వెలికి తీసిన విలువైన రంగురాళ్లు
రంగురాళ్లంటే వెంటనే గుర్తొచ్చేది విశాఖ ఏజెన్సీ.. అందులో నర్సీపట్నం ప్రాంతాలే. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విలువైన వైఢూర్యాలు ఇక్కడికి సమీపంలో లభ్యం కావడమే ఇందుకు కారణం. నెల రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తూ.. అప్పట్లో మూసివేసిన క్వారీలన్నీ తవ్వకాలకు అనువుగా మారడంతో అందరూ దృష్టీ దీనిపై పడింది. నెలరోజుల క్రితం సాక్షాత్తూ డీఎఫ్‌వో డ్రైవర్ ఆధ్వర్యంలో కొంతమంది రంగురాళ్ల తవ్వకాలకు యత్నించి దొరికిపోయిన సంఘటన మరువక ముందే వారం నుంచి గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం, జీకే వీధి, చింతపల్లి మండలాల్లో సిగనాపల్లి, మేడూరు, గుర్రాలగొందిల్లో క్వారీలలో సైతం తవ్వకాలు కొనసాగిస్తున్నారు. రంగురాళ్ల వ్యాపారానికి నర్సీపట్నం కేంద్రంగా మారింది. వారం రోజుల్లో సుమారు రూ.5 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలిసింది. ఫారెస్టు, పోలీసు సిబ్బంది చూసీచూడనట్టు వ్యవహరించడంతో వ్యాపారులు రంగురాళ్ల తవ్వకాలు నిరాటంకంగా సాగిస్తున్నారు. కృష్ణాబజార్ ప్రాంతంలో ఒక రంగురాళ్ల వ్యాపారి ఇల్లే ఇందుకు కేంద్రంగా మారింది. – నర్సీపట్నం
కోట్లు కురిపించే క్వారీలు.. చెంతనే ప్రమాదాలు
విశాఖ ఏజెన్సీ తూర్పు కనుమల్లోని గొలుగొండ మండలం కరక రంగురాళ్ల క్వారీలో లభించే ఆకుపచ్చ వైఢూర్యాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. పప్పుశెట్టిపాలెం, సిగనాపల్లి, గుర్రాలగొంది, మేడూరు క్వారీల్లో లభించే క్యాట్స్ ఐ రకాలకు కూడా డిమాండ్ ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రంగురాళ్ల తవ్వకాలకు అనువుగా మారాయి. నర్సీపట్నానికి చెందిన వ్యాపారులు సమీప గ్రామాల్లోని కొంతమందికి డబ్బులు ఇచ్చి పప్పుశెట్టిపాలెం లీజు క్వారీకి సమీపంలో అనధికారికంగా రంగురాళ్ల తవ్వకాలు సాగిస్తున్నారు. జీకే వీధి మండలం సిగనాపల్లిలో కూడా రంగురాళ్ల తవ్వకాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. సిగనాపల్లి క్వారీలో సెల్‌సిగ్నల్స్ అందుబాటులో ఉండటం రంగురాళ్ల వ్యాపారులకు కలిసొచ్చింది.
తవ్వకాలు జరుపుతున్న కూలీలు (ఫైల్)
పోలీసు, అటవీ సిబ్బంది ఎవరు వచ్చినా ఇట్టే సమాచారం తెలుస్తుండడంతో సమయానుకూలంగా తవ్వకాలు సాగిస్తున్నారు. 1992–93లో పప్పుశెట్టిపాలెం క్వారీలో ముమ్మరంగా తవ్వకాలు జరపడంతో క్వారీ కూలి అప్పట్లో 15 మంది మృతి చెందారు. ఆ తర్వాత కరకలో రంగురాళ్ల క్వారీ కూలి ముగ్గురు మృతి చెందారు. కరక ప్రమాదం తర్వాత అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌ప్రకాష్ , జిల్లా పోలీసు, అటవీ అధికారులు రంగురాళ్ల క్వారీల్లో తవ్వకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అప్పటి నుండి కరక, పప్పుశెట్టిపాలెం ప్రాంతాల్లో తవ్వకాలకు అడ్డుకట్ట పడింది. ఇటీవల పప్పుశెట్టిపాలెం, సిగనాపల్లి క్వారీలో భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ లభ్యమవుతున్న రంగురాళ్లను నర్సీపట్నం తరలిస్తున్నారు. చదవండి: (ఇక సొంత ఊరే.. వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్)
నర్సీపట్నానికి చెందిన వ్యాపారి క్రయవిక్రయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. విశాఖపట్నం, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఈ వ్యాపారి వద్దకు వచ్చి రంగురాళ్లు కొనుగోలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సిగనాపల్లి క్వారీలో లభ్యమైన రంగురాళ్లు సుమారు రెండు కోట్ల రూపాయలకు విక్రయించినట్లు తెలిసింది. రంగురాళ్ల వ్యాపారుల ధన దాహనికి మరింత మంది అమాయకులు ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసు, అటవీ, రెవెన్యూ అధికారులు రంగురాళ్ల తవ్వకాలు నిరోధించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
తవ్వకాలు జరిపితే ఉపేక్షించేది లేదు
రంగురాళ్ల తవ్వకాలు, స్మగ్లింగ్ జరిపితే వదిలే ప్రసక్తి లేదు. లీజు క్వారీల వద్ద తప్ప మిగిలిన చోట్ల తవ్వకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహించే వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి రంగురాళ్ల తవ్వకాలకు వెళ్ళ వద్దు. ఎవరైనా వ్యాపారులు డబ్బులిచ్చి తవ్వకాలు జరపమని ప్రోత్సహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
–మణికంఠ చందోలు, నర్సీపట్నం ఏఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment