శ్రీదేవిగారు చనిపోయారనే వార్త విన్నప్పుడు ఏమనిపించింది?
మోహన్‌బాబు: షాకింగ్ న్యూస్. నమ్మలేకపోయాను. ఇంత త్వరగానా అనిపించింది. మంచి మనిషి. మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టింది కాబట్టి.. ఇంకా ఎక్కువ సినిమాలు చేస్తుందనుకునేవాణ్ణి. ఇలా జరుగుతుందని ఊహించలేదు. పైగా ఆరోగ్యంగానే కనిపిస్తోంది కాబట్టి ఎవరూ ఊహించలేం.
శ్రీదేవిగారి కుటుంబంతో మీ పరిచయం తిరుపతి నుంచే జరిగింది కదా?
అవును. శ్రీదేవి తల్లి రాజేశ్వరీగారిది తిరుపతి. ఆ కుటుంబంతో నాకు తిరుపతి నుండి మంచి అనుబంధం ఉంది. రాజేశ్వరిగారు చాలా మంచి మనిషి. కూతుర్ని మంచి హీరోయిన్‌ని చేయాలనే పట్టుదల ఆమెలో ఉండేది. అనుకున్నట్లే చేయగలిగారు. కూతురి వైభవాన్ని చూశారు. ఆమె చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. ఏదో ఆపరేషన్ చేయించుకోబోయి, ఊహించని విధంగా చనిపోయారావిడ. ఇప్పుడు శ్రీదేవి అకాల మరణం పెద్ద షాక్. భారతీయ చిత్రసీమ మంచి నటిని మాత్రమే కాదు, ఉన్నతమైన వ్యక్తిని కూడా కోల్పోయింది.
‘పదహారేళ్ల వయసు’, ‘దేవత’.. ఇలా మీరు, శ్రీదేవిగారు చాలా సినిమాల్లో నటించారు. ఆ సమయంలో ఆమె మీకు దీటుగా నటించడానికి ఇబ్బందిపడిన సంఘటనలేమైనా?
ఒకటీ రెండు ఉన్నాయి. అయితే అవి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. ‘దేవత’ సినిమాలో నా భార్య క్యారెక్టర్ చేసింది శ్రీదేవి. అప్పుడు వాళ్ల అమ్మగారు సినిమాల్లోనే మోహన్‌బాబుగారు యాంటీ రోల్స్ చేస్తారు. నిజజీవితంలో చాలా మంచి వ్యక్తి అని శ్రీదేవితో అనేవారు.
నా కాంబినేషన్‌లో నటించడానికి తనెప్పుడూ ఇబ్బంది పడలేదు.స్వతహాగా ఏ పాత్రను అయినా అవలీలగా చేయగల గొప్ప నటి శ్రీదేవి. భారతదేశం గర్వించదగ్గ నటి అనిపించుకున్నప్పటికీ సెట్‌లో పోజు కొట్టడం నేనెప్పుడూ చూడలేదు. బాంబేకి వెళ్లి అక్కడ టాప్ హీరోయిన్ అయ్యాక కూడా తనలో మార్పు రాలేదు. ఆ వ్యక్తిత్వమే ఆమెను పెద్ద స్థాయికి తీసుకెళ్లింది.
కరెక్టే.. ముంబయ్‌లో సెటిలైనా ఇక్కడ ఏ ఫంక్షన్ జరిగినా హాజరయ్యేవారు. పుట్టినింటికి వచ్చానంటూ ఆనందంగా మాట్లాడేవారు..
అవును నిజమే. నా 42వ సినీ జీవిత ఉత్సవాలు వైజాగ్‌లో జరిగినప్పుడు ఫంక్షన్‌కి రావాలనగానే, ఒక్కసారి భర్త బోనీతో మాట్లాడమంది. ‘వాట్ మోహన్‌బాబుగారు వాట్ డూ యు వాంట్?’ అన్నారు. విషయం చెప్పాను. ఓకే అన్నారు. మీ సెక్రటరీని మా సెక్రటరీతో మాట్లాడమనండి అన్నారు. ఫ్లైట్ టిక్కెట్స్ గురించి నేను మాట్లాడబోతుంటే, ‘వద్దు. మేమే టికెట్స్ కొనుక్కుంటాం. హోటల్ కూడా మేమే చూసుకుంటాం’ అన్నారు. హోటల్ ఓకే చేశాం కానీ టిక్కెట్స్ మాత్రం ఆ అమ్మాయి ఒప్పుకోలేదు.
‘మోహన్‌బాబుగారూ.. మీరు నన్ను గుర్తుపెట్టుకుని ఇంత ప్రేమగా పిలిచారు. అది చాలు’ అంది శ్రీదేవి. వేరేవాళ్లయితే ‘డైరీ చెక్ చేసుకుని చెబుతానండి’ అనేవారేమో. కానీ శ్రీదేవి అలా కాదు. అక్కడికి వచ్చి చాలా బాగా మాట్లాడింది. అంతకన్నా సంస్కారం ఏం ఉంటుంది. మన ఇండస్ట్రీలో కొంతమందిని ఫంక్షన్‌కి పిలిస్తే ‘అబ్బో బిజీ బిజీ’ అంటుంటారు. అంతెందుకు? మనతో సినిమాలు చేసేవాళ్లు ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి రమన్నా రారు. ఈ జనరేషన్‌లో అలాంటివాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లందరికీ శ్రీదేవి ఆదర్శప్రాయురాలు.
పిల్లల బాగోగులు అడగడం వంటివి చేసేవారా?
మా ఫ్యామిలీకి చాలా క్లోజ్. ఎక్కడ కనిపించినా ‘ఏం శ్రీదేవి ఎలా ఉన్నావ్?’ అంటే, ‘నేను బోనీకపూర్ బాగున్నాం. పిల్లలు బాగున్నారు’ అని చెప్పి, మా పిల్లల బాగోగుల గురించి అడిగి తెలుసుకుంటుంది. గొప్ప సంస్కారవంతురాలు. ఈ జనరేషన్‌లో చాలామంది ఆమెను చేరుకోవడం కష్టం. శ్రీదేవి అంటే నాకు చాలా అభిమానం. అందుకే నేను హీరోగా యాక్ట్ చేసిన ‘అల్లుడుగారు’ సినిమా ఫస్ట్ షాట్‌కు తనతో క్లాప్ కొట్టిద్దామని రాఘవేంద్రరావుగారు అడగ్గానే ‘ఓ యస్’ అన్నాను. శ్రీదేవి కూడా చాలా ఆనందంగా వచ్చి, క్లాప్ కొట్టింది.
శ్రీదేవిగారు తక్కువ మాట్లాడేవారట. చిన్న వయసులోనే ప్రొఫెషనల్‌గా బిజీ బిజీగా ఉండటం వల్ల ఆమెలో కష్టం ఏదైనా ఉండేదా?
పర్సనల్ విషయాలు మనకేం తెలుస్తాయి. కానీ నాకు తెలిసినంతవరకూ తను హ్యాపీగా ఉండేది. స్వతహాగా మితభాషి. మాట్లాడిన నాలుగు మాటలు బాగానే మాట్లాడేది. ఎక్కడ పుట్టింది? ఎక్కడికి వెళ్లింది? భారతదేశంలోనే నంబర్ వన్ అనిపించుకుంది. తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయం ఇది. శ్రీదేవి లేని లోటు భర్తీ చేయలేనిది. నటిగా ఆమె ఓ అద్భుతం.
Comments
Please login to add a commentAdd a comment