భార్యతో గొడవపడి.. పిల్లలను అనాథలు చేశాడు | Kadthal Man Hangs Himself After Fighting With Wife | Sakshi
Sakshi News home page

పెళ్లాంతో గొడవపడి.. పిల్లలను అనాథలు చేశాడు

Published Fri, Aug 30 2019 12:27 PM | Last Updated on Fri, Aug 30 2019 1:56 PM

Kadthal Man Hangs Himself After Fighting With Wife - Sakshi

సాక్షి, కడ్తాల్‌: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్యతో గొడవపడి క్షణికావేశానికి గురై ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కడ్తాల్‌ మండల కేంద్రంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుందరయ్య, స్థానికుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం రాణిపేట్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ ముజీబ్‌(38) కడ్తాల్‌ మండలం న్యామతాపూర్‌కు చెందిన సలేహాబేగంను కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. స్వగ్రామంలో ఉపాధి లేక పోవడంతో బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం దంపతులు కడ్తాల్‌ మండల కేంద్రానికి వచ్చారు. స్థానికంగా శ్రీశైలం–హైదరాబాద్‌ జాతీయ రహదారి పక్కన తలకొండపల్లి చౌరస్తాలో ముజీబ్‌ పంక్చర్‌ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

ఇటీవల మద్యానికి బానిసైన ముజీబ్‌ తరచు భార్య సలేహాబేగంతో గొడవపడుతున్నాడు. మద్యం మానేయాలని భార్య పలుమార్లు అతడిని కోరినా ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా గురువారం ఉదయం భార్యాభర్తల మధ్య మరోమారు గొడవ జరిగింది.అప్పటికే మద్యం మత్తులో ఉన్న ముజీబ్‌ భార్యను కొట్టాడు. ఆమె ఇంటి అవరణలో నిద్రించింది. ఈక్రమంలో క్షణికావేశానికి గురైన ముజీబ్‌ 11 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు భార్యతో పాటు, పోలీసులు, బంధువులకు సమాచారం అందించారు. ఏఎస్‌ఐ సీతారాంరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. స్థానిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతుడి భార్య సలేహాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుందరయ్య తెలిపారు. మృతుడికి కూతుళ్లు సుమాయ, హయిసా, కుమారుడు సోహైల్‌ ఉన్నారు.

రోదిస్తున్న భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు, స్కూల్‌ నుంచి వచ్చిన పిల్లలు
 
మా నాన్నకు ఏమైంది..
ముజీబ్‌ ఆత్మహత్యతో భార్యాపిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. దంపతులకు ఐదోతరగతి చదువుతున్న సుమాయ, నాలుగో తరగతి చదువుతున్న కూతుళ్లు హయిసాతో పాటు 1వ తరగతి చదువుతున్న కొడుకు సోహైల్‌ ఉన్నారు. వీరంతా స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్నారు. ఇదిలా ఉండగా నిత్యం మధ్యాహ్నం సమయంలో సలేహాబేగం పాఠశాలకు వెళ్లి పిల్లలకు అన్నం తినిపించి వచ్చేది. గురువారం మాధ్యాహ్నం తల్లి పాఠశాలకు రాకపోవడంతో చిన్నారులు ముగ్గురు భోజనం కో సం స్కూల్‌కు సమీపంలో ఉన్న ఇంటికి వచ్చారు.

తండ్రి ఆత్మహత్య చేసుకున్న విష యం వీరికి తెలియదు. ఇంటి ఆవరణలో అప్పటికే జనం పెద్దసంఖ్యలో గుమిగూడి ఉండడంతో వారికి ఏమీ అర్థం కాలేదు. బిక్కుబిక్కుమంటూ ఇంట్లోకి వెళ్లి చూశారు. తండ్రి విగతజీవిగా పడి ఉండడం, తల్లి రోదిస్తుండడం చూసి విషయం తెలిసింది. మా పప్పాకు ఏమైందని పలువురిని అడిగారు. కొంత సేపటికి విషయం తెలుసుకొని ‘పప్పా..’ అంటూ గుండెలుబాదుకుంటూ రోదించిన తీరు హృదయ విదారకం. చిన్నారుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement