సాక్షి, పరిగి: ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన పరిగిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. చావుకు తన భార్యే కారణమని సూసైడ్ నోట్ సైతం రాశాడు. పోలీసులు, గ్రామస్తులు వివరాల ప్రకారం.. పరిగి పట్టణంలోని బాహర్‌పేట్ వల్లభనగర్‌కు చెందిన ముకుంద్ శ్రీనివాస్ (35) సహకార సంఘం కార్యాలయంలో ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గతంలో అతనికి వేరొక మహిళతో వివాహం జరగ్గా మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు.
నాలుగేళ్ల క్రితం శ్రీనివాస్ కొడంగల్‌కు చెందిన భాగ్యలక్ష్మిని కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో 15 రోజుల క్రితం శ్రీనివాస్ తల్లి సత్తెమ్మ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో గత మూడు రోజుల క్రితం కొడంగల్‌లోని అత్తవారింటికి శ్రీనివాస్ భార్య పిల్లలతో కలిసి నిద్ర చేసేందుకు వెళ్లాడు. అక్కడ భార్యభర్తలు గొడవపడ్డారు. గురువారం భార్య పిల్లలను అక్కడే వదిలి తన నివాసానికి చేరుకొని ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందాడు. రాత్రి 11 గంటల సమయంలో చుట్టు పక్కల వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి అతని వద్ద లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
రెండు చావులకు నా భార్యే కారణం..
మృతుడు శ్రీనివాస్ రాసిన సూసైడ్ నోట్‌లోని సారాంశం ఇది.. ఈ నెల 10న మా అమ్మ ఉరి వేసుకుని మృతి చెందింది. దీంతో దశదిన ఖర్మ అయిపోయాక 21వ తేదీన భార్య పిల్లలతో కలిసి కొడంగల్‌లోని అత్తవారింటికి వెళ్లాను. అక్కడ రాత్రి సమయంలో నా కూతురు తినకుండా మారాం చేసింది. ఆ సమయంలో నేను ఆ పక్కనే ఉన్నాననే విషయం మరిచిపోయి నా భార్య కూతురును బెదిరించింది. నీ నాయనమ్మను ఉరేసి చంపాను. నిన్ను. మీ నాన్నను కూడా చంపేస్తాను అని బెదిరించింది.
వెంటనే వెళ్లి నేను మా అమ్మను ఎందుకు చంపావని తనని నిలదీశా. కోపంతో నన్ను కింద తోసేసింది. అవును మీ అమ్మను చంపాను. నిన్ను చంపుతాను.. ఏంచేస్తావంటూ బెదిరించింది. ఇంట్లోకి తీసుకు వెళ్లి రాత్రి బయటకు రానివ్వలేదు. మరుసటి రోజు 22న ఎలాగోలా బయటకు వచ్చి పరిగికి చేరుకున్నాను. ఇక బతకి ప్రయోజనం లేదని ఆత్మహత్య చేసుకుంటున్నా. అంత్యక్రియలకయ్యే ఖర్చుకు రూ. 500 పక్కింటి వారి దగ్గర ఉన్నాయి తీసుకుని అంత్యక్రియలు జరిపించండి. నా ఇద్దరు కూతుళ్లు నవ్యశ్రీ, సాత్వికలను మా అక్క సంరక్షణలో ఉంచండి. మా అమ్మతో పాటు నా చావుకు కారణమైన నా భార్యను విచారించి శిక్షించి పోలీసులు న్యాయం చేయాలంటూ ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment