ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి | World Pneumonia Day 2024 | Sakshi
Sakshi News home page

World Pneumonia Day: ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి

Published Tue, Nov 12 2024 11:19 AM | Last Updated on Tue, Nov 12 2024 11:31 AM

World Pneumonia Day 2024

న్యూమోనియాతో  చిన్నారులు సతమతం  

వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వారిలోనూ ఇబ్బందులు  

ప్రభుత్వ ఆసుపత్రుల్లో  ఉచితంగా వైద్యం 

చిన్నారులకు రాకుండా ఉచితంగా  పీసీవీ వ్యాక్సిన్‌ 

నేడు ప్రపంచ న్యూమోనియా డే  

చలికాలం వచ్చిందంటే చాలా మంది చిన్నపిల్లల్లో న్యూమోనియా వ్యాధి ప్రబలుతుంది. చలి తీవ్రత పెరిగే కొద్దీ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. పలు రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా కారణంగా వచ్చే ఈ వ్యాధి చిన్నారులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుంది. ఈ నెల 12న ప్రపంచ న్యూమోనియా డే సందర్భంగా ప్రత్యేక కథనం.

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు జిల్లాలోని సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో న్యూమోనియాకు అక్కడి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కర్నూలు ప్రభుత్వ వైద్యశాల చిన్నపిల్లల ఓపీకి ప్రతిరోజూ 300 మంది పలు రకాల వ్యాధులతో చికిత్స కోసం వస్తుండగా అందులో 60 మంది దాకా న్యూమోనియా బాధితులు ఉంటున్నారు. చలికాలంలో ఈ సంఖ్య 150 నుంచి 200 దాకా ఉంటోంది. వీరిలో అవసరమైన వారిని వార్డులో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. వీరికి అవసరమైన యాంటీబయాటిక్‌ మందులు, ఇంజెక్షన్లు, ఆక్సిజన్, నెబులైజేషన్‌ ఇస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న రోగులకు వెంటిలేటర్‌ సపోర్ట్‌ కూడా ఇస్తున్నారు. కర్నూలుతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స చేస్తున్నారు.  

పీసీవీతో న్యూమోనియాకు చెక్‌ 
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రొటీన్‌ ఇమ్యూనైజేషన్‌లో భాగంగా ఆరు వారాలు, 14 వారాలు, 9వ నెల వయస్సులో చిన్నారులకు మూడు డోసుల పీసీవీ వ్యాక్సిన్‌ (నీమోకోకల్‌) ఇస్తున్నారు. ఇది భవిష్యత్‌లో చిన్నారులకు న్యూమోనియా రాకుండా అడ్డుకుంటుంది. దీంతో పాటు న్యూమోనియా వచ్చిన చిన్నారులను ఆశాలు, ఏఎన్‌ఎంలు గుర్తించి వారికి దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే అమాక్సిలిన్‌ సిరప్‌ ఇస్తారు. తీవ్రంగా ఉంటే సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రి, బోధనాసుపత్రికి రెఫర్‌ చేసి అక్కడ మెరుగైన వైద్యం అందేలా చేస్తారు. 

న్యూమోనియా అంటే.. 
సాధారణంగా ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్‌ను వైద్యులు న్యూమోనియాగా పరిగణిస్తారు. ఇది ముఖ్యంగా పిల్లల్లో, వయోవృద్ధుల్లో,  ఇమ్యూనిటీ (వ్యాధినిరోధక శక్తి) తక్కువగా ఉన్నవారు, ధూమపానం అలవాటు ఉన్న వారిలో వస్తుంది. ఇందులో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌కు సంబంధించిన క్రిముల కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ రావచ్చు. ఊపిరితిత్తుల్లో అలి్వయోలి ద్రవం లేదా చీముతో నిండినప్పుడు శ్వాస తీసుకోవడం నరకంగా మారుతుంది. కొన్నిసార్లు ఈ పరిస్థితి ప్రాణాంతకమవుతుంది. వ్యాధినిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఛాతి ఎక్స్‌రే, ఛాతి సీటీ స్కాన్, గళ్ల పరీక్షలు, రక్త పరీక్షలు, అవసరమైన వారికి బ్రాంకోస్కోపి ద్వారా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.  

లక్షణాలు 
న్యూమోనియాలో కఫంతో కూడిన దగ్గు, చలి, వణుకుతో పాటు జ్వరం, ఛాతినొప్పితో పాటు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం(ఆయాసం), బలహీనం, నీరసంగా శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపించడం, వికారం, వాంతులు విరేచనాలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉంటుంది.  

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
దగ్గు/తుమ్మేటప్పుడు ముక్కు, నోరును కప్పుకోవాలి 
సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి 
ముక్కు, నోరు, కళ్లను తరచుగా తాకరాదు 
ప్రొటీన్, విటమిన్‌–సి, జింక్‌ ఎక్కువగా   ఉండే ఆహారం ఇవ్వాలి 
దగ్గు, జలుబు ఉన్నప్పుడు మాస్క్‌   ధరించాలి 
వ్యాక్సిన్, రొటీన్‌ చెకప్‌ తీసుకోవడం వల్ల  ఈ వ్యాధిని నివారించవచ్చు 
ముఖ్యంగా ధూమపానం అలవాటు మానేయాలి    

సకాలంలో  చికిత్స అందించాలి 
న్యూమోనియా సాధారణంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. దగ్గు, ఆయాసం, జలుబు, జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. ఆయాసం కనిపిస్తే వెంటనే పిల్లలను వైద్యుల వద్దకు తీసుకెళ్లి అవసరమైన పరీక్షలు చేయించి మందులు ఇప్పించాలి. ఆలస్యం చేసే కొద్దీ ఈ వ్యాధి ప్రాణాంతకం అవుతుంది. అప్పుడు వెంటిలేటర్‌పై ఉంచి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. సకాలంలో ఆసుపత్రికి తీసుకొస్తే వైరస్, బ్యాక్టీరియాను బట్టి మందులు ఇస్తాం.      – డాక్టర్‌ బి.విజయానందబాబు, 
చిన్నపిల్లల విబాగాధిపతి, జీజీహెచ్, కర్నూలు

వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స 
మనం పీల్చే గాలితో పాటు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌ వంటి సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ సోకి న్యూమోనియా మారుతుంది. పిల్లలు, వృద్ధులు, డయాబెటీస్, ఆల్కహాలు, స్మోకింగ్, హెచ్‌ఐవీ, ఆస్తమా, ఇతర దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉన్న వా రిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. వ్యాధి తీవ్రతను బట్టి న్యూమోనియాకు చికిత్స అందిస్తాం.   
–డాక్టర్‌ కమ్మర వినోద్‌ఆచారి, పల్మనాలజిస్టు, కర్నూలు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement