కుమార్తె మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు(ఫైల్)
కామారెడ్డి క్రైం: విద్యార్థి దశలోనే ఎదురవుతున్న ఒత్తిళ్ళకు యువత చిత్తవుతున్నారు. ఇక్కడితో అంతా అయిపోయింది, ఇంక చేసేదేమి లేదనే నైరాశ్యంలోనికి వెళ్లిపోతున్నారు. చదువుల పేరిట అటు విద్యాలయాల్లో, ఇంట్లో పెద్దలు నిర్దేశిస్తున్న లక్ష్యాలను చేరుకుంటామో లేదోనన్న బెంగ ఎంతో మంది విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. అలాంటి బలహీనమైన క్షణాలు వారిని మృత్యువైపు అడుగులు వేయిస్తున్నాయి. ఎంత చదివినా మార్కులు తక్కువగా వస్తున్నాయనే బాధలో కొందరు, పరీక్ష బాగా రాయలేకపోయామని మరికొందరు, ఫలితాలు నిరాశపరిచాయని ఇంకొందరు ఇలా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 11 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలవరపెడుతోంది.
కొన్ని సందర్భాల్లో సమస్యలు ఎదురై మనోవేదనకు గురైనా భవిష్యత్తుపై భరోసాతో ముందుకుసాగాల్సిన విషయాన్ని గుర్తించాల్సి ఉంది. పిల్లలను ఉన్నతస్థానాల్లో చూడాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అదే సమయంలో పిల్లల శక్తి సామర్‌థ్య్లాలను సైతం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అవసరమైన విషయాల్లో తోడ్పాటును అందించాలి. సెల్‌ఫోన్లు, సినిమాల ప్రభావం పిల్లలపై ఏ మాత్రం ఉందో గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టసమయాల్లో మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా వారి భుజం తట్టాల్సిన అవసరాన్ని తల్లిదండ్రుల గుర్తించాలి. వీటి విషయాల్లో నిర్లక్ష్యం చేస్తూనే పిల్లల నుంచి ఉత్తమ ఫలితాలను ఆశించడం అనర్థాలకు దారి తీస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
చిన్న చిన్న కారణాలకే....
పరీక్షలు బాగా రాయ లేదని, అందరితో సమనంగా చదవలేకపోతున్నాననీ, మార్కులు తక్కువగా వస్తే తల్లిదండ్రులు ఏమంటారోననే భయాందోళనలు విద్యార్థుల్లో పెరిగాయి. ఇవే కొన్ని సందర్భాల్లో అత్మహత్యలకు కారణమవుతున్నాయి. తల్లిదండ్రులు, గురువులు వారి మానసిక పరిస్థితిని సకాలంలో గుర్తించక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. వారం క్రితం రెండు రోజుల వ్యవధిలో బానుసవాడలో ఓ 8వ తరగతి చిన్నారి, కామారెడ్డిలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 12న మోర్తాడ్ మండలంలో సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకరం.
గత మార్చిలో తాడ్వాయికి చెందిన హారిక అనే ఇంటర్ విద్యార్థిని పరీక్షలో ఫెయిలయ్యానని ఉరేసుకుంది. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన సుప్రియ(19) అనే విద్యార్థిని టెట్ పరీక్షలు బాగా రాయలేదనే బాధలో ఉరేసుకుంది. ఉప్పల్‌వాయి గ్రామానికి చెందిన కుమ్మరి రజిత(25) అనే యువతి వీఆర్‌ఓ పరీక్ష బాగా రాయలేదని ఆత్మహత్యకు పాల్పడింది. అడ్లూర్‌కు చెందిన సుస్మిత(18) టెట్‌లో మార్కులు తక్కువగా వస్తున్నాయని మనస్థాపం చెంది రైలు కిందపడి ప్రాణం తీసుకుంది. కామారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని ప్రవళిక(19) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా జిల్లాలో ఈ యేడాది ఇప్పటిదాక జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నవారిలో 20 ఏళ్లలోపు వారు 20 మంది ఉన్నారు.
మాధ్యమాల ప్రభావం...
ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్‌ల ప్రభావం యువతపై ఎంతగా పడుతోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అశ్లీలతను చూపించే వెబ్‌సైట్‌లు విద్యార్థి దశనుంచే యువతను పెడదారి పట్టిస్తున్నాయి. హైస్కూల్ స్థాయి నుంచి యువత మొబైల్ ఫోన్‌లను చేత పట్టుకుని నిమగ్నమవుతున్నారు. కళాశాలల్లో ఫోన్‌లను నిరాకరించే విషయంలో యాజమాన్యాలు దృష్టి సారించడం లేదు. ఎక్కడున్నా స్మార్ట్‌ఫోన్‌లలో కాలక్షేపం చేస్తూ సమయాన్ని వృథా చేసుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీని సరైన మార్గంలో ఉపయోగించుకోవాల్సిన యువతరం అదే టెక్నాలజీతో పెడదారి పట్టడంతో పాటు విలువైన సమయాన్ని వృథా చేసుకుంటోంది. తద్వారా చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు.
స్మార్ట్‌ఫోన్‌లను తమ పిల్లలను దూరంగా ఉంచాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు గుర్తించాల్సి అవసరం కనిపిస్తోంది. ఇక సినిమాల ప్రభావం ఏ విధంగా ఉన్నదో ఇటీవలి జగిత్యాలలో ఇద్దరు యువకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చూస్తే తెలుస్తుంది. సెల్‌ఫోన్ కొనివ్వలేదనే కారణంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. కొద్దిరోజుల క్రితం బిచ్కుందకు చెందిన పురుషోత్తం(19) అనే యువకుడు ఓ వివాహితను ఫోన్‌లో వేధించగా పెద్దలు పంచాయితీ పెట్టి మందలించారు. దీంతో మనస్థాపం చెందిన అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి దశలో యువతపై సెల్‌ఫోన్‌లు, సినిమాల ప్రభావం పడుతోందని ఇలాంటి సంఘటనలతో స్పష్టమవుతోంది.
బాధ్యతగా వ్యవహరించాలి..
తమ పిల్లల చదువులు, వారి ప్రవర్తనల విషయంలో జరుగుతున్న సంఘటనలు తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తు చేస్తున్నాయి. ప్రశాంతమైన క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను పిల్లలకు అందించడంతో పాటు వారి శక్తి సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సాహం అందించాలని పలువురు సూచిస్తున్నారు. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసి కుటుంబాలు పెరిగాయి. నిత్యం విధులు, ఇంటి పనుల్లో బిజీగా ఉంటూ పిల్లలతో కలిసి సమయాన్ని గడపడం లేదు. వారికి ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఎందరో యువత మానసికంగా కృంగిపోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. తప్పనిసరిగా పిల్లలతో తల్లిదండ్రులు సమయాన్ని కేటాయిస్తూ వారి కష్ట, సుఖాల్లో అండగా నిలుస్తూ ఆలోచనలను పంచుకుంటే జరిగే తప్పిదాలను అరికట్టవచ్చు. వారి సమస్యలను తెలుసుకుని ప్రోత్సహించాలి. తప్పుదారిలో వెళ్తే దిశానిర్దేశం చేయాలే గానీ ఒత్తిళ్లకు గురి చేయడం సరికాదంటున్నారు విశ్లేషకులు.
ఒత్తిడికి గురిచేయొద్దు..
పోటీ ప్రపంచంలో యాజమాన్యాలు, తల్లిదండ్రులు చదువు ఒక్కటే చూస్తున్నారు. పిల్లల సామర్థ్యానికి మించి ఒత్తిడికి గురి చేయొద్దు. వారి సామర్థ్యాలను సమస్యలను అర్థం చేసుకుని ప్రోత్సహించాలి. వారిలో అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. – లక్ష్మీనారాయణ, డీఎస్‌పీ, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment