సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజి విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతిపై ఎమ్మెల్సీ కవిత విచారం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందిన విషయం తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి గురైనట్లు తెలిపారు. ప్రీతి మరణంతో ఒక తల్లిగా తనెంతో మనో వేదనకు గురయ్యానన్నారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ వేదికగా ప్రీతి మృతికి సంతాపం ప్రకటిస్తూ.. తల్లిదండ్రులకు లేఖ రాశారు.
‘ప్రీతి కోలుకోవాలని గత మూడు రోజులుగా కోరుకున్న కోట్లాది మందిలో నేనూ ఒకరిని. ఎన్నో కష్టాలకోర్చి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నాను. చదువుకుని సమాజానికి సేవ చేయాలన్న తపన, పట్టుదల మెండుగా ఉన్న ప్రీతికి ఇలా జరగడం దురదృష్టకరం. ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయింది. అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను.
కడుపుకోత అనుభవిస్తున్న మీకు ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం చేసినా అది చాలా తక్కువే అవుతుంది. ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడని పరిస్థితి ఇది. మీ కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదని మీకు హామీ ఇస్తున్నాం. ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.
యావత్ రాష్ట్ర ప్రజలు మీ వెంటే ఉన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో భగవంతుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని కవిత పేర్కొన్నారు.
డాక్టర్ ప్రీతి తల్లితండ్రులకు నా లేఖ pic.twitter.com/SsIQimvQdP
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 28, 2023
Comments
Please login to add a commentAdd a comment