Calves
-
పొట్టి దూడ.. గట్టి మేలు!
పలమనేరు(చిత్తూరు జిల్లా): పుంగనూరు పొట్టిరకం దూడలకు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. పుట్టినప్పుడు కేవలం అడుగు మాత్రమే ఎత్తు ఉండి, తన జీవితకాలంలో మూడు అడుగులు మాత్రమే పెరుగుతుంది. అయితే ఈ దూడలకు ఉండే తోక నేలకు తాకేట్లు ఉంటే... ఆ రకానికి విపరీతమైన డిమాండ్ ఉన్నట్టే. వీటిలో మొదటిరకం రూ.2 నుంచి రూ.4 లక్షలు పలుకుతుండగా, రెండో రకం రూ. 50వేల నుంచి రూ.4 లక్షల ధర పలుకుతోంది. ఇంత ఖరీదైనా, ప్రస్తుతం ఇవి అందుబాటులో ఉండడం లేదు. ఈ దూడల్లో తోక నేలకు తాకడం, గోపురం కింద గంగడోలు కిందికి ఉండే రకాలు ఇళ్లల్లో ఉంటే ఆరోగ్యంతోపాటు అదృష్టం వరిస్తుందనే నమ్మకం చాలామందిలో ఉంది. సాంకేతికంగా ఈ జాతి దూడలు తక్కువ మేత తింటూ, ఎక్కువ రోగ నిరోధకశక్తి కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలున్న దూడల కొనుగోలుకు ఏపీలోని ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురము, ఉభయ గోదావరి జిల్లాలు సహా దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన బడాబాబులు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఔషధ గుణాలు మెండు అరుదైన రకం పశువులుగా ఈ పుంగనూరు పొట్టి దూడలకు పేరుంది. అధిక వ్యాధి నిరోధక శక్తి, తక్కువ మేతతో ఎక్కువ వెన్నశాతం కలిగిన పాలనిస్తాయి. వీటి పాలు, మూత్రంలలో ఔషధ గుణములు మెండుగా ఉన్నాయి. అయితే వీటి ఉనికి ప్రశార్థకమవుతున్న తరుణంలో మరిన్ని దూడల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) ద్వారా కృషి చేస్తోంది. దేశంలో ఇలాంటి పశువులు 700 దాకా ఉండగా, దీన్లో 277 చిత్తూరు జిల్లా పలమనేరులోనే ఉన్నాయి. వీటిలో కుర్ర దూడలు 33, పెయ్య దూడలు 17 ఉండగా, మిగిలినవి ఎద్దులు, ఆవులు. పలమనేరు పరిశోధనా సంస్థలో ఉత్పత్తి... 1953లో పలమనేరు కెటిల్ఫామ్ వద్ద ‘సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రం’ ప్రారంభమైంది. అనంతరం ఇన్‌సైటీవ్ కన్సర్వేషన్ (స్థానికంగా పొట్టి దూడల సంఖ్యను ఉత్పత్తి చేయడం) అనే లక్ష్యంతో 1995లో పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. స్థానిక అధికారులు మేలైన పుంగనూరు రకం ఎద్దుల వీర్యాన్ని స్థానికంగా ఈరకం ఆవులు కలిగివున్న రైతులకు అందిస్తున్నారు. తద్వారా వారి వద్ద పొట్టి దూడల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. పలమనేరు సహా రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఔత్సాహిక రైతులు ఫామ్స్‌లో ఈ పొట్టిజాతిని ఉత్పత్తి చేస్తూ లక్షల్లో విక్రయిస్తున్నారు. గణనీయ ఉత్పత్తికి కృషి ఆంధ్రప్రదేశ్ పశు అభివృద్ధి సంఘం (ఏపీఎల్డీఏ) ద్వారా పుంగనూరు రకం ఎద్దుల వీర్యాన్ని ఎదకొచ్చిన, పుంగనూరు ఆవులు కలిగిన ఉన్న రైతులకు స్థానిక పశువైద్యుడి పర్యవేక్షణలో అందిస్తూ, ఈ జాతి అభివృద్ధి అయ్యేలా కృషి చేస్తున్నాం. అవసరమైన రైతులు కెటిల్ఫామ్లో సెమన్ పొందవచ్చు.– డా.వేణు, సైంటిస్ట్, పశు పరిశోధన కేంద్రం, పలమనేరు -
మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు!
ఆవులు, గేదెల్లో ఏ దూడలు కావాలని కోరుకుంటారు... సహజంగా ఎవరైనా పెయ్య దూడలు (ఆడ) కావాలని ఆకాంక్షిస్తారు. కృత్రిమ గర్భధారణ సూదులు వేస్తున్నా.. పుట్టేది ఆడదూడా.. మగదూడా అనేది తెలియని పరిస్థితి. ఇక నుంచి పాడి అభివృద్ధికి ఆడదూడలే పుట్టించుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లింగ నిర్ధారణ వీర్యం (సార్టెడ్ సెక్స్ సెమన్) ద్వారా 95 శాతం పెయ్య దూడలను అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. కర్నూలు (అగ్రికల్చర్): పెయ్య దూడల జననం ద్వారా పాల దిగుబడిని, రైతు ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు. లింగనిర్ధారణ వీర్యం సాంకేతికతను కృత్రిమ గర్భధారణ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం, పాడి పరిశ్రమను మరింత అభివృద్ది చేసేందుకు దోహదపడుతోంది. నేడు విద్యావంతులైన నిరుద్యోగులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అటువంటి వారికి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఏడాది జిల్లాలో 5,000 పశువులకు లింగనిర్ధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూది వేసి పెయ్య దూడలు అభివృద్ధి చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిని రైతుల్లోకి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. సబ్సిడీపై కృత్రిమ గర్భధారణ వీర్యం లింగనిర్ధారణ వీర్యాన్ని పూణే, అహమ్మదాబాద్ల్లోని వెటర్నరీ రీసెర్చ్ కేంద్రాల్లో అధిక పాలసార ఉన్న ఆంబోతుల నుంచి సేకరించారు. ఆడదూడలే పుట్టే విధంగా లింగనిర్ధారణ వీర్యాన్ని వృద్ధి చేశారు. రెండేళ్ల క్రితం జెర్సీ, హెచ్ఎఫ్ ఆవుల్లో ఈ ప్రయోగం చేశారు. 200 ఆవులకు ఇటువంటి వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూదులు వేయగా 52 దూడలు పుట్టాయి. ఇందులో 47 పెయ్యదూడలు ఉండటం విశేషం. తాజాగా మరింత సాంకేతికతతో అభివృద్ధి చేసిన లింగనిర్ధారణ వీర్యంతో ముర్రా గేదెలతో పాటు జెర్సీ, ఆవు జాతులైన గిర్, సాహివాల్, హెచ్ఎఫ్ ఆవులకు కృత్రిమ గర్భధారణ సూదులు వేస్తారు. ఒక డోసు పూర్తి ధర రూ.700 ఉండగా... కేంద్రం రూ.450 సబ్సిడీ ఇస్తుంది. రైతు రూ.250 చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో 5,000 పశువులకు సార్టెడ్ సెక్స్ సెమన్ ద్వారా సూదులు వేసే విధంగా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. 95 శాతం ఆడదూడలే పుట్టే అవకాశం లింగనిర్ధారణ వీర్యం ద్వారా 95 శాతంపైగా పెయ్యదూడలే పుట్టే అవకాశం ఉంది. ఒక ఆవు లేదా గేదెకు మూడు డోసుల వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఆవులు, గేదెలు ఎదకు రావడాన్ని గుర్తించి ఈ వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూదులు వేయించాలి. ఎదకు వచ్చిన 12 గంటల నుంచి 24 గంటలలోపు సూదులు వేయించాల్సి ఉంది. మొదటి డోసు వేసినపుడు చూడికట్టకపోతే రెండవసారి వేయంచవచ్చు. అపుడు కూడా చూడికట్టకపోతే మూడవ డోసు వేయించవచ్చు. ప్రతి డోసుకు రైతు సబ్సిడీ పోను రూ.250 చెల్లించాల్సి ఉంది. మూడు డోసులు వేసినా చూడికట్టకపోతే రూ.500 రైతుకు వెనక్కి ఇస్తారు. మూడు డోసుల సార్టెడ్ సెక్స్ సెమన్‌తో కృత్రిమ గర్భధారణ చేసినా మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు. ఈ సెమన్ ప్రధాన లక్ష్యం పెయ్యదూడల అభివృద్ధి. ఈ కార్యక్రమాన్ని గోపాలమిత్రలు అమలు చేస్తారు. సార్టెడ్ సెక్స్ సెమన్‌తో సూది వేస్తే రూ.100 ప్రోత్సాహకం ఇస్తారు. మొదటి డోసుతోనే చూడి కడితే రూ.150, రెండవ డోసుతో చూడి కడితే రూ.100 ప్రోత్సాహక బహుమతి ఇస్తారు. పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాం లింగనిర్ధారణ వీర్యంతో ఒంగోలు జాతి మినహా మిగిలిన అన్ని ఆవు, గేదె జాతి పశువులకు కృత్రిమ గర్భధారణ చేయవచ్చు. దీని ద్వారా 90 నుంచి 95 శాతం వరకు ఆడదూడలే పుట్టే అవకాశం ఉంది. పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తోంది. – రాజశేఖర్, కార్యనిర్వహణాధికారి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, కర్నూలు -
చిరుత దాడిలో మూడు దూడలు మృతి
ఆమనగల్లు: చిరుత మళ్లీ పంజా విసిరింది. ఆమనగల్లు మండలం మంగళపల్లి గ్రామ సమీపంలో ఉన్న మూడు దూడలపై ఆదివారం రాత్రి చిరుత దాడి చేసింది. ఈ దాడిలో దూడ అక్కడికక్కడే మృతిచెందగా మరో రెండు దూడలు సాయంత్రం మృతిచెందాయి. మంగళపల్లి గ్రామ సమీపంలో బాపురెడ్డి, శ్రీను తమ వ్యవసాయ పొలాల వద్ద పశువులను ఉంచారు. తెల్లవారుజామున రైతులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిచూడగా దూడ చనిపోగా మిగతా రెండు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. సమీపంలో ఉన్న పాదముద్రలను చూసి చిరుత దాడి చేసినట్లుగా రైతులు గుర్తించారు. రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని మంగళపల్లి సర్పంచ్ నర్సింహారెడ్డి పరిశీలించారు. చిరుత దాడిలో ఇప్పటికే ఆరు ఆవు దూడలు మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చిరుతను త్వరగా బంధించాలని రైతులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. -
వధశాలకు తరలిస్తున్న దూడలను పట్టివేత
ఘట్కేసర్: వధశాలకు అక్రమంగా తరలిస్తున్న దూడలను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... మండల పరిధిలోని అవుశాపూర్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రెండు డీసీఎంలను ఆపారు. ఇదేంటని ప్రశ్నించగా ఆ వాహనాల్లో 15 దూడలను నగరంలోని అంబర్పేట్ వధశాలకు తరలిస్తున్నట్లు దాని డ్రైవర్లు బానోతు కుమార్, బానోతు మోహన్ తెలిపారు. డ్రైవర్లు నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం గోపతండాకు చెందిన వారని చెప్పారు. వరంగల్ జిల్లా లింగాల ఘణాపూర్ మండలం నవాబుపేట్ గ్రామంలోని సంత నుంచి 15 దూడలను వ్యాపారులు కొనుగోలు చేశారు. వాటిని వాహనాల్లో నగరానికి తరలించడానికి డ్రైవర్లతో బేరం కుదుర్చుకున్నారని వివరించారు. దూడలను, వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దూడలను గోశాలకు పంపినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
మూగజీవాలపై దాడి!
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : మూగజీవాలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన శంషాబాద్ మండలం మదన్‌పల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడాది వయసున్న 6 దూడలు మృతిచెందగా.. మరో మూడు దూడలు తీవ్రంగా గాయపడ్డాయి. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరోసారి కుక్కల స్వైరవిహారం
-
ఒకే కాన్పులో రెండు దూడలు
విజయనగరం: ఒక ఆవు ఒకే కాన్పులో రెండు దూడలకు జన్మనిచ్చింది . ఈ సంఘటన మంగళవారం విజయనగరం జిల్లా గొర్ల మండలం గూడెం గ్రామంలో జరిగింది. మహాశివరాత్రి పర్వదినం నాడు ఆవు ఒకే కాన్పులో రెండు దూడలను కనడం అందరిని ఆశ్చర్యంలో ముంచింది. ఆవు ఒకే కాన్పులో రెండు దూడలను కనడం అరుదైన సంఘటనగా స్థానికులు భావిస్తున్నారు. ఆవుకు వైద్యసేవలు చేసిన వెటర్నరీ డాక్టర్ రెడ్డి కృష్ణ మాట్లాడుతూ ఇలా పుట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. మగ దూడకు టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని, అదే సమయంలో ఆడ దూడకు పునరుత్పత్తిలో సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. -
పశు పోషణలో.. దూడల సంరక్షణే కీలకం
న్యూమోనియా దూడ పుట్టిన నెల రోజుల తర్వాత ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటుంది. శీతాకాలంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దూడలు ఉన్న షెడ్లలో తేమ ఎక్కువగా ఉండటం, ఈదురు గాలులు రావటం, రాత్రి సమయంలో లేగదూడలను బయట కట్టేయడం, చలి గాలుల బారిన పడటం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. న్యూమోనియా సోకిన దూడల్లో జ్వరం, అజీర్ణం, ముక్కు నుంచి చీమిడి కారటం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తించి తక్షణమే చికిత్స అందించాలి. లేదంటే దూడలు మరణించే ప్రమాదం ఉంటుంది. నివారణ చర్యలు... దూడలు ఉండే పాకల్లో తేమ శాతం అధికంగా లేకుండా చూసుకోవాలి. ఈదురు గాలులు, చలి లేకుండా జాగ్రత్తపడాలి. పుట్టిన అరగంటలోపు దూడకు జున్నుపాలు తాగించాలి. లేదంటే ఈ వ్యాధి సులభంగా సోకుతుంది. వ్యాధి బారిన పడిన దూడలకు యాంటీబయోటిక్స్, యాంటీహిస్టమీన్ సూదులు ఇప్పించాలి. పారుడు వ్యాధి లేగదూడల్లో ఎక్కువ శాతం పారుడు వ్యాధి సోకి మృత్యువాత పడుతుంటాయి. నట్టలు, ప్రోటోజువా, వైరస్, బ్యాక్టీరియా వలన దూడలకు తెల్లని, పచ్చని విరేచనాలవుతాయి. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గి నీరసపడి మరణిస్తుంటాయి. మట్టి, అపరిశుభ్ర పరిసరాలు తదితర కారణాల వల్ల దూడల్లో నట్టలు తయారవుతాయి. సకాలంలో దీన్ని గుర్తించకపోతే తర్వాత చికిత్స అందించినా ఫలితం ఉండదు. లేగదూడలకు జున్నుపాలు అందించకపోవడం, తగిన మోతాదులో పాలు లేకపోవటం, పోషకాల లోపం, చలిగాలులు, మట్టితినడం లాంటి లోపాల వల్ల కూడా లేగదూడల్లో పారుడు వ్యాధి వస్తుంది. నివారణ చర్యలు... లేగలు పుట్టిన వెంటనే జున్నుపాలు తాగించాలి. వైద్యుల సలహా ప్రకారం నట్టల నివారణ మందులు వేయాలి. లేగదూడ పుట్టిన ఐదురోజుల లోపు టెటానస్, విటమిన్-ఏ ఇంజక్షన్లు తప్పక ఇప్పించాలి. దూడలు మట్టి తినకుండా మూతికి ప్రత్యేకంగా తయారు చేసిన బట్టలు కట్టాలి. బొడ్డు, కీళ్ల వాపు లేగదూడ యొక్క బొడ్డు నరం ద్వారా సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీని ద్వారా దూడలు జ్వరంతో బాధపడుతుంటాయి. బొడ్డు వాచి లోపల చీము చేరుతుంది. తీవ్రమైన నొప్పి ఉంటుంది. సూక్ష్మజీవులు కీళ్లకు కూడా వ్యాపిస్తాయి. దీని ద్వారా దూడలు పాలు తాగవు. పుట్టిన నాటినుంచి ఆరు వారాల్లోపు ఎప్పుడైనా బొడ్డు, కీళ్ల వ్యాధి రావచ్చు. మెదడు వాపు క్లామిడియా సూక్ష్మజీవుల వల్ల దూడలకు మెదడు వాపు వ్యాధి వస్తుంది. దీంతో జ్వరం, ఆకలి మందగించడం, కండరాల వణుకు, నిలబడలేకపోవటం తదితర లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధిని గుర్తించి వెంటనే చికిత్సలు అందించాలి. లేదంటే దూడలు వారం రోజుల్లో మరణించే ప్రమాదం ఉంటుంది. అంధత్వం గర్భస్థ సమయంలో పశువులకు విటమిన్-ఏ సరిగ్గా అందించకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీంతో లేగదూడలు దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంధత్వం సోకిన దూడల కళ్ల నుంచి నీరు కారుతుంటుంది. కండరాలు వణుకుతుంటాయి. నరాల్లో పటుత్వం కోల్పోయి లేగదూడలు సరిగా నిలబడలేవు. నివారణ చర్యలు... గర్భం సమయంలో పశువుకు తగిన నీటిని అందించటంతో పాటు, విటమిన్-ఏ విధిగా ఇవ్వాలి. దీనికోసం మేలురకం పశుగ్రాసం అందించాలి. విటమిన్ -ఏ ఇంజక్షన్లు వేయించడం వల్ల ఈ లోపాన్ని నివారించవచ్చు. పుట్టిన దూడలకు సమృద్ధిగా జున్ను పాలు తాగించాలి.