కీలక రికార్డులు ఏమైనట్టు? | Anyway key records? | Sakshi
Sakshi News home page

కీలక రికార్డులు ఏమైనట్టు?

Published Sat, Dec 6 2014 12:32 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

Anyway key records?

చింతపల్లి సబ్ ట్రెజరీ కుంభకోణం విచారణ వేగవంతం
పాడేరు ఏడీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పోలీసు తనిఖీలు
 పలు రికార్డులు సీజ్

 
పాడేరు : విశాఖ ఏజెన్సీ చింతపల్లి సబ్ ట్రెజరీలో వైద్య ఆరోగ్యశాఖ నిధుల కుంభకోణంపై విచారణ వేగవంతమైంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఈ కుంభకోణంపై విచారణ జరపాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. విశాఖపట్నంలోని క్రైం స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులు ట్రెజరీ కుంభకోణంపై వారం రోజుల నుంచి విచారణ చేపడుతున్నారు. చింతపల్లి సబ్ ట్రెజరీ, విశాఖపట్నం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని రికార్డులన్నింటినీ సీజ్ చేసి విచారణ జరుపుతున్న క్రైం బ్రాంచ్ డీఎస్పీ కృష్ణవర్మ, శుక్రవారం పాడేరు ఏడీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో కార్యాలయంలో ఉన్న ఏడీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు నుంచి పలు రికార్డులు స్వాధీనం చేసుకుని సమగ్ర పరిశీలన జరిపారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్‌లో చింతపల్లి సబ్ ట్రెజరీ నుంచి డ్రా చేసిన రూ.3 కోట్ల సొమ్ముకు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేకపోవడంపై డీఎస్పీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంత బడ్జెట్ వచ్చింది, ఖర్చు, జీతాల పేరిట డ్రా చేసిన సొమ్ము వివరాల రికార్డులు కూడా లేకపోయాయి.

ఏడీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సూపరిండెంట్‌గా విధులు నిర్వహించి ప్రస్తుతం ట్రెజరీ కుంభకోణంలో కీలకవ్యక్తిగా మారిన సంజీవరావు పరారీలో ఉండటంతో ఈ రికార్డులన్నీ ఎక్కడ పెట్టారో తెలియడం లేదని, తాను కూడా ఇటీవలే ఏడీఎంహెచ్‌ఓగా బాధ్యత స్వీకరించానని డాక్టర్ వెంకటేశ్వరరావు పోలీసు అధికారులకు వివరించారు. 2011 నుంచి వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్, చింతపల్లి ట్రెజరీలో డ్రా చేసిన నగదు వివరాల రికార్డులు కూడా కనిపించ లేదు. అందుబాటులో ఉన్న కొన్ని రికార్డులను మాత్రం వీఆర్వోలు వెంక టలక్ష్మి, మత్స్యకొండబాబు సమక్షంలో డీఎస్పీ కృష్ణవర్మ, ఎస్‌ఐ గోపాలరావులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ కృష్ణవర్మ విలేకరులతో మాట్లాడుతూ ఏడీఎంహెచ్‌ఓ కార్యాలయంలో రికార్డులు సక్రమంగా లేవని, ముఖ్యమైన రికార్డులు కూడా కనిపించడం లేదన్నారు. ఈ కుంభకోణంలో కీలకవ్యక్తులు పరారీలో ఉండటంతో రికార్డులు కూడా వారి వద్దే ఉన్నట్టు తెలుస్తోందని, త్వరలోనే విచారణ పూర్తి చే స్తామన్నారు.
 
అవినీతి ఉద్యోగుల చిట్టా రెడీ

చింతపల్లి సబ్ ట్రెజరీలో వైద్య ఆరోగ్యశాఖ నిధులను నకిలీ ఉద్యోగుల పేరిట పక్కదారి పట్టించడంతో కీలకంగా వ్యవహరించిన అధికారులు, ఉద్యోగుల చిట్టాను పోలీసు శాఖ సిద్ధం చేస్తోంది. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని కొంత మంది అధికారులతో పాటు 420 జీఓను అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడిన మాజీ ఏడీఎంహెచ్‌ఓ డాక్టర్ స్వప్నకుమారి, ఏడీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని సంజీవరావు, చింతపల్లి మండలంలోని జూనియర్ అసిస్టెంట్ సాగిన సింహాచలం మరికొంత మంది సిబ్బందితో పాటు సబ్ ట్రెజరీలోని ప్రధాన సూత్రధారి అప్పలరాజు మరికొంత మంది ట్రెజరీ ఉద్యోగులపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కొంత మంది ఉద్యోగులు ఈ అవినీతి సొమ్మును తిరిగి ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పూర్తిగా రికవరీ అనంతరమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో  జిల్లా కలెక్టర్ ఉన్నట్టు తెలిసింది.

కుంభకోణంలో బాధ్యులపై చర్యలు : ఎస్పీ ప్రవీణ్

చింతపల్లి రూరల్ : ఇక్కడి సబ్‌ట్రెజరీ కార్యాలయంలో జరిగిన అవినీతిలో బాధ్యలపై చర్యలు తప్పవని రూరల్ ఎస్పీ ప్రవీణ్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి సిబ్బంది నివేదిక తయారు చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యశాఖలో పని చేస్తున్న 41 మందికి రూ.1.10 కోట్లు అవసరం కాగా రూ.5 కోట్లు నిధులు మంజూరు చేయడంపై సంబంధిత శాఖాధికారులపై నిబంధనల ప్రకారం దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అధిక బిల్లుల మంజూరు, చెల్లింపులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు నివేదికను సమర్పించిన అనంతరం ఏ స్థాయి అధికారిపైనైనా కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో సీఐ ప్రసాద్, ఎస్‌ఐ తారకేశ్వరరావు పాల్గొన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement