నాలుగు 'గోడు'లు | interview with nadiya | Sakshi
Sakshi News home page

నాలుగు 'గోడు'లు

Published Sun, Feb 18 2018 1:56 AM | Last Updated on Sun, Feb 18 2018 10:52 AM

interview with nadiya - Sakshi

నాలుగు గోడల మధ్య ఉండాల్సినవి నాలుగు గోడల మధ్యే ఉండాలని ఆడపిల్లకు చెప్పి మరీ మెట్టినింటికి పంపిస్తారు. అందుకేనేమో ఆడపిల్ల నాలుగు గోడలకే అన్ని గోడులు చెప్పుకుంటుంది.   ఇది మారాలి అంటున్నారు నదియా.


గృహ హింస కొందరి ఆడవాళ్లకు ‘జీవన్మరణ సమస్య’. మీరు ఇలాంటి సంఘటనలను స్వయంగా చూశారా?
చూడలేదు కానీ విన్నాను. నిజానికి ఇంట్లో ఇలాంటి హింస జరుగుతోందంటే చాలామంది నమ్మరు. ఎందుకంటే ఇంట్లో ఏం జరుగుతోందో ఎవరూ ఊహించలేం. కొన్నిసార్లు అమ్మాయి చెప్పినదానికన్నా ఎక్కువ హింస∙జరిగి ఉండొచ్చు. కొన్నిసార్లు తక్కువ జరిగి ఉండొచ్చు. తక్కువ.. ఎక్కువ అని కాదు కానీ ‘డొమెస్టిక్‌ వయొలెన్స్‌’ అంటేనే క్షమించరాని నేరం. నాలుగు గోడల మధ్య అమ్మాయిని బంధించి, నిస్సహాయురాలిని చేసి, ఆమె జీవితంతో ఆడుకోవడం సరి కాదు.

ఇలాంటివాటిని ఎదుర్కోవాలంటే ఆడవాళ్లు ఏం చేయాలి?
అమ్మాయిలు ఏం చేయాలనే విషయం చెప్పేముందు తల్లిదండ్రుల గురించి మాట్లాడాలి.  ‘ఏదైనా జరిగితే ఎవరో వస్తారు.. హెల్ప్‌ చేస్తారని ఎదురు చూస్తూ కూర్చోకుండా నీ అంతట నువ్వు సమస్యను ఎదుర్కోవాలి’ అని చిన్నప్పటి నుంచి చెబుతూ పెంచాలి. అప్పుడే వాళ్లల్లో ధైర్యం పెరుగుతుంది. పోనీ పేరెంట్స్‌ నేర్పించలేదనుకోండి.. సమాజాన్ని చూసి పిల్లలు నేర్చుకోవాలి. ఓ సమస్యను ఇతరులు ఎలా పరిష్కరించుకుంటున్నారో తెలుసుకోవాలి. భరిస్తూ ఉంటే బాధ పెరుగుతుంది తప్ప తగ్గదు.

అంటే.. ఆ బంధాన్ని వదిలించేసుకోవాలంటారా?
అలాంటి స్టేట్‌మెంట్స్‌ ఇచ్చి తప్పుదోవ పట్టించను. ‘కాంప్రమైజ్‌’ అవ్వాలి. అయితే అది ఎంతవరకు? అన్నది ముఖ్యం. ఎందుకంటే ఒక బంధం ఏర్పడటం చాలా కష్టం. అంత ఈజీగా ఆ బంధాన్ని తెంచేసుకోకూడదు. అందుకే రాజీపడాలన్నాను. అయితే రాజీపడినా లాభం లేదనుకున్నప్పుడు ఆ బంధం నుంచి బయటపడిపోవాలి. బాధపడుతూ అక్కడే ఉండటంలో అర్థం లేదు.

భార్యను భర్త వేధించడం మాత్రమే కాదు.. తండ్రికి ఇచ్చిన గౌరవం పిల్లలు తల్లికి ఇవ్వకపోవడం కూడా గృహ హింసకు దారి తీస్తుందా?
ఎగ్జాట్లీ. తండ్రికి ఇచ్చే విలువ తల్లికి ఇవ్వని పిల్లలను నేనూ చూశాను. పిల్లలు అలా ప్రవర్తించడానికి తండ్రే కారణం. ‘ఆ.. మీ అమ్మకేం తెలుసు? వంట తప్ప’ అని తండ్రి అనే మాటలు పిల్లలకు తల్లిపట్ల చిన్న చూపు కలిగేలా చేస్తాయి. అలాగే పిల్లల కళ్ల ముందే భార్యను భర్త కొడితే ఆ పిల్లలకు తల్లంటే ఏం గౌరవం ఉంటుంది? భార్య మాటలకు భర్త గౌరవం ఇస్తే అప్పుడు పిల్లలు కూడా తల్లిని గౌరవిస్తారు. అప్పుడే కుటుంబం కూడా బాగుంటుంది.

అక్కడ పిల్లలను తిట్టినా కేసు అవుతుంది
గృహ హింసకు గురవుతున్న స్త్రీల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉంది. అయితే మన దేశంలోనే ఎక్కువగా జరుగుతున్నట్లు రావడానికి కారణం మన పాపులేషన్‌ ఎక్కువ. శిక్షలు పడటం తక్కువ. అదే విదేశాల్లో అయితే కారణం లేకుండా పిల్లలను తిట్టినా కేసు అవుతుంది. ఇక్కడైతే ‘హింస భరించలేకపోతున్నాను’ అంటూ స్త్రీ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకునేవాళ్లు తక్కువ.

మీ కుటుంబం సంగతేంటి?
మా ఆయన, నేను పిల్లల ముందు వాదించుకోం. అలాగే పిల్లలు ఏదైనా అడిగినప్పుడు తను ‘సరి’ అని, నేను ‘కాదు’ అని చెప్పం. ఇద్దరం ఒకే మాట మీద ఉంటాం. ఫర్‌ ఎగ్జాంపుల్‌ నా కూతుళ్లు ఈవినింగ్‌ ఏదైనా పార్టీకి వెళతానని పర్మిషన్‌ అడిగితే.. ‘ఈ టైమ్‌ లోపల వచ్చేయాలి’ అని నేను ఓ కండిషన్‌ పెడతాను. ఆయన కూడా అదే అంటారు. అలా కాకుండా ‘మీ అమ్మ మాటలకేం.. మీ ఇష్టం’ అని ఆయన అన్నారనుకోండి.. అప్పుడు పిల్లలు నా పర్మిషన్‌ కోసం చూడరు. తల్లి అనుమతి లేకుండా పిల్లలు బయటికెళ్లడం అంత మంచిది కాదు. ఎందుకంటే.. పిల్లలెక్కువగా తల్లి కనుసన్నల్లోనే పెరుగుతారు.

కొంతమంది ఆడవాళ్లు భర్త మీద పూర్తిగా ఆధారపడతారు.. అలాంటివాళ్లకు మీరిచ్చే సలహా?
ఆడవాళ్లందరూ చదువుకోవాలి. తమ కాళ్ల మీద తాము నిలబడాలి. నాలుగు గోడల మధ్య మగ్గిపోకూడదు. భర్త తెచ్చే సంపాదనతో ఇల్లు గడుపుతూ, అతను అనే సూటిపోటీ మాటలు పడకూడదు. పూర్తిగా అతని మీద ఆధారపడినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అందరూ ఇలా ఉంటారని అనడంలేదు. నా మాటలు కటువుగా అనిపించొచ్చు కానీ భర్త ఉన్నంతవరకూ చూసుకుంటాడు.

ఒకవేళ అతను చనిపోతే ఆ తర్వాత ఆ కుటుంబానికి దిక్కెవరు? పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? భార్యదే కదా. అందుకే రూపాయి సంపాదించుకోవడం తెలుసుకోవాలి. ఒకవేళ చదువుకోలేదనుకోండి ఏదో ఒక పని నేర్చుకోవాలి. అది కూడా నేర్చుకోలేని స్థితిలో ఉన్నవాళ్లను చూసి జాలిపడటం మినహా మనం ఏమీ చేయలేం. వాళ్లది నిజంగా దయనీయ స్థితి.

భయపెట్టి, ఒత్తిడి చేసి కొందరు ఆడపిల్లలకు బాల్యవివాహం చేస్తున్నారు. దాని గురించి?
నా ఫ్రెండ్స్‌ కొంతమంది టీనేజ్‌లోనే పెళ్లి చేసుకున్నారు. 16, 17, 18ఏళ్ల వయసులో వాళ్ల పెళ్లి జరిగింది. అయితే ఎవరూ ఒత్తిడి చేయలేదు. కానీ ఆ వయసులో పెళ్లి చేసుకోవడం సరి కాదు. అసలు ప్రపంచం గురించి ఏం తెలుస్తుంది? పెళ్లి చేసుకుని భర్త, పిల్లలను చూసుకుంటూ గడిపేస్తారు. బాగున్నంతవరకూ అంతా బాగానే ఉంటుంది. లేకపోతేనే కష్టం.

అందుకే ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాక పెళ్లి చేయాలి. రేపు ఏదైనా జరిగితే తట్టుకునేంత ఆత్మస్థయిర్యం అమ్మాయికి ఉండాలి కదా. ఇళ్లల్లో జరిగే బాల్య వివాహలను మనం సామాన్యులం ఆపలేం. ప్రభుత్వం చేయాల్సిన పని అది. ఇలాంటి పెళ్లిళ్ల విషయంలో ఇంట్లో ఉండే ఆడవాళ్ల చెయ్యి కూడా ఉంటుంది కాబట్టి.. భార్య–భర్తలిద్దర్నీ విమర్శించాలి.

