సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూతగాదాల కేసులో రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన షాబాద్ సీఐ శంకరయ్యపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కసరత్తు చేస్తోంది. గత శుక్రవారం శంకరయ్య ఇంట్లో సోదాల సందర్భంగా రూ.4.58 కోట్ల ఆస్తులను గుర్తించిన అధికారులు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు, నగలు, నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. శంకరయ్యకు హైదరాబాద్, పూర్వ నల్లగొండ జిల్లాలో బినామీల పేరిట పలు ఆస్తులు ఉన్నట్లు తేలింది. సోదాల సందర్భంగా ఆయన ఇంట్లో రూ.17.88 లక్షల నగదు లభ్యంకాగా.. డాక్యుమెంట్ల ఆధారంగా11 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ రూ.2.28 కోట్లు. నిజామాబాద్ జిల్లా రెంజల్‌తో పాటు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లో 41.3 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. వీటి విలువ రూ.77 లక్షలని ఏసీబీ వెల్లడించింది. రూ.7 లక్షల విలువ చేసే కారు, రూ.21.44 లక్షల ఖరీదైన బంగారు ఆభరణాలు, రూ.6.13 లక్షల విలువ చేసే గృహోపకరణాలు, రూ.81వేల విలువ చేసే వెండి సామగ్రిని ఏసీబీ అధికారులు గుర్తించారు. నగరంలో రెండు ఇళ్లు ఉండగా, వాటి విలువ రూ.1.05 కోట్లుగా నిర్ధారించారు. సీఐ స్థాయి అధికారికి ఇంత ఆస్తులు కూడబెట్టడంతో.. ఇవి అక్రమాస్తులుగా ఏసీబీ పరిగణించిందని, అందుకే ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు రంగం సిద్ధం చేస్తోందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment