తప్ప ఆ ఇంట్లో ఎవరూ ఉండరు. ఇంట్లోనే కాదు, ఆ ఊళ్లో జనం ఉండేది కూడా తక్కువే. అంతా వేరే ఊళ్లకు వలస వెళ్లిపోయారు. హీరా దేవి కూతురు కూడా అక్కడి కి 30 కి.మీ. దూరంలోని బరణి గ్రామంలో ఉంటోంది. హీరా దేవి ఇద్దరు కొడుకులు ఢిల్లీలో స్థిరపడిపోయారు. చివరికి ఆమె పెద్ద కొడుకు చేత చెప్పించి ‘పైర్’లో హీరోయిన్‌పాత్రలో నటించేందుకు ఒప్పించారు చిత్ర దర్శకుడు కప్రీ.
‘పైర్’ 80 ఏళ్ల వయసులో ఉన్న దంపతుల ప్రేమ కథ. ఉత్తరాఖండ్‌లోని మున్శా్యరీ గ్రామంలోని ఒక నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం స్క్రీన్ ప్లేను 2018లోనే రాసి పెట్టుకున్నారు వినోద్ కప్రీ. స్థానిక నటుల కోసం వెతకులాటతోనే ఇన్నేళ్లూ గడిచిపోయాయు. ఆఖరికి.. ‘గడ్టిర్’ గ్రామంలో పసుగ్రాసం కోసం అడవికి వెళుతుండే కొందరు మహిళల ద్వారా హీరా దేవి చలాకీగా ఉంటారని, చక్కగాపాడతారని, భావాలను ముఖంలో భలేగా ఒలికిస్తారని తెలుసుకున్న కప్రీ.. హీరోయిన్ పాత్రకు హీరా దేవిని ఎంపిక చేసుకున్నారు. హీరోగా మున్శా్యరీ గ్రామంలో నాటకాలు వేస్తుండే మాజీ సైనికుడు పదమ్ సింగ్‌ని తీసుకున్నారు. ‘పైర్’లో ఇద్దరూ చక్కగా నటించారు. చిత్రానికి మంచి ఆర్ట్ మూవీగా పేరొచ్చింది. ఆ చిత్రాన్నే ఇవాళ ఎస్టోనియాను ప్రదర్శిస్తున్నారు.
ఇంతకీ – హీరా దేవి తన బర్రెను వదిలిపెట్టి ఎస్టోనియా వెళ్లేందుకు ఎలా అంగీకరించారు?! బర్రెను తను చూసుకుంటానని తల్లికి హామీ ఇచ్చి కూతురు ఆదివారం ఉదయం ఊళ్లోకి దిగగానే... బర్రె కంఠాన్ని ప్రేమగా, మృదువుగా నిమిరి, వెనక్కు తిరిగి తిరిగి బర్రె వైపు చూసుకుంటూ ఎస్టోనియా వెళ్లటం కోసం ఊళ్లోంచి బయటకు అడుగు పెట్టారు హీరా దేవి.
Comments
Please login to add a commentAdd a comment