నాలుగు గోడల మధ్య జరిగే హింసను నలుగురి దృష్టికి తేవడానికి కొందరు ముందుకు రావడంలేదు. ఎందుకంటారు?
భయం. నలుగురూ ఆడిపోసుకుంటారని. ‘ఏమో.. ఆ అమ్మాయి ఏం చేసిందో?’ అని మాట్లాడుకుంటారని. నిజానికి పరాయి ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోకుండా కామెంట్‌ చేయకూడదు. చాలామంది అమ్మాయిలు భయపడేది ఇలాంటి కామెంట్స్‌కే. ప్లస్‌ చట్టపరంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉండాలి. అప్పుడే ధైర్యంగా ముందుకొస్తారు. మన చట్టం ఎలా ఉందంటే... ఇవాళ అమ్మాయి ఫిర్యాదు చేస్తే స్వీకరిస్తారు. కానీ ఆ కేసు తేలడానికి ఏళ్లు పడుతుంది. ఈలోపు అబ్బాయి ఏదో ఒక రకంగా బయటికొచ్చేస్తున్నాడు. లండన్, న్యూయార్క్‌లో అలా కాదు.

పేదరికం ఓ శాపం
భర్త ఇంటిని పట్టించుకోకపోతే పిల్లలను పోషించుకోవడానికి ఇళ్ల పనులు చేస్తుంటారు కొందరు ఆడవాళ్లు. అన్ని ఇళ్లూ ‘సేఫ్‌’ అని చెప్పలేం. అలాగే ఇక్కడి ఏజెంట్స్‌ ద్వారా విదేశాలు వెళ్లి ఇళ్ల పనులు ఒప్పుకుంటారు. ఏ కుటుంబంలో ఇరుక్కుంటారో తెలియదు. వీళ్ల ఫేట్‌ బాగుంటే మంచి ఇంట్లో పడతారు. బాగాలేకపోతే అరాచక శక్తుల చేతిలో పడతారు. అది వాళ్ల బ్యాడ్‌ లక్‌. పేదరికం ఓ శాపం.

స్త్రీకి స్త్రీయే శత్రువు కాకూడదు
ఎక్కడైతే సురక్షితంగా ఉండొచ్చనుకుంటామో అక్కడే (ఇంట్లో) వేధింపులు అంటే బాధపడాల్సిన విషయం. మేనమామ వేధించాడనో, బాబాయ్‌ వెకిలిగా ప్రవర్తించాడనో, తండ్రే దాడి చేశాడనో విన్నప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. ‘అసలు వీళ్లు మనుషులేనా?’ అనుకుంటా. పట్టరాని ఆవేశం వస్తుంది. అయితే నాది ఎందుకూ పనికి రాని ఆవేశం. ఎందుకంటే నేను స్వయంగా వెళ్లి ఏమీ చేయలేను.

ఇంట్లో ఉన్న ఆడవాళ్లు ఆ మగవాళ్లను వదిలిపెట్టకూడదు. కొన్నిచోట్ల ఆడవాళ్లు ఇలాంటి విషయాలను తేలికగా తీసుకుంటారు. సాటి స్త్రీని అర్థం చేసుకోలేకపోతే ఎలా? మగవాళ్లకు మనం లోకువ అయ్యేది అక్కడే. ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు కాకూడదు. ఇప్పుడు చాలా టీవీ సీరియల్స్‌లో చూపిస్తున్నది అదే కదా. అత్త మీద కోడలు కుట్రలు చేయడం, తోడికోడలి మీద అసూయ, ఆడబిడ్డ కాపురాన్ని నాశనం చేయాలనుకోవడం వంటివి చూపించడం ద్వారా సమాజానికి ఏం చెబుతున్నట్లు? అవి చూసి రియల్‌ లైఫ్‌లోనూ ఫాలో అవుతున్నారు.

పర్టిక్యులర్‌గా లండన్, నూయార్క్‌ గురించి చెప్పారేంటి?
నా పెళ్లయిన తర్వాత కొన్నేళ్లు అక్కడ ఉన్నాను. అక్కడ ‘లా’ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ వీక్‌గా ఉంటుంది. తప్పు చేస్తే అక్కడ తప్పించుకోవడం కష్టం. ఇంట్లో భర్త హింసపెడుతుంటే ఒక్క ఫోన్‌ చేస్తే చాలు నిముషాల్లో పోలీసులు ఇంటికొస్తారు. అలా ఉండాలి. అదే ఇక్కడ అయితే అంత ఫాస్ట్‌గా రియాక్షన్‌ ఉండదు.

లీగల్‌ సిస్టమ్‌ నమ్మకం కలిగిస్తే.. నాలుగు గోడల మధ్య మౌనంగా రోదిస్తున్నవాళ్లు తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టగలుగుతారు. ఆడవాళ్లు చాలావరకు సున్నితహృదయులు. ‘కైండ్‌’గా ఉంటారు. మన ఇంట్లోవాళ్లను బయటపెట్టడమేంటి? అనుకుంటారు. ఆ ‘కైండ్‌నెస్‌’ని  ‘వీక్‌నెస్‌’గా అర్థం చేసుకుంటున్నారు. అది బలహీనత కాదు.. మంచితనం అని అర్థం చేసుకుంటే గృహహింసలు తగ్గుతాయి.

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement