Chintapalli Sub-Treasury
-
కీలక రికార్డులు ఏమైనట్టు?
చింతపల్లి సబ్ ట్రెజరీ కుంభకోణం విచారణ వేగవంతం పాడేరు ఏడీఎంహెచ్ఓ కార్యాలయంలో పోలీసు తనిఖీలు పలు రికార్డులు సీజ్ పాడేరు : విశాఖ ఏజెన్సీ చింతపల్లి సబ్ ట్రెజరీలో వైద్య ఆరోగ్యశాఖ నిధుల కుంభకోణంపై విచారణ వేగవంతమైంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఈ కుంభకోణంపై విచారణ జరపాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. విశాఖపట్నంలోని క్రైం స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులు ట్రెజరీ కుంభకోణంపై వారం రోజుల నుంచి విచారణ చేపడుతున్నారు. చింతపల్లి సబ్ ట్రెజరీ, విశాఖపట్నం డీఎంహెచ్ఓ కార్యాలయంలోని రికార్డులన్నింటినీ సీజ్ చేసి విచారణ జరుపుతున్న క్రైం బ్రాంచ్ డీఎస్పీ కృష్ణవర్మ, శుక్రవారం పాడేరు ఏడీఎంహెచ్ఓ కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో కార్యాలయంలో ఉన్న ఏడీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు నుంచి పలు రికార్డులు స్వాధీనం చేసుకుని సమగ్ర పరిశీలన జరిపారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్లో చింతపల్లి సబ్ ట్రెజరీ నుంచి డ్రా చేసిన రూ.3 కోట్ల సొమ్ముకు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేకపోవడంపై డీఎస్పీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంత బడ్జెట్ వచ్చింది, ఖర్చు, జీతాల పేరిట డ్రా చేసిన సొమ్ము వివరాల రికార్డులు కూడా లేకపోయాయి. ఏడీఎంహెచ్ఓ కార్యాలయంలో సూపరిండెంట్‌గా విధులు నిర్వహించి ప్రస్తుతం ట్రెజరీ కుంభకోణంలో కీలకవ్యక్తిగా మారిన సంజీవరావు పరారీలో ఉండటంతో ఈ రికార్డులన్నీ ఎక్కడ పెట్టారో తెలియడం లేదని, తాను కూడా ఇటీవలే ఏడీఎంహెచ్ఓగా బాధ్యత స్వీకరించానని డాక్టర్ వెంకటేశ్వరరావు పోలీసు అధికారులకు వివరించారు. 2011 నుంచి వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్, చింతపల్లి ట్రెజరీలో డ్రా చేసిన నగదు వివరాల రికార్డులు కూడా కనిపించ లేదు. అందుబాటులో ఉన్న కొన్ని రికార్డులను మాత్రం వీఆర్వోలు వెంక టలక్ష్మి, మత్స్యకొండబాబు సమక్షంలో డీఎస్పీ కృష్ణవర్మ, ఎస్ఐ గోపాలరావులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ కృష్ణవర్మ విలేకరులతో మాట్లాడుతూ ఏడీఎంహెచ్ఓ కార్యాలయంలో రికార్డులు సక్రమంగా లేవని, ముఖ్యమైన రికార్డులు కూడా కనిపించడం లేదన్నారు. ఈ కుంభకోణంలో కీలకవ్యక్తులు పరారీలో ఉండటంతో రికార్డులు కూడా వారి వద్దే ఉన్నట్టు తెలుస్తోందని, త్వరలోనే విచారణ పూర్తి చే స్తామన్నారు. అవినీతి ఉద్యోగుల చిట్టా రెడీ చింతపల్లి సబ్ ట్రెజరీలో వైద్య ఆరోగ్యశాఖ నిధులను నకిలీ ఉద్యోగుల పేరిట పక్కదారి పట్టించడంతో కీలకంగా వ్యవహరించిన అధికారులు, ఉద్యోగుల చిట్టాను పోలీసు శాఖ సిద్ధం చేస్తోంది. డీఎంహెచ్ఓ కార్యాలయంలోని కొంత మంది అధికారులతో పాటు 420 జీఓను అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడిన మాజీ ఏడీఎంహెచ్ఓ డాక్టర్ స్వప్నకుమారి, ఏడీఎంహెచ్ఓ కార్యాలయంలోని సంజీవరావు, చింతపల్లి మండలంలోని జూనియర్ అసిస్టెంట్ సాగిన సింహాచలం మరికొంత మంది సిబ్బందితో పాటు సబ్ ట్రెజరీలోని ప్రధాన సూత్రధారి అప్పలరాజు మరికొంత మంది ట్రెజరీ ఉద్యోగులపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కొంత మంది ఉద్యోగులు ఈ అవినీతి సొమ్మును తిరిగి ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పూర్తిగా రికవరీ అనంతరమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో జిల్లా కలెక్టర్ ఉన్నట్టు తెలిసింది. కుంభకోణంలో బాధ్యులపై చర్యలు : ఎస్పీ ప్రవీణ్ చింతపల్లి రూరల్ : ఇక్కడి సబ్‌ట్రెజరీ కార్యాలయంలో జరిగిన అవినీతిలో బాధ్యలపై చర్యలు తప్పవని రూరల్ ఎస్పీ ప్రవీణ్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి సిబ్బంది నివేదిక తయారు చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యశాఖలో పని చేస్తున్న 41 మందికి రూ.1.10 కోట్లు అవసరం కాగా రూ.5 కోట్లు నిధులు మంజూరు చేయడంపై సంబంధిత శాఖాధికారులపై నిబంధనల ప్రకారం దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అధిక బిల్లుల మంజూరు, చెల్లింపులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు నివేదికను సమర్పించిన అనంతరం ఏ స్థాయి అధికారిపైనైనా కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో సీఐ ప్రసాద్, ఎస్ఐ తారకేశ్వరరావు పాల్గొన్నారు. -
సింహాచలమూ..తక్కువేం కాదు
మన్యంలో సంచలనమైన చింతపల్లి సబ్ ట్రెజరీ కుంభకోణం కీలక మలుపులు తిరుగుతోంది. కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటి వరకు ట్రెజరీ అకౌంటెంట్ పేరు మాత్రమే ప్రధానంగా వినిపించేంది. తాజాగా వైద్య ఆరోగ్యశాఖలోని చిరుద్యోగి అక్రమాలు అధికారులకు దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి. ఆ శాఖలో యూడీసీగా పనిచేస్తున్న సింహాచలం 15 నెలల్లో ఏకంగా రూ.1.4 కోట్లు కొల్లగొట్టిన విషయం వెలుగు చూసింది. చింతపల్లి: చింతపల్లి సబ్ ట్రెజరీ కార్యాలయంలో అక్రమాలపై వెద్య,ఆరోగ్యశాఖ చీఫ్ అకౌంటెంట్(హైదరాబాద్) ఐ.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం విచారణ ప్రారంభమైంది. పలు పీహెచ్‌సీల సిబ్బంది జీతభత్యాలకు సంబంధించిన వివరాలతోపాటు ట్రెజరీ ద్వారా డ్రా చేసిన నగదుకు సం బంధించిన వివరాలు, కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట పంపిణీ చేసిన డీడీలు వంటి అంశాలపై లోతుగా విచారణ జరిపారు. అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూ రు మండలాల్లోని తాజంగి, కోరుకొండ, సప్పర్ల, పెదవలస, జర్రెల, దారకొండ, రాజేంద్రపాలెం పీహెచ్సీలలో 43 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వీరి వేతనానికి సరిపడే బడ్జెట్ కాకుండా రెట్టింపు రాబట్టుకుని రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. 2013-14 సంవత్సరానికి రూ.2.87 కోట్లు ట్రెజరీ అధికారులతో కుమ్మక్కయి వైద్యశాఖ ఉద్యోగులు కాజేసీన విషయం విదితమే. ఇందుకు సహకరించిన అకౌంటెంట్ అప్పలరాజు ఖాతాలోకి రూ.17 లక్షలు నేరుగా జమ కావడంతో ఇప్పటి వరకు ఇతడే ప్రధాన నిందితునిగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం విశాఖపట్నం ఆర్సీడీ ప్రభుత్వ ఆస్పత్రిలో యూడీసీగా పని చేస్తున్న సింహాచలం 2012-13లో కోరుకొండ, దారకొండ, పెదవలస పీహెచ్‌సీల్లో యూడీసీగా డిప్యుటేషన్‌పై బాధ్యతలు చేపట్టారు. ఆయా ఆస్పత్రులలో పనిచేస్తున్న గుమాస్తాలకు సరైన కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో బిల్లుల వ్యవహారాలన్నీ ఇతనికే అప్పగించారు. ఇదే ఆదునుగా భావించిన సింహాచలం కొందరు వైద్యశాఖ అధికారులతో కుమ్మక్కయి భారీ ఎత్తున నిధులు తన ఖాతాలోకి జమ చేసుకున్నట్లు తెలిసింది. 2012 మే నుంచి 2013 మార్చి వరకు యూనియన్ బ్యాంకు చింతపల్లి బ్రాంచిలోని అకౌంట్ నంబర్లో రూ.1.4 కోట్లు జమ చేసుకున్నారు. అనంతరం అతనికి విశాఖ ఆర్సీడీ ఆస్పత్రికి బదిలీ అయింది. ఆరోగ్యశాఖలో బోగస్ కాంట్రాక్టు ఉద్యోగుల జాబితా వెలుగు చూసిన వెంటనే సింహాచలం కుంభకోణం బయటపడింది. కిందిస్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్న సింహాచలమే ఇంత భారీ అవినీతికి పాల్పడితే బడ్జెట్ కేటాయింపులకు ప్రధాన సూత్రధారులైన ఆ శాఖ ఉన్నతాధికారులు ఇంకెన్ని కోట్లు కొల్లగొట్టారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్లు కొల్లగొట్టిన సింహాచలం విశాఖపట్నం, రింతాడ ప్రాంతాల్లో విలువైన భవంతులు నిర్మించుకున్నాడని, మైదాన ప్రాంతాల్లో విలాస వంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని ఈ ప్రాంత ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఆస్పత్రుల రికార్డులు పరిశీలన స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్ని పీహెచ్‌సీల రికార్డులను తనిఖీ బృందంప్రాథమికంగా పరిశీలించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పీహెచ్సీలలో గతంలో పని చేసిన వైద్యాధికారులు, యూడీసీలు, గుమస్తాల వంటి వారి వివరాలను కూడా సేకరించారు. 2013-14కు సంబంధించి బ్యాంకుల ద్వారా డ్రా చేసిన అన్ని రకాల నగదు వివరాలను విచారణ బృందం పరిశీలించింది. శుక్రవారం కూడా కార్యాలయంలో విచారణ జరపనున్నామని వారు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం నివేదికలను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ జూనియర్ అకౌంట్ అధికారులు ప్రవీణ్‌కుమార్, చింతపల్లి క్లస్టర్ అధికారి శర్మ ,తదితరులు ఉన్నారు. -
తవ్వే కొద్దీ అక్రమాలు
పాడేరు/చింతపల్లి: చింతపల్లి సబ్ ట్రెజరీలో తవ్వే కొద్దీ అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. లేని ఉద్యోగుల పేరిట రూ.2.87 కోట్లు పక్కదారి పట్టినట్టు ప్రాథమిక విచారణలో తేలడంతో జిల్లా ఉన్నతాధికారులు మరింత లోతుగా విచారణకు చర్యలు చేపట్టారు. ట్రెజరీలో అవకతవకలపై సమగ్ర విచారణకు కలెక్టర్ యువరాజ్ ఆదేశించారు. ఇందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికను కూడా సమర్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్ఎఫ్ఎల్ ఆడిట్ బృందం చింతపల్లి ఖజానా కార్యాలయంలో సమగ్ర విచారణ జరిపింది. అక్రమాలు వాస్తవమేనని నిర్ధారణకు వచ్చాక, ఆ నివేదికను కలెక్టర్‌కు అందజేసింది. 2013కు ముందు కూడా భారీస్థాయిలో అక్రమాలు జరిగినట్లు అధికారులకు ఫిర్యాదులు అందడంలో 2011 నుంచి సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు. చింతపల్లి ట్రెజరీలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు జరిపిన చెల్లింపుల వివరాలన్నీ సేకరించిన ప్రత్యేక అధికారుల బృందం సుమారు రూ.8 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టాయనే నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా పలు పీహెచ్‌సీల రికార్డులను అధికారులు మళ్లీ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. భారీ కుంభకోణంలో 60 మంది వైద్య ఆరోగ్యశాఖ నిధులను పక్కదారి పట్టించి రూ.కోట్లను కాజేసిన ఈ భారీ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన వైద్య శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. డీఎంహెచ్‌వో, ఏడీఎంహెచ్ఓ, ఆయా కార్యాలయాల సీనియర్ అసిస్టెంట్లు, చింతపల్లి ఉప ఖజాన కార్యాలయం పరిధిలోని ఆరోగ్య కేంద్రాల వైద్యులు, కార్యాలయ అధికారులు, కొంతమంది వైద్య ఉద్యోగులు కూడా ఇందులో సూత్రధారులుగా తనిఖీ బృందం అధికారులు నిర్ధారించారు. కొంత మంది వైద్య ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోనే రూ.లక్షలు డిపాజిట్ అయినా నోరు మెదపకుండా వ్యవహరించిన తీరును కూడా తనిఖీ బృందం అధికారులు తప్పుపడుతున్నారు. ఈ వ్యవహారంలో వారి పాత్రలపై కూడా నివేదికను సిద్ధం చేశారు. చింతపల్లి ఉపఖజానా కార్యాలయంలో రూ.కోట్ల అవకతవకలను ప్రభుత్వం కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నది. జిల్లా కలెక్టర్ యువరాజ్ ఎప్పటికప్పుడు ఈ వివరాలను సేకరిస్తున్నారు.