
బాక్సైట్ తవ్వకాలకే సర్కారు మొగ్గు
బడ్జెట్ సమావేశంలో తేటతెల్లం
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజం
పాడేరు: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం మొగ్గు చూపిస్తున్న వైఖరి బడ్జెట్ సమావేశంలో మొదటిసారి తేటతెల్లమైందని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. ఆమె గురువారం హైదరాబాద్ నుంచి ఫోన్‌లో విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్రంలో గనుల తవ్వకాల ద్వారా రూ.17,880 కోట్లు ఆదాయం సమకూర్చాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారని చెప్పారు.
రాష్ట్రంలో ఇంత ఆదాయం సమకూరే గనులు మరెక్కడా లేవని, ఏజెన్సీలో నిక్షిప్తమైన బాక్సైట్ తవ్వకాల ద్వారానే ఇది సాధ్యమవుతుందని, దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో గిరిజన సంక్షేమానికి రూ.3,100 కోట్లు కేటాయించిన ప్రయోజనమేమీ ఉండదన్నారు. గతేడాది గిరిజన సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్‌లో సుమారు రూ.900 కోట్లు దారిమళ్లించిందని వెల్లడించారు. దీని వల్ల గిరిజన సంక్షేమం కుంటుపడుతోందని, నిధులు కేటాయించినా సక్రమంగా వినియోగించకపోవడం వల్ల మౌలిక సౌకర్యాలు కూడా మెరుగు పడటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.