
బాధితురాలు జెన్నె ఎల్లమ్మ
సాక్షి, తాండూరు: వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతో ఓ మహిళ రైతుబంధు డబ్బులు మరొకరి బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. సంబంధిత రైతు ఖాతాలో పడాల్సిన డబ్బులు హైదరాబాద్‌లోని ఓ వ్యక్తి ఖాతాలో పడ్డాయి. తాండూరు మండలం గౌతపూర్ గ్రామానికి చెందిన జెన్నె ఎల్లమ్మకు అల్లాపూర్ గ్రామ సమీపంలో సర్వే నంబర్ 200, 201లో 4.35 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం చేస్తూ ఆమె జీవిస్తోంది. అయితే ఆమెకు అందించాల్సిన రైతుబంధు పెట్టుబడి సహాయం ఆమె ఖాతాలో జమ కాలేదు. తనకు డబ్బులు పడలేదని ఆమె వ్యవసాయ అధికారులు, ఆంధ్రాబ్యాంక్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోంది. అయితే ఆమెకు రావాల్సిన 2018, 2019 కు సంబంధించిన రైతుబంధు డబ్బులు ఆమె ఖాతాలో కాకుండా ఇతరుల ఖాతాల్లో పడ్డాయని సమాచారం తెలిసింది. హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌కు సంబంధించిన సిండికేట్ బ్యాంక్ ఖాతా ఉన్న ఓ వ్యక్తి ఖాతాలో జమ అయినట్లు అధికారులు చెప్పారు. దీంతో ఎల్లమ్మ కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు వెళ్లి సిండికేట్ బ్యాంకులో వెళ్లి నగదు విషయమై బ్యాంక్ అధికారులను అడగ్గా తిరస్కరించారు. దీంతో ఎల్లమ్మ తాండూరులోని వ్యవసాయ కార్యాలయం చుట్టూ రైతుబంధు డబ్బుల కోసం తిరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ ఉన్నతాధికారులు స్పందించి రైతుబంధు డబ్బులు ఎల్లమ్మ ఖాతాలో జమ చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment