సమాజంలో ఆడవాళ్ల పై జరుగుతున్న లైంగిక దాడుల గురించి నటి ఖుష్బూతో ‘సాక్షి’ స్పెషల్ ఇంటర్వ్యూ.
స్త్రీ వస్త్రధారణ సరిగ్గా లేకపోవడంవల్ల కూడా దాడులు జరుగుతున్నాయన్నది కొందరి ఒపీనియన్.. మీరేమంటారు?
ఎనిమిదేళ్ల పాపపై అత్యాచారం జరిగింది. 67 ఏళ్ల వృద్ధురాలిపైనా లైంగిక దాడి జరిగింది. వారు ఎలాంటి బట్టలు వేసుకున్నారని అలా జరిగింది. 88ఏళ్ల తల్లిని 45ఏళ్ల కొడుకు రేప్ చేశాడు. ఆ వయసులో ఆ తల్లి ఎలాంటి బట్టలు వేసుకుని ఉంటుంది? వయసు మీద పడి, వాడిపోయిన ఆమె శరీరం కనిపిస్తే వేరే ఆలోచనలు వస్తాయా? చూసే కళ్లల్లో తేడా ఉంటే ఎదుటి వ్యక్తి నిండుగా కప్పుకున్నా చెడ్డ ఆలోచనలే వస్తాయి.
పైన చెప్పిన ఉదాహరణలన్నీ మనుషులు చేయదగ్గవేనా? మనిషి రూపంలో ఉన్న మృగాలు వాళ్లు. అయినా మన దగ్గరే బట్టల గురించి మాట్లాడుతున్నాం. విదేశాల్లో మొత్తం కురచ దుస్తులే వేసుకుంటారు. రోడ్డు మీద వాళ్లు వెళుతుంటే ఎవరూ పట్టించుకోరు. మనకు మాత్రం చాలా వింతగా ఉంటుంది. చూసే దృష్టి మారాలి. బుద్ధి మారాలి.
ఆ మధ్య వైజాగ్‌లో ఓ అమ్మాయిని రోడ్డు మీద రేప్ చేస్తుంటే జనాలు చూస్తూ ఉండిపోయారు. ఈ సంఘటన వినే ఉంటారు. కామన్ పీపుల్‌కి మీరిచ్చే సందేశం ఏంటి?
చూస్తూ నిలబడ్డానికి అక్కడేమైనా వినోదం జరిగిందా? అరాచకం జరిగినప్పుడు ఆపాల్సిన బాధ్యత లేదా? ఇవాళ అక్కడ ఉన్నది మన ఇంటికి సంబంధించిన అమ్మాయి కాకపోవచ్చు.. రేపు మన అమ్మాయి అవ్వొచ్చు. ‘ప్రతి స్త్రీ మన ఇంటి సభ్యురాలే’ అనుకుంటే చాలు. ఆ ్రïస్తీకి అన్యాయం చేయాలనుకునేవాళ్లు చేయలేరు.
ఒకవేళ ఎవరైనా చేసినా మిగతావాళ్లు చూస్తూ ఉండలేరు. ఇంటి నుంచి రోడ్డు మీదకు వచ్చాక మన కళ్లెదుటే జరగరానిది జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలబడాలి. లేకపోతే ‘మేం ఈ దేశ పౌరులం’ అని చెప్పుకునే అర్హత మనకు లేదు. ఒకవేళ పట్టించుకుంటే మనకేదైనా జరుగుతుందేమోనని భయం. ఆ మైండ్‌సెట్ మారాలి.
లో క్లాస్ ఆఫీసుల నుంచి హై క్లాస్ ఆఫీసుల వరకూ లైంగిక వేధింపులకు గురయ్యే ఆడవాళ్ల సంఖ్య చాలానే ఉంటుంది. ‘ఉద్యోగంలోంచి తీసేస్తా’ వంటి బెదిరింపులు ఎదుర్కొంటుంటారు. వాళ్ల గురించి?
మన వ్యక్తిగత మర్యాదను కాపాడుకోవడంకన్నా ఏ ఉద్యోగమూ గొప్పది కాదని నా అభిప్రాయం. ఉద్యోగం తప్పనిసరి అయిన పరిస్థితుల్లో కూడా రాజీపడకూడదు. ఎందుకంటే, ఒక్కసారి ‘యస్’ చెబితే అక్కడున్నంతకాలం అన్నింటికీ ఆమోదించాల్సిందే. అందుకే ‘నో’ చెప్పడం నేర్చుకోవాలి. ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు కుదరదని నిర్మొహమాటంగా చెప్పేయొచ్చు. వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు.
కానీ ‘నో’ చెప్పలేని పరిస్థితుల్లో వేరేవాళ్లు ఉంటారు. వాళ్లే ‘సెక్స్ వర్కర్స్’. వాళ్లంటే నాకు గౌరవం ఉంటుంది. ఎందుకంటే వేరే ఏ దారీ దొరక్క తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆ పని చేస్తున్నామని వాళ్లు బాహాటంగానే చెబుతుంటారు. ఏ స్త్రీ కూడా తన శరీరాన్ని ఇష్టపూర్వకంగా అమ్ముకోదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అలా చేస్తుంది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వేధిస్తారని నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌పై హాలీవుడ్ నటి ఆష్లే జడ్ ఆరోపణలు చేశాక చాలామంది ‘మీటూ’ అంటూ తమకెదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. మీకలాంటి సంఘటనలు ఏమైనా?
టీనేజ్‌లో నేను సినిమాల్లోకొచ్చాను. ముంబై నుంచి ఇక్కడికొచ్చినప్పుడు ఇక్కడి పద్ధతులు తెలియవు. ఇక్కడి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో కూడా తెలియదు. లక్కీగా నాకు ఎలాంటి వేధింపులు ఎదురు కాలేదు. కెరీర్ మొత్తం స్మూత్‌గా సాగింది. అయితే ‘అన్‌లక్కీ’ పీపుల్ ఉంటారు. వాళ్లు వేధింపులు ఎదుర్కొన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ‘నో’ చెప్పగలగడం. స్టార్టింగ్‌లోనే ‘నో’ చెప్పేశామనుకోండి.. ఇక్కడ ఉండనిస్తే ఉండనిస్తారు. లేకపోతే లేదు. వేరే ప్రొఫెషన్‌ని ఎంపిక చేసుకోవచ్చు.
ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు.. గుడిలాంటి పాఠశాలల్లో మంచి మార్కులు వేసి, పాస్ చేస్తానంటూ స్టూడెంట్స్‌ని ట్రాప్ చేయడానికి ట్రై చేసే టీచర్స్ గురించి తెలిసినప్పుడు మీకేమనిపిస్తుంది?
నా రక్తం ఉడికిపోతుంది. అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసేయాలనిపించేంత కసి. ఏమీ చేయలేం. మన పిల్లలు ఎక్కువ టైమ్ గడిపేది స్కూల్స్‌లోనే. అమ్మ లేని చోట పిల్లలను గైడ్ చేయడానికి టీచర్ ఉంటారంటారు. అలాంటి టీచర్సే ద్రోహం చేస్తుంటే ఇక పిల్లల్ని నమ్మి ఎక్కడికి పంపించాలి? స్కూల్‌కి పంపించాలంటే భయం. హాస్టల్‌లో ఉంచాలంటే భయం. ఎవర్ని నమ్మాలి? అందుకే పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో ఎక్కువగా మాట్లాడాలి. స్కూల్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలి.
ఒకవేళ మూడీగా ఉంటే ఎందుకలా ఉన్నారో అడిగి తెలుసుకోవాలి. స్కూల్‌కి వెళ్లనని మొండికేస్తే బలవంతంగా పంపించేయకూడదు. అలా ఎందుకు చేస్తున్నారో ఆలోచించాలి. ఇంట్లో చెబితే నిన్ను ఫెయిల్ చేస్తామని టీచర్ బెదిరించి ఉండొచ్చు. అందుకే పదే పదే అడిగి, విషయం రాబట్టాలి. ముఖ్యంగా పిల్లల ప్రవర్తనలో మార్పొస్తే ఏదో జరగకూడనిది జరిగిందని గ్రహించాలి. అందుకే పిల్లల కోసం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి.
ఆడవాళ్లకు మీరిచ్చే సందేశం?
సందేశాలు ఇచ్చేంత కాదు కానీ.. నా మనసుకి తోచిన విషయాలు చెబుతాను. ఆత్మాభిమానం వదులుకోవాల్సి వచ్చే పరిస్థితులను సవాల్ చేయండి. తలొంచకూడదు.. తలెత్తుకునేలా మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోండి. ఎదుటి వ్యక్తి దాడి చేస్తున్నాడనగానే భయపడి సహాయం కోసం అరవకండి. తిరగబడండి. మీ కళ్లెదుట ఉన్నది మీలాంటి మనిషే అనే విషయాన్ని మరచిపోవద్దు.
ఓవైపు నిర్మాతగా అప్పుడప్పుడు నటిగా చేస్తున్నారు. మీ ఇద్దరు కూతుళ్లకు తగినంత టైమ్ స్పెండ్ చేస్తుంటారా?
ఇప్పుడు ఒక పాప టెన్త్, మరో పాప ట్వెల్త్ చదువుతున్నారు. చిన్నప్పుడు స్కూల్‌కి డ్రాప్, పికప్ నేనే. ఇప్పుడు వాళ్లే వెళతారు. మొదటి నుంచీ నా పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఆ రోజంతా ఏం జరిగిందో చెప్పే అలవాటు చేశాను. నేను పికప్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు కారులో వచ్చేటప్పుడే అన్ని విషయాలూ అడిగి తెలుసుకునేదాన్ని.
ఇప్పుడు నా పని మీద బిజీగా ఉండి, ఇంట్లో లేకపోతే స్కూల్ నుంచి రాగానే ఫోన్ చేస్తారు. ‘ఈరోజు చాలా మూడీగా గడిచిందమ్మా’ అంటే.. ఎందుకు? అని అడుగుతాను. ‘హ్యాపీగా గడిచింది’ అంటే కూడా కారణం అడుగుతాను. నా పిల్లల మూడ్స్ మీద నేను ఓ దృష్టి పెడతాను. అలాగని వాళ్లకు ఆంక్షలు పెట్టను. స్వేచ్ఛ లేకుండా చేయను. తల్లిగా ఓ కంట కనిపెడతా. అంతే.
ఇంతకుముందు స్కూల్ గురించి మాట్లాడుకున్నాం. స్కూల్‌లాంటి పవిత్రమైన మరో ప్లేస్ ‘హాస్పిటల్’. అక్కడ పేషెంట్స్‌ని కూడా కొందరు డాక్టర్స్ వదలని సంఘటనలు బయటికొచ్చాయి. అంత చదివినవాళ్లు కూడా అలా అంటే కారణం ఏమంటారు?
పెరిగిన వాతావరణం ముఖ్య కారణం. ప్రాణం పోయాల్సిన డాక్టర్ దయనీయ స్థితిలో ఉన్న పేషెంట్‌పై లైంగిక దాడికి పాల్పడుతున్నాడంటే అతను డాక్టర్ ఎలా అయ్యాడు? అనిపిస్తుంది. చదువు.. సంస్కారం నేర్పిస్తుందంటారు. మరి.. ఆ చదువు ఎక్కడికి పోయినట్లు? ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోయి ఉండొచ్చు.
ఇంట్లో ఆడవాళ్లను మగవాళ్లు ఎలా ట్రీట్ చేస్తారన్నది చాలా ముఖ్యం. వాళ్లు చులకనగా చూస్తే.. ఆడవాళ్లను అవమానించడం, వాళ్ల పట్ల అమానుషంగా ప్రవర్తించడం తమ ‘బర్త్ రైట్’ అని అబ్బాయిలు అనుకుంటారు. పరాయి స్త్రీపై దాడి చేయాలనుకోవడానికి ఇదో కారణం అయ్యిండొచ్చు. అందుకే ఆడపిల్లల పెంపకం విషయంలో జాగ్రత్త తీసుకున్నట్లే మగపిల్లలను కూడా కేర్‌ఫుల్‌గా పెంచాలి. ఆడవాళ్ల విలువ చెప్పాలి.
దాడులు జరగడం సరే.. కొందరు ఆడవాళ్లు తమంతట తాము మాయలో పడిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ భక్తి పేరుతో ఏ స్వామీజీని పడితే ఆ స్వామీజీని నమ్మడంలాంటివి..
ఇదైతే చర్చించాల్సిన విషయం. దేవుడు ఉన్నాడని నమ్ముతాం. దేవుడి సహాయం కోరతాం. దేవుడి మీద నమ్మకం పోతే అది మూఢ నమ్మకం అవుతుందని నా ఒపీనియన్. ఆ మూఢ నమ్మకమే వాళ్లను నమ్మకూడని వాళ్లను నమ్మేలా చేస్తుంది. పిల్లలు పుట్టాలంటే స్వామీజీ ఎలా చెబితే అలా చేయాలట? అవన్నీ కూడా చేయదగ్గ పనులు కాదు. అప్పుడైనా అతనెలాంటివాడో గ్రహించాలి కదా. గుర్మీత్ రామ్ రహీమ్ చేసిన అకృత్యాలు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అందుకే ఎవర్ని నమ్ముతున్నామన్నది ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి.
సమాజంలో జరిగేవే సినిమాల్లో కనిపిస్తున్నాయా? సినిమాలు చూసి చేస్తున్నారా? కొన్ని సినిమాలు చెడు దారి పట్టిస్తున్నాయనే విమర్శకు మీ సమాధానం?
సమాజంలో జరిగేవే సినిమాల్లో చూపిస్తున్నాం. మీరు ఏ సినిమా తీసుకున్నా.. లవ్, ఫ్యామిలీ, యాక్షన్.. ఇలా ఏ జానర్ తీసుకున్నా.. ఫైనల్‌గా ‘చెడుని మంచి గెలవడం’ అనే పాయింట్‌తోనే సినిమా ఎండ్ అవుతుంది కదా. అన్ని సినిమాల్లో చెప్పే ఇంత సింపుల్ మెసేజ్‌ని గుర్తించలేకపోతున్నారా? విలనే కదా ఓడిపోతున్నాడు. సినిమాలో ఉన్న మంచిని తీసుకుని చెడుని వదిలేయొచ్చు కదా. చెడు మార్గంలో వెళ్లాలనుకునేవాళ్లు చెడుని తీసుకుంటారు. అలాంటివాళ్లు సినిమాలు చూసి మాత్రమే చెడిపోరు. స్వతహాగా వాళ్లల్లో చెడు ఉంటుంది.
సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఇద్దరు ఆడపిల్లల తల్లిగా కూతుళ్లు పుట్టినందుకు ఎప్పుడైనా బాధపడ్డారా?
నెవర్. చాలా ఆనందంగా ఉన్నాను. నేను, మా ఆయన (దర్శకుడు–నటుడు సుందర్. సి) ఆడపిల్లలు పుట్టాలనే కోరుకున్నాం. మేం లక్కీ. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక మగపిల్లాడు కావాలని కూడా అనుకోలేదు. ఏం ఆడపిల్లలు మన రక్తం కాదా? మరి.. మగపిల్లలనే ఎందుకు వారసులుగా ప్రకటిస్తున్నాం. మన కడుపున పుట్టిన మగబిడ్డ ఒంట్లో ఉండేదీ మన రక్తమే.. ఆడబిడ్డ ఒంట్లోదీ ఉండేది మన రక్తమే. అలాంటప్పుడు ఎందుకీ తేడా?
ఫైనల్లీ.. పూటకో లైంగిక వేధింపుల గురించి వింటున్నాం. ఇవి ఆగాలంటే ఏం చేయాలి?
చట్టరీత్యా పెద్ద దండన దొరుకుతుందనే భయం లేదు. అందుకే ఫ్రీగా ఉంటున్నారు. అరెస్ట్ చేసినా బెయిల్ మీద బయటికి వచ్చేయొచ్చనే ధీమా. నాన్–బెయిలబుల్ వారెంట్‌తో అరెస్ట్ చేయాలి. నేరం రుజువైతే శిక్ష వెంటనే పడాలి. పదీ పన్నెండేళ్లు లాగకూడదు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో తీర్పు చెప్పాలి. ‘క్యాపిటల్ పన్మిష్‌మెంట్’ ఇవ్వాలి. ఇలా చేస్తేనే నేరాలు కొంతైనా తగ్గుతాయి. లా స్ట్రిక్ట్‌గా ఉండాలి.
తమిళనాడులో ఓ చిన్నారి రేప్ విషయంలో ఇలానే జరిగింది కదా?
తను ఏడేళ్ల పాప. చట్ట ప్రకారం బాధితుల పేరు మనం చెప్పకూడదు. నేరగాడి పేరు చెబుతాను. అతని పేరు ధశ్వంత్. ఏడేళ్ల పాపను రేప్ చేసి, చంపేశాడు. అతనికి న్యాయస్థానం మరణ శిక్ష విధించాలని తీర్పు ఇచ్చింది. ఈ కేస్ ఏళ్ల తరబడి సాగలేదు. ఏ కేస్ అయినా ఇంత త్వరగా మూవ్ అయితే బాగుంటుంది.
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment