
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie). ఇందులో విష్ణు (Vishnu Manchu) హీరోగా నటిస్తుండగా ప్రీతి ముకుందన్ కథానాయికగా యాక్ట్ చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి టీజర్ వరకు విమర్శలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇటీవల విడుదలైన శివ శివ శంకరా.. పాటతో ట్రోలింగ్ అంతా కొట్టుకుపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.
ఎన్ని జన్మలెత్తినా..
శివుడి ప్రత్యక్షమై వరమిస్తానంటే.. ఎన్ని జన్మలెత్తినా మోహన్‌బాబు (Mohan Babu) నాకు తండ్రిగా ఉండాలని కోరుకుంటాను. మా కుటుంబంలోని కలహాలకు త్వరగా ఫుల్‌స్టాప్ పడితే బాగుండనిపిస్తోంది. నాకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం. నేను మా అమ్మానాన్నతో ఉండాలి. నా పిల్లలు అలాంటి కుటుంబ వాతావరణంలో పెరగాలని నాకిష్టం. ట్రోలింగ్ విషయానికి వస్తే.. ప్రతి ఒక్కరూ మానవత్వంతో ప్రవర్తించాలి.
నాకేం తెలీదు
మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని అవతలివారి స్వేచ్ఛకు, వ్యక్తిత్వానికి భంగం కలిగించకూడదు. హీరోల గురించి ఎందుకు అసభ్యంగా మాట్లాడతారు? సీనియర్ నటులు చనిపోయారని ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తారు? కోట శ్రీనివాసరావు గురించి ఇలాంటి ప్రచారమే జరిగినప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి విపరీతంగా బాధపడ్డారు. ఇకపోతే ప్రభాస్ పెళ్లి గురించి, కాబోయే భార్య గురించి నాకెలాంటి విషయాలు తెలియవు.
గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి
కన్నప్ప సినిమా బడ్జెట్ విషయంలో ఇప్పటికీ నా గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. సినిమాపై నమ్మకంగా ఉన్నా. అయినా సక్సెస్- ఫెయిల్యూర్ రెండూ మోసగాళ్లే! ఎవరూ మనతో శాశ్వతంగా ఉండరు అన్నాడు. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న కన్నప్ప మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఇందులో మోహన్‌బాబు, శరత్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
చదవండి: ఆ ఒక్క పనితో లాభపడ్డ ఇద్దరు హీరోలు.. లేకుంటే సీన్ రివర్స్?!