ఇంటి నుంచి మనోజ్‌ను బయటకు పంపాలంటూ మోహన్‌బాబు ఫిర్యాదు | Mohan Babu Complaint on Manchu Manoj over Jalpally House | Sakshi
Sakshi News home page

మోహన్‌బాబు ఫిర్యాదు.. తండ్రిని అడ్డం పెట్టుకుని విష్ణు నాటకాలాడుతున్నాడన్న మనోజ్‌

Published Sat, Jan 18 2025 2:34 PM | Last Updated on Sat, Jan 18 2025 4:05 PM

Mohan Babu Complaint on Manchu Manoj over Jalpally House

మోహన్‌బాబు ఫ్యామిలీ (Manchu Mohan Babu Family) లో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఇటీవల తిరుపతిలో జరిగిన ఘటన మరువక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. తన ఆస్తుల్లో ఉన్న అందర్నీ వెకేట్‌ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కు మోహన్‌బాబు (Mohan Babu) శనివారం ఫిర్యాదు చేశాడు. జల్‌పల్లిలో ఉన్న ఆస్తులను కొంతమంది ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన ఇంట్లో ఉన్న వారందరినీ బయటకు పంపించేసి ఆ ఇంటిని తనకు అప్పగించాలని కోరాడు.

కాగా గత కొన్ని రోజుల నుంచి మోహన్‌బాబు తిరుపతిలోనే ఉంటున్నాడు. జల్‌పల్లిలోని ఇంట్లో భార్య, కూతురితో కలిసి మనోజ్‌ నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే సీనియర్‌ సిటిజన్‌ యాక్ట్‌ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్‌బాబు కోరాడు. పోలీసుల దగ్గరి నుంచి మోహన్‌బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్న కలెక్టర్‌.. జల్‌పల్లిలోని ఇంట్లో ఉంటున్న మనోజ్‌కు నోటీసులు ఇచ్చారు.

మోహన్‌బాబు ఫిర్యాదుతో మనోజ్‌.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లాడు. అదనపు కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌ను కలిశాడు. జల్‌పల్లిలోని ఇంటికి అక్రమంగా చొరబడలేదని తెలిపాడు. తమకు ఆస్తి తగాదాలు ఏమీ లేవని, విష్ణు (Manchu Vishnu).. తండ్రిని అడ్డం పెట్టుకుని నాటకాలాడుతున్నాడని ఆరోపించాడు. న్యాయం జరిగేవరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశాడు.

ఆస్తులపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మోహన్ బాబు

గత నెలలో మొదలైన గొడవ
మోహన్‌బాబు కుటుంబంలో కలహాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. గత కొద్దిరోజులుగా మనోజ్‌ (Manchu Manoj), విష్ణు మధ్య వైరం పెరుగుతూనే వస్తోంది. గతేడాది డిసెంబర్‌ నెలలో మనోజ్‌ తనపై దాడి జరిగింది. మోహన్‌బాబు ఆదేశాల మేరకు ఆయన ప్రధాన అనుచరుడు, విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్‌ దాడి చేసినట్లుగా మనోజ్‌ పేరుతో ఓ ప్రకటన వెలువడింది. నడవలేని స్థితిలో మనోజ్‌ ప్రైవేటు ఆస్పత్రిలో చేరడంతో ఏం జరిగిందన్న ఉత్కంఠ నెలకొంది. అటు మంచు కుటుంబం మాత్రం అలాంటిదేం జరగలేదని ప్రకటించింది.

జల్‌పల్లి నివాసాన్ని స్వాధీనం చేసుకున్న మనోజ్‌
కానీ తర్వాత హైదరాబాద్‌ శివార్లలోని జల్‌పల్లిలో ఉన్న మోహన్‌బాబు ఫామ్‌హౌస్‌ను మంచు మనోజ్‌ స్వాధీనం చేసుకున్నాడు. తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే మోహన్‌బాబు.. అసాంఘిక శక్తుల నుంచి తనకు ప్రాణహాని అని చెప్తూ మనోజ్‌-మౌనికపై ఫిర్యాదు చేశాడు. జల్‌పల్లిలోని తన నివాసం నుంచి మనోజ్‌, మౌనికను బయటకు పంపండి అని కోరాడు.

చక్కెర గొడవ.. ర్యాలీతో రభస
తర్వాత ఓ రోజు మనోజ్‌ ఇంట్లో పార్టీ చేసుకుంటే విష్ణు జనరేటర్‌లో చక్కెర పోశాడని గొడవ చేశాడు. అలాంటిదేం లేదని తల్లి స్వయంగా స్పందించడంతో ఈ గొడవ సద్దుమణిగింది. రెండు రోజుల క్రితం మోహన్‌బాబు యూనివర్సిటీకి 200 మందితో ర్యాలీగా వెళ్లాడు మనోజ్‌. యూనివర్సిటీ ప్రాంగణంలోకి వెళ్లడానికి అనుమతి లేదంటూ కోర్టు ఉత్తర్వులు చూపించినా మనోజ్‌ వెనక్కు తగ్గలేదు. ఈ క్రమంలో గొడవ జరగడంతో మనోజ్‌, మౌనికపై కేసు నమోదు అయింది. అటు మనోజ్‌ ఫిర్యాదుతో ఎంబీయూ సిబ్బంది, మోహన్‌బాబు బౌన్సర్లపైనా కేసు నమోదైంది.

కుక్క తిట్లు
ఇంతలో శుక్రవారం విష్ణు, మనోజ్‌ సోషల్‌ మీడియా వేదికగా తిట్టుకున్నారు.  'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అన్న సినిమా డైలాగ్‌ను విష్ణు ట్వీట్‌ చేశాడు. దీనికి మనోజ్‌ స్పందిస్తూ.. కన్నప్పలో రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్‌ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు అని కౌంటరిచ్చాడు.

మాట్లాడుకుందాం.. అంతలోనే ట్విస్ట్‌
ఈ రోజు ఉదయం కలిసి మాట్లాడుకుందాం. నాన్నను, ఇంట్లోని ఆడవారిని, సిబ్బందిని అందర్నీ పక్కన పెట్టి రా. నేనూ ఒంటరిగానే వస్తాను. అన్ని విషయాలు చర్చించుకుందాం అని మనోజ్‌ ట్వీట్‌ చేశాడు. ఇంతలోనే మోహన్‌బాబు మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించడం.. మనోజ్‌ కలెక్టరేట్‌కు వెళ్లి న్యాయం కోసం పోరాడతాననడం జరిగిపోయింది. ఇక ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి!

చదవండి: చాలా సిగ్గుపడుతున్నా.. సైఫ్‌కు క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌటేలా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement