వివరాలు వెల్లడిస్తున్న సీఐ నర్సింహారెడ్డి, వెనుకాల నిందితులు
సాక్షి, ఆమనగల్లు: పదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆటోతో పాటు ఒమన్ దేశానికి చెందిన ఓ నిందితుడి పాస్‌పోర్ట్‌ను సీజ్ చేశారు. గురువారం సాయంత్రం కస్తూర్బా గాంధీ గిరిజన విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న బాలిక తన స్వగ్రామానికి వెళ్తుండగా ఆటోలోని యువకులు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కిందికి దూకడంతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
శుక్రవారం స్థానిక ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ నర్సింహారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. కడ్తాల మండలం నార్లకుంట తండాకు చెందిన బాలిక ఆమనగల్లులోని కస్తూర్బా గాంధీ గిరిజన విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. బాలిక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నిత్యం స్వగ్రామం నుంచి పాఠశాలకు వచ్చి వెళ్తుండేది. ఈక్రమంలో గురువారం సాయంత్రం 5.30 గంటలకు బాలిక నార్లకుంట తండాకు వెళ్లేందుకు జాతీయ రహదారిపై నిలబడి ఉంది. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న ఆటోను చూసి ప్యాసింజర్ ఆటోగా భావించి ఆపి అందులో ఎక్కింది. ఆటోలో ఉన్న యువకుడు విద్యార్థినిని పొగతాగుతావా.. అంటూ చేయి పట్టుకున్నాడు.
అసభ్యంగా ప్రవర్తించడంతో తీవ్ర భయాందోళనకు గురై ఆటోలో నుంచి కిందికి దూకడంతో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి.. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఘటన విషయం వెంటనే విఠాయిపల్లి సమీపంలో ఆటోతోపాటు అందులో ఉన్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. బాధితురాలి వాంగ్మూంలం మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన యువకులు ఇమ్రన్ హుస్సేన్(ఒమన్ దేశస్తుడు), మహ్మద్ సాజిద్(చంద్రాయణగుట్ట)గా గుర్తించి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.
నిందితులు ఇద్దరూ స్నేహితులు. ఆటోతోపాటు ఇమ్రాన్ హుస్సేన్ పాస్‌పోర్టును సీజ్ చేశామన్నారు. అయితే, మహబూబ్‌నగర్ పరిసర ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతలను చూసేందుకు నిందితులు ఇద్దరూ మూడు రోజుల క్రితం బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. ఇమ్రన్ హుస్సేన్ తల్లి పాతనగరవాసి, తండ్రి ఒమన్ దేశస్తుడు. ఇతడు తరచూ మేనమామల ఇంటికి వస్తుంటాడని సీఐ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. విలేకర్ల సమావేశంలో ఆమనగల్లు ఎస్‌ఐ ధర్మేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment