రవీందర్ (ఫైల్) రఘు (ఫైల్) నరేశ్ (ఫైల్)
చేవెళ్ల: నలుగురూ స్నేహితులు... ఒకే గ్రామం.. పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. వేర్వేరు ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నారు. సరదాగా కారులో వెళ్లి గ్రామానికి తిరిగి వస్తుండగా మృత్యువు రూపంలో మర్రిచెట్టు మాటేసి మింగేసింది. కారు అదుపుతప్పి ఢీకొనడంతో ఘటనా స్థలంలో ముగ్గురు దుర్మరణం పాలవడగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా మండల పరిధిలోని ఆలూరు గ్రామస్తులు కావడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన ఆదివారం రాత్రి 7 గంటలకు మండల పరిధిలోని మీర్జాగూడ బస్‌స్టేజీ సమీపంలో జరిగింది. పోలీసులు, మృతుల కుటుంబీకుల కథనం ప్రకారం.. మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన సార నరేశ్(30), గారెల రవీందర్(32), ఎన్కేతల రఘు(30), నర్కుడ నవీన్ స్నేహితులు. వీరు నలుగురు కలిసి చదువుకున్నారు. 2005 పదో తరగతి బ్యాచ్.
ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్వగ్రామం నుంచి నరేష్‌కు చెందిన కారులో సరదాగా చేవెళ్లకు వచ్చారు. రాత్రి 7 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. మరో 10 నిమిషాల్లో గ్రామానికి చేరుకోవాల్సి ఉండగా.. మార్గంమధ్యలో మీర్జాగూడ బస్‌స్టేజీ దాటిన తర్వాత కారు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న మర్రిచెట్టును ఢీకొట్టింది. వాహనం అతివేగంగా చెట్టును ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారు డ్రైవింగ్ చేస్తున్న రఘు వాహనంలో ఇరుక్కుపోయాడు. సార నరేశ్, గారెల రవీందర్ తీవ్రంగా గాయపడటంతో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. నర్కూడ నవీన్ కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురు మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన నవీన్‌ను చికిత్స నిమిత్తం నగరానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురూ ఉద్యోగస్తులే..
కారు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు స్నేహితులు ఆలూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబాలకు చెందిన యువకులు. ఎప్పుడూ స్నేహంగా మెలిగే వీరు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. బాధిత కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. సార నరేశ్ బీటెక్, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు. బెంగళూరులో ప్రైవేట్ జాబ్ చేసేవాడు. లాక్‌డౌన్‌తో ఇటీవల ఉద్యోగం షాదనగర్‌కు మారింది. ఆదివారం సెలవు కావటంతో గ్రామానికి వచ్చాడు. తండ్రి చంద్రయ్యకు ఇద్దరు కొడుకులు నరేశ్ పెద్దకొడుకు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న అతడు మృతిచెందడంతో తల్లిదండ్రులు గుండులుబాదుకుంటూ రోదించారు. గారెల నారాయణ, కమలమ్మ దంపతుల ఏకైక కుమారుడు రవీందర్. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం కాలేదు. ఎన్కేతల రఘు(30) ఏఆర్ కానిస్టేబుల్. వికారాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామానికి చెందిన ఎన్కేతల యాదయ్య, లక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురూ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. రఘుకు ఏడాది క్రితమే వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయన భార్య గర్భవతి. తీవ్రంగా గాయపడిన నర్కుడ నవీన్ గ్రామంలోనే ఉంటూ తల్లిదండ్రులకు సాయంగా ఉండేవాడు. చేవెళ్ల ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment