కుటుంబమంతా ఉద్యమంలోనే..
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన అరుణక్క
- ఆమె తండ్రి, సోదరుడూ ఉద్యమబాటలోనే
-16 ఏళ్ల కిందట లొంగిపోయిన మావోయిస్టు అరుణక్క తండ్రి
- గత మే 4న ఎన్‌కౌంటర్‌లో కన్నుమూసిన సోదరుడు ఆజాద్
పెందుర్తి: ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినట్లు భావిస్తున్న మావోయిస్ట్ అరుణక్క కుటుంబం మొత్తం ఉద్యమ బాటలో ఉంది. వెంకటరవివర్మ లక్ష్మణరావు, అర్జునమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. చాలాకాలం ఉద్యమంలో ఉన్న లక్షణరావు.. 16 ఏళ్ల కిందట ప్రభుత్వానికి లొంగిపోయారు. వీరి స్వస్థలం విజయవాడ సమీపంలోని మహంతిపురం. లక్ష్మణరావు లొంగుబాటు తరువాత కుటుంబంతో సహా విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెంలో స్థిరపడ్డారు. ఉన్నత విద్యను అభ్యసించిన లక్ష్మణరావు ప్రస్తుతం ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. తాజా ఎన్‌కౌంటర్‌లో మరణించిన లక్ష్మణరావు పెద్దకుమార్తె చైతన్య అలియాస్ అరుణక్క ఒడిశా మావోయిస్ట్ దళంలో కీలక సభ్యురాలిగా ఉన్నారు. 16 ఏళ్ల కిందట ఆమె ఉద్యమంలోకి వెళ్లింది.
అప్పటి నుంచి ఇప్పటికి ఒకటి రెండుసార్లు మాత్రమే ఆమె తల్లిదండ్రులతో మాట్లాడింది. లక్ష్మణరావు రెండో కుమార్తె ఝాన్సీ ప్రజా ఉద్యమకారిణి. అడ్వకేట్. హిందుజా పవర్‌ప్లాంట్, గంగవరం పోర్టు పోరాటంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. లక్ష్మణరావు మూడో సంతానం గోపాల్ అలియాస్ ఆజాద్ ఇంజనీరింగ్ వరకు చదువుకున్నాడు. యుక్తవయసు నుంచీ ఉద్యమం వైపు నడిచాడు. 2002లో తొలిసారి మావోయిస్ట్ సభ్యునిగా చేరాడు. 2006లో మావోయిస్టులకు ఆయుధాలు, సాంకేతిక సామగ్రి సరఫరా చేస్తున్నాడన్న అభియోగంతో విజయనగరంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత పూర్తిస్థాయి ఉద్యమంలోకి వెళ్లిన ఆజాద్ గాలికొండ దళానికి కమాండర్‌గా ఉన్న సమయంలో గత మే 4న విశాఖ ఏజెన్సీ కొయ్యూరులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కన్నుమూశాడు.