పారా‘చెక్‌’ | Blood test with slides in old way | Sakshi
Sakshi News home page

పారా‘చెక్‌’

Published Fri, Jun 2 2017 9:46 AM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM

పారా‘చెక్‌’

పారా‘చెక్‌’

► మలేరియా నిర్ధారణకు మీనమేషాలు
► పాత పద్ధతిలో స్లైడ్లతో రక్తపరీక్షలు
► జ్వర పీడితులకు సకాలంలో అందని వైద్యం
► ఎపిడమిక్‌కు ముందస్తు చర్యలు చేపట్టని ప్రభుత్వం


మలేరియా అనగానే విశాఖ ఏజెన్సీ గుర్తుకొస్తుంది. ఈ మహమ్మారి విజృంభణతో ఆదివాసీలు పిట్టల్లా రాలిపోయిన సందర్భాలను గుర్తు చేసుకుంటే భయం గొలుపుతుంది. ఈ ఏడాది మాత్రం దీని నియంత్రణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేకపోయింది. గిరిజనుల సంక్షేమమే ధ్యేయమని ఊకదంపుడు ప్రసంగాలిచ్చే పాలకులు మలేరియాను క్షణాల్లో నిర్ధారించే పారాచెక్‌ కిట్లను కూడా ఆస్పత్రులలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచలేకపోయారు.

హుకుంపేట (అరకులోయ): పారాచెక్‌ కిట్లు ఏజెన్సీలోని పీహెచ్‌సీల్లో లేకపోవడంతో మలేరియా నిర్ధారణ సకాలం జరగడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి మే 28వ తేదీ వరకు మన్యంలో 11,073 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జ్వర పీడితులకు రక్తపరీక్షలను స్లైడ్స్‌ పద్ధతిలో ఇప్పుడు చేపడుతున్నారు. ఈ నివేదిక వచ్చేందుకు 24 గంటల సమయం పడుతోంది. మలేరియా బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించకుంటే ప్రాణాంతక సెరిబ్రల్‌గా మారి ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. అదే పారాచెక్‌లతో రక్తపరీక్షలు చేపడితే క్షణాల్లో అది మలేరియా..కాదా అన్నది నిర్ధారణ అవుతుంది. కానీ గ్రామాలలో తిరిగే వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తల వద్ద పారాచెక్‌లు లేవు. ఒకటి,రెండు కిట్లతో గ్రామాలను వైద్యసిబ్బంది సందర్శించాలిసిన దుస్థితి.

ఏటా ఏప్రిల్‌ నెల నుంచి మన్యంలో వ్యాధుల కాలం మొదలవుతుంది. మలేరియా, ఇతరత్రా వ్యాధుల నివారణకు జనవరి నెల నుంచే ముందస్తుగా ,ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం, వైద్యఆరోగ్య, మలేరియా శాఖలు ప్రణాళికలు రుపోందించాలి. ఈ ఏడాది జనవరి నెల నుంచే మలేరియా తీవ్రత నెలకొంది. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 36 ఆరోగ్య కేంద్రాలతో పాటు, అరకులోయ, పాడేరు, నర్సీపట్నం, కె.కోటపాడు ఏరియా ఆస్పత్రులలో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఆస్పత్రులన్నింటిలోనూ పారాచెక్‌లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో జ్వరపీడితులకు ,క్షణాల్లో రక్తపరీక్షలు జరగడం లేదు. ప్రతి ఆస్పత్రి పరిధిలో కనీసం 2వేల పారాచెక్‌ కిట్లు అందుబాటులో ఉండాలి. ఒక్కోదానిలో ప్రస్తుతం 100 కూడా లేవు.

జ్వరంతో పరిస్థితి విషమించిన వారికి మాత్రమే ఉన్నవాటితో ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నారు. మిగతా జ్వరపీడితులకు రక్తపరీక్షలు ఆలస్యమవుతున్నాయి. పారాచెక్‌లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతామని, ఈమేరకు జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చామని మలేరియా శాఖాధికారులు గత నెలలో ప్రకటించారు.కానీ  కొత్త కిట్లు మన్యానికి రాలేదు. పాత పద్ధతిలో స్లైడ్‌లపై రక్తపూతలు సేకరించి తెచ్చి ల్యాబ్‌లలో  పరీక్షలు చేస్తున్నారు. ఎపిడమిక్‌ దృష్ట్యా ఆస్పత్రులకు జ్వరపీడితుల తాకిడి అధికంగా ఉంటోంది. ఈ కారణంగా పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. మరుసటి రోజున వ్యాధి నిర్ధారణ చేసి, సంబంధిత రోగి ఉండే గ్రామాలకు వైద్యసిబ్బంది పరుగులు తీస్తున్నారు.ఆసమయంలో మలేరియా సోకిన గిరిజనుడు ఉంటే వైద్యసేవలు కల్పిస్తున్నారు. రోగి లేకపోతే వైద్యసేవలు ఆలస్యమవుతున్నాయి.

రెండు రోజుల్లో 20వేల కిట్లు...
మలేరియాను సకాలంలో నిర్ధారించే పారాచెక్‌ ఆర్‌డీ కిట్లు 20వేలు రెండు రోజుల్లో అందుబాటులోకి తెస్తాం. జిల్లా కలెక్టర్‌ అనుమతి లభించడంతో పారాచెక్‌లను ఏజెన్సీలోని అన్ని ఆస్పత్రులకు పంపిణీకి చర్యలు చేపట్టాం. ప్రతి జ్వరపీడితుని క్షణాల్లో మలేరియా నిర్ధారణ పరీక్షలు జరుపుతాం. - ప్రసాదరావు, జిల్లా మలేరియా అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement