సాక్షి, రాజేంద్రనగర్: కట్నం వేధింపులు తాళలేక ఓ నవవధువు తనువు చాలించింది. కోటి ఆశలతో అత్తింట్లో కాలు పెట్టిన ఆమె భర్త వేధింపులకు విసుగుచెందిన ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ పట్టణానికి చెందిన మమత(24)ను మూడు నెలల క్రితం గండిపేట మండలం గంధంగూడ వెస్టెండ్ కాలనీకి చెందిన సురేష్‌కుమార్ వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో మమత కుటుంబసభ్యులు బంగారం, నగదుతోపాటు ఇతర వస్తువులను అందజేసి ఘనంగా వివాహం చేశారు.
సురేష్‌కుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, పెళ్లి తర్వాత నెలరోజుల నుంచి అతడు అద నపు కట్నంతోపాటు కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకొని ఆ డబ్బు తీసుకురావాలని భార్యను వేధించసాగాడు. దీంతో మమత విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. ఇటీవల అల్లుడి వద్దకు వచ్చిన వారు మూడు నెలల క్రితమే వివాహం చేశామని, ప్రస్తుతం కట్నం డబ్బు లేదని, త్వరలో సమకూర్చి అందజేస్తామని నచ్చజెప్పి వెళ్లిపోయారు.
అప్పటి నుంచి సురేశ్ భార్యతో మాట్లాడడం మానేశాడు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు తన కుటుంబీకులు, తల్లిదండ్రులకు చెప్పి కన్నీటిపర్యంతమైంది. ఈక్రమంలో తీవ్ర మనస్తాపం చెందిన మమత గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం విధుల నుంచి వచ్చిన సురేశ్ విషయాన్ని గమనించి పోలీసుకలు సమాచారం ఇచ్చాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.
మమత మృతదేహం
Comments
Please login to add a commentAdd a comment