రశ్మీఠాకూర్
మహిళలు అంటే వంటింటికే పరిమితం కావద్దని..తమలోని శక్తిపై నమ్మకంతో ముందడుగు వేస్తే సాధించలేనిదేమీ లేదని.. ఆడపిల్లలపై తల్లిదండ్రులు వివక్ష వీడి, అబ్బాయిలతో సమానంగా పెంచాలంటున్నారు మిస్ క్వీన్ ఇండియా, పోచంపల్లి ఇఖత్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్ రశ్మీఠాకూర్. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, ఆడపిల్లల చదువుపై వివక్ష చూపొద్దని కోరుతున్నారు. ఎన్టీసీపీ రామగుండం వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ ఆమెను పలకరించింది. స్త్రీశక్తిపై ఆమె మాటలు..
పెద్దపల్లి, జ్యోతినగర్: దక్షిణ భారతదేశంలో మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు. సమానత్వం కోసం ఇంకా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. మగవారితో సమానంగా అవకాశాలు ఇవ్వాలి. అయితే ఇంటి నుంచే వివక్ష మొదలవుతుంది. తల్లిదండ్రులే ఆడపిల్లలపై ఆంక్షలు పెడుతున్నారు. దీంతో వారు స్వశక్తితో ముందుకు సాగలేకపోతున్నారు. అబ్బాయిలతో సమానంగా చూసినప్పుడే వారిలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ప్రధానంగా విద్యతోనే అభివృద్ధి సాధ్యం. ఉన్నత విద్యనభ్యసించి, ఆర్థికంగా ఎదిగినప్పుడే గుర్తింపు దక్కుతుంది. అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలి.
♦ బ్రాండ్ అంబాసిడర్‌గా..
పోచంపల్లి ఇఖత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం నా అదృష్టం. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నికైన మూడో రోజే అక్కడకు వెళ్లినప్పుడు వారి కష్టాలను చూశాను. పలువురు తమ మగ్గాలను వదిలి పెట్రోల్‌బంక్‌లు, షాపింగ్‌మాల్స్‌ల్లో వాచ్‌మెన్‌లుగా పనిచేయడం కలచివేసింది. వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. వారు తయారు చేసిన వస్త్రాలను విక్రయించేందుకు ‘రశ్మీఠాకూర్ టెక్స్‌టైల్స్’ ఏర్పాటు చేయబోతున్నాను. అంతేకాకుండా వివిధ దేశాల్లో పర్యటించినప్పుడు వారు నేసిన వస్త్రాల గురించి ప్రచారం చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నాము.
♦ అందాల పోటీలపై..
పారిశ్రామికప్రాంతం రామగుండం నుంచి అందాల పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. అయితే ఇండియాలో అందాల పోటీల నిర్వహణలో వెనుకబడి ఉన్నాం. అయితే తెలంగాణ టూరిజం వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు.
♦ శ్రీమతి తెలంగాణతో..
స్త్రీ అంటే శక్తి అని నిరూపించేందుకే ‘శ్రీమతి తెలంగాణ’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను వివరిస్తూ ఈ పోటీలు చేపడుతున్నాం. ఈ పోటీల ద్వారా మహిళల ప్రాధాన్యతను వివరిస్తూ, వారిలోని టాలెంట్‌ను బయటకు తీస్తుంది. పోటీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం గర్వకారణంగా ఉంది. ఈ పోటీల ద్వారా మహిళల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మహిళల్లోని ప్రతిభను వెలుగుతీసేందుకే ఈ కార్యక్రమం.
♦ యువతకు సందేశం
విద్యతోనే బంగారు భవిష్యత్ సాధ్యం. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తేనే ఏదైనా సాధించగలం. సోషల్‌మీడియాను మంచికే ఉపయోగించుకోవాలి. అలాగని గంటలకొద్దీ గడపడం కచ్చితంగా తప్పు. ఆరోగ్యం పాడుకావడంతోపాటు విలువైన సమయాన్ని నష్టపోతాం. మనకు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలి. విశ్రమించకుండా పరిశ్రమించాల్సిందే. అప్పుడే బంగారు భవిష్యత్ మన కళ్ల ముందు ఉంటుంది. మనకంటూ గుర్తింపు వస్తుంది. తల్లిదండ్రులు సైతం ఆడపిల్లలపై వివక్ష చూపొద్దు. మగవారితో సమానంగా పెంచాలి.
Comments
Please login to add a commentAdd a comment