ఈరోజు (నవంబర్ 12) ప్రపంచ న్యుమోనియా దినోత్సవం. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలకు కారణంగా నిలుస్తూ, అన్ని వయసులవారినీ ప్రభావితం చేస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య న్యుమోనియా. ఈ వ్యాధిపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ప్రపంచ న్యుమోనియా దినోత్సవం నిర్వహిస్తున్నారు.
న్యుమోనియా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల ఇది సోకుతుంది. న్యుమోనియాను ప్లూరిసీ అని కూడా అంటారు. పిల్లలు లేదా వృద్ధులు ఎవరికైనా ఈ వ్యాధి సొకే అవకాశాలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపిన వివరాల ప్రకారం 2019లో ప్రపంచ వ్యాప్తంగా 7,40,000 మంది ఐదేళ్లలోపు చిన్నారులు న్యుమోనియాతో మృత్యువాత పడ్డారు.
న్యుమోనియా వ్యాధి ముప్పును తగ్గించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చైల్డ్ న్యుమోనియాకు వ్యతిరేకంగా, ఈ వ్యాధిని నియంత్రించే దిశగా జరిగే ప్రచార కార్యక్రమంలో వందకుపైగా సంస్థలు పాల్గొంటున్నాయి. స్టాప్ న్యుమోనియా సంస్థ అంచనా ప్రకారం 2009లో 6,72,000 మంది పిల్లలు సహా దాదాపు 2.5 మిలియన్ల మంది న్యుమోనియా బారినపడి మరణించారు.
ప్రపంచ న్యుమోనియా దినోత్సవాన్ని 2009, నవంబర్ 12న గ్లోబల్ కోయలిషన్ ప్రారంభించింది. 2030 నాటికి న్యుమోనియా మరణాల సంఖ్యను సున్నాకి తగ్గించడమే ఈ దినోత్సవ లక్ష్యం. న్యుమోనియా చికిత్స అందించగల వ్యాధి. అయితే ఈ వ్యాధి విషయంలో అధిక మరణాల రేటు నమోదవుతోంది. ఈ ప్రాణాంతక శ్వాసకోశ రుగ్మతపై పోరాడటం, పిల్లలు, పెద్దలలో మరణాల రేటును తగ్గించడం అత్యవసరమని వైద్య నిపుణులు గుర్తించారు.
న్యుమోనియా కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుంటుంది. అందుకే దీనిని తొలి దశలోనే గుర్తించడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల్లో న్యుమోనియాను తేలిగ్గా గుర్తించొచ్చు. చిన్నారుల్లో ఛాతీనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే పెద్దలు అప్రమత్తం కావాలి. ఊపిరితిత్తుల్లోని ఈ వైరస్ శరీరమంతటా వ్యాపించడానికి రోజుల నుంచి వారాల వరకు పట్టవచ్చు. బ్యాక్టీరియా కారణంగా సోకే న్యుమోనియాకు యాంటీబయోటిక్స్ ద్వారా చికిత్స అందించవచ్చు. న్యుమోనియా తీవ్రం అయినప్పుడు వెంటనే ఆస్పత్రిలో చేరాలి. అధికంగా విశ్రాంతి తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం లాంటి ఉపశమన చర్యలతో న్యుమోనియా నుంచి త్వరగా కోలుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఎక్కువసేపు నిద్రా? ఆందోళన వద్దు...
Comments
Please login to add a commentAdd a comment