చండీ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే కోరికన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మాతృదేవత అనుగ్రహంతో లక్ష్మీదేవి, పార్వతీ దేవి, సరస్వతి దేవి కలిసి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించారు. త్రిశక్తి స్వరూపిణి అయిన మహాచండీని ప్రార్థిస్తే సర్వదేవతలనూ కొలిచినట్లేనని భక్తుల విశ్వాసం. సింహ వాహనంపై కొలువుదీరిన మహాచండీ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాచండీ రూపంలో ఉన్న అమ్మవారిని ప్రార్ధిస్తే విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారతారన్న ప్రతీతి ఉంది.
మరోవైపు పలు పుణ్యక్షేత్రాల్లో ఈ రోజు అమ్మవారిని స్కందమాతగా ఆరాధిస్తారు. ఈ అవతారంలో బాల కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని అమ్మవారు దర్శనమిస్తుంది. శివగణాలకు స్కందుడు సైన్యాధిపతి. పైగా జ్ఞానానికి కూడా అధిపతి. ఇక అమ్మవారేమో తన చల్లని చూపుతో సకల ఐశ్వర్యాలనూ అనుగ్రహించే తల్లి. అందుకే ఈ స్కందమాతని పూజిస్తే అమ్మవారితో పాటూ కుమార స్వామి ఆశీస్సులూ లభిస్తాయని పండితులు చెబుతారు.
‘స్కందయతీతి శత్రూన్ శోషయతీతి స్కందః’
శత్రువులను శోషింపచేయువాడు కనుక పార్వతీ తనయుడికి స్కందుడు అని పేరు. ఈయనకే కార్తికేయుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు అని పలు పేర్లు కలవు. స్కందుని తల్లికావడం వల్లే అమ్మవారికి ‘స్కంద మాత’ అని పేరు. నవదుర్గలలో ఇది ఐదో రూపం.
సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా
శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ॥
స్కందమాత వాహనం సింహం. తెల్లని రంగుతో ప్రకాశిస్తూ నాలుగు చేతులు, మూడు నేత్రాలు కలిగి ఉంటుంది. తన కుమారుడైన బాలస్కందుడిని ఒక చేతితో ఎత్తుకుని, రెండు చేతుల్లో పద్మాలు ధరించి, మరో చేతితో అభయమిస్తూ కనిపిస్తుంది. స్కందమాత సకల శుభాలనూ అనుగ్రహిస్తుంది. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇంద్రియ నిగ్రహంతో, మానసిక ఏకాగ్రతతో, నిస్వార్థంగా ఆరాధించే భక్తులకు ఇహపర సుఖాలను, ముక్తిని ప్రసాదిస్తుంది.
నైవేద్యం: పులిహోర, రవ్వకేసరి, గారెలు
Comments
Please login to add a commentAdd a comment