ఆ రోజు నేను చనిపోయేదాన్ని...! | singer kausalya about domestic violance | Sakshi
Sakshi News home page

భార్యను కొట్టేవాడా.. నీ చేతికి 'ఇనుప' గాజులు!

Published Sun, Feb 18 2018 12:37 AM | Last Updated on Sun, Feb 18 2018 9:03 AM

singer kausalya about domestic violance - Sakshi

కాపాడవలసిన చేతులు... ప్రేమించాల్సిన చేతులు ఊతం కావలసిన చేతులు...భరోసా ఇవ్వాల్సిన చేతులు మాటిమాటికీ లేస్తుంటే... బుసలు కొడుతుంటే.. కాటేస్తుంటే... అలాంటి చేతులకు సంకెళ్లు వేయాల్సిందే ఇనుప గాజులు తొడగాల్సిందే.

సాక్షి తలపెట్టిన మహోద్యమం, మహిళోద్యమం అయిన ‘నేను శక్తి’ లో భాగంగా గతవారం అంతా ‘లైంగిక వివక్ష’పై కేస్‌ స్టడీలు ఇచ్చిన ‘ఫ్యామిలీ’.. ఈరోజు నుంచి ‘గృహహింస’పై ప్రత్యేక కథనాలను అందిస్తోంది.  

పెళ్లంటే అందరి అమ్మాయిల్లాగే నేనూ ఎన్నో కలలు కన్నాను. ఒక కొత్త జీవితాన్ని ఊహించి ఆ ఇంట్లో అడుగుపెట్టాను. అన్ని విధాలా నన్ను చూసుకునే, ప్రేమించే వ్యక్తి ఉన్నాడనే భరోసాతో వెళ్లాను. కానీ పెళ్లయిన పదహారో రోజే  అత్తారింట్లో అందరిముందు కొట్టాడు. పెళ్లిలో మా అమ్మ మర్యాదలు సరిగా చేయలేదని.  నేను టెన్త్‌క్లాస్‌లో ఉన్నప్పుడే నాన్న చనిపోయారు హఠాత్తుగా. ఏజీ ఆఫీస్‌లో పనిచేసేవారు. మేం ముగ్గురం పిల్లలం. నాకు ఒక చెల్లి, తమ్ముడు.  అమ్మే కష్టపడి పెంచింది మమ్మల్ని.

‘‘మా అమ్మను ఒక్క మాట కూడా అనొద్దు’’ అని నేను అన్నందుకు నన్ను కొట్టాడు. దవడ ఇప్పటికీ నొప్పిగానే ఉంటుంది. ఆరోజే అనుకున్నాను ఇంక  ఇది వద్దు అని. అయితే విడాకులు తీసుకొని ఇంటికెళితే అమ్మకు ఎంత కష్టం? పెళ్లి కావల్సిన చెల్లి ఉంది. సొసైటీ ఏమనుకుంటుంది? అనే ఆలోచన వెనక్కిలాగింది. అయినా ‘‘నాకు వద్దు. నేను వెళ్లిపోతా’’అని చెప్పా. అప్పుడు మా మామగారు.. ‘‘అమ్మాయి చెప్పింది కరెక్టే.  సరిగ్గా చూసుకోగలిగితే చూసుకో. లేదంటే నేనే దగ్గరుండి డివోర్స్‌ ఇప్పిస్తాను’’ అని అన్నారు.

ఆ మాటకు  ‘‘లేదు, ఇంకోసారి ఈ మిస్టేక్‌ జరగదు. ఇది నాకు కావాలి’’ అని తను అన్నాడు. క్షమించాను.  కాని అది  క్లోజ్‌ కాలేదు. అతను చెయ్యి ఎత్తుతూనే వచ్చాడు.  ఒకసారి మా అత్తగారితో కూడా షేర్‌ చేసుకున్నా.  ‘‘మన ఇళ్లల్లో కొత్తేం కాదు ఇది.. నువ్వే కొంచెం చూసీ చూడనట్టు పో’’ అని చెప్పారు ఆమె. చూసీచూడనట్టూ వెళ్లా.  తర్వాత నాకు తెలిసిందేంటంటే.. అతను ఇంకో అమ్మాయితో ఉన్నాడు.. వాళ్లకు సంతానం కూడా ఉందని.

టామ్‌బాయ్‌లా..
మా నాన్నే కొట్టలేదెప్పుడూ నన్ను. సింగింగ్‌తో  చదువులో బీగ్రేడ్‌ వచ్చిన రోజూ పల్లెత్తు మాటనలేదు.  ‘‘బాధపడకురా.. నీకు చాలా స్ట్రెన్త్‌ ఉంది’’ అంటూ ఎంకరేజ్‌ చేయడం తప్ప. పైగా నన్ను ఓ టామ్‌బాయ్‌లా పెంచారు. సైకిల్‌ తొక్కేదాన్ని. స్పోర్ట్స్‌  బాగా ఆడేదాన్ని. సింపుల్‌గా, స్ట్రాంగ్‌గా ఉండడం ఆయనకు ఇష్టం.  అలాగే పెంచాడు. నిజానికి మా మామగారు, మా నాన్న ఇద్దరూ కొలీగ్స్‌. చిన్నప్పటి నుంచీ చూసినవాళ్లే. పాడడం నచ్చే నన్ను చేసుకున్నాడు అతను (భర్త). ఫస్ట్‌లో చాలా ఎంకరేజ్‌  చేశాడు కూడా.

అలాంటిది ఒక్కసారిగా ‘‘నీ ఫొటోలు చూడు ఎట్లా ఉన్నాయో? నీ బిహేవియర్‌ చూడు ఎట్లా ఉందో? నీకు ఎవడో ఉన్నడంట కదా..’’ అంటూ మొదలుపెట్టాడు. సామరస్యంగా మాట్లాడదామని ట్రై చేసినా సాగనిచ్చేవాడు కాదు. కొట్టడమే. ఆయన ఇంటికొస్తున్నాడంటనే దడ వచ్చేది. ‘‘ఎందుకిలా బిహేవ్‌ చేస్తున్నావ్‌?’’ అని అడిగితే నా మీద రాంగ్‌ ఎలిగేషన్స్‌ వేయడం స్టార్ట్‌ చేశాడు.  ఎక్కడికి వెళ్లినా ఆయనను తీసుకునే వెళ్లేదాన్ని. అయినా  అలా మాట్లాడేవాడు. ఉన్నట్టుండి అప్రోచ్‌ అయి కొట్టేవాడు. పోలీసుల దగ్గరకు వెళ్లా.. ‘‘ఏం జరిగిందో నాతో చెప్పట్లేదు. ఆయనను ఎవరో ఇన్‌ఫ్లుయెన్స్‌ చేస్తున్నారు. మా ఇద్దరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్‌ ఇవ్వండి’’ అని.  

చంపేస్తామని బెదిరించారు
సూపర్‌ సింగర్‌ 7 నాకు పెద్ద చాలెంజ్‌. అప్పుడే అమ్మకు క్యాన్సర్, ఆయన గొడవలు స్టార్ట్‌ చేయడం అన్నీ ఒకేసారి. చాలా కుంగిపోయా. ఎందుకంటే ఆమే నాకు సపోర్ట్‌. బాధ తొలిచేసేది. ఒకసారి మా బావగారు అంటే ఆయన పెద్దనాన్న కొడుకు వాళ్లు వచ్చారు ఇంటికి మా సమస్యను సాటవుట్‌ చేద్దామని.  వాళ్లందరి ముందూ కొట్టాడు రక్తంకారేలా. వాళ్లు ఆయన్ని ఆపకపోతే నేను చచ్చిపోయేదాన్ని ఆ రోజు. మా బాబుకి అప్పుడు ఆరేళ్లు. ‘అమ్మను కొట్టొద్దు నాన్నా. ప్లీజ్‌ కొట్టొద్దు నాన్నా’ అంటూ వాళ్ల నాన్న కాళ్లు పట్టుకున్నాడు. 

నా దగ్గరకు వచ్చి ‘అమ్మా కొట్టుకోకండి అమ్మా... కలిసి ఉండండి అమ్మా..’ అని వాడు ఏడుస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది. నా తలంతా గాయాలే. మా బావగారు వాళ్లే ఐస్‌క్యూబ్స్‌ ఇచ్చి ‘‘వెళ్లి అమ్మాయికి పెట్టరా’’ అన్నారు. ఆయన తలకు ఐస్‌క్యూబ్స్‌ అద్దుతుంటే ‘‘ఎందుకిలా చేస్తున్నావ్‌? నిన్నేం ఇబ్బంది పెట్టను. చెప్పుకోవడానికి నాకెవరూ లేరు’’ అని బతిమాలాను. అయితే తెల్లవారి ఈ మాటలనే పట్టుకుని హేళన చేస్తుంటే అనుకున్నాను ఇంక చాలు అని.

మాట్లాడ్డానికి కూడా ట్రై చేయక మళ్లీ పోలీసుల దగ్గరకు వెళ్లా. ‘‘కేసులేమీ లేకుండా ఒకసారి ఆయనను పిలిచి మాట్లాడండి’’ అని రిక్వెస్ట్‌ చేశా. కంప్లయింట్లు ఇచ్చి, పదిమందికీ తెలిసి అల్లరి కాకుండా లోపలే పరిస్థితి చక్కదిద్దుకుందామనే నా ప్రయత్నం అప్పటికీ.  అందుకే ఆయన మీద డొమెస్టిక్‌ వయలెన్స్‌ కేసు వేయాలనే ఆలోచన కూడా రాలేదు. కాని  ఇప్పుడనిపిస్తోంది. అప్పుడే ఆ పని చేసుండాల్సింది అని. ఆయనతో ఉన్న ఆమె పేరు బయటపెడితే చంపేస్తామని బెదిరించారు ఇద్దరూ. భయపడి అప్పుడు  కేస్‌ ఫైల్‌ చేశాను.

ఒక్కో రీజన్‌తో..
భరించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. భరించడం కూడా ఒక శాపం. ఒక్కసారి చెయ్యి ఎత్తిన మగవాడు మళ్లీ మళ్లీ ఎత్తుతూనే ఉంటాడు. ఇది నా అనుభవంతో చెప్తున్న సత్యం. వెన్‌ థింగ్స్‌ ఆర్‌ గోయింగ్‌ రాంగ్‌.. దాని వెనక కారణం ఏంటో గ్రహించాలి. మరీ పాజిటివ్‌ ఆటిట్యూడ్‌ కూడా మంచిది కాదు.  నెమ్మదిగా ఆయనే మారతాడని, చెల్లెలి పెళ్లికావాలని,  అమ్మకు మాట రాకూడదని, సమాజం ఏమనుకుంటుందోనని..  తర్వాత బాబు ఉన్నాడని ఒక్కో రీజన్‌తో కామ్‌గా ఉన్నా.  తర్వాత నా వల్ల కాలేదు. మన దేశంలో స్త్రీత్వం అంటే  డిపెండెన్సీ.. అదే అందం అంటూ ఆడపిల్లలను పెంచుతారు.

కాని మనకు  కావల్సింది ఆత్మవిశ్వాసం, ధైర్యం! నా చేయి  పట్టుకొని నా కొడుకు.. ఎదురుగా జీవితమనే సముద్రం.. ఒంటరిగా ఆ సముద్రాన్ని ఈదాలనే వాస్తవం భయపెట్టినప్పుడు,  రేపేంటి? అన్న ప్రశ్న కలవరం పుట్టిస్తే నావలా కనిపించేది ఆత్మస్థైర్యమే.  సెల్ఫ్‌ పిటీలోకి పడిపోయి ఎమోషనల్‌ అయిపోతే ముందుకు వెళ్లలేం. ఆర్థిక ఇబ్బందులున్నాయి. కలిసి ఉన్నప్పుడు భర్త, నేను వేరువేరు అనుకోం కదా. నా అకౌంట్స్, ఐటీ రిటర్న్స్‌అన్నీ ఆయనే చూసుకునేవారు. అలా ఆస్తీ ఆయనే చూసుకున్నారు. అయినా నాకు న్యాయం జరుగుతుందన్న ఆశ ఉంది. 

ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కొట్టినా, తిట్టినా పడ్డాను. సెలబ్రెటీగా నేనెప్పుడూ బతకలేదు. ఇంట్లో అన్ని పనులు చేసే రికార్డింగ్‌కి వెళ్లేదాన్ని. ఆయన స్నేహితులొస్తే వండిపెట్టేదాన్ని.  అత్తింట్లో అందరికీ మర్యాద ఇచ్చాను. నా కొడుకు వ్యాక్సినేషన్‌ దగ్గర్నుంచి స్కూల్లో చేర్పించేదాకా అన్నీ నేనే చూసుకున్నా ఇండిపెండెంట్‌గా.  ఎక్కడా ఏ లోపం చేయలేదే? ఎందుకు నన్ను ఇంత మోసం చేయడం?  ఇప్పుడు నా జీవితం నేను జీవిస్తున్నా.

నేను ఇంత బలంగా.. సంతోషంగా.. నవ్వుతున్నానంటే కారణం నా కొడుకే. వాడు క్రికెట్‌ బాగా అడతాడు. పొద్దున్నే అయిదు గంటలకు కోచింగ్‌కు తీసుకెళ్తా.  నేను నా కొడుకు మీద పెడుతున్న శ్రధ్ధను చూసి వాళ్ల నాన్నే జెలసీ ఫీలయ్యి  ‘‘నువ్వు నీ కొడుకును పెంచినట్టు మా అమ్మ నన్ను పెంచి ఉంటే నేనిట్లా తయారయ్యేవాడిని కాను’’ అని అంటుండేవాడు.  నాకున్న గొడవల్లో నాకు వచ్చిందాన్ని మరిచిపోకుండా ఉండడానికే సంగీత అకాడమీ. అదే  నా ఆత్మసంతృప్తి. పాడడంలోనే నాకు  మనశ్శాంతి.

మన హక్కు మనమే..
ఎవరో వస్తారు.. ఏదో సాయం చేస్తారు అనుకుంటూ ఎదురుచూసే  రోజులు పోయాయి. నీకు నువ్వే అన్నీ. మన హక్కును మనమే కాపాడుకోవాలి. మన చాయిస్‌ను మనం పర్‌స్యూ చేసుకోవాలి. ఇబ్బందిని ధైర్యంగా చెప్పాలి. ఇలాంటి క్యాంపెయిన్స్‌ వల్ల సమాజం  ఎడ్యుకేట్‌ అవుతుంది.

-సరస్వతి రమా


డొమెస్టిక్‌ వయలెన్స్‌ యాక్ట్‌
మనదేశంలో గృహహింస చట్టం 2006 నుంచి అమల్లోకి వచ్చింది. ఒక్కొక్క ఉపశమనానికి ఒక్కో కోర్ట్‌ని ఆశ్రయించకుండా అన్ని ఉపశమనాలకు ఒకే చట్టం అనేది ఇందులోని ముఖ్యమైన విషయం. స్త్రీలపై జరిగే మానసిక, శారీరక, ఆర్థిక, లైంగిక వేధింపుల నుంచి ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది.  అన్ని హింసల స్వరూప స్వభావాలను చర్చించి, విశదీకరించిందీ చట్టం. సహజీవనాన్నీ గుర్తించింది.  ఇదొక శుభపరిణామం.. మహిళలకు ఆశాకిరణం!

ది బెస్ట్‌: మహిళలు పోరాడి సాధించుకున్న ఈ చట్టం చాలా గొప్పది. ప్రభుత్వం కాస్త దృష్టి పెడితే దిబెస్ట్‌ అవుతుంది. మధ్యంతర ఉత్తర్వులు ఆర్థికపరంగా, నివాసపరంగా, కస్టడీ పరంగా, రక్షణపరంగా వెనువెంటనే వస్తున్నాయి. కేస్‌ల పరిష్కారమే ఆలస్యమవుతోంది. ఉత్తర్వుల సత్వర అమలుకు చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. డీవీ (డొమెస్టిక్‌ వయలెన్స్‌) చట్టం వచ్చాక 498ఏ కేసుల సంఖ్య కొంత శాతం తగ్గింది.  

సపరేట్‌ కోర్టులు కావాలి: డీవీ కేసులను విచారించడానికి సపరేట్‌ కోర్ట్‌లను ఏర్పాటు చేయాలి. క్రిమినల్‌ కేసులలో ఎఫ్‌ఐఆర్‌ లాంటిదే డీవీ కేసులలో డీఐఆర్‌. చట్టప్రకారమైతే కొన్ని గుర్తింపు ఉన్న ఎన్‌జీఓలు గృహహింస జరిగిన చోటుకు వెళ్లి, విచారించి ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలి. దాని ఆధారంగానే అధికారులు తదుపరి చర్యలు తీసుకొని కోర్ట్‌కు పంపాలి. కాని ఇది సవ్యంగా జరగడంలేదు.

యాంత్రికంగా డీఐఆర్‌లు వేస్తున్నారు. అసలు కొన్ని చోట్ల అయితే విచారణలే లేవు. ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు పరిచే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. డీవీ చట్టం కింద జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తే నేరం. కాని నేరాన్ని నిరూపించాలన్నా, ఆ ఉత్తర్వులను అమలుపర్చుకోవాలన్నా పోలీసుల సహాయం తప్పనిసరి. కాబట్టి ప్రతి స్టేషన్‌లో కొందరు పోలీసులకు  ఈ బాధ్యతను అప్పగించాలి.

రెండవ స్థానంలో ..
♦ డొమెస్టిక్‌ వయలెన్స్‌ కేసుల విషయంలో దేశంలోనే రెండవస్థానంలో ఉంది హైదరాబాద్‌.
♦మహిళలకు సంబంధించి హైదరాబాద్‌లో దాఖలయ్యే కేసుల్లో 25 డీవీ కేసులే.
♦ చట్టం వచ్చిన ఈ పదేళ్లలో మన దేశంలో పదిలక్షల కేసులు నమోదయ్యాయి.    
♦ ప్రతిరోజు ఒక్కో కోర్టులో కనీసం అయిదు డీవీ కేస్‌లు బుక్‌ అవుతున్నాయి.

సర్వే: తమపై జరిగే హింస గృహహింస అని చాలామంది మహిళలు ఇంకా గుర్తించనేలేదు. వారికి తెలియదు కూడా. 80 శాతం మగవారు ఏదో ఒక సందర్భంలో భార్యలను కొడుతున్నామని అంగీకరించారు. అప్పుడప్పుడు అది తప్పు కాదని కొందరు అభిప్రాయపడ్డారు కూడా. - ఇ. పార్వతి, అడ్వకేట్, ఫ్యామిలీకౌన్సిలర్‌

గట్టిగా ఎదురించాలి..
ఎక్కువ కుటుంబాల్లో భర్తలు తాగివచ్చి భార్యలపై దాడులకు పాల్పడుతున్నారు. శారీరకంగా వేధిస్తున్నారు. చాలా మంది మహిళలు పిల్లల కోసం ఈ హింసను భరిస్తున్నారు. తమపై జరిగే దాడులను మహిళలు ప్రతిఘటించాలి. నలుగురికీ చెప్పాలి. గట్టిగా ఎదురించాలి. అవసరమైతే బంధువుల సహాయం తీసుకోవాలి. అలా చేస్తేనే మగవారిలో భయం వస్తుంది. విదేశాల్లో కూడా గృహహింస ఉంటుంది. ఫిర్యాదు చేస్తే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయి. – పద్మ పాల్వాయి, సైకాలజిస్ట్‌

జీవితంలో ఎన్ని అపజయాలనైనా  ఎదుర్కోవచ్చు.. కాని నీకు నువ్వు ఓటమికి లొంగిపోకు! – మాయా ఎంజెలో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement