Amangal
-
మహిళ మెడకు చున్నీ బిగించి.. 23 రోజుల తర్వాత!
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం ఓ మహిళ హత్యకు దారితీసింది. దాదాపు 23 రోజుల క్రితం హత్యకు గురైన మహిళ ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. కేశంపేట మండల కేంద్రానికి చెందిన నారా అమృత(25)ను హత్య చేసిన ఆమనగల్లు మండలం పోలెపల్లికి చెందిన జంగాపురం శంకర్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మార్చి 31న అమృత హత్యకు గురికాగా నిందితుడి సమాచారంతో శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఆమనగల్లు పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షాద్‌నగర్ ఏసీపీ కుషాల్కర్ వెల్లడించిన కేసు వివరాలు.. అమృతకు పదేళ్ల క్రితం కేశంపేట మండలం అల్వాల్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. నాలుగున్నరేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న అమృత తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. కూలీపని చేసుకునే ఈమెకు ఆమనగల్లు మండలం పోలెపల్లికి చెందిన జంగాపురం శంకర్‌తో పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే అమృత మరొకరితో సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్న శంకర్ ఆమె హత్యకు పథకం వేశాడు. మార్చి 31న అమృత కనిపించకుండా పోవడంతో సోదరుడు నర్సింహ ఏప్రిల్ 1న కేశంపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే మార్చి 31న అమృతకు మద్యం తాగించిన శంకర్ తన బైక్‌పై తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామ సమీపంలోని మల్లప్పగుట్ట వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఫోన్‌ద్వారా తన స్నేహితుడైన ఆమనగల్లు మండలం విఠాయిపల్లికి చెందిన ఇస్లావత్ శంకర్‌కు సమాచారం ఇచ్చి పిలిపించాడు. ఇద్దరూ కలిసి అమృత మెడకు చున్నీ బిగించి చంపేశారు. చదవండి: భక్తి ముసుగులో మహిళలను లోబర్చుకుని... అనంతరం గుట్ట పక్కనే ఉన్న గుంతలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. మృతురాలి ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు.. గురువారం శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. నిందితుడి సమాచారం మేరకు మల్లప్పగుట్టవద్ద అమృత మృతదేహాన్ని వెలికితీయించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. హత్యకు పాల్పడిన శంకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, మరో నిందితుడు ఇస్లావత్ శంకర్ పరారీలో ఉన్నాడని ఏసీపీ వివరించారు. విలేకరుల సమావేశంలో సీఐ ఉపేందర్, ఎస్ఐలు ధర్మేశ్, వరప్రసాద్ పాల్గొన్నారు. చదవండి: క్షణికావేశంలో భర్తను చంపిన భార్య -
రైతు కాళ్లు మొక్కిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
మహబూబాబాద్: ఆస్పత్రి నిర్మాణానికి భూమి దానం చేసిన ఓ దాత పాదాలను మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మొక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రజా ప్రయోగ కార్యక్రమానికి సహకరించిన వ్యక్తి పాదాలు మొక్కి కృతజ్ఞతలు తెలిపినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని ఆమన్‌గల్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆమన్‌గల్‌లో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణానికి రైతు వద్ది సుదర్శన్ రెడ్డి స్థలం ఇచ్చారు. రూ.30 లక్షల విలువైన 24 గుంటల భూమిని విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో ఆ స్థలంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థలం ఇచ్చిన రైతు సుదర్శన్‌రెడ్డి కాళ్లను ఎమ్మెల్యే మొక్కారు. పాదాభివందనం చేస్తుండగా రైతు వారించాడు. రైతు స్థలం ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఆ రైతును అభినందించారు. -
భార్యను దూరం చేశారని..
సాక్షి, ఆమనగల్లు: ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని తననుంచి దూరం చేశారని ఆరోపిస్తూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. కిందికి దిగేందుకు అతడు ససేమిరా అనడంతో స్థానికులు, పోలీసులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన శనివారం మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. తలకొండపల్లికి చెందిన నీలకంఠం పాండు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని కొంతకాలం ప్రేమించి గత నవంబర్ 21న వివాహం చేసుకున్నాడు. కులాంతర వివాహం కావడంతో యువతి తల్లిదండ్రులు, కులపెద్దలు, రాజకీయ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను తనకు దక్కకుండా దూరం చేశారని ఆరోపిస్తూ శనివారం తెల్లవాముజామున 5.30 గంటలకు పాండు ఆమనగల్లులోని ప్రధాన రహదారిపై ఉన్న బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కాడు. అనంతరం అతడు తన బాధను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి మిత్రులకు వాట్సప్‌లో పంపాడు. విషయం తెలియడంతో పట్టణవాసులు, ఆమనగల్లు సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ ధర్మేశ్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అనంతరం సీఐ టవర్‌పై ఉన్న పాండు సెల్‌ఫోన్ నంబర్ తీసుకుని ఫోన్లో మాట్లాడారు. తాను పెళ్లి చేసుకున్న యువతిని ఇక్కడికి రప్పించి తనతో మాట్లాడిస్తే కిందికి దిగుతానని లేదంటే పైనుంచి దూకేస్తానంటూ బెదిరించాడు. కిందికి దిగిన తర్వాత యువతి కుటుంబసభ్యులతో మాట్లాడిస్తామని పోలీసులు సర్దిచెప్పినా పాండు వినలేదు. అతడి కుటుంబీకులు, బంధువులు అక్కడికి చేరుకొని కిందికి దిగాలని ప్రాధేయపడినా ఫలితం లేకుండా పోయింది. చేసేది లేక చివరకు పోలీసులు యువకుడు వివాహం చేసుకున్న యువతితో మాట్లాడారు. తనను పాండు బెదిరించడంతోనే వివాహం చేసుకున్నానని పోలీసులకు తెలిపింది. తాను అక్కడికి రానంటూ స్పష్టం చేసింది. చివరకు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సీఐ నర్సింహారెడ్డి సెల్ఫోన్లో మరోసారి పాండుతో మాట్లాడారు. యువతి తలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఉందని, కిందికి దిగితే అక్కడికి తీసుకెళ్లి మాట్లాడిస్తామని పాండుకు చెప్పడంతో అతడు దిగి వచ్చాడు. అనంతరం పాండును సీఐ నర్సింహారెడ్డి తన వాహనంలో తలకొండపల్లికి తీసుకెళ్లారు. పాండు కిందికి దిగడంతో పోలీసులు, స్థానికులు, అతడి కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. -
చిరుత దాడిలో మూడు దూడలు మృతి
ఆమనగల్లు: చిరుత మళ్లీ పంజా విసిరింది. ఆమనగల్లు మండలం మంగళపల్లి గ్రామ సమీపంలో ఉన్న మూడు దూడలపై ఆదివారం రాత్రి చిరుత దాడి చేసింది. ఈ దాడిలో దూడ అక్కడికక్కడే మృతిచెందగా మరో రెండు దూడలు సాయంత్రం మృతిచెందాయి. మంగళపల్లి గ్రామ సమీపంలో బాపురెడ్డి, శ్రీను తమ వ్యవసాయ పొలాల వద్ద పశువులను ఉంచారు. తెల్లవారుజామున రైతులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిచూడగా దూడ చనిపోగా మిగతా రెండు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. సమీపంలో ఉన్న పాదముద్రలను చూసి చిరుత దాడి చేసినట్లుగా రైతులు గుర్తించారు. రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని మంగళపల్లి సర్పంచ్ నర్సింహారెడ్డి పరిశీలించారు. చిరుత దాడిలో ఇప్పటికే ఆరు ఆవు దూడలు మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చిరుతను త్వరగా బంధించాలని రైతులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. -
ఘోర ప్రమాదం: ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని అమనగల్ పట్టణ సమీపంలో కల్వకుర్తి-హైదరాబాద్ ప్రధాన రహదారి మెడిగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న వారిని మృత్యువు వెంటాడింది. లారీ-ఇనోవా కారు ఢీకొన్న.. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వివరాలు.. వరంగల్ జిల్లా కాజీపేట మండలం మట్టువడా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న దుర్గ ప్రసాద్ అతని కుటుంబంతో కలిసి శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లారు. కార్యక్రమం అనంతరం.. హైదరాబాద్ వైపు తిరిగి వస్తుండగా అమన్‌గల్ మండలం మెడిగడ్డ సమీపంలో గణపతి వేబ్రిడ్జ్ కాంట కోసం లారీ టర్న్ అవుతుండగా వారు ప్రయాణిస్తున్న ఇనోవా కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న దుర్గ ప్రసాద్ భార్యా విజయ లక్ష్మి, కొడుకు శాంతన్, అతని బావ రాజు, అక్క అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. -
బంగారు కడ్డీ ఆశ చూపి మోసం
ఆమనగల్లు: ఆమనగల్లు మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన వరికుప్పల వెంకటమ్మ అనే వృద్ధురాలిని మభ్యపెట్టి బంగారు ఆభరణాలను దొంగిలించిన ముగ్గురు కిలేడీలను ఆమనగల్లు పోలీసులు అరెస్టు చేశారు. ఆమనగల్లు పట్టణంలోని పోలీసు స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఫతేనగర్‌కు చెందిన వేముల సమ్మక్క అలియాస్ లక్ష్మి, రాజేంద్రనగర్‌కు చెందిన చల్లా నర్సమ్మ, ఫతేనగర్‌కు చెందిన బండారి అనితలు ముఠాగా ఏర్పడి ముఖ్య కూడలిలో వృద్ధులను గుర్తించి వారిని మభ్యపెట్టి ఆభరణాలు దోచుకోవడం వృత్తిగా పెట్టుకున్నారు. ఈనెల 10న ఆమనగల్లు పట్టణంలో మంగళపల్లికి చెందిన వరికుప్పల వెంకటమ్మ నడుచుకుంటూ వెళ్తుండగా బంగారు పూత పూసిన ఇనుపకడ్డీని ఆమె ముందు వేసి... పెద్దమ్మ ఇది నీదా.. అంటూ ఒక మహిళ వృద్ధురాలితో మాటలు కలిపింది. వెనుక నుంచి వచ్చిన అదే ముఠాకు చెందిన మరో ఇద్దరు మహిళలు వారితో జత కలిశారు. బంగారు కడ్డీని నలుగురం ముక్కలు చేసి పంచుకుందామని భాగానికి వచ్చారు. అయితే రేపు నువ్వు వస్తావో రావో.. నిన్ను నమ్మడమెలా అని వృద్ధురాలిని కంగారు పెట్టించారు. కడ్డీని నీ దగ్గరే ఉంచుకోమని చెప్పి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యారు. ఇంటికొచ్చిన వరికుప్పల వెంకటమ్మ తనకిచ్చిన కడ్డీ నకిలీదని తెలుసుకుని ఈనెల 11న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వృద్ధురాలిని మోసం చేసిన ముగ్గురు మహిళలు వేముల సమ్మక్క, చల్లా నర్సమ్మ, బండారు అనితలను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని కల్వకుర్తి కోర్టులో హాజరు పరిచారు. విలేకరుల సమావేశంలో ఎస్సై మల్లీశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలను పరిష్కరించాలి
ఆమనగల్లు: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని రెండవ ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెండవ ఏఎన్ఎంలు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరంలో ఏఎన్ఎంలు ఒకరోజు దీక్షనిర్వహించారు. రెండవ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని, పదో పీఆర్సీ ప్రకారం వేతనాలను అందించాలని, ఇతర అలవెన్సులను అందించాలని ఎఎన్ఎంలు కోరారు. సమస్యల పరిష్కారం కోసం గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికి ప్రభుత్వం స్పందించడం లేదని వారు ఆరోపించారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా సమ్మె కొనసాగిస్తామని ఎఎన్ఎంలు చెప్పారు. సమ్మెలో రెండవ ఎఎన్ఎంలు మంజుల, మారతమ్మ, పద్మ, రాజేశ్వరీ, సునీత, పార్వతి, ఆసీఫా, కరుణశ్రీ, సునీతాబాయి తదితరులు పాల్గొన్నారు.