మన్యంలో సంచలనమైన చింతపల్లి సబ్ ట్రెజరీ కుంభకోణం కీలక మలుపులు తిరుగుతోంది. కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటి వరకు ట్రెజరీ అకౌంటెంట్ పేరు మాత్రమే ప్రధానంగా వినిపించేంది. తాజాగా వైద్య ఆరోగ్యశాఖలోని చిరుద్యోగి అక్రమాలు అధికారులకు దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి. ఆ శాఖలో యూడీసీగా పనిచేస్తున్న సింహాచలం 15 నెలల్లో ఏకంగా రూ.1.4 కోట్లు కొల్లగొట్టిన విషయం వెలుగు చూసింది.
చింతపల్లి: చింతపల్లి సబ్ ట్రెజరీ కార్యాలయంలో అక్రమాలపై వెద్య,ఆరోగ్యశాఖ చీఫ్ అకౌంటెంట్(హైదరాబాద్) ఐ.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం విచారణ ప్రారంభమైంది. పలు పీహెచ్‌సీల సిబ్బంది జీతభత్యాలకు సంబంధించిన వివరాలతోపాటు ట్రెజరీ ద్వారా డ్రా చేసిన నగదుకు సం బంధించిన వివరాలు, కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట పంపిణీ చేసిన డీడీలు వంటి అంశాలపై లోతుగా విచారణ జరిపారు. అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూ రు మండలాల్లోని తాజంగి, కోరుకొండ, సప్పర్ల, పెదవలస, జర్రెల, దారకొండ, రాజేంద్రపాలెం పీహెచ్‌సీలలో 43 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు.
వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వీరి వేతనానికి సరిపడే బడ్జెట్ కాకుండా రెట్టింపు రాబట్టుకుని రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. 2013-14 సంవత్సరానికి రూ.2.87 కోట్లు ట్రెజరీ అధికారులతో కుమ్మక్కయి వైద్యశాఖ ఉద్యోగులు కాజేసీన విషయం విదితమే. ఇందుకు సహకరించిన అకౌంటెంట్ అప్పలరాజు ఖాతాలోకి రూ.17 లక్షలు నేరుగా జమ కావడంతో ఇప్పటి వరకు ఇతడే ప్రధాన నిందితునిగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం విశాఖపట్నం ఆర్‌సీడీ ప్రభుత్వ ఆస్పత్రిలో యూడీసీగా పని చేస్తున్న సింహాచలం 2012-13లో కోరుకొండ, దారకొండ, పెదవలస పీహెచ్‌సీల్లో యూడీసీగా డిప్యుటేషన్‌పై బాధ్యతలు చేపట్టారు. ఆయా ఆస్పత్రులలో పనిచేస్తున్న గుమాస్తాలకు సరైన కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో బిల్లుల వ్యవహారాలన్నీ ఇతనికే అప్పగించారు.
ఇదే ఆదునుగా భావించిన సింహాచలం కొందరు వైద్యశాఖ అధికారులతో కుమ్మక్కయి భారీ ఎత్తున నిధులు తన ఖాతాలోకి జమ చేసుకున్నట్లు తెలిసింది. 2012 మే నుంచి 2013 మార్చి వరకు యూనియన్ బ్యాంకు చింతపల్లి బ్రాంచిలోని అకౌంట్ నంబర్‌లో రూ.1.4 కోట్లు జమ చేసుకున్నారు. అనంతరం అతనికి విశాఖ ఆర్‌సీడీ ఆస్పత్రికి బదిలీ అయింది. ఆరోగ్యశాఖలో బోగస్ కాంట్రాక్టు ఉద్యోగుల జాబితా వెలుగు చూసిన వెంటనే సింహాచలం కుంభకోణం బయటపడింది. కిందిస్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్న సింహాచలమే ఇంత భారీ అవినీతికి పాల్పడితే బడ్జెట్ కేటాయింపులకు ప్రధాన సూత్రధారులైన ఆ శాఖ ఉన్నతాధికారులు ఇంకెన్ని కోట్లు కొల్లగొట్టారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్లు కొల్లగొట్టిన సింహాచలం విశాఖపట్నం, రింతాడ ప్రాంతాల్లో విలువైన భవంతులు నిర్మించుకున్నాడని, మైదాన ప్రాంతాల్లో విలాస వంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని ఈ ప్రాంత ఉద్యోగులు చెప్పుకుంటున్నారు.
ఆస్పత్రుల రికార్డులు పరిశీలన
స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్ని పీహెచ్‌సీల రికార్డులను తనిఖీ బృందంప్రాథమికంగా పరిశీలించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పీహెచ్‌సీలలో గతంలో పని చేసిన వైద్యాధికారులు, యూడీసీలు, గుమస్తాల వంటి వారి వివరాలను కూడా సేకరించారు. 2013-14కు సంబంధించి బ్యాంకుల ద్వారా డ్రా చేసిన అన్ని రకాల నగదు వివరాలను విచారణ బృందం పరిశీలించింది. శుక్రవారం కూడా కార్యాలయంలో విచారణ జరపనున్నామని వారు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం నివేదికలను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ జూనియర్ అకౌంట్ అధికారులు ప్రవీణ్‌కుమార్, చింతపల్లి క్లస్టర్ అధికారి శర్మ ,తదితరులు ఉన్నారు.
సింహాచలమూ..తక్కువేం కాదు
Published Fri, Nov 28 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM
Advertisement