శ్రీనివాసుడు తల్లి వకుళాదేవిగా నటించారు శాంతకుమారి. కృష్ణ, శోభన్‌బాబుల తరం రాగానే తల్లిగా మారారు అంజలీ దేవి. పండరీబాయి లేకుంటే ఎన్నో తల్లి పాత్రలు తెల్లముఖం వేసేవి. అమ్మంటే అన్నపూర్ణే అన్నట్టు ఒక కాలం గడిచింది. అమ్మ లేని కథ లేదు. అమ్మ లేని సినిమా ఉండదు. తెల్లజుట్టు అమ్మల కాలం నుంచి నల్లజుట్టు అమ్మలు వచ్చినా పాత్రల ప్రాభవం పోలేదు. నటీమణుల డిమాండ్ తగ్గలేదు. ఆ కాలం తల్లుల నుంచి ఈ కాలం తల్లుల వరకూ ‘మదర్స్ డే’ సందర్భంగా రీలు తిప్పేద్దామా?
పౌరాణికాలలో ప్రేక్షకులు తప్పక మెచ్చే తల్లులు ఇద్దరు ఉన్నారు. ఒకరు కుంతీ దేవి. మరొకరు సీతమ్మ తల్లి. కుంతీదేవిగా అందరు నటీమణులు సరిపోరు. ఆ పాత్రలో రాజసం, అదే సమయంలో అమాయక తెగింపు ఉండాలి. ఎస్.వరలక్ష్మి ఆ పాత్రను ‘దానవీరశూరకర్ణ’లో గొప్పగా పోషించారు. ఇక సీతమ్మ తల్లి అంటే తెలుగువారికి అంజలీదేవే. ఆమె ‘లవకుశ’లో లవకుశుల తల్లిగా బిడ్డల కోసం పరితపించే మాతృమూర్తిగా చెరగని ముద్ర వేశారు. ‘భక్త ప్రహ్లాద’ను కన్నతల్లిగా కూడా అంజలీ ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు.
ఇక అభిమన్యుడిని కన్న పౌరుషమూర్తిగా ‘మాయాబజార్’లో ఋష్యేంద్రమణి కనిపిస్తారు. అదే సినిమాలో శశిరేఖను కన్న లోకరీతి గల తల్లిగా ఛాయాదేవి కనిపిస్తారు. ఛాయాదేవి అంత చక్కగా ఒక్క తల్లి పాత్రలో కనిపించిన మొదటి, చివరి సినిమా అదే. పరమ గయ్యాళిగా భావించే సూర్యకాంతం ‘మాయాబజార్’లోనే అరమరికలు లేని తల్లిగా ఘటోత్కచునితో ‘ఇది నీకు తగదంటిని కదరా’ అని ఎంతో ఆత్మీయంగా అనిపిస్తారు.
∙∙
సాంఘికాలు వచ్చాక బ్లాక్ అండ్ వైట్ చిత్రాల కాలంలో తల్లి పాత్రలు సంఘర్షణతో, కథకు మూలస్తంభాలగానో నిలవడం పెరిగింది. ఈ కాలంలో కన్నాంబ, హేమలత, అంజలీ దేవి, సంధ్య, దేవిక... వీళ్లంతా తల్లి పాత్రల్లో రాణించారు. ఎన్.టి.ఆర్ ‘ఆత్మబంధువు’లో కడుపున పుట్టకపోయినా ఎన్.టి.ఆర్ మీద కన్నాంబ పెంచుకున్న మమత చాలా కదిలించేలా ఉంటుంది. ‘మిస్సమ్మ’లో తప్పిపోయిన కన్నకూతురిని తలుచుకుని బాధపడే ఋష్యేంద్రమణిని చూసి మహిళా ప్రేక్షకులు సానుభూతి చూపిస్తారు. హిందీలో వచ్చిన ‘మదర్ ఇండియా’ భారతీయ సినిమాలలో తల్లి పాత్ర రూపు రేఖలను మార్చేసింది.
అంత ఉదాత్తమైన తల్లి పాత్రను తిరిగి తయారు చేయడం ఇప్పటికీ సాధ్యం కాలేదు. ఆ సినిమా రీమేక్‌గా తెలుగులో ‘బంగారు తల్లి’ నిర్మిస్తే హిందీలో నర్గిస్ చేసిన పాత్రను జమున చేశారు. సావిత్రి హీరోయిన్‌గా ఎంత రాణించారో తల్లి పాత్రల్లో కూడా అంతే రాణించారు. ‘అమ్మ మాట’, ‘కన్నతల్లి’.. రెండు సినిమాల్లోనూ ఆమెది మంచి తల్లి పాత్ర. ఆ తర్వాత ‘గోరింటాకు’ సినిమాలో శోభన్‌బాబుకు తల్లిగా కనిపిస్తారామె. కాని ‘మట్టిలో మాణిక్యం’ సినిమాలో భానుమతిది వదిన పాత్రే అయినా చలంను ఆమెను కొడుకులా చూసుకోవడం, వెనకేసుకు రావడం చాలా బాగుంటుంది. ఆ పాత్రను అలా ఆమె మాత్రమే చేయగలదు.
∙∙
అయితే డెబ్బైల తర్వాత వచ్చిన కమర్షియల్ సినిమాలన్నీ చిన్నప్పుడు కుటుంబానికి అన్యాయం చేసిన విలన్‌ను గుర్తు పట్టడానికి మాత్రమే ఆ తల్లి ఉండేది. హీరో పెద్దయ్యాక ‘చెప్పమ్మా... ఎవరు మనకింత అన్యాయం చేసింది’ అనంటే ఆ తల్లి విలన్ నాగభూషణం గురించో, రాజనాల గురించో చెబుతుంది. ఈ కాలంలో పండరి బాయి చాలా సినిమాలలో తల్లిగా కనిపిస్తారు. ఆ తర్వాత పుష్పలత, జయంతి, శారద, కాంచన ఆ పాత్రల్లో కనిపిస్తారు.
∙∙
కృష్ణ, శోభన్‌బాబుల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వచ్చే సమయానికి ముందుతరం హీరోయిన్లు తల్లిపాత్రలకు సిద్ధంగా ఉన్నారు. వీరిలో జయసుధ ఎక్కువగా తల్లి పాత్రలలో ప్రేక్షకులకు నచ్చారు. ఆ తర్వాత జయచిత్ర, సుజాత, శ్రీవిద్య, మంజుల, వాణిశ్రీ... వీరందరూ చాలా సినిమాల్లో తల్లులుగా ఉన్నారు. జయచిత్ర నటించిన ‘అబ్బాయిగారు’ ఆమెను భిన్నమైన తల్లిగా చూపిస్తే మంజుల ‘ప్రేమ’ సినిమాలో కూతురి ప్రేమను అంగీకరించని తల్లిగా గట్టి పాత్రలో కనిపిస్తుంది. వాణిశ్రీ ‘సీతారత్నం గారి అబ్బాయి’ హిట్ అయ్యింది. శారద ‘అమ్మ రాజీనామా’తో పెద్ద హిట్ కొట్టారు. వీరు కాకుండా ‘ముందడుగు’ సినిమాతో గట్టి తల్లి పాత్రతో ముందుకు వచ్చిన అన్నపూర్ణ తెలుగు సినిమాల తల్లిగా ఒక కాలాన్ని ఏలారనే చెప్పాలి. ఆ తర్వాత సుధ ఎక్కువ మంది హీరోలకు తల్లిగా కనిపించారు
∙∙
ఇప్పుడు గ్లామర్ ఉన్న తల్లులు వెండితెర పై కనిపిస్తున్నారు. నదియ, తులసి, పవిత్ర లోకేష్, సుకన్య, రేవతి, రోహిణి, ప్రగతి వీరంతా తల్లులుగా కొత్త హీరోలతో కలిసి నటిస్తున్నారు. నటి శరణ్య గత పదేళ్లలో తెలుగు – తమిళ భాషల్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న తల్లి పాత్రధారిగా గుర్తింపు పొందారు. ఇక రమ్యకృష్ణ ‘బాహుబలి’లో రాజమాత శివగామిగా సంచలనమే సృష్టించారు.సృష్టి మొదలైనప్పటి నుంచి మదర్ సెంటిమెంట్ మొదలైంది. సినిమాలో ఆ సెంటిమెంట్ తప్పక పండుతుంది. నటీమణుల పేర్లు మారుతుండొచ్చు. అమ్మ పాత్ర మారదు. అది చిరకాలం ఉంటుంది. చిరంజీవ అని ఆశీర్వదిస్తూ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment