వీణా అంబరీష
బెంగళూరుకు చెందిన వీణా అంబరీష బస్సు ప్రమాదంలో కుడి కాలిని కోల్పోయింది. ఆ తరువాత డిప్రెషన్ బారిన పడింది. ఆ చీకటి నుంచి అతి కష్టం మీద బయటపడి అర్ధంతరంగా ఆగిపోయిన చదువును కొనసాగించింది. ఆ తరువాత ఎంబీఏ చేసింది. ‘కరీ దోశ’ పేరుతో ఫుడ్ స్టాల్ ప్రారంభించి తన కాళ్ల మీద తాను నిలబడుతూ ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తోంది వీణా అంబరీష.
కొన్ని సంవత్సరాల క్రితం..
భరతనాట్యం డ్యాన్సర్ అయిన వీణ తన ఆరంగేట్రం కోసం సన్నాహాలు చేసుకుంటోంది. కాలేజీకి వెళ్లడానికి రోడ్దు దాటుతున్నప్పుడు బస్సు ఢీకొట్టడంతో ప్రమాదానికి గురై కుడికాలు కోల్పోయింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన తరువాత వాకింగ్ స్టిక్‌తో నడవడం మొదలు పెట్టింది. చాలా కష్టంగా అనిపించేది. భరతనాట్య కళాకారిణిగా పేరు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్న వీణ తనకు జరిగిన ప్రమాదాన్ని జీర్ణించుకోలేపోయింది. కలల రెక్కలు విరిగిన బాధ ఆమె కళ్లలో కన్నీరై కనిపించేది.
‘నాకు ఇలా జరిగిందేమిటి!’ అని ఒకటికి పదిసార్లు అనుకోవడం వల్ల వీణ పరిస్థితి ఎక్కడి దాకా వెళ్లిందంటే.. ‘ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దారి లేదు’ అని బలంగా అనుకునేంతగా. అయితే వీణ తన నిర్ణయం మార్చుకోవడానికి ఒక దృశ్యం కారణం అయింది. ఆ దృశ్యం తనకు వేకప్–కాల్‌గా పనిచేసింది. ఫిజికల్ డిజేబిలిటీ సర్టిఫికెట్ తీసుకోవడానికి విక్టోరియా హాస్పిటల్‌కు వెళ్లిన వీణ అక్కడ ఒక మహిళను చూసింది. ఆమెకు రెండు కాళ్లు లేవు. ఆమె తన బిడ్డను లాలిస్తూ బువ్వ తినిపిస్తోంది. ఒక క్షణం ఆమె ముఖం వైపు చూసింది వీణ. రవ్వంత బాధ కూడా ఆమె ముఖంలో కనిపించలేదు.
జీవనోత్సాహంతో ఆ ముఖం వెలిగిపోతోంది. తాను ఏవైతే పెద్ద సమస్యలు అనుకుంటుందో అవి గాలిలో దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ఈ ఒక్క దృశ్యం వీణ ఆలోచనలో పూర్తిగా మార్పు తీసుకువచ్చింది. ‘ఏదో సాధించాలి’ అనే ఉత్సాహం మనసులోకి వచ్చింది. ఆగిపోయిన చదువును కొనసాగించింది. మంచి మార్కులతో పరీక్షలు పాసైంది. ఆ తరువాత ఎంబీఏ పూర్తి చేసింది. బ్యాంకులలో సేల్స్ ఆఫీసర్‌గా, ఐటీ పరిశ్రమలో సాఫ్ట్‌వేర్ టెస్టర్‌గా పనిచేసింది. ఒకవైపు గంటల కొద్దీ చేసే ఉద్యోగం.. మరోవైపు పిల్లల ఆలనా పాలనా కష్టమనిపించింది.
ఒక సౌత్ అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఎడతెగకుండా జరిగే మీటింగ్‌లు, పనిభారం వల్ల కాలికి ఇన్‌ఫెక్షన్ వచ్చి హాస్పిటల్‌లో పదిహేను రోజులు ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలోనే సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది వీణ. దానికి ఫిట్‌నెస్ ట్రెయినర్ అయిన ఆమె భర్త ప్రోత్సాహం తోడైంది. గత సంవత్సరం బెంగళూరులో ‘కరీ దోశ’ పేరుతో దోశ స్టాల్ మొదలు పెట్టినప్పుడు ‘ఎంబీఏ చదివి ఇదేమిటీ’ అన్నట్లుగా మాట్లాడారు కొద్దిమంది. వారి మాటలేవీ పట్టించుకోలేదు వీణ. ప్రత్యేకత ఉంటేనే ఫుడ్ స్టాల్ అయినా పెద్ద వ్యాపారమైనా విజయం సాధిస్తుంది.
మరి ‘కరీ దోశ’ స్పెషల్ ఏమిటి? కరీ దోశే! తమిళనాడులోని మధురై ప్రాంతంలో ‘కరీ దోశ’గా పిలిచే వేడి వేడి దోశ దానిపై ఆమ్లెట్, మటన్ కీమా చాలా ఫేమస్. కరీ దోశ బెంగళూరులో కూడా హిట్ అయింది. ఈ దోశ కోసం కస్టమర్‌లు పొద్దున్నే లైన్ కడతారు. స్టాల్ ప్రారంభించడానికి ముందు ‘కరీ దోశ’ రుచులలో ప్రావీణ్యం సంపాదించడానికి రెండు నెలల పాటు ఇంట్లోనే ఉంది వీణ. వంటగది తన పాఠశాలగా, ప్రయోగశాలగా మారింది. ‘కరీ దోశ’ స్టాల్ పొద్దున ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అందుబాటులో ఉంటుంది. ఇక మిగిలిన సమయమంతా ఇంట్లోనే పిల్లలతో గడుపుతుంది వీణ.
చిరునవ్వే సందేశం..
బాధ లేనిది ఎవరికి? బాధ పడుతూ కూర్చోవడం కంటే దాని నుంచి బయటపడడానికి కొత్తబాట వెదకాలి. మనకంటే ఎక్కువ బాధలు పడుతున్న వారు, పెద్ద పెద్ద సమస్యల్లో ఉన్న వారు ఎంతోమంది మన చుట్టుపక్కలే ఉన్నారు. అంత కష్టంలోనూ వారి పెదవి మీద కనిపించే చిరునవ్వు మనకు సందేశాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. – వీణా అంబరీష
ఇవి చదవండి: World Human Trafficking Day: ట్రాఫికింగ్ నెట్‌తో జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment