
ధారూరు: శ్రీసాయి రాఘవేంద్ర ఎంటర్‌ప్రైజెస్‌ను స్థాపించి 800 మంది సభ్యుల్ని చేర్చుకుని నెలకు రూ.వెయ్యి చొప్పున రాబట్టి, చిట్టీల రూపంలో బాదితుల నుంచి డబ్బులు తీసుకుని ఉడాయించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రెంటాల రాఘవప్రసాద్‌ను బుధవారం మద్యాహ్నంట్టుకుని అరెస్టు చేసి అదేరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో రిమాండుకు పంపించామని ధారూరు సీఐ దాసు తెలిపారు. ఎంటర్‌ప్రైజెస్ పేరుతో బురిడీ అనే శుక్రవారం సాక్షిలో వచ్చిన వార్తకు సీఐ దాసు స్పందించారు. శ్రీసాయి రాఘవేంద్ర ఎంటర్‌ప్రైజెస్‌లో సభ్యులుగా చేర్పించిన వారు కూడా నేరస్తులేనని స్పష్టం చేశారు. వారు సభ్యులు దగ్గర డబ్బులు వసూలు చేసి వాటిలో కొన్ని వాడుకున్నారని సీఐ తెలిపారు. ఇలాంటి వారే ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌కు ఫిర్యాదు చేశారని చెప్పారు. వారు చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదన్నారు. జైలులో ఉన్న రాఘవప్రసాద్‌ను, అతడి బాబాయి, ఏ 2 ముద్దాయి రెంటాల సత్యనారాయణను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ వేస్తున్నట్లు వివరించారు.
తమ కస్టడీకి వస్తే వారి నుంచి అన్ని విషయాలను రాబట్టి ఎంటర్‌ప్రైజెస్‌లో సభ్యులుగా చేరి డబ్బులు కట్టి నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాన నిందితుడి బామర్ది, బాబాయి, బావలతో పాటు ఏజెంట్లుగా మారిన వారిని విచారిస్తామని, నిందితుడి మామను కూడా ఈ కేసులో చేర్చినట్లు వెల్లడించారు. నిందితుడి భార్య హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారని, అందుకే నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపామని తెలిపారు. రాఘవప్రసాద్ దగ్గర ఏజెంట్లుగా మారి డబ్బులు తిన్న వారు కూడా నిందితులేని అన్నారు. అరెస్టు చేసిన నిందితుని వద్ద ఒక్క రూపాయి కూడా లేదని, నిందితుడు వసూలు చేసిన డబ్బులతో బాబాయి పేరుతో ధారూరులో ఓ ఇల్లు కట్టించారని, ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారని, మామ, బామ్మర్తికి రూ.10 లక్షల చొప్పున డబ్బులు ఇచ్చాడని, తన పెళ్లికి రూ.15 లక్షలు వ్యయమైందని నిందితుడు చెప్పినట్లు వెల్లడించారు. ఎంటర్‌ప్రైజెస్ స్కీంలో నష్టపోయిన ప్రతి వ్యక్తికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment