‘నేను శక్తి’ క్యాంపెయిన్ గురించి జయప్రద మాట్లాడుతూ... ‘‘సాక్షి’ చేస్తున్న ఈ కార్యక్రమం చాలా గొప్పది. ఈ ప్రయత్నం తప్పకుండా జయప్రదం కావాలి. ఎంతోమందిలో ఇది చైతన్యం తేవాలి’’ అన్నారు.
ఆడ, మగ... రెండూ రక్తమాంసాలున్న శరీరాలే. ఆడ తక్కువ.. మగ ఎక్కువ ఎందుకు?
కరెక్టే. దెబ్బ తగిలితే నొప్పి ఎవరికైనా ఒకటే. మగాళ్లకు తక్కువగా ఉంటుందా? లేదు కదా. మరి ఆడవాళ్లు ఎందుకు తక్కువ? మగవాళ్లు ఎందుకు ఎక్కువ? ఇది ఎవరికివాళ్లు వేసుకోవాల్సిన ప్రశ్న. ముఖ్యంగా ఆడవాళ్లు తక్కువ అని అనుకునేవాళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి.
కడుపులో పడ్డ బిడ్డ ‘ఫీమేల్’ అనగానే నిర్దాక్షిణ్యంగా ఊపిరి ఆపేస్తున్నారు. చివరికి ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అని అభ్యర్థించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది..
‘ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే’ సెలబ్రేషన్స్‌ను ప్రతి ఏడాదీ ఘనంగా జరుపుకుంటున్నాం. ఆ వేడుకలు ఎందుకు? ఎవరి కోసం? సమాజంలో ఉన్న ఆడవాళ్లందరి పరిస్థితీ బాగుందనా? ఇప్పుడు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. వెయ్యి మంది మగపిల్లలుంటే ఆరేడు వందల మంది మాత్రమే ఆడపిల్లలు ఉంటున్నారు. ఆడపిల్లను కడుపులోనే చంపేస్తున్నారు. చూస్తూ ఉండండి... ఇప్పుడు కట్నం తీసుకుంటున్న అబ్బాయిలు భవిష్యత్తులో ఆడపిల్లల కొరత కారణంగా ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.
మీరు హర్యానా, రాజస్తాన్‌లను తీసుకుంటే అక్కడ భ్రూణ హత్యలు ఎక్కువ. ఆడపిల్ల ఏం పాపం చేసిందని భూమ్మీదకు రానివ్వకుండా చేస్తున్నారో? మగపిల్లాడైతే కట్నం తెస్తాడనా? కొన్ని సందర్భాల్లో ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులవుతున్నారు. కోడలి కడుపులో పడ్డది ఆడబిడ్డ అంటే అత్త కూడా వ్యతిరేకిస్తుంది. అందుకే ఆడవాళ్లలోనూ మార్పు రావాలి. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థలకు ఓ విన్నపం. లింగ నిర్ధారణ కూడదని ప్రభుత్వం ఓ నిబంధన పెట్టినప్పటికీ, కొన్ని చోట్ల దాన్ని ఉల్లంఘిస్తున్నారు. దయచేసి దాని మీద పోరాడండి.
భాష కూడా మారిపోతుంది
నా విషయంలో అజమ్ ఖాన్ చేసింది ఏంటి? నీచమైన ప్రచారానికి ఒడిగట్టాడు. క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. స్త్రీ అంటే ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక బొమ్మలా భావిస్తారు. ఈ గడ్డ మీద ప్రతి స్త్రీకి ప్రతి నిమిషం అగ్ని పరిక్షే. ఆమె గురించి మాట్లాడేటప్పుడు కొందరి భాష కూడా మారిపోతుంది. వాడే పదాలు ఘోరంగా ఉంటాయి. ఆ విధంగా సంతృప్తి పొందుతారు.
ఖిల్జీకి దక్కకూడదనే పద్మావతి అలా చేసింది
ఆడవాళ్లకు ఆత్మాభిమానం ఎక్కువ. రాణీ పద్మావతి అందుకు ఓ ఉదాహరణ. ఖిల్జీ నీడ కూడా తనను తాకకూడదని ఆత్మాహుతికి పాల్పడింది. పిరికితనంతో కాదు.. తెగువతో. తనంతట తాను ఇష్టపడి తీసుకున్న నిర్ణయం అది. ఖిల్జీకి దక్కి తాను ఓడిపోకూడదని, తనువు చాలించి, గెలిచింది. మన గడ్డ మీద ఉన్న స్త్రీ అంత పవిత్రమైనది.
ఆడవాళ్లు గొప్ప పదవుల్లో ఉంటే.. ఆమెను వీలైనంతగా హింసించాలని చాలామంది ప్రయత్నిస్తారు. రాజకీయ నాయకురాలిగా మీరలాంటివి ఫేస్ చేశారు కదా?
యస్.. మనం పెద్ద పదవుల్లో ఉంటే భరించలేరు. రామ్‌పూర్‌లో నేను పొలిటీషియన్‌గా అడుగుపెట్టినప్పుడు ఆడవాళ్లను లీడర్‌గా అంగీకరించే పరిస్థితులు లేవు. కానీ ప్రజల ప్రేమతో గెలిచాను. ప్రత్యర్థి పార్టీల సంగతి వదిలేయండి.. నా పార్టీలో ఉన్నవాళ్లే నన్ను సూటిపోటి మాటలనేవాళ్లు. యాసిడ్ ఎటాక్ చేస్తారని, చంపేస్తారని భయపడేదాన్ని. అలాంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. మనసులో భయం ఉన్నా ధైర్యంగా ముందుకెళ్లా. మేల్ డామినేషన్ ఉన్న ఈ సొసైటీలో ఆడవాళ్లు రాజకీయాల్లోకి రావాలి. ఇందిరా గాంధీ, జయలలితగార్లను జనాలు ఎప్పటికీ మరచిపోలేరు. ప్రజల ప్రేమ ఒక్కటి చాలు. ఎవరేం చేయాలనుకున్నా చేయలేరు.
ఆడవాళ్ల ప్రతిష్టను మంటగలపాలంటే వాళ్ల క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడే ప్రబుద్ధులు చాలామంది ఉంటారు. అలాంటివారి గురించి ఏమంటారు?
వాళ్లకు ‘ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్’ ఎక్కువ. అందుకే క్యారెక్టర్‌ని తక్కువ చేసి మాట్లాడతారు. నిండు సభలో జయలలితగారిని అలానే కదా చేయబోయారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. పట్టుదలతో అనుకున్నది సాధించారు. క్యారెక్టర్ తక్కువ చేసి మాట్లాడటం మొదలుపెడితే ఏ ఆడపిల్లకైనా బాధ ఉంటుంది.
ఆ బాధలోంచి అభద్రతాభావం వస్తుంది. మానసికంగా కుంగిపోతుంది. అప్పుడు అనుకున్నది సాధించలేదు. అప్పుడు ఇన్‌ఫీరియార్టీ కాంప్లెక్స్‌తో బాధపడే మగవాడు తాను గెలిచినట్లుగా ఫీలవుతాడు. ఆ మగవాడి బుద్ధి అంత నీచమైనది. నా గురించి కూడా అవాకులు చెవాకులు పేలారు. పట్టించుకోలేదు. ఎందుకంటే పట్టించుకుని నేను వెనక్కి తగ్గితే, ఇంకొకరి గెలుపుకి కారణం అవుతాను.
అలాగే మగవాళ్ల సక్సెస్‌ని వాళ్ల ప్రతిభతో, ఆడవాళ్ల సక్సెస్‌ని వాళ్ల అందానికి ఎక్కువగా ఆపాదించి, టాలెంట్‌కి తక్కువ స్పేస్ ఇస్తారు కొంతమంది...
ఇది దౌర్భాగ్య పరిస్థితి. ఆడవాళ్ల ప్రతిభను అంగీకరించలేని కుంచిత మనస్తత్వాలు ఉంటాయి. ఆ మనుషులను ఏమీ చేయలేం. అయితే బయటకు ఎంత మాట్లాడినా మనసుకి తెలుస్తుంది కదా.. తాము మాట్లాడేది కరెక్ట్ కాదని. అది ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా, పాలిటిక్స్ అయినా.. ఏ ఫీల్డ్ అయినా ఆడవాళ్ల టాలెంట్‌ను అభినందించే వాళ్లు తక్కువ ఉంటారు. వాళ్ల సక్సెస్‌ని ప్రతిభకు తక్కువ, అందంతో ఎక్కువ ముడిపెట్టేస్తారు.
అందుకే అంటున్నా... ‘అందంగా ఉండటం కూడా ఆడదానికి శాపమే’. అసలు ఆడవాళ్లంటేనే అందమైనవాళ్లు. అందుకే ప్రతి స్త్రీకి పోరాటం తప్పడంలేదు. నాలుగేళ్ల పాపలో ఏం అందం చూసి, రేప్ చేస్తున్నారు. ఎంత రాక్షసత్వం ఉండి ఉంటుంది. ఆ మనిషి ఎంత కఠినాత్ముడు అయ్యుంటాడు? వాళ్లను క్షమించవచ్చా? ‘నిర్భయ’ యాక్ట్ అంటున్నారు. కానీ నిర్భయంగానే ఇలాంటి పనులు చేస్తున్నారు. వాళ్లను ఎంత కఠినంగా శిక్షించాలంటే తప్పు చేయాలనుకున్నవాళ్ల వెన్నులో వణుకు పుట్టాలి.
అవునూ... ఆడవాళ్లు ఎందుకు కట్నం ఇవ్వాలి?
ఈ ప్రశ్న చాలాసార్లు వేసుకున్నాను. ఇలాంటి ఓ నియమం ఉంది కాబట్టే ఆడపిల్లను తల్లిదండ్రులు భారంగా అనుకుంటున్నారు. ఎక్కువ చదువులు చదివిస్తే ఆ చదువుకి తగ్గ వరుడ్ని తీసుకురావాల్సి వస్తుందని భయపడుతున్నారు. అంతేకానీ అమ్మాయి తన కాళ్లపై తను నిలబడుతుందని ఆలోచించడంలేదు. ‘డౌరీ యాక్ట్’ రావడంతో చాలామంది బతికిపోయాం. లేకపోతే ఆడవాళ్లను గుండెల మీద కుంపటిలా చూసేవాళ్లు. అయినా ఇప్పటికీ కట్నం వ్యవహారం సాగుతుందనుకోండి. ఒక పెళ్లి కుదరాలంటే కట్నం ‘డిసైడింగ్ ఫ్యాక్టర్’ అవుతోంది. పెళ్లనేది రెండు మనసులతో, ‘మాంగల్యం’తో ముడిపడుతుంది కానీ డబ్బుతోనే ఎక్కువ ముడిపడింది. బాధపడాల్సిన విషయం ఏంటంటే.. పుట్టింటి నుంచి మెట్టినింటికి కోడలిగా వచ్చే అమ్మాయి.. అత్త అయ్యే సమయానికి కట్నం ఆశిస్తోంది. కొందరు ఆడవాళ్లు ఇందుకు మినహాయింపు. ఏది ఏమైనా నిన్నటి కంటే ఇవాళ మార్పు వచ్చింది. కట్నం విషయంలో రేపు మరింత మంచి మార్పు వస్తుందనే నమ్మకం ఉంది.
కొందరు మగవాళ్లు తమ ఇంటి ఆడవాళ్లను పరాయి మగాడు కన్నెత్తి చూడకూడదనుకుంటారు. వాళ్లు మాత్రం పరాయి ఆడవాళ్ల మీద కన్నేస్తారు...
రావణాసురుడు ఏమయ్యాడు? సీతను అపహరించి మరీ తీసుకెళ్లాడు. అతనికి అవసాన దశ వచ్చింది కాబట్టే అలాంటి దుర్బుద్ధి పుట్టింది. పరాయి స్త్రీని ఆశించే ఏ మగాడి పరిస్థితి అయినా చివరికి అదే అవుతుంది.
మీరు గమనించారో లేదో కానీ అనాధాశ్రమాల్లో దత్తత తీసుకునేటప్పుడు కూడా ఎక్కువమంది తల్లిదండ్రులు మగపిల్లలనే దత్తత తీసుకుంటుంటారు?
‘మాతృదేవోభవ’ సినిమా గుర్తొస్తోంది. ఆ సినిమాలో ముందు మగపిల్లలను దత్తత తీసుకుంటారు. బిడ్డలు లేనివాళ్లకు ఏ బిడ్డ అయినా ఒకటే. అయినా దత్తత తీసుకునేటప్పుడు మగబిడ్డను కోరుకుంటారు. మగబిడ్డ లేకపోతే అప్పుడు ఆడపిల్ల గురించి ఆలోచిస్తారు. నేను స్వయంగా ఇలాంటి సంఘటనలు చూశా.
కొంతమందికి హితబోధ చేశాను కూడా. మగపిల్లాడైతే ఆదుకుంటాడనా? ఏం మగపిల్లలు తల్లిదండ్రులను నిర్దయగా వదిలేయడం మనం చూడటంలేదా? అయినా ఇంకా మారకపోతే ఎలా? దేశం కోసం పోరాడిన వీర నారీమణులు ఉన్న ఝాన్సీ లక్ష్మీబాయ్, రాణీ రుద్రమదేవి, పద్మావతి వంటి వాళ్లు తిరగాడిన ఈ గడ్డ మీద వివక్షా? అప్పుడు వాళ్లు కత్తి పట్టి దేశాన్ని రక్షించాలనుకున్నారు. ఆడవాళ్లు దేశాలనే పాలించగల సమర్థత ఉన్నవాళ్లు. వాళ్లను అణగదొక్కడమా? ఇదెక్కడి న్యాయం?
కొన్ని ఇళ్లల్లో మగవాళ్లకు ముందు అన్నం పెట్టి, ఆ తర్వాత ఆడవాళ్లు తినడం జరుగుతుంది. ఆకలికి కూడా ‘జెండరా?’ ఇదెక్కడి న్యాయం?
ఆడ కడుపు, మగ కడుపు అని ఉండదు కదా. ఆకలి ఒకటే. మగవాళ్లు తినేంతవరకూ ఆకలి భరించాలా? వాళ్లు తిన్న తర్వాత మిగిలితే తినాలా? సగం ఆకలే తీర్చుకోవాలా? కడుపు నిండా తినే అర్హత కూడా ఆడపిల్లకు లేదా? ఆకలిలోనూ వివక్షా? ఇదెంత దుర్మార్గం. కొన్ని ఇళ్లల్లో మగపిల్లలకు పౌష్టికాహారం పెట్టి, ఆడపిల్లకు తక్కువ పెడతారు. మగపిల్లలకు గ్లాసుడు పాలు ఇస్తారు.
అమ్మాయికి కొన్ని చుక్కలు ఇస్తారు. మగాడి జన్మకు కారణం అవుతున్న ఆడపిల్లకు తక్కువ తిండా? ఆడపిల్ల చదువుకోకూడదా? ఎనిమిదో తరగతి వరకూ చదివిస్తే చాలని ఇప్పటికీ కొన్ని ఇళ్లల్లో అనుకుంటున్నారు. ఆడపిల్ల ఎడ్యుకేట్ అవ్వకూడదా? ఏం... ప్రశ్నిస్తుందని భయమా?
హీరోలతో సమానంగా హీరోయిన్లకు పారితోషికం ఎందుకు ఇవ్వరు?
ఈ ఒక్క విషయంలో కొంచెం న్యాయం మాట్లాడాలి. ఫెయిల్యూర్ ఎఫెక్ట్ ఎక్కువగా హీరోల మీదే పడుతుంది. అందుకని మనం ఈ పరిస్థితిని అంగీకరించాలి. అదే విధంగా హీరోయిన్ల కష్టం తక్కువ కాదని కూడా గ్రహించాలి. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో సాగడం అంటే అంత సులువు కాదు. అయినా మాకంటూ ఓ ప్రత్యేకత క్రియేట్ చేసుకోవాలి. ఆ ప్రత్యేకత కొన్ని తరాల పాటు గుర్తుండిపోయేలా ఉండాలి. అది సాధించగలిగితే మేం సక్సెస్ అయినట్లే.
ప్రపంచం ప్రగతిపథంలో వెళుతున్న ఈ సమయంలో ‘సమానత్వం’ ఇంకా ప్రశ్నార్థకంగానే ఉండటం గురించి?
పురాణాలకు వెళితే స్త్రీ–పురుషులు సమానమే అనేది గుర్తొస్తుంది. సీతారాములు, రాధాకృష్ణులు, పార్వతీపరమేశ్వరులు అన్నారు. పురాణాల్లో స్త్రీకి అంత విలువ ఉంది. మనం చాలా విషయాల్లో పురాణాలను ఆచరిస్తాం. కానీ స్త్రీ–పురుష సమానత్వం వచ్చేసరికి కొందరు పురాణాలను మరచిపోతారు. స్త్రీని దేవతలా భావించాల్సిన సంస్కృతి మనది. దేవతలా భావించడం పక్కన పెట్టండి.. కనీసం తమతో సమానంగా చూడ్డానికి కూడా ఇష్టపడటంలేదు. మారాలి.. మనిషి ఆలోచనా విధానం మారాలి. స్త్రీని చూసే విధానంలో మార్పు రావాలి. స్త్రీని సమానంగా చూసే ప్రపంచం రావాలి.
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment