మన్యంలో నవలోకం!
మన్యంలో ఓ నవలోకం ఇటీవల వెలుగులోకి వచ్చింది. అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన ఈ గుహలు విశాఖ ఏజెన్సీ హుకుంపేట, అనంతగిరి మండలాల సరిహద్దులో పాటిపల్లి గ్రామానికి చేరువలో ఉన్నాయి. వీటిని భీమాలమ్మ గుహలుగా ఇక్కడి గిరిజనులు పిలుస్తున్నారు. ఇంతవరకు వారికి మాత్రమే తెలిసిన ఇవి తాజాగా బయటి ప్రపంచం దృష్టికి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న బొర్రా గుహలకన్నా ఇవి పెద్దవని ఆదివాసీలు చెబుతున్నారు.
మన్యంలో ఓ నవలోకం ఇటీవల వెలుగులోకి వచ్చింది. అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన ఈ గుహలు విశాఖ ఏజెన్సీ హు కుంపేట, అనంతగిరి మండలాల సరిహద్దులో పాటిపల్లి గ్రామానికి చేరువలో ఉన్నాయి. ఈ గుహలను భీమాలమ్మ గుహలుగా ఇక్కడి గిరిజనులు పిలుస్తున్నారు. ఇంతవరకు గిరిజనులకు మాత్రమే తెలిసిన ఈ గుహలు తాజాగా బయటి ప్రపంచం దృష్టికి వచ్చాయి. వీటికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను స్థానికులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న బొర్రా గుహలకన్నా ఈ గుహలు పరిమాణం లో ఎన్నో రెట్లు పెద్దవిగా ఉంటాయని గిరిజనులు చెబుతున్నారు. చీకటి కారణంగా 50 మీటర్ల కు మించి లోపలికి వెళ్లడానికి ఏ ఒక్కరూ ధైర్యంచేయలేకపోతున్నారు.
గుహ లోపలి మార్గం వన్యప్రాణులకు ఆవాసంగా మారినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ప్రవేశమార్గంలో 6 మీటర్ల వెడల్పు ఉండగా, లోపలికి వెళ్తున్న కొద్దీ గుహ వెడల్పు పెరుగుతోంది. లోపల మరె న్నో గుహలకు మార్గాలు ఉన్నాయి. పెద్ద లైట్లు, కాగడాలు ఉంటే సగం వరకు వెళ్లే అవకాశం ఉంది. గుహ లోపల భాగమంతా కొంతమేర రాయి అరుణ వర్ణం లో ఉండి ఎంతో ఆకర్షణగా కనిపిస్తోంది. గుహలో వెలుతురు ప్రసరించే ప్రాంతం వరకు ఏడాది పొడవునా స్థానికులు వంటచెరకును భద్రపరచుకుంటారు. ఏటా ఏప్రిల్ నెలలో గుహలో కొలువై ఉన్న భీమాలమ్మకు జాతర నిర్వహిస్తారు. ఈ గుహ లు అటవీ ప్రాంతంలో ఉండటంతో ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలియక ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదు. పర్యాటక శాఖ స్పందించి వీటి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని పాటిపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.
ఇలా వెళ్లాలి...
విశాఖ జిల్లా హుకుంపేట నుంచి బాకూరు మీదుగా మత్స్య పురం చేరుకుని అక్కడి నుంచి పాటిపల్లి గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. హుకుంపేట నుంచి దాదాపుగా 25 కిలో మీటర్లు ఉండే ఈ మార్గంలో ద్విచ క్రవాహనాలు, జీపులు వెళ్లేందుకు ఆస్కారం ఉంది. పాటిపల్లి నుంచి కాలినడకన కొండ చివరకు చేరుకుంటే..అబ్బుర పరిచే భీమాలమ్మ గుహల వద్దకు చేరుకోవచ్చు.
- హుకుంపేట