చిరుతదాడిలో హతమైన దూడ
ఆమనగల్లు: చిరుత మళ్లీ పంజా విసిరింది. ఆమనగల్లు మండలం మంగళపల్లి గ్రామ సమీపంలో ఉన్న మూడు దూడలపై ఆదివారం రాత్రి చిరుత దాడి చేసింది. ఈ దాడిలో దూడ అక్కడికక్కడే మృతిచెందగా మరో రెండు దూడలు సాయంత్రం మృతిచెందాయి. మంగళపల్లి గ్రామ సమీపంలో బాపురెడ్డి, శ్రీను తమ వ్యవసాయ పొలాల వద్ద పశువులను ఉంచారు. తెల్లవారుజామున రైతులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిచూడగా దూడ చనిపోగా మిగతా రెండు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. సమీపంలో ఉన్న పాదముద్రలను చూసి చిరుత దాడి చేసినట్లుగా రైతులు గుర్తించారు. రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని మంగళపల్లి సర్పంచ్ నర్సింహారెడ్డి పరిశీలించారు. చిరుత దాడిలో ఇప్పటికే ఆరు ఆవు దూడలు మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చిరుతను త్వరగా బంధించాలని రైతులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment