శ్రీనివాస్
రంగారెడ్డి , దౌల్తాబాద్: కడుపులో నొప్పి భరించలేక ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దౌల్తాబాద్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సతీశ్ వివరాల ప్రకారం.. పొల్కంపల్లి గ్రామానికి చెందిన పెద్ద నర్సప్ప, పద్మమ్మకు కుమారుడు నాగమొళ్ల శ్రీనివాస్ (16). తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లగా శ్రీనివాస్ నాన్నమ్మ దగ్గర ఉంటూ గోకఫసల్‌వాద్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అయితే ఆదివారం నాన్నమ్మ పొలం పనులకు వెళ్లగా ఆ సమయంలో శ్రీనివాస్ కడుపు నొప్పితో బాధపడ్డాడు.
నొప్పి భరించలేక ‘తన చావుకు ఎవరూ కారణం కాదు’ అని సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చిన నానమ్మ చూసి కంగారుపడింది. వెంటనే చుట్టు పక్కల వారికి సమాచారం అందించి శ్రీనివాస్ మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు గ్రామానికి చేరుకుని కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని కొడంగల్ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. తండ్రి నర్సప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు
తమ కుమారుడి కడుపులో నొప్పి అని ఏనాడు తమకు చెప్పలేదని కుటుంబసభ్యులు వాపోయారు. గతంలో శ్రీనివాస్‌కు ఒక అక్క లక్ష్మి ఉండేది. ఆరు నెలల కిందట లక్ష్మి కూడా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకుంది. ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు పిల్లలను దూరం చేసుకోవడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
నేను వెళ్లిపోతున్నా..
‘అమ్మానాన్న నేను వెళ్లిపోతున్నా. ఎందుకంటే నాకు కడుపులో నొప్పిగా ఉంది. అందుకని నేను చనిపోతున్నా. సారీ గుడ్ బై’ అని ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడే ముందు సూసైడ్ నోటు రాసి పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment