న్యూమోనియా
దూడ పుట్టిన నెల రోజుల తర్వాత ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటుంది.
శీతాకాలంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
దూడలు ఉన్న షెడ్లలో తేమ ఎక్కువగా ఉండటం, ఈదురు గాలులు రావటం, రాత్రి సమయంలో లేగదూడలను బయట కట్టేయడం, చలి గాలుల బారిన పడటం వల్ల ఈ వ్యాధి సోకుతుంది.
న్యూమోనియా సోకిన దూడల్లో జ్వరం, అజీర్ణం, ముక్కు నుంచి చీమిడి కారటం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వీటిని గుర్తించి తక్షణమే చికిత్స అందించాలి. లేదంటే దూడలు మరణించే ప్రమాదం ఉంటుంది.
నివారణ చర్యలు...
దూడలు ఉండే పాకల్లో తేమ శాతం అధికంగా లేకుండా చూసుకోవాలి. ఈదురు గాలులు, చలి లేకుండా జాగ్రత్తపడాలి.
పుట్టిన అరగంటలోపు దూడకు జున్నుపాలు తాగించాలి. లేదంటే ఈ వ్యాధి సులభంగా సోకుతుంది.
వ్యాధి బారిన పడిన దూడలకు యాంటీబయోటిక్స్, యాంటీహిస్టమీన్ సూదులు ఇప్పించాలి.
పారుడు వ్యాధి
లేగదూడల్లో ఎక్కువ శాతం పారుడు వ్యాధి సోకి మృత్యువాత పడుతుంటాయి.
నట్టలు, ప్రోటోజువా, వైరస్, బ్యాక్టీరియా వలన దూడలకు తెల్లని, పచ్చని విరేచనాలవుతాయి.
దీంతో శరీరంలో నీటి శాతం తగ్గి నీరసపడి మరణిస్తుంటాయి.
మట్టి, అపరిశుభ్ర పరిసరాలు తదితర కారణాల వల్ల దూడల్లో నట్టలు తయారవుతాయి.
సకాలంలో దీన్ని గుర్తించకపోతే తర్వాత చికిత్స అందించినా ఫలితం ఉండదు.
లేగదూడలకు జున్నుపాలు అందించకపోవడం, తగిన మోతాదులో పాలు లేకపోవటం, పోషకాల లోపం, చలిగాలులు, మట్టితినడం లాంటి లోపాల వల్ల కూడా లేగదూడల్లో పారుడు వ్యాధి వస్తుంది.
నివారణ చర్యలు...
లేగలు పుట్టిన వెంటనే జున్నుపాలు తాగించాలి.
వైద్యుల సలహా ప్రకారం నట్టల నివారణ మందులు వేయాలి.
లేగదూడ పుట్టిన ఐదురోజుల లోపు టెటానస్, విటమిన్-ఏ ఇంజక్షన్లు తప్పక ఇప్పించాలి.
దూడలు మట్టి తినకుండా మూతికి ప్రత్యేకంగా తయారు చేసిన బట్టలు కట్టాలి.
బొడ్డు, కీళ్ల వాపు
లేగదూడ యొక్క బొడ్డు నరం ద్వారా సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
దీని ద్వారా దూడలు జ్వరంతో బాధపడుతుంటాయి.
బొడ్డు వాచి లోపల చీము చేరుతుంది. తీవ్రమైన నొప్పి ఉంటుంది.
సూక్ష్మజీవులు కీళ్లకు కూడా వ్యాపిస్తాయి. దీని ద్వారా దూడలు పాలు తాగవు.
పుట్టిన నాటినుంచి ఆరు వారాల్లోపు ఎప్పుడైనా బొడ్డు, కీళ్ల వ్యాధి రావచ్చు.
మెదడు వాపు
క్లామిడియా సూక్ష్మజీవుల వల్ల దూడలకు మెదడు వాపు వ్యాధి వస్తుంది.
దీంతో జ్వరం, ఆకలి మందగించడం, కండరాల వణుకు, నిలబడలేకపోవటం తదితర లక్షణాలు కనిపిస్తాయి.
వ్యాధిని గుర్తించి వెంటనే చికిత్సలు అందించాలి.
లేదంటే దూడలు వారం రోజుల్లో మరణించే ప్రమాదం ఉంటుంది.
అంధత్వం
గర్భస్థ సమయంలో పశువులకు విటమిన్-ఏ సరిగ్గా అందించకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది.
దీంతో లేగదూడలు దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
అంధత్వం సోకిన దూడల కళ్ల నుంచి నీరు కారుతుంటుంది.
కండరాలు వణుకుతుంటాయి. నరాల్లో పటుత్వం కోల్పోయి లేగదూడలు సరిగా నిలబడలేవు.
నివారణ చర్యలు...
గర్భం సమయంలో పశువుకు తగిన నీటిని అందించటంతో పాటు, విటమిన్-ఏ విధిగా ఇవ్వాలి.
దీనికోసం మేలురకం పశుగ్రాసం అందించాలి.
విటమిన్ -ఏ ఇంజక్షన్లు వేయించడం వల్ల ఈ లోపాన్ని నివారించవచ్చు.
పుట్టిన దూడలకు సమృద్ధిగా జున్ను పాలు తాగించాలి.
పశు పోషణలో.. దూడల సంరక్షణే కీలకం
Published Fri, Nov 7 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM
Advertisement
Advertisement