మన్యం జల్లెడ | To celebrate a decade of the Maoist party | Sakshi
Sakshi News home page

మన్యం జల్లెడ

Published Mon, Sep 22 2014 12:35 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

మన్యం జల్లెడ - Sakshi

మన్యం జల్లెడ

  • భారీగా బలగాల మోహరింపు
  •  మావోయిస్టు పార్టీ దశాబ్ది ఉత్సవాలను అడ్డుకొనే వ్యూహం
  •  ఆరు మండలాలపై ప్రత్యేక దృష్టి
  •  పోలీసులు, మావోల సంచారంతో గిరిజనుల్లో భయం
  • మావోయిస్టుల దశాబ్ది ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కావడంతో మన్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. గ్రేహౌండ్స్‌తోపాటు ఏపీఎస్‌పీ పోలీసులను కూంబింగ్‌కు దింపారు. ఒడిశా సరిహద్దు వరకు పోలీసుల కూంబింగ్‌తో ఏజెన్సీలో యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో వ్యవసాయ పనుల కోసం వెళ్లిన గిరిజనుల సాయంత్రానికే ఇంటికి చేరుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
     
    పాడేరు /కొయ్యూరు: విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల అలజడితో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మావోయిస్టు పార్టీ దశాబ్ది ఉత్సవాలను అడ్డుకునేందుకు పోలీసు శాఖ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలలో ఉద్యమాలు నడుపుతున్న మావోయిస్టు అగ్రనేతలు ఇటీవల విశాఖ ఏజెన్సీలో చొరబడి ప్రజా సదస్సులు, బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలు చేపడుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసు యంత్రాంగం కూంబింగ్ చర్యలను ఉధృతం చేసింది.

    కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల  పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతాల్లో మూడురోజుల నుంచి పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి. అదనపు పోలీసు బలగాలను కూడా పోలీసు స్టేషన్లలో అందుబాటులో ఉంచారు. ఒడిశా సరిహద్దు వరకు పోలీసుల కూంబింగ్‌తో ఏజెన్సీలో యుద్ధ వాతావరణం నెలకొంది.

    ఓ వైపు మావోయిస్టులు కూడా అభయారణ్యంలో సంచరిస్తున్నారు. మావోల సంచారంపై సమాచారం తెలుసుకుంటూనే పోలీసులు కూడా అటువైపే గాలింపు చర్యలు చేపడుతుండడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. మా రుమూల గ్రామాలలో గిరిజనులు బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. పోలీసులు, మావోయిస్టుల సంచారంతో ఏ క్షణానికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఈ మారుమూల గ్రామాల గిరిజనుల్లో నెలకొంది.
     
    20 గ్రామాల్లో కూంబింగ్ : ఈనెల 13న తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలం జంగాలతోటలో మువ్వల నరేశ్‌ను మావోయిస్టులు హతమార్చడంతో తూర్పు పోలీసులు కూడా వై.రామవరం - కొయ్యూరు  మండలాల సరిహద్దుగా ఉన్న  20 గ్రామాల్లో కూంబింగ్ చేపట్టారు. కొన్నిచోట్ల పోలీసులు గుర్తుపట్టేందుకు వీలు లేకుండా తలపాగా చుట్టుకుని లుంగీలతో వెళుతున్నట్టుగా గిరిజనులు చెబుతున్నారు. ఆదివారం కొయ్యూరు సంత కావడంతో పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. సుమారు 30 గ్రామాలకు చెందిన గిరిజనులు దీనికి వస్తారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యాపారులు కూడా ఈ సంతకు వస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలీసులు తనిఖీలు చేశారు.
     
    అగ్రనేతల సంచారం

    చింతపల్లి : విశాఖ మన్యంలోకి మావోయిస్టు అగ్రనేతలు ప్రవేశించారనే పక్కా సమాచారంతో పోలీసు బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.  కొయ్యూరు, జీకేవీధి మండలాల సరిహద్దు ప్రాంతంలో ఇటీవల గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేసి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన విషయం విధితమే. ఇటీవల జీకేవీధి మండలంలో ఒక మారుమూల అటవీ ప్రాంతంలో భారీ బహిరంగ సభకు పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నారు.

    ఈ సమావేశానికి మావోయిస్టు అగ్రనేతలైన చలపతి, రవి కూడా హాజరుకావాల్సి ఉంది. విషయం రెండురోజుల ముందే పోలీసులకు తెలియడంతో ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. పోలీసులు వచ్చారనే సమాచారం తెలుసుకుని అగ్రనేతలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. దీంతో సాయంత్రం నాలుగు గంటలకే వ్యవసాయ పనులకు వెళ్లిన గిరిజనులు ఇళ్లకు చేరుకుంటున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement