బోల్తాపడిన కంటైనర్
రాజేంద్రనగర్: రెడిమిక్స్ వాహనం అదుపు తప్పి మినరల్ వాటర్ సప్లే చేసేందుకు వెళ్తున్న టాటా ఏసీ ఆటోని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ సంఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెడిమిక్స్ వాహనం ఆటోని ఢీకొట్టి ముందుకు ఈడ్చుకెళ్లి హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పల్టీకొట్టింది. దీంతో ఆటోలోని ఇరువురు ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. స్తంభాన్ని ఢీకొట్టకుండా అలాగే వెళ్లి ఉంటే పక్కనే ఉన్న గుడిసెలపై పడి మరింత ప్రాణ నష్టం సంభవించేది. ఈ సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట మూవీ టవర్స్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోకాపేట నుంచి ఖానాపూర్ వెళ్లేందుకు మూవీ టవర్స్ మీదుగా రెడిమిక్స్ వాహనం బుధవారం రాత్రి వెళ్తుంది. రోడ్డు నిటారుగా ఉండడంతో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న టాటా ఏసీ ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది. ఇందులోని వాటర్ సప్లే చేసే వట్టినాగులపల్లికి చెందిన అనిల్‌కుమార్(27), హేమంత్‌రెడ్డి(30) ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. రెడిమిక్స్ డ్రైవర్ వాహనంలోని ముందు భాగంలో ఇరుక్కుపోయాడు. అతి కష్టం మీద గచ్చిబౌలి ట్రాఫిక్ సీఐ రవికుమార్, నార్సింగి ఇన్‌స్పెక్టర్ నారాయణగౌడ్‌లు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. క్లినర్ సైతం తీవ్రగాయాలకు గురయ్యారు. ఇరువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి తరలివచ్చారు. సహాయక చర్యల్లో పోలీసులకు సహకరించారు.
తప్పిన పెను ప్రమాదం...
రెడిమిక్స్ వాహనం రోడ్డు పక్కన ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ దాటికి స్తంభం పక్కకు ఒరిగింది. స్తంభానికి ఉన్న ఒక వైరు మాత్రం తెగి కిందపడింది. స్తంభం పూర్తిగా కింద కు పడి వైర్లు పడిఉంటే మరింత ప్రమాదం చోటు చేసుకునేది. సంఘటన జరిగిన వెంటనే ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని విద్యుత్ అధికారులకు సమాచారం అందించి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు.
రెడిమిక్స్ వాహనాలను నిషేధించండి...
రెడిమిక్స్ వాహనాల కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానిక ప్రజలు బుధవారం రాత్రి పోలీసుల ఎదుట వాపోయారు. ప్రతి రోజు ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటుందన్నారు. రెడిమిక్స్ వాహనాలు అదుపు తప్పి తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వాటిని నిషేధించాలని వెల్లడించారు. కేవలం రాత్రి 10 గంటల అనంతరం మాత్రమే అనుమతించాలని పోలీసులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